Previous Page Next Page 
ఆత్మబలి పేజి 40


    ఈ మధ్య రావు ఇంటికెళ్ళలేదు. రోజులు మహాయుగాల్లా గడుస్తున్నాయి. రావును చూడకుండా నిగ్రహించుకోగలదేమో కాని, ఆశను చూడకుండా ఎలా? అయినా రావుకూ తనకూ మధ్య అభిమానాలు పంతాలూ కాని, తనకూ ఆశకూ మధ్య ఏమున్నాయి?
    ఒక్కసారి ఆశ స్కూల్ కెళ్లి ఆశను చూసి రావటానికి నిశ్చయించుకుంది.
    పావు తక్కువ నాలుగింటికి సూపరింటెండెంట్ ను వంట్లో బాగులేదని పర్మిషన్ అడిగింది. దార్లో రెండు కాడ్ బరీ మిల్క్ చాక్లెట్స్ కొనుక్కొని రిక్షాలో స్కూల్ దగ్గిర కెళ్ళింది.
    ఆశకోసం ఎదురుచూస్తూ స్కూల్ గ్రౌండులో నిలబడింది. గంటకొట్టాక క్లాస్ రూంలోంచి బయటికొచ్చిన ఆశ శోభను చూడగానే "టీచర్" అంటూ పరుగెత్తుకొచ్చి చాచిన శోభ చేతుల్లో వాలిపోయింది. ఆశను ఆప్యాయంగా కరువుతీరా హృదయానికి హత్తుకుంది శోభ. తన హాండ్ బ్యాగ్ లోంచి చాక్లెట్లు తీసి రేపర్ ఒలిచి ఆశ చేతిలో పెట్టింది. ఆశ ముఖం వికసించింది. తన పుస్తకాల సంచిలో చెయ్యిపెట్టి గులాబీలగుత్తి బయటకు తీసింది. అవి బాగా వడిలిపోయాయి. ఖిన్నురాలై "పాడైపోయాయి టీచర్! మీకివ్వను" అంటూ పారెయ్యబోయింది.
    "ఫర్వాలేదు ఆశా! ఇలా ఇయ్యి. పువ్వులు వడిలిపోయినా, వాటిల్లో నీ ప్రేమ పరిమళిస్తూ ఉంటుందమ్మా!" అంటూ ఆశ చేతిలో పువ్వులందుకుంది. ఆశ ముఖం వికసించింది. ఆ పసికళ్ళలో సంతోషం వెల్లివిరిసింది.
    "నేనివాళ వస్తున్నానని నీకెలా తెలుసు ఆశా! పువ్వులు తెచ్చావు?" ఆశ్చర్యంతో అంది శోభ.
    "రోజూ తెస్తున్నాను టీచర్. ఇంటికి మీరు రాకపోయేసరికి స్కూల్ కైనా వస్తారేమోనని తెస్తున్నాను. నిన్నా మొన్నా ఎందుకు రాలేదు టీచర్? మీకోసం తెచ్చినపూలు పారేస్తూంటే ఎంత ఏడుపొచ్చిందో తెలుసా?"
    శోభ మెడ చుట్టూ చేతులు పెనవేసి గారంగా అంది ఆశ. ఆశకు తనపట్ల గల మమకారానికి వళ్ళు తెలియని సంతోషంతో తనను తను మరిచి ఆశను చూస్తూ ఉండిపోయింది శోభ.
    "ఆశా!"
    సింహగర్జనలాంటి ఆ పిలుపుకు ఆశా, శోభా ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. తీక్షణంగా తనవంక చూస్తూ నిలబడిన రావును గమనించి అప్రయత్నంగా ఆశ చెయ్యి వదిలేసింది శోభ.
    తండ్రి కోపానికి బిక్కుబిక్కుమంటూ నిల్చున్న ఆశను విసురుగా తన దగ్గిరకు లాక్కున్నాడు రావు.
    "అడ్డమైనవాళ్ళతోనూ చనువుగా తిరగకు. ఆ వెధవగుణాలు నీకూ పట్టుబడితే నువ్వు బ్రతికుండటంకంటే చావటం మేలనుకుంటాను." కసిగా అన్నాడు రావు. ఆ మాటలు ఆశనుద్దేశించి అన్నవికావు. అందుకని ఆశకేమీ అర్థంకాలేదు. అయోమయంగా తండ్రిని చూస్తూ "ఏవిఁటి డాడీ!" అంది.
    ఆ మాటలు ఆశ కర్ధమవ్వాలని రావు కోరిక కాదు. అందుకని 'పద' అని ఆశను కారు దగ్గిరకు నడిపించుకెళ్ళాడు.
    కారు చప్పుడు వినిపించటం ఆగిపోయిన తరువాత కాని శిలాప్రతిమలా నిల్చున్న శోభలో చలనం రాలేదు. హృదయం క్షోభతో మూలుగుతుండగా, నీరసంతో కాళ్ళు తేలిపోతుండగా బయటకు నడిచింది.
    ఇంత దారుణమైన అవమానానికి తన అపరాధమేమిఁటీ? ఇల్లు గడవక తప్పనిసరై ఉద్యోగంలో చేరటం తప్పా? ఇంటిలోని ఆ వాతావరణంలో ఆనందాన్ని కనలేని, ఉత్సాహపూరితమైన పడుచు మనసు స్నేహితులమధ్యనైనా హుషారుగా గడపాలని కోరుకోవటం తప్పా? సంఘము, విధి, బంధువులూ అందరూ ఏకమై తన చిరునవ్వును తుడిచివేయాలని కంకణం కట్టుకోగా అందరినీ ఎదిరించి నిర్లక్ష్యంగా నవ్వటం తప్పా?
    ఇంతవరకూ ఎన్నింటినో సహించింది. ఎందరెందరో తనను గురించి చెవులు కొరుక్కుంటున్నారని తెలిసినా, నిర్లక్ష్యంగా తోసిపారేసింది. దేన్నీ, ఎవ్వరినీ లక్ష్యపెట్టలేదు. అన్నింటికీ అతీతంగా ఉండగలిగే మనోధైర్యాన్ని సంపాదించుకుంది. కాని ఇప్పుడీ అవమానం మనసును పుండులా సలుపుతుంది. ఎంత ప్రయత్నించినా దీనికి తట్టుకోలేకపోతూంది. అన్నింటికంటే విచిత్రం - తననింత చిత్రహింస పెడుతున్న రావును ద్వేషించలేకపోతూంది. అవును ఆయన తప్పేముందీ? సంఘమంతా ఏమనుకుంటున్నారో, ఆయనా అదే అనుకుంటున్నారు. అలా అనుకోడానికెలా ఆధారాలు లేవో, అనుకోకుండా ఉండటానికీ అలా ఆధారాలూ లేవు. తానొక శాపగ్రస్త. జీవితాంతమూ ఇలా క్రుళ్ళవలసిందే!
    కారులో కూర్చున్న రావు తన ప్రవర్తనకు తనే ఆశ్చర్యపోయాడు. ఆశను స్కూల్ నుండి తీసుకురావటానికి రావు స్వయంగా ఎన్నడూ రాడు. మాలి సైకిల్ మీద దింపి, మళ్ళీ సైకిల్ మీదే ఇంటికి తీసుకొస్తాడు. వరసగా ఇన్నిరోజులు శోభ కనిపించకపోయేసరికి రావుకు మతిపోయినట్లయింది. ఏ పనిమీదా మనసు నిలపలేకపోయాడు. చివరకు హాస్పిటల్ కెళ్ళడానిక్కూడా విసుగనిపించింది. అందరిమీదా చిరాకు. తనమీద తనకే చిరాకు. శోభను చూడకుండా ఉండగలిగే శక్తి తనకులేదని అర్థమయిపోయింది రావుకు. శోభ చెంపదెబ్బ ఏనాడో మాయమయిపోయింది. ఆనాడు శోభను గాఢంగా హృదయానికి హత్తుకున్నప్పటి మధురిమలే శరీరాన్ని మనసునూ ఆత్మనూ ఆక్రమించుకొని తిరిగి తిరిగి తలపుకొస్తూ మనసు నుర్రూతలూగిస్తున్నాయి.
    వద్దనుకున్నకొద్దీ ఆలోచనలన్నింటినీ శోభే ఆక్రమించుకుంటూంది. తను విన్నదాన్నిబట్టి, చూసినదాన్ని బట్టీ శోభ శీలవతి అని నమ్మలేడు. తనపట్ల శోభకు ప్రేమ లేదనుకుని భరించలేడు. ఆనాడు ఆశ జ్వరంలో ఆశ మంచంలో కూర్చుని అటు ఆశనూ, ఇటు తననూ సమంగా బుజ్జగించి, ఆశ శరీర రుగ్మతను, తన మానసికాందోళనను మరిపించిన ఆ మమకారాన్ని శంకించలేడు. ఒకదానితో ఒకటి ముడిపడని ఈ విషయాలన్నీ ఎలా సమన్వయించుకోవటం?
    ఆనాడు ఉదయమే ఆశ గులాబీ గుత్తులు తుంపుతూంటే చూశాడు. అవి ప్లవర్ వేజ్ లో పెడుతుందనుకున్నాడు. కాని ఆశ ఆ పూలు రుమాలులో చుట్టి భద్రంగా పుస్తకాలసంచీలో పెట్టుకుంటూంటే ఆశ్చర్యపోయాడు. కొన్ని క్షణాలు ఆలోచించినమీదట కారణం అర్థమయింది. ఆశకు శోభపైగల మమకారానికి ఆశ్చర్యపోయాడు. ఆశకులాగే అతనిక్కూడా శోభ స్కూల్ కి రావచ్చేమోననిపించింది. అందుకే ఆనాడు తనే స్వయంగా స్కూల్ కి వచ్చాడు. దారిపొడుగునా శోభను ఏవిధంగా క్షమాపణ కోరుకోవాలా, ఏవిధంగా తిరిగి ఆమె స్నేహాన్ని పొందగలనా అనుకుంటూనే వచ్చాడు. కాని, తను వచ్చి నిల్చున్నదికూడా గమనించకుండా శోభ ఆశతో ఆప్యాయంగా కబుర్లు చెపుతూంటే ఏదో ఉడుకుమోత్తనం వచ్చింది. తనను చూసి కూడా ఆమె నిర్లిప్తంగా నిలబడిపోవటంతో ఏదో తనకే అర్థంకాని తిక్కరేగింది. తన చెవులకే కటువుగా వినిపించేటంత దుర్భరంగా నిందించాడు. శిలాప్రతిమలా నిలబడిపోయిన శోభ మూర్తి అతని అంతరాత్మను తట్టి మేల్కొల్పింది.

 Previous Page Next Page