Previous Page Next Page 
అష్టదళం 2 పేజి 39


    ముక్కుకి వున్న  ముక్కెర, చెవులకి మకర కుందనాల్లాంటి ఆభరణాలు, మెడలో కాసుల దండ, మేలిమి బంగారంతో చేసినట్లుగా పచ్చగా మెరిసిపోతూ ఆమె శరీర సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తున్నాయి.

     "ఇక్కడ మీవాళ్లెవరూ లేరా?"

    "లేరు సామీ!"

    "ఎవరూలేరా? మరెందుకొచ్చావు? ఇదసలే మహానగరం. ఇక్కడ అడుగడుగునా మాయాజాలం కనిపిస్తుంది. వయసొచ్చిన ఆడపిల్లవి. ఇలా ఒంటరిగా రావడం, రోడ్లమీద తిరగడం క్షేమంకాదమ్మా" అన్నాడు యోగానందం నొచ్చుకుంటూ.

     "కష్టాలొచ్చినయ్ సామీ. ఏడకెళ్లాలో ఎరికైతలేదు. ఎవళ్లయినా మీవంటి దరమాత్ములు కూసింత జాగిస్తే ఉండిపోతా!"

    ఎక్కడికెల్లాలో తెలీడంలేదు యోగానందానికి.

     "మనతోపాటు తీసుకెళదాం మణీ! ఇంటికి తిరిగి వచ్చాక ఈమెకి ఏం దారి చూడాలో అందరం కూర్చుని ఆలోచిద్దాం" అన్నాడు.

     "రా సిరి! కారెక్కు"సిరి చెయ్యి పట్టుకుని కారు తలపు తెరిచి లోపలికి పంపిస్తున్న  కౌస్తుభ ఉలికిపడ్డట్టుగా అయింది.

     "అబ్బా! నీ చెయ్యి కొలిమిలా  ఇంత వేడిగా వుందేమిటి?"

    'ఉన్న తావు వదిలేసిన కాణ్ణించి ఒళ్లు మంటెత్తినట్లుగా మసలిపోతానే ఉందక్కా!'


                         *    *    *    *

   
    అప్పటికి పదోసారి మారుతీరావు వాచీ చూసుకోవడం.

    యోగానందం వాళ్లకోసం పంపిన కారింకా రాలేదు. ఇప్పటికే బాగా ఆలస్యమైపోయింది.
 
     ఆహుతులంతా వచ్చేశారు.

     దిగంబరరావుని ఏదో పిలవాలని పిలిచాడుగానీ  అతడొస్తాడని అనుకోలేదు.

     అతడు రావడమేకాదు, కూతుర్ని కూడా వెంటబెట్టుకు వచ్చాడు.
 
     ఆ అమ్మాయి ఏమీ జరగనట్లుగా శ్రీచక్రతో మాట్లాడుతోంది.

     ఇది మరీ ఆశ్చర్యం గొలిపింది మారుతీరావును.

     ఆమె కళ్లు అతడి అందాన్ని త్రాగేస్తున్నట్లుగా వున్నాయి. కొత్త సూటులో అతడెంతో బాగున్నాడు.

     మారుతీరావుకంటే ఆత్రంగా వాచీ చూసుకుంటున్నాడు దిగంబరరావు. ఆ వార్త వినడానికి అవుతున్న ఆలస్యాన్ని భరించలేకపోతున్నాడు.

    నవ్వుతూ, తుళ్లుతూ  ఆహుతులతో మాట్లాడుతున్న మారుతీరావును అతడి కొడుకునూ చూస్తుంటే దిగంబరరావుకి కడుపు మండినట్లుగా వుంది.

     తన కూతురి హృదయంలో చిచ్చుపెట్టి వీళ్లు ఆనందాలు పండించుకుంటున్నారా?

     ఆ పంటమీద ఈ క్షణమో, మరుక్షణమో పిడుగు పడుతుంది.

     ఈ దిగంబరంతో పెట్టుకున్నవాళ్లు సర్వనాశనం కావలసిందే.

     "కారొచ్చేసింది. పెళ్లికూతురు వాళ్లు వచ్చేశారు" ఎవరో ఉరుకులు పరుగులతో వచ్చి వార్త అందించారు.

     శ్రీచక్ర అతడి తల్లిదండ్రులు బయటికి వెళ్లి సాదరంగా వాళ్లని తీసుకొచ్చారు.

     దిగంబరరావు ముఖం మాడిపోయినట్లుగా  వుంది నిక్షేపంగా దిగిన వాళ్ళని చూసి.

     "ఈ డానీగాడికేమైంది? వాడికి అప్పగించిన పని ఎప్పుడూ ఫెయిలవడం జరగలేదే!" అనుకున్నాడు.

    వినోదిని ముఖంలో చెప్పలేని ఆశాభంగం.

     శ్రచక్ర చెయ్యిపట్టి తీసుకువస్తున్న కౌస్తుభను చూస్తుంటే ఆమె   కళ్లలో ఈర్ష్య భగ్గుమన్నట్లుగా అయింది.
 
     'ఇంత అందగత్తె కాబట్టే  తననుండి లాక్కోగలిగింది' అనుకుంది అక్కసుగా.

     తన మిత్రులకి కౌస్తుభను  పరిచయం చేస్తూ వినోదినికి   కూడా పరిచయం చేశాడు శ్రీచక్ర.

     "ఈమె వినోదిని. నా క్లాస్ మేట్" అంటూ వినూని ఆమెకు పరిచయం  చేశాడు.

    అందరూ ముగ్దులై చూస్తున్నారు చక్కని అలంకరణలో అపురూపమైన  అందంతో మెరిసిపోతున్న  కౌస్తుభను.

     పద్మావతి  గమనిస్తూనే వుంది వినూ వచ్చినప్పటినుండి వినూ  కళ్లలో ఎగిపడుతున్న  జ్వాలలు  ఆమె దృష్టినుండి తప్పుకుపోలేదు.

     "ఈ దరిద్రాన్ని ఎందుకు పిలిచారండీ? ఆనందంగా సాగిపోతున్న పాటలో అపశ్రుతిలాగా" అంది భర్తతో మెల్లగా.
 
     "మాట వరసకి పిలిస్తే వస్తారనుకోలేదు. నాకదే ఆశ్చర్యంగా వుంది" అన్నాడాయన.

     కెమేరాలు క్లిక్ - క్లిక్ మంటూండగా జీవితంలో మళ్లీ మళ్లీ  రాని అపురూపమైన ఆ సన్నివేశం వీడియోలో చిత్రీకరించబడుతుండగా జరగాల్సిన తతంగమంతా  చకచకా జరిగిపోయింది.

     శ్రీచక్ర కౌస్తుభ కుడిచెయ్యి అందుకుని సుతారంగా ముత్యపుటుంగరాము తొడిగాడు.

    అందరూ చప్పట్లు కొడుతూ  హర్షద్వానాలు చేశారు.

     "డియర్ ఫ్రెండ్స్! మీరంతా నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు నాకు ఆనందంగా వుంది. వేదమూర్తులచే  నిశ్చయించబడిన సుముహూర్తం సరిగ్గా నెలరోజులుంది.

     మీరంతా మరోసారి విచ్చేసి వధూవరులను ఆశీర్వదించి మాచే ఒసగబడే తాంబూలాలు స్వీకరించి పోవలసిందిగా  కోరుతున్నాను" అన్నాడు మారుతీరావు.

     అందరూ మరోసారి చప్పట్లు మ్రోగించారు.

     ఫంక్షన్ ముగిసేసరికి రాత్రి తొమ్మిదయింది.

     ఫంక్షన్ మధ్యలోనే కూతుర్ని తీసుకుని వెళ్లిపోయాడు దిగంబరరావు.

     కనీసం వెళ్లొస్తానని కూడా చెప్పలేదు.

     అందరూ వెళ్లిపోతుంటే "ఈ పిల్ల ఎక్కడ?" అంటూ సిరికోసం చూశాడు యోగానందం.

     ఎక్కడా కనిపించలేదు.

     "తను అసలు లోపలికి  వచ్చినట్టు లేదు నాన్నా!" అన్నాడు రవి.

    "అయ్యో మన సంతోషంలోపడి ఆ పిల్ల లోపలికి వచ్చిందో లేదో  చూసుకోలేదు."

    "ఇక్కడ తనకెవరూ లేరంది. కొత్త చోటు. పాపం ఎక్కడికి వెళ్లిందో?" అనుకుంటూ బయటికి వచ్చేసరికి సిరి కారు బ్యానెట్ మీద కూర్చుని కనిపించింది.

     డ్రైవర్ ఆ పిల్లను కారుమీద నుండి దిగమంటూ కసురుతున్నాడు.

    "అరె! నువ్విక్కడున్నావా? లోపలికి రాలేదేం?" అంది కౌస్తుభ.

    "మీరంతా దసూకున్నోళ్ళు, గొప్పగొప్పోళ్లు. నామాట తీరువేరు. బాస  తీరు వేరు. నన్ను ఇంతగా చూస్తరు."

    "నీకేంటి తక్కువ? అడవి పువ్వులా స్వచ్చంగా వున్నావు" అంటూ చెయ్యి అందించి కారుమీదనుండి దింపడానికి సాయంచేసింది కౌస్తుభ.

    స్నేహితులకు సెండాఫ్ ఇచ్చి కౌస్తుభ దగ్గిరకు వస్తున్నాడు శ్రీచక్ర.

    సిగి గబుక్కున కారెక్కి కూర్చుంది.

     మిగతావాళ్లు కూడా కారెక్కి కూర్చున్నారు.

    చివరగా ఎక్కుతున్న కౌస్తుభ చెయ్యందుకుని ముద్దుపెట్టుకుని - "మళ్లీ దేవి దర్సనం ఎప్పుడు?" అన్నాడు శ్రీచక్ర.

    "పెళ్లి పీటలమీద" చిలిపిగా నవ్వింది కౌస్తుభ.

    "బాబోయ్! నెలరోజులు. మీ మామయ్య  నిన్ను చూడకుండా ఏడాది పెట్టిన గడువు ఎలా పూర్తి చేశానో తెలియదుగానీ ఈ నెల గడువుమాత్రం నా వల్ల కాదు. ఎప్పుడు చూడాలని అనిపిస్తే అప్పుడు వచ్చేస్తాను మీ ఇంటికి' అన్నాడు శ్రీచక్ర.

     అనసూయ నవ్వుతూ అంది కారు లోపలినుండి -

    "ఇప్పుడు నువ్వు రావడానికీ పోవడానికీ అడ్డేముంటుంది బాబూ? నిశ్చితార్దం అయ్యి ముహూర్తాలు కూడా పెట్టుకున్నాం"  అంది నవ్వుతూ.


                     *    *    *    *

   
     కాదు దిగి అందరూ ఇంట్లోకి వెళ్లిపోయారు.

    అందరి వెనుక వస్తున్న యోగానందం వెనుక సంకోచంతో అడుగులో అడుగువేస్తూ వస్తున్న సిరినుద్దేశించి - "ఇదే మా ఇల్లు లోపలికి రామ్మా" అన్నాడు ఐదరంతో.

     "కూతురినై రానా! కోడలిలై రానా!"

    ఎవరో చెవిలో గుసగుసలాడినట్లుగా వెదురుపొదల మధ్య గాలిచేసే సవ్వడిలా మధురంగా వినిపించిన స్వరానికి  ఉలికిపాటుతో చివ్వున వెనుదిరిగి చూశాడు యోగానందం.

     "నువ్వేనా మాట్లాడింది?" అతడి శరీరం రోమాంచితమైన గొంతు వణికినట్లుగా అయింది.

     "నేనేమన్న సామీ?"

    "మరి.... మరి... నాకు వినిపించింది....."

    "ఏం ఇనిపించింది సామీ?"

    "ఏదోలే! లోపలికిరా!"


                        *    *    *    *    *


    సోషల్ వెల్ ఫేర్ వాళ్లని కలిసేసరికి ఏదో ఒక దారి చూడాలనుకున్న యోగానందానికి వెళ్లడానికి టైమే చిక్కడంలేదు.

     ఓవైపు ఉద్యోగ భాద్యత, మరోవేపు కౌస్తుభ పెళ్లికి డబ్బు సమకూర్చుకునే ప్రయత్నం.

     తన తాహతుకు తగ్గట్టుగా సింపుల్ గా ఏదయినా గుడిలో తలంబ్రాలు వేయిస్తానని చెప్పాడు యోగానందం.

     దానికి శ్రీచక్ర అంగీకరించడమే కాదు, తల్లిదండ్రులను కూడా ఒప్పించాడు.

     ఊరికే పప్పన్నం పెట్టి పెళ్లిచేసినా ఓ ఇరవయ్ ముప్పై వేలకి తక్కువ ఖర్చుకాదు.

     పదివేలు అప్పుగా ఇస్తానన్నాడు సత్యనారాయణ.

     మరో ఇరవయ్ వేలకి లోన్ కోసం ఆఫీసులో అప్లై చేసి దానికోసం తిరగడంలో క్షణం తీరిక లేనట్లుగా అయినా యోగానందం తను ఏదో దారి చూపేవరకు  తమ ఇంట్లోనే వుండమని చెప్పాడు సిరికి.

 Previous Page Next Page