కానీ ఒంటరి స్త్రీకి ఎలాంటి రక్షణలు, ఎలాంటి కాలక్షేపాలూ లేని మనదేశంలో అంతకంటే గత్యంతరం లేదు.
విదేశాల్లో ఒంటరితనం ఎవరినీ బాధించలేదు.
అసలు అక్కడి జీవితంలో ఒంటరితనానికి స్థానం లేదు...ఎవరు ఎన్నుకున్న మార్గంలో వాళ్ళు నిశ్చింతగా ప్రయాణించఅచ్చు. సెక్స్ విషయంలో ఎలాగూ ఎవరికీ పట్టింపు లేదు. నాగరికత ఎంత వెర్రితలలు వేసినా, విదేశాల్లో స్త్రీకున్న గౌరవం నిజంగా అద్భుతమయిన ఎచీవ్ మెంట్!
"అక్కా! ఆయన ఫ్రెండొకాయన పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాడు. నీ ఫోటో చూపించాము. అతనికి నచ్చావు... నీకిష్టమయితే..." చెప్పబోయింది చెల్లెలు.
"నేనిప్పుడే చేసుకోను..."
"ఎందుకనక్కా...ఇప్పటికే ఆలస్యమయిపోయింది నీ మ్యారేజ్__"
సావిత్రికి నవ్వు వచ్చింది.
తన విషయం వాళ్ళకి...అప్పుడెందుకు గుర్తురాలేదో__?
"మనకంటే పెద్దదయిన అక్కయ్య పెళ్ళి కాకుండా మనమెలా పెళ్ళి చేసుకుంటాం ముందు చెల్లెళ్ళ పెళ్ళి అయిపోతే తరువాత అక్కనెవరు చేసుకుంటారు?" అన్న ఆలోచనే వాళ్ళకప్పుడు రాలేదు.
కేవలం 'స్వార్థం' చూసుకున్నారు.
తనకొచ్చిన కొద్ది సంబంధాలూ చెడిపోయాయి. ముఖ్యంగా తన చెల్లాయిలే కారణం.
అక్కయ్యకవ్వకుండా చెల్లెళ్ళ కెందుకయింది?
అందరూ ఇదే ప్రశ్న...అందరికీ అనుమానం...
తమ్ముడు అమ్మను తీసుకెళ్ళిపోయాడు. తనూ తిరిగి వచ్చేసింది సావిత్రి.
వస్తూనే స్నానం అదీ ముగించి శంకర్ రూమ్ కీ వెళ్ళింది.
తలుపులు దగ్గరగా వేసి వున్నాయి.
తలుపు తోసి లోపలికెళ్ళి చూసింది.
ఇంకా నిద్రపోతున్నాడతను.
తనను చూడగానే ఆనందంగా మీదకు లాక్కున్నాడు.
"ఇన్ని రోజులుకా రావటం! నేనేమయిపోవాలనుకున్నారు?" ప్రేమగా అడిగాడు మొఖమంతా ముద్దులతో నింపేస్తూ.
అతని చేతుల్నుంచి అతి కష్టం మీద వదిలించుకుని దూరంగా జరిగి నిలబడిందామె.
"మా ఇంటికి రండి...మీరొచ్చేలోగా నేను కావలసినవి రడీ చేసి వుంచుతాను" అందామె.
"ఏం? ఇక్కడే చేయకూడదా?" అడిగాడతను.
"బ్రహ్మచారి గదిలోనా? వద్దులెండి! మనిద్దరినీ ఎవరయినా చూస్తే మిమ్మల్ని గదిలో నుంచి వెళ్ళగొడతారు"
తను వచ్చేసింది.
కాసేపటి తర్వాత వచ్చాడతను.
ఇంటి విషయాలన్నీ మాట్లాడుకుంటూ గడిపారు కాసేపు.
"అన్నట్లు చెప్పటం మర్చిపోయాను...మీ శాంత పెళ్ళి శుభలేఖ వచ్చింది. బాలకృష్ణగారి దగ్గర్నుంచీ నేను తీసుకుని వుంచాను."
శుభలేఖ అందుకుని చూసిందామె.
ఆ మర్నాడే పెళ్ళి.
తను పెట్టిన శెలవు అయిపోయింది. జాయినయిన వెంటనే మళ్ళా శెలవు అంటే ఇవ్వక పోవచ్చు. అదీగాక పెళ్ళికి వెళ్ళాలంటే అప్పటికప్పుడే బయల్దేరాలి. లేకపోతే మళ్ళీ సమయానికి చేరుకోవటం కష్టం.
"పరిస్థితులన్నీ శాంతకు రాయండి! ఆమె అర్ధం చేసుకుంటుంది" అన్నాడు శంకర్.
"అదే అనుకుంటున్నాను నేను కూడా..."
అతను దగ్గరికొచ్చి మళ్ళీ కౌగలించుకున్నాడు తనను.
"సావిత్రిగారూ! దయచేసి నన్నొదిలి ఇలా వెళ్ళిపోకండి ఎప్పుడూ! ఎంత నరకం అనుభవించానో మీకు తెలీదు. అన్నం తినబుద్ధయ్యేది కాదు...నిద్ర పట్టేది కాదు..."
సావిత్రి మనసు గతంలోకి జంప్ చేసింది.
శ్రీరామ్ కూడా అచ్చం ఇలాగే తనను కౌగిలించుకుని క్షణం వదల్లేకుండా...ప్రేమగా, తీయగా మాట్లాడుతూ...
"వదలండి...ప్లీజ్" బ్రతిమాలుతున్నట్లు అంది సావిత్రి.
ఆమె పెదాల మీద ముద్దుపెట్టుకుని వదిలేశాడతను.
ఆ రాత్రికే వివరంగా శాంతకు ఉత్తరం రాసిందామె. కొద్ది రోజులు గడచిపోయినాయి. తనను క్షణం వదలి వుండటంలేదు శంకర్. ఇద్దరూ రాత్రి పొద్దుపోయే వరకూ షికార్లకూ, సినిమాలకూ తిరుగుతూ గడిపేస్తున్నారు.
ఆరోజు శంకర్ ఆఫీస్ కి రావటం చూచి ఆశ్చర్యపోయిందామె.
ఉదయం తొమ్మిది గంటలవరకూ ఇద్దరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. కలసే భోజనం చేశారు.
"ఏమిటి అప్పుడే?" కోపంగా అంది తను.
"మీకో శుభవార్త చెప్పాలని!"
"ఏమిటది?"
"బ్యాంక్ ఎగ్జామినేషన్స్ ఇంటర్వ్యూలో సెలక్టయ్యాను..." అంటూ లెటర్ తీసి ఆమెకిచ్చాడు.
"కంగ్రాచ్యులేషన్స్" ఆనందంగా అందామె.
"సావిత్రీ! ఇంక మనం డిలే చేయాల్సిన అవసరంలేదు. వీలయినంత త్వరలో మ్యారేజ్ చేసేసుకుందాం..." ఆతృతగా అన్నాడతను.
"మరి మీ వాళ్ళు..."
"అదంతా నేను చూచుకుంటాను కదా..."
ఇద్దరూ క్యాంటీన్ కెళ్ళారు. స్వీట్స్ తెప్పించాడతను.
"ఎవరేమనుకున్నా సరే...నేనే స్వయంగా స్వీట్ మీ నోట్లో ఉంచాలి" అన్నాడతను.