రఘునాథ్ కి కొంచెం కొంచెంగా ధైర్యం వస్తోంది.
ఈ జనంలో నక్సలైట్స్ చేతిలోంచి తప్పించుకోవచ్చా? ఒక్క ఉదుటున లేచి జనంలో కలిసి పారిపోతే వాళ్ళేం చేయగలరు తనను? జనం అందరిలో తుపాకులు తీసుకుని వెంటపడలేరు. అందరి ఎదురుగ్గా తనను చంపలేరు. పైగా రైలు ప్రమాదం జరగబోతూన్న ఈ తరుణంలో వీళ్ళ ప్రాణాలు రక్షించుకోడానికే తంటాలు పడుతుంటారుగానీ తన సంగతి ఎక్కడ పట్టించుకుంటారు?
అతను ఓసారి ఇన్స్ పెక్టర్ రత్నాకర్ వేపు చూశాడు. రత్నాకర్ కూడా ఆ అవకాశాన్ని ఉపయోగించుకోడానికే చూస్తున్నాడు.
ఇద్దరూ కనుసైగలు చేసుకున్నారు.
"జమదగ్నీ!" పిలిచాడు ఫణి.
"చెప్పండి!"
"అవతలి కోచ్ లోకెళ్ళి ఒక్కసారి ఏం జరుగుతోందో కనుక్కున్నారా!"
జమదగ్ని లేచి గన్ చంద్రికకు ఇచ్చి పక్క కోచ్ వైపు నడిచాడు.
రఘునాథ్ కి అంతకంటే మంచి అవకాశం దొరకదనిపించింది. ఛటుక్కున స్ప్రింగ్ లా ఎగిరి కర్టెన్ తొలగించుకుని అవతలి కోచ్ వైపు పరుగెత్తబోయాడు. పైకి లేచిన అతని కాలి నుంచి దూసుకుపోయింది ఫణి చేతిలోని రివాల్వర్ బుల్లెట్.
"అబ్బా" అంటూ అక్కడే కూలబడిపోయాడతను.
అమాంతం అతనిని లోపలకు లాగి సీటుమీద కూర్చోబెట్టింది చంద్రిక. ఇన్స్ పెక్టర్ ఆ దృశ్యం చూసి లేవబోయినవాడల్లా మళ్ళీ కిందే చతికిలబడిపోయాడు.
* * *
డివిజనల్ సేఫ్టీ ఆఫీసర్ జయకర్ షాక్ తగిలినట్లు కుర్చీలోనుంచి లేచి నిలబడ్డాడు.
మెరుపులా వచ్చిందా ఆలోచన!
సాధ్యమవుతోందో కాదో తనకు తెలీదు.
కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయత్నించతగ్గ ఏకైక ఉపాయం అదే! అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ వేపు చూశాడతను.
"లూప్ లో డబుల్ హెడ్ డీజిల్ పవర్సు వున్నాయి కదూ?"
"అవున్సార్!"
"నేను మీ పాయింట్స్ మెన్ తో, ఆ ఇంజెన్స్ లో 8 డౌన్ వెనుకే వెళుతున్నాను. త్వరగా లైన్ సెట్ చేయించు."
"సార్! మరి లైన్ క్లియర్...."
"డోంట్ బాదర్ ఎబౌట్ ఫార్మాలిటీస్! అయ్ వాన్ట్ టు సేవ్ ది యాక్సిడెంట్!" అంటూ పక్కనే నిలబడ్డ పాయింట్స్ మెన్ ని తీసుకుని పరుగెత్తాడతను.
ఇద్దరూ ఇంజన్ దగ్గరకు చేరుకునేసరికి సరిగ్గా ఒక్క నిముషం పట్టింది.
"కమాన్ త్వరగా స్టార్ట్ చేయండి! మనం 8 డౌన్ ని అందుకోవాలి" ఇంజన్ ఎక్కుతూ అరిచాడు జయకర్! పాయింట్స్ మెన్ కూడా ఇంజన్ ఎక్కేశాడు. ఇద్దరూ ఆయాసంతో ఒగరుస్తున్నారు.
నిద్రమత్తులో ఉన్న డ్రైవరుకి 8 డౌన్ గొడవ తెలీటంతోనే క్షణాల్లో నిద్ర ఎగిరిపోయింది.
ఎక్కడికి స్టార్ట్ చేయాలి? ఎందుకు స్టార్ట్ చెయ్యాలి అన్న ప్రశ్నలు వచ్చాయ్ గానీ ఆ ప్రశ్నలు డి.యస్.ఓ.ని అడిగేంత ధైర్యం లేకపోయిందతనికి. ఎదురుగ్గా వున్న సిగ్నల్ చూశాడు. స్టార్టర్ ఇచ్చి వుంది. జయకర్ మనసులో స్టేషన్ మాస్టర్ సమయస్పూర్తికి అభినందించాడు.
"కమాన్! ఇంకేం చూస్తున్నావ్? స్టార్ట్" అరిచాడతను.
"ఎడ్వాన్స్ స్టార్టర్!" అంటూ నసిగాడు డ్రయివర్.
జయకర్ కి తనుచేసిన తప్పు అర్థమయింది. తను ఇంజనులో వుండి డ్రయివర్సుతో రూల్సుకి వ్యతిరేకంగా పని చేయించటం చాలా కష్టం! స్టేషన్ మాస్టర్ మెమో ఇస్తే తప్ప అతను లైను క్లియర్ లేకుండా ఇంజన్ నడపడు. స్టేషన్ మాస్టర్ దగ్గరకెళ్ళి మళ్ళీ మెమో రాయించి తేవాలంటే ఇంకో పదినిముషాలు పడుతుంది. పది నిముషాలు ఆలస్యమయితే తన ప్లాన్ నిరుపయోగమవుతుంది.
"నీ పేరేమిటి?" డ్రైవర్ నడిగాడతను.
"హఫీజ్ ఖాన్!"
జయకర్ కి ఆ పేరు వినగానే ఠక్కున గుర్తుకొచ్చింది.
అతను ఒక స్టేషన్లో షంటింగ్ చేస్తున్న సమయంలో అడ్వాన్సు స్టార్టర్ ముందుకెళ్ళిపోయాడు. అప్పుడే హోమ్ సిగ్నల్ చేరుకుంటున్న పాసింజరు బండి డ్రైవర్ సడెన్ బ్రేక్స్ వేయడంతో కొలీజన్ తప్పింది.
తనే అప్పుడు అధారిటీ లేకుండా లాస్ట్ స్టాప్ సిగ్నల్ దాటినందుకు హఫీజ్ ఖాన్ కి ఛార్జిషీట్ ఇచ్చాడు.
"హఫీజ్ ఖాన్! నేను నీకు మేజర్ పెనాల్టీస్ ఛార్జిషీట్ ఇచ్చాను కదూ?"
"అవున్సార్!"
"అది వెంటనే కాన్సిల్ చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను. కమాన్ ఇంజను స్టార్టు చేసేయ్! మనం రూల్స్ కోసం చూసేసమయం కాదిది. కొన్నివేలమంది ప్రయాణీకులతో ప్రమాదానికి గురికాబోతున్న 8 డౌన్ ని రక్షించడానికి వెళుతున్నాం." అతనిలో చలనం కలిగింది. వెంటనే ఇంజన్ స్టార్టు చేశాడు.
"ఇప్పుడిటు వెళ్ళింది 8 డౌనేనా సార్?"
"అవును! నువ్వు ముందు ప్రశ్నలాపి వందకిలోమీటర్ల స్పీడ్ లోకి తీసుకురా ఇంజన్ ని." అతను చకచక నాబ్ లు మార్చాడు.
ఒక్క కుదుపుతో ఇంజన్లు వేగం అందుకున్నాయ్.
ప్రతి సెకండ్ కీ వేగం పెరిగిపోతోంది.
జయకర్ స్పీడోమీటర్ వంకే చూస్తున్నాడు.
నలభై, యాభై,అరవై, డెబ్భై, ఎనభై, తొంభై, వంద_
"ఇంకా స్పీడ్ పెంచు హఫీజ్ ఖాన్."
"సార్! కంట్రోల్ చేయడం-"
"డోంట్ వర్రీ - డబుల్ హెడ్ కంట్రోల్ కాకపోవడమేమిటి? కమాన్! క్విక్!"
వేగం మరింత పెరిగింది. నూటపది, నూటఇరవై, నూట ముప్పై_
గాలిలో తేలిపోతున్నట్లు వెళ్ళిపోతున్నాయ్ ఇంజన్లు!
జయకర్ చకచక కాగితం మీద లెఖ్ఖలు వేసుకోసాగాడు.
ఆరూ పదికి 8 డౌన్ కృష్ణా కెనాల్ దాటింది.
కృష్ణా కెనాల్ నుంచి కొలనుకొండకు రన్నింగ్ టైమ్ నాలుగు నిమిషాలు. కానీ 8 డౌన్ మూడు నిమిషాల్లో దాటేస్తుంది.
పెదవడ్లపూడికి రన్నింగ్ టైం మూడు నిముషాలు. 8 డౌన్ రెండు నిముషాలలో దాటేస్తుంది. అలాగే చిలువూరు కూడా రెండు నిముషాల్లో దాటుతుంది.
అక్కడి నుండి దుగ్గిరాల అయిదు నిముషాలలో చేరుకోవచ్చు. దుగ్గిరాలకు సమీపంలోనే పార్టింగ్ అయిన గూడ్స్ వుంది. లేదా చిలువూరు నుంచి అప్ గ్రేడియెంట్ ప్రారంభమవుతుంది కనుక దాని స్పీడ్ తగ్గి రన్నింగ్ టైం పెరగవచ్చు. అంటే షుమారు ఆరూ ఇరవైకల్లా 8 డౌన్ వెళ్ళి దుగ్గిరాల దగ్గర రెండు భాగాలుగా వున్న గూడ్స్ ట్రెయిన్ ని ఢీకొంటుంది.
జయకర్ టైం చూసుకున్నాడు. ఆరూ పదమూడు నిముషాలు.
కేవలం ఏడు నిముషాల వ్యవధి.
"హఫీజ్ ఖాన్ ఇంకా స్పీడ్ పెంచు."
"సర్! మాక్సిమమ్ పర్మిషబుల్ స్పీడ్!"
"హఫీజ్ ఖాన్ రూల్స్ కాసేపు మర్చిపో! మనం ఎంత త్వరగా 8 డౌన్ ని అందుకోగలిగితే అందులో వున్నవారికి అంత సహాయం చేసినవారిమవుతాము."
"కానీ 8 డౌన్ ని చేరుకోగలిగినంత మాత్రాన ఉపయోగం ఏముంటుంది సార్?
"అది చేరుకున్నప్పుడు చెప్తాను."
అతను స్పీడ్ ఇంకొంచెం పెంచాడు.
నూట నలభై, నూట యాభై!
జయకర్ కే భయంగా వుంది ఆ స్పీడ్! ఏ క్షణంలోనయినా ఇంజన్లు డిరైల్ అవుతాయేమోనన్న ఫీలింగ్!
అదీగాక తను చేస్తున్న పని ఎంతవరకు కరెక్ట్?
ఈ ఆపరేషన్ లో తను సక్సెస్ అయితే ఫరవాలేదు.
అవకపోతే? తను అనుకున్నదానికి బదులు మరోటి జరిగితే! తన ఉద్యోగానికే ముప్పు రావచ్చు!
డి.ఆర్.ఎమ్. అనుమతి లేకుండా, ఏ రూల్సు పాటించకుండా... కొలనుకొండ స్టేషన్ చిటికెలో దాటేసింది ఇంజన్.
అతను టైమ్ చూసుకున్నాడు.
ఆరుగంటల పదిహేను నిముషాలు_ అంటే కేవలం అయిదు నిముషాల వ్యవధి.
"హఫీజ్ ఖాన్" పిలిచాడు జయకర్.
"యస్సార్!"
"ఇంకొంచెం స్పీడ్!"
అతను బెంబేలెత్తిపోయాడు.
"సార్!"
"ఆల్ రైట్! కొంచెం పక్కకు జరుగు" అనేసి తనే డ్రైవర్ సీట్లో కూర్చున్నాడతను. చిన్న కుదుపుతో మరింత వేగం అందుకుంది డబుల్ హెడ్ యూనిట్!
* * *
"హలో దుగ్గిరాల! హలో దుగ్గిరాలా!" కంగారుగా పిలుస్తోంది మృదుల కంట్రోల్ ఫోన్లో.