తమను లెక్కచేయకుండా వెళ్ళిపోయిన శ్రీప్రియను కసికసిగా నలిపివేయాలని ఆరాటంగా వున్నది శివరామ్ కు.
చాణక్య మేడమెట్లు ఎక్కి పైకి వెళ్ళాడు.
సరిగ్గా అతను శ్రీప్రియ గదిలోకి అడుగుపెట్టే సమయానికి....
"వెల్ కమ్ మిస్టర్ చాణక్యా....వెల్ కమ్" నవ్వుతూ ఆహ్వానించింది ఆమె.
శ్రీప్రియ వాలకం చూసి ఆశ్చర్యపోయాడతను.
"మొత్తానికి మంచి ప్లాన్ మీదే స్నేహితులను కూడగట్టుకుని వచ్చావన్నమాట...." అంటూనే బెడ్ క్రిందనుంచి రివాల్వర్ ను బయటకు తీసింది.
ఆమె చేతిలో ఎప్పుడయితే రివాల్వర్ ను చూశాడో అప్పుడే అతనికి నిలువుగుడ్లు పడ్డాయి.
అంతేకాదు....తాము ఎందుకు వచ్చామో....ఏం చేయాలనుకున్నామో కూడా ఆమెకు తెలిసిపోయిందన్న విషయం అర్ధం కావడంతో అతనికి భయంతో ముచ్చెమటలు పట్టాయి.
"అదికాదు శ్రీప్రియా....మరి....మరి....నేను...."
"షటప్....ఇందాకటి నుంచీ మీరు మాట్లాడుకున్న ప్రతిమాటనూ నేను విన్నాను. ఇంకా మాయమాటలతో నన్ను బుకాయించాలని ప్రయత్నించకు. మీలాంటి నరవ్యాఘ్రాల కోసమే ఇలాంటి మారణాయుధాన్ని నా దగ్గర వుంచుకున్నాను....నన్ను లొంగదీసుకోవడానికి నీ మిత్రులు నీకు అరగంట టైమ్ ఇస్తే....ఇక్కడనుంచి వెళ్ళిపోవడానికి నీకు రెండే రెండు నిమిషాలు టైమ్ ఇస్తున్నాను....వెంటనే ఈ ఇంటినుంచి వెళ్ళక పోయారో మీ అందరినీ వరుసపెట్టి షూట్ చేస్తాను...."
ఆమె కళ్ళలో కనిపించే ఎర్రజీరను బట్టే ఆమె అన్నంతపని చేయగలదని అర్ధమయిందతనికి....
అంతే....
క్రిందకు పరుగెత్తుకు వెళ్లాడతను.
శివరామ్ తలపైకెత్తి చూశాడు....
చేతిలో రివాల్వర్ తో అపరకాళికలా విలుచుని వున్నది శ్రీప్రియ..
కసిగా పళ్ళు కొరుక్కున్నాడతను....
పళ్ళ బిగువున ఆవేశాన్ని అణుచుకుంటూ....అవమానభారంతో బయటకు నడిచాడు శివరామ్.
అతన్ని అనుసరించాడు మిత్ర బృందం....
వాళ్ళ వెనుకనే తలుపులు బిడాయించింది శ్రీప్రియ.
ఒక పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నందున సంతోషంగా లేదామెకు.
ఆమెకు తెలుసు....ఇక ఆ ఇంటిలో తనకు నూకలు చెల్లిపోయాయని.
కానీ, అంత రాత్రివేళ తను బయటకు వెళితే లేనిపోని ఆపదలను కొనితెచ్చుకొనవలసి వస్తుందేమోననే ముందుచూపుతో ఆమె ఆగిపోయింది.
ఒకవైపు జగపతి....
మరొకవైపు చక్రవర్తి....
తనకోసం వేయికళ్ళతో వెదుకుతుంటారని తెలుసు....
అందుకే ఆ రాత్రి సమయంలో ధైర్యం చేసి అడుగు బయటపెట్టలేకపోతున్నది.
ఏదిఏమయినా....రేపు తెల్లవారాక అయినా వెళ్ళిపోక తప్పదనే నిర్ణయానికి వచ్చి తన బెడ్ రూంలోకి అడుగుపెట్టింది శ్రీప్రియ.
కానీ....ఆ క్షణంలో ఆమెకు తెలియని నిజం ఇంకొకటి వున్నది....
శివరామ్ సామాన్యుడు కాదనీ....పగపట్టిన త్రాచుపాము లాంటి వాడని తెలిసే అవకాశం ఆమెకు లేకపోయింది.
* * *
అర్ధరాత్రి పన్నెండు గంటలు....
ఎవ్వరూ తనను అనుమానించకుండా మేకప్ చేసుకుని రోడ్డున పడ్డాడతను.
కాలి నడకన నడిచి వెళ్ళిపోతున్నాడు చక్రవర్తి.
దూరంగా పోలీసు వ్యాన్ శబ్దాలకు గోడలచాటుకు తప్పుకుంటున్నాడు.
కాలి నడకన జగపతి ఇంటికి వెళ్ళాలంటే చాలాదూరం....అయినా వెళ్ళక తప్పదు.
అతని ఆశయం....ఎలాగైనా శ్రీప్రియను వెదకాలి....ఆమె ఆచూకీకోసం జగపతి ఇంటికి వెళ్ళక తప్పదు.
సోడియం లైట్లు దట్టంగా వెలుగుని విరజిమ్ముతున్నాయి.
వాతావరణం నిశ్శబ్దంగా వున్నది.
జన సంచారం కానీ, వాహనాల రాకపోకలు కానీ అసలు లేనేలేవు.
కొద్దిదూరం నడిచాక అనుకోని సంఘటన ఒకటి ఎదురయింది అతనికి.
చక్రవర్తి కోసం నగరం మొత్తం జాగిలాల్లా వెదుకుతున్న రాణా మనుషులు నలుగురు అతనికి ఎదురయ్యారు.
అనుమానంగా వాళ్ళు చక్రవర్తిని నఖశిల పర్యంతం పరీక్షగా చూశారు.
చక్రవర్తిని వాళ్ళు గుర్తించలేకపోయారు.
అయినా అనుమానం తీరక....
"ఎవరు నువ్వు...." అడిగాడు ఒకడు.
"నా పేరు హరిశ్చంద్ర...."సాధ్యమైనంత వరకు గొంతుమార్చి చాలా మామూలుగా చెప్పాడు చక్రవర్తి.
"ఈ సమయంలో ఎక్కడకు వెళుతున్నావు...."
"నగరానికి క్రొత్తవాడిని....సినిమాకు వెళ్ళి వస్తున్నాను. బంధువుల ఇల్లు మరిచిపోయి వెదుకుతున్నాను...." నోటికి వచ్చిన అబద్ధాన్ని గడగడా చెప్పాడతను.