పోన్ మోగింది. సోమనాధ్ అందుకుని, మాట్లాడి, మహావీర్నుద్దేశించి, "పోను నీకు" అన్నాడు. మహావీర్ పోన్ అందుకున్నాడు. అటువైపు నించి మృదుల గొంతువిని ఉత్సాహంగా, "హల్లో! మీరా! మీరేమైపోయారోనని ఖంగారుపడి లాయర్ యశోధరాదేవికి ఫోన్ చేసాను. ఏం జరిగింది? ఇక్కడికొస్తానన్న వారు ఎందుకురాలేదు?" అన్నాడు.
"అవన్నీ వివరంగా తరువాత చెప్తాను. ప్రస్తుతం నేను భాగవతార్ తో జయా నర్సింగ్ హోమ్ లో వున్నాను. పాపం భాగవతార్ నా కోసం చావు దెబ్బలు తిన్నాడు. ఈ నర్సింగ్ హోమ్ లో నేను కనీసం ఇంకో రెండ్రోజులైనా వుండవలసి వస్తుందేమో? మీరు వెంటనే మనం సేకరించిన మెటీరియల్ ప్రెస్ కిచ్చే ఏర్పాట్లు చూడండి. వీలుచూసుకుని నేను మిమ్మల్ని కలుస్తాను."
ఫోన్ పెట్టేసింది.
"భాగవతార్, అంటున్నావేమిటి? ఎవరు మాట్లాడింది?" కుతూహలంగా అడిగాడు సోమనాధ్.
"మృదుల, భాగవతార్ జయా నర్సింగ్ హోమ్ లో ఉన్నాడట వంటి నిండా దెబ్బలతో."
మహావీర్ మాటలు వినగానే జయానర్సింగ్ హోమ్ కి బయల్దేరాడు సోమనాధ్.
* * *
లాయర్ యశోధరాదేవి కోపంతో దహించుకు పోసాగింది. డాక్టర్ సౌగంధి అక్కడి విశేషాలన్నీ వివరంగా చెప్పింది.
"భార్య మిత్రురాలు, కుమార్తె దుఃఖ కారకురాలు, పుత్రుడు మాత్రమే పరలోకంలోని పరంజ్యోతి" అని ఐతరేయ బ్రాహ్మణంలోనూ అధర్వణ వేదంలోనూ పేర్కొన్నారని తెలుసుకున్నప్పుడు వేదకాలంలో సహితం స్త్రీ సంతానం పట్ల ఆ చిన్నచూపు భరించలేక బాధపడింది. చదువు సంస్కారం పెంపొందిన ఆధునిక సమాజంలోనైనా స్త్రీకి తగిన గౌరవం లభిస్తుందని ఆశపడింది. చివరికి ఈనాటికీ స్త్రీని గౌరవించడం నేర్చుకోకపోగా గర్భంలో వుండగానే స్త్రీ సంతానాన్ని పట్టు బెట్టడానికి పూసుకుంటున్నారా! ఏనాటికి మారుతుందీ సమాజం.
జరుగుతున్నదానికి ప్రతి క్రియగా యేం చెయ్యాలా? అని యశోధరాదేవి మదనపడుతూండగా, మహావీర్ దగ్గిర్నుంచి పోనొచ్చింది. మొదట అనుకున్నట్లుగా మృదుల సోమనాధ్ ప్రయివేట్ డిటెక్టివ్ ఏజన్సీస్ ఆఫీసుకి రాలేదని తెలిసినప్పుడు కలవరపడింది. దీనిలో రాజభూషణం జోక్యం వుండి వుంటుందని అనుమానించింది. వెంటనే హైదరాబాద్ "కరదీపిక" కార్యాలయానికి ఫోన్ చేసి అక్కడి సెక్రటరీతో జరిగింది క్లుప్తంగా చెప్పి, "మీ తక్షణ కర్తవ్యం మృదులని విడిపించడం. మీరంతా రాజభూషణం ఇంటికి పెద్దగుంపుగా వెళ్ళండి. అప్పుడు మిమ్మల్నెవరూ ఏం చెయ్యలేరు. అంతేకాదు ప్రజలకు ప్రభోదించే కొన్ని స్లోగన్స్ తయారు చేసి నినాదాలిచ్చుకుంటూ ప్రొపెషన్ లో వెళ్ళి జంటనగరాల్లో రాజభూషణం మందుల దుకాణాల్లో ఏ మందూ అమ్మనీయకుండా మూసేయించండి. ఇవాళ రాత్రి ప్లెయిట్ లో బయల్దేరి నేను హైదరాబాద్ వొస్తున్నాను" అని చెప్పింది. కరదీపిక కార్యవర్గ సభ్యుల్లో టీచర్లు, డాక్టర్లు, లాయర్లు కంపెనీ సెక్రటరీలు, స్టెనోలు- ఇలా అన్నిరకాల వాళ్లూ వున్నారు. ఏక్టివ్ వర్కర్స్ గా ఔత్సాహికులైన విద్యార్ధినిలూ వున్నారు. క్షణాల్లో చాలా పెద్దసంఖ్యలో వాలంటీర్లను సమావేశపరిచారు. రెండు గుంపులుగా చీలిపోయారు. ఒక గుంపు వేన్ లో రాజభూషణం యింటికి బయలుదేరింది మృదులని విడిపించడానికి, మరో గుంపు "అమానుష ప్రయోగాలు నశించాలి" "స్వంత లాభాలకోసం ప్రాణాలు తీయడానికి సిద్ధపడేవాళ్ళని శిక్షించాలి" అనే నినాదాలు చేసుకుంటూ వెళ్ళి రాజభూషణం మందుల షాపులు మూసేయాలని పట్టుబట్టాయి. షాపుపైన పెట్రోలు గుమ్మరించి అగ్గిపుల్ల గీసేసారు.
వేన్ లో రాజభూషణం యింటిముందుకు చేరుకున్న గుంపుని ఘూర్ఖా అడ్డగించబోయాడు. విద్యార్దినిలు అతనినొక తోపుతోసి లోపలికి నెట్టుకుపోయారు. అంతమంది ఆడవాళ్ళని గుంపుగా చూసేసరికి రాజభూషణం గూండాలక్కూడా భయంవేసింది. అదే సంఘబలం. రాజభూషణం ఇంట్లో వున్న సామానులన్నీ ఇష్టంవచ్చినట్లు చిందరవందర చేస్తూ మృదుల కోసం గాలించసాగేరు కరదీపిక సభ్యులు. వాలంటీర్లు, బయటగొళ్ళెంపెట్టి వున్న గది తలుపు చూసి గొళ్ళెం తీయబోతూండగా లోపల్నించి, "వొద్దు, వొద్దు, తెరవొద్దు" అని అరిచాడు నగ్నంగా మంచానికి కట్టిపడేసి వున్న రాజభూషణం. పాపం అతనికి లోపల్నించి తలుపు బోల్డ్ పెట్టుకునే అవకాశమేనాలేదు. లాయర్ యశోధరాదేవి మృదుల యే ఆపదలో చిక్కుకుంటోదన్న ఆరాటంలో పోన్ల మీద చకచక పన్లు జరిపించబట్టి ఎవరేనా వచ్చి రాజభూషణాన్ని విడిపించకముందే స్త్రీ సమూహం విరుచుకు పడటం జరిగిపోయింది. ఆదిశక్తుల్లా విజృంభించిన స్త్రీలు రాజభూషణం అరుపులు లక్ష్యపెట్టకుండా గొళ్ళెం తీసేసారు. అటు రాజభూషణం, ఇటు స్త్రీలు ఒకేసారి కెవ్వునరిచారు. ఆడవాళ్ళు చేతులతో కళ్ళు మూసుకుని గది బయటికొచ్చేస్తుంటే, రాజభూషణం తలని మంచం కోడుకేసి కొట్టుకున్నాడు. బయటికొచ్చాక ఆడవాళ్ళంతా ఒకళ్ళ మొఖాలొకళ్ళూ చూసుకుని పొట్టలు చేత్తో పట్టుకుని విరగబడి నవ్వుకున్నారు.
"మృదులని మనం రక్షించక్కర లేదు. తనని తనే రక్షించుకుంది. రాజభూషణానికి బ్రహ్మాండమైన శిక్షవేసింది. ఎవరూహించలేని శిక్ష" అని మళ్ళీ నవ్వుకున్నారు. అవమానం భరించలేక వుడికిపోయాడు రాజభూషణం. గట్టిగా పిడికిలి బిగించి, "మృదులా! నిన్నొదుల్తాననుకోకు. ఇంతకి పదిరెట్లు నీకు పాఠం చెప్తాను. ఈసారి లాయర్ యశోధరాదేవి కాదుగదా ఆ దేవుడే దిగివచ్చినా నిన్ను బయటపడేయలేడు." అని శపథం చేసుకున్నాడు కసిగా.
ఆ రాత్రి 7.30 గ.లకు బొంబాయి నుంచి సికింద్రాబాద్ వచ్చే ఐ.సి 117 విమానంలో లాయర్ యశోధరాదేవి సికింద్రబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగింది.
* * *
భాగవతార్ బెడ్ పక్కన స్టూల్ మీద కూర్చుని అతనిచేత బత్తాయి రసం తాగిస్తోంది మృదుల. సహజంగానే అతణ్ని అభిమానించే ఆ అమ్మాయిలో తనకోసం అతడన్ని దెబ్బలు తిన్నాడనే భావం ఎంతో సానుభూతిని కలిగిస్తోంది. భాగవతార్ కైతే స్వర్గంలో వున్నట్లుగానే వుంది. మృదుల ఇలా తన పక్కన కూర్చుని సపర్యలు చేస్తుంది అంటే ఇంకా ఇన్ని దెబ్బలు తినడానికైనా అతడు సిద్ధంగానే వున్నాడు. డ్యూటీ నర్స్ రూమ్ లో కొచ్చి, "మేడమ్! మీకు పోనొచ్చింది" అంది మృదులతో. మృదులలేచి వెళ్ళి రిసీవరందుకుంది.
అటువైపు నుంచి యశోధరాదేవి.
"మృదులా! ఎలా వున్నావు? ఏ అఘాయిత్యం జరగలేదు కదా!" ఆప్యాయత, అనురాగం ఉట్టిపడుతున్నాయి ఆమె గొంతులో.
"బాగానే వున్నాను మేడమ్. మీరెప్పుడొచ్చారు? ఎక్కడున్నారు?"
"ఇప్పుడే ఫ్లెయిట్ లో వచ్చాను. ఒకప్పటి నా జూనియర్ లాయర్ ఇప్పటి లీడింగ్ లాయర్ వైజయంతి ఇంట్లో వున్నాను. నీకోసం అనేక చోట్ల ట్రైచేసి చివరికి మహావీర్ కి ఫోన్ చేస్తే ఈ హాస్పిటల్ లో ఉన్నట్లు తెలిసింది. ఎలా వుంది మీ ఆయనకి."
నవ్వింది మృదుల. "నన్ను కాపాడాలని వచ్చి, పాపం! తను దెబ్బలు తిన్నాడు. ఆదర్శపతిదేవుడు."
అటువైపు నుంచి యశోధరాదేవి కూడా నవ్వింది.
"ఈ ఆదర్శ పతిదేవులు ఏ క్షణంలో అర్ధంలేని పతిదెయ్యాలుగా మారిపోతారో ఇప్పటికీ నా ఊహకందడం లేదు. అది సరేగాని మీ పతిదేవుణ్ని ఒక గంటసేపు నర్సుకప్పగించి లాయర్ వైజయంతి ఇంటికి రాగలవా? దేవకి కేసుకి సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడాలి" అంది.
"ఓ.కే, మేడమ్. పది నిముషాల్లో బయలుదేర్తాను" ఫోన్ పెట్టేసింది.
"ఎవరి దగ్గిర్నుంచి ఫోను?" మృదుల వచ్చి కూర్చోగానే అడిగాడు భాగవతార్.
"లాయర్ యశోధరాదేవి దగ్గర్నుంచి."
భాగవతార్ ముఖంలో ప్రసన్నత ఎగిరిపోయింది. ఎంతైనా అతడు మగవాడు. స్త్రీ స్వతంత్ర వ్యక్తిత్వం కోసం నడుంకట్టి పోరాడే లాయర్ యశోధరాదేవి అంటే గౌరవమున్నా అభిమానం లేదు. పైగా మృదులని, తన నుంచి దూరం చేస్తుందేమోనని భయం కూడా వుంది.
అతడి భయాలు నిజం చేస్తున్నట్టుగా, "లాయర్ యశోధరాదేవి గారు ఒక్కసారి నన్ను రమ్మన్నారు. వెళ్ళి ఇప్పుడే వచ్చేస్తాను. మీ దగ్గర నర్స్ వుంటుంది" అంది.
ఏడుపు మొహం పెట్టాడు భాగవతార్. అతడి గెడ్డం పట్టుకుని అటూ ఇటూ వూగిస్తూ, "ఇప్పుడే వచేస్తాగా ప్లీజ్!" అంది. ఏమనగలడు? ఏడుపు మొహంతోనే వెళ్ళమన్నట్లు తలూపాడు.
డ్యూటీనర్స్ కి, ఆయాకి భాగవతార్ ని కనిపెట్టి చూస్తూండమని చెప్పి తమ కారులోనే వైజయంతి ఇంటికి బయల్దేరింది. ఈ వ్యూహంలోంచి ఎలాగైనా దేవకిని బయటపడెయ్యాలని మృదులకీ వుంది. లాయర్ యశోధరాదేవి ప్రయత్నిస్తే ఎలాగయినా సాధించగలదేమో!
మృదుల వెళ్ళిన అరగంటకి సోమనాథ్ వచ్చాడు ఆసుపత్రికి. ఎంక్వయిరీలో భాగవతార్ వున్న రూమ్ నెంబరు అడిగి తెలుసుకుని అక్కడికొచ్చి, "హల్లో! భాగవతార్ గారూ! బాగున్నారా! దెబ్బలు బాగా తగిలినట్లున్నాయి. ఐ యామ్ సారీ!" అన్నాడు.
సోమనాధ్ ని చూడగానే గతుక్కుమన్నాడు భాగవతార్. తను మర్చిపోవాలనుకుంటున్న పీడకల యేదో తన కళ్ళముందు నిల్చినట్లౌతోంది. తను అమెరికా వెళ్ళినప్పుడు తన గదిలో మృదుల పైన వీడియో రికార్డింగ్ చేయించిన విషయం మృదులకి తెలియనీయొద్దు- అని చెప్పాలనుకుని, "సోమనాద్ గారూ! ఆ వీడియో...." అని ప్రారంభించాడు. సోమనాధ్ మధ్యలోనే అందుకుని, "ఆ వీడియోలో ఫిగర్స్ ఇప్పుడు క్లియర్ గా కనిపించాయి. ఆ విషయం చెప్పడానికే వచ్చాను" అన్నాడు.