"సరే వెళ్లు...."
బ్రతుకు జీవుడా అనుకుంటూ రెండడుగులు వేశాడు చక్రవర్తి.
"ఏయ్....ఆగు...."
ఖంగారు పడిపోతూనే ఆగిపోయాడు చక్రవర్తి.
"వాడిని చెక్ చేయండి...."
ఇద్దరు వ్యక్తులు వచ్చి చక్రవర్తి జేబుల్ని వెదికారు.
వాళ్ళను ఎదిరిద్దామంటే మొత్తం పదిమంది వున్నారు. తను తిరగబడితే వాళ్ళ అనుమానం పెరిగిపోతుంది. అందుకే మౌనం వహించాడు.
అంత దగ్గరగా అతని ముఖాన్ని చూసేసరికి వాళ్ళకు ఏదో అనుమానం వచ్చినట్టుంది.
ముఖాన్ని పరిశీలనగా చూడడంతో వాళ్ళ అనుమానం దృడపడింది.
కొద్ది మేకప్ తో ముఖాన్ని మార్చుకున్నప్పటికీ వాళ్ళు అతనిని పోల్చుకోగలిగారు.
"ను...వ్వు...చ...క్ర...వ...ర్తి...వి కదూ?"
వాళ్ళ మాటలు వాళ్ళ నోట్లోనే వున్నాయి.
చక్రవర్తి రెండు పిడికిళ్లు బిగుసుకున్నాయి. మరుక్షణంలోనే ఆ ఇద్దరి ముఖాల ముందు నక్షత్రాలు కనిపించాయి. నిల్చున్నచోటనే కుప్పకూలిపోయారు.
మిగిలినవాళ్ళు జరిగిందేమిటో గ్రహించేలోపు లాగివదిలినబాణంలా ఒక్కసారిగా పరుగు అందుకున్నాడు చక్రవర్తి.
"చక్రవర్తి పారిపోతున్నాడు...."
దెబ్బలు తిని పడిపోయిన వాళ్ళు కీచుగొంతుతో అరిచారు.
విషయం అర్ధం కావడంతో అందరూ జీప్ ఎక్కారు.
చక్రవర్తి ఆఘమేఘాలతో పరుగులు దీస్తున్నాడు.
రాణా మనుషులు జీప్ లో తనను అనుసరిస్తున్నారని తెలుసుకాబట్టి, తప్పించుకునే మార్గాలకోసం పరుగుదీస్తూనే శరవేగంగా ఆలోచిస్తున్నాడతను.
ఉన్నట్టుండి చక్రవర్తి కనులు ఆనందంతో మెరిసాయి.
జీప్ ఏ మాత్రం పట్టని ఒక ఇరుకు వీధి కనిపించింది అతనికి.
చటుక్కున ఆ వీధిలోకి తిరిగాడు చక్రవర్తి.
జీప్ షడన్ బ్రేక్ తో ఆగింది.
బిలబిలలాడుతూ ఒకరి వెంట ఒకరు దిగి చక్రవర్తి వెంటపడ్డారు రాణా మనుషులు.
కనిపించిన సందులోకి తిరుగుతూ....పద్మహ్యంలోకి జొరబడిన అభిమన్యుడిలా వేగంగా మెలికలు తిరుగుతూ వాళ్ళకంటపడకుండా తప్పించుకున్నాడు చక్రవర్తి.
డిమ్ వెలుతురు మాత్రమే అక్కడ వుండటం వలన దగ్గరకు వచ్చేవరకూ ముందేంవున్నదో గుర్తించడం కష్టం....
కొద్దిదూరంలో నిండుగా ప్రవహిస్తున్న మురికికాలువ....
అంతటితో తను పారిపోవడానికి త్రోవలేదని అర్ధం కావడంతో చక్రవర్తి మెదడు పాదరసం కన్నా వేగంగా పనిచేసింది.
అక్కడ కనిపించిన పెద్ద రాతి బండలను రెండింటిని బలంగా ఆ కాలువలోకి విసిరాడు....
కాలువకు కొద్దిదూరంలో తలుపు కొద్దిగా తెరిచివున్న ఒక గుడిసెను గమనించి చప్పుడు చేయకుండా లోనికి ప్రవేశించి చుట్టూ చూశాడు చక్రవర్తి.
అతని అదృష్టంకొద్దీ ఆ గుడిసెలో ఎవ్వరూ లేరు.
చక్రవర్తి ఊహించినట్టే ఆ కాలువ దగ్గర నిలబడిపోయారు రాణా మనుషులు.
ఆ కాలువలో కదులుతున్న మురికినీరు....తమకు వినిపించిన చప్పుడునుబట్టి చక్రవర్తి ఆ కాలువలోకి దిగి అవతలవైపు చేరుకుని పారిపోయాడని అర్ధమయింది వాళ్ళకు.
తాము ఆ కాలువ దాటి వెళ్ళినా అతను ఇక దొరకకపోవచ్చు....ఈపాటికే చాలాదూరం వెళ్ళిపోయి వుంటాడు.
నిరుత్సాహంగా వెనుదిరిగారు రాణా మనుషులు.
దూరమవుతున్న అడుగుల చప్పుడు విన్న చక్రవర్తి గుండెల నిండా హాయిగా గాలిని పీల్చుకున్నాడు.
* * *
అర్దరాత్రి....
పన్నెండు గంటల యాభై నిమిషాలు దాటింది.
శ్రీప్రియ గదిలో అటూ ఇటూ పచార్లు చేస్తున్నది.
జరిగిన సంఘటనతో ఆమెకు నిద్రపట్టడంలేదు....
అందరు ఆడపిల్లల్లా తన జీవితం సుఖాంతం కావాలని తను ఆశించలేదు....కారణం....తన జీవితాశయం అలాంటిది!
తన జీవితంలో ఒక అందమైన భర్త....తనను అపురూపంగా చూసుకోగల భర్త కావాలని గడిచిన కాలంలో తను ఏనాడూ కోరుకోలేదు కూడా....
కావాలనే తన జీవితాన్ని ఒక క్రైమ్ స్టోరీగా మలచుకున్నది.
చూస్తూ చూస్తూ ముళ్ళబాటనే ఎన్నుకుని ప్రయాణించింది.
ఆనాడు జగపతి భార్యను చంపించిన తరువాత అతను జెయిల్ నుంచి బయటపడ్డాడని తెలిసిన మరుక్షణం నుంచీ తను ఈ ఇంటి నీడలోనే గడుపుతున్నది.
కొద్దిరోజుల క్రితమే చక్రవర్తి జైలునుంచి తప్పించుకున్న విషయం పేపర్ లో చూసి తెలుసుకున్నది.
ఇంతవరకూ ఎలాంటి ప్రమాదమూ తనను వెదుక్కుంటూ రాలేదు.
కానీ, ఇప్పుడు హఠాత్తుగా ఊహించని విధంగా చాణక్యవైపు నుంచి కొత్త ప్రమాదం ఎదురయింది తనకు....వాళ్ళు అంత తేలికగా వదిలే రకం కాదని వాళ్ళ మాటలను బట్టే అర్ధమయింది.
అందుకే ఆ ఇంటినుంచి వెళ్ళిపోవడమే క్షేమమనే నిర్ణయానికి వచ్చిందామె.
కానీ, అడుగు ముందుకు వేయలేకపోతున్నది....
ఒకవైపు చక్రవర్తి....


