కాలనీలో కిడ్నాప్
ఆరోజు ఆదివారం. తెల్లవారుఝామున అయిదింటికే కాలనీ అంతా పోలీసులతో నిండిపోయేసరికి మేము కంగారుగా ఇళ్ళల్లోనుండి బయటకు పరుగెత్తుకొచ్చాం.
అప్పటికే రంగారెడ్డి, గోపాల్రావ్, యాదగిరి, జనార్ధన్, సాయిరామ్ పోలీస్ అధికారులతో మాట్లాడుతున్నారు.
"మీ కాలనీ యువకులు కార్పొరేటర్ నీ, కొంతమంది ప్రభుత్వాధికారుల్నీ కిడ్నాప్ చేసుకొచ్చి ఆ చివరింట్లో బందీలుగా ఉంచారట. మేము ఆ ఇంటి దరిదాపులకొస్తే వారిని చంపేస్తామంటున్నారు. అందుకని మీ కాలనీ కమిటీ మెంబర్స్ మాకు సహాయం చేయాలి!" అన్నారు వాళ్ళు. మేము వెంటనే ఆ చివరింటికి చేరుకుని సగం తెరచిన కిటికీలోనుంచి లోపలున్న మా కాలనీ యువకులతో మాట్లాడసాగాం.
"ఏమిటోయ్ - ఎందుకిలాంటిపని చేశారు?"
"మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయ్"
"ఏమిటవి?"
"మేమెన్ని అర్జీలు పెట్టుకున్నా కార్పొరేటర్ గారు మా కాలనీకి రోడ్లు వేయించలేదు. మా కాలనీ దగ్గరలో ఉన్న ఇండస్ట్రీ వల్ల బోర్ వెల్స్ లోని నీళ్లన్నీ కలుషితమయి హానికారకంగా తయారయినాయి కాబట్టి మాకు కార్పొరేషన్ మంచినీరు సప్లయ్ చేయమంటే పట్టించుకోవడం లేదు."
"మరి ఎలక్ట్రిసిటీ బోర్డ్ అధికారినెందుకు కిడ్నాప్ చేశారు?"
"మా కాలనీకి మిగతా సిటీ కంటే ఎక్కువ 'పవర్ కట్' చేస్తున్నారు. ఎన్ని కంప్లయింట్స్ ఇచ్చినా పట్టించుకోవడం లేదు."
"మరి హౌసింగ్ బోర్డ్ చైర్మన్ సంగతేమిటి? అతన్నెందుకు కిడ్నాప్ చేశారు?"
"మాకు ఎలాట్ అయిన హౌసింగ్ బోర్డ్ ఇంట్లో కపిల్ దేవ్ అయిదువేల పరుగులు సాధించాడన్న సంతోషంతో మేమంతా టీ.వీ. ముందు కూర్చుని తప్పట్లు కొట్టేసరికి గోడలు, సీలింగ్ అన్నీ పగుళ్ళిచ్చినయ్- అవి సరిచేసేవరకు అతనిని వదిలేది లేదు."
"మరి ఆర్టీసి డిపో మేనేజర్ని ఎందుకు కిడ్నాప్ చేశారు?"
"మా కాలనీలోకొచ్చే బస్సుల సంఖ్య పెంచమని ఎన్నిసార్లు బ్రతిమాలినా పెంచడం లేదు- అందుకే గత్యంతరం లేక అతనిని కిడ్నాప్ చేశాం! ఎక్ స్ట్రా బస్ లు వేసేవరకు అతనిని వదిలేది లేదు."
"మరి దూరదర్శన్ అధికారినెందుకు కిడ్నాప్ చేశారు? వాళ్ళేం పాపం చేశారు? అతనినయినా వదిలేయండి!"
"దేశంలో ఏ గొడవచ్చినా జరుగుతున్నదానికి పూర్తిగా వ్యతిరేకంగా అబద్దాలతో చేసే ప్రచారం ఆపమని ఎన్నోసార్లు ఉత్తరాలు వ్రాశాం - జవాబుల కార్యక్రమానికి. కానీ వాటిల్లో వాళ్ళను పొగిడే ఉత్తరాలే చదువుతున్నారు. అలాగే తెలుసు ప్రజలమీద అతి నీచంగా రుద్దుతున్న చెత్త కార్యక్రమాలు ఆపమని కూడా కోరాం! వాళ్ళు వాటిని ఇంకా పొడిగిస్తున్నారు.
ఇవిగాక న్యూస్ లో మనదేశాధినేతల 'సమాధులు' వాటి దగ్గర ప్రార్థనలు. ఆ సమాధుల చుట్టూ 24గంటలూ ప్రదక్షణలూ చేసి దండలు వేసే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులను చూసి అసహ్యం కలుగుతోందని. కనుక అలాంటి సమాధుల కార్యక్రమం ఆపాలని కూడా అడిగాము. కానీ ఆ కార్యక్రమాల నిడివి కూడా పెంచారు.
మేము కోరిన కోరికలన్నీ అమలు పరచేవరకూ దూరదర్శన్ అధికారిని వదిలే ప్రసక్తిలేదు" అన్నారు వాళ్ళు.
"మరా సెన్సార్ బోర్డ్ అధికారిని ఎందుకు తీసుకెళ్ళారు?"
"సెన్సార్ పేరుతో ప్రొడ్యూసర్లను బ్లాక్ మెయిల్ చేయడం, ఓ పక్క అడ్డమయిన చెత్తా కట్ చేయకుండా జనం మీదకు వదిలేయడం. మరో పక్క - కట్ చేసిన దృశ్యాలన్నిటినీ మళ్ళీ రికమండేషన్ తేగానే ఓకే చేసేయడం, ఇంకో పక్క - ఇలాంటివన్నీ నెరవేరకపోతే వాళ్ళందరూ ప్రాణాలు పోగొట్టుకోవలసి వస్తుంది."
"మీరు వాళ్ళనలా కిడ్నాప్ చేయడం చట్ట విరుద్దమని పోలీస్ అధికారులంటున్నారు. వాళ్ళను చంపితే ఉరిశిక్ష పడుతుందని కూడా వాళ్ళు అంటున్నారు" ఆ యువకులు పగలబడి నవ్వారు.
"మేము వాళ్ళను చంపడం అనేది జరగదు కాని వాళ్ళంతటవాళ్ళు చస్తే మాత్రం పూచీ మాదికాదు."
"అదేమిటి? వాళ్ళంతట వాళ్ళు ఎలా చస్తారు?"
"ఎందుకు చావరు. కార్పొరేటర్ ని రోజూ చీకట్లో కాలనీ రోడ్ మీద మా వాలంటీర్ ఒకడు పదిసార్లు నడిపిస్తాడు. కనుక ఆ రోడ్డు మీద గోతులు ఓపెన్ చేసి ఉన్న డ్రయినేజ్ మూతల్లో ఏ క్షణంలోనయినా అతను పడి చావడం ఖాయం. కనుక ఈలోగానే ఆ రోడ్డుని రిపేర్ చేయించి డ్రయినేజ్ కవర్లని మూయించాలి.
ఇక హౌసింగ్ బోర్డ్ ఇంజనీర్ని వాళ్ళు కొత్తగా కట్టించిన ఈ ఇంటివెనుక గదిలో పెట్టి తలుపులు మూసివేశాం! ఆ గది సీలింగ్ ఏ క్షణంలోనయినా కూలిపోవడానికి సిద్ధంగా వుంది. అది కూలితే అతడు చేసిన నేరానికి అతనే బలి అవుతాడు.
ఆర్టీసీ డిపో మేనేజర్ని అమిత రద్దీగా ఉన్న వాళ్ళ బస్ లోనే బలవంతంగా ఎక్కించి పది రౌండ్లు కొట్టేలా చెస్థాఅమ౧ మూడు నాలుగు రౌండ్లకే ఎగిరిపోతాడతను.
దూరదర్శన్ అధికారిని టీ.వీ. ముందే కట్టేసి కూర్చోబెట్టి టీ.వీ ఆన్ చేసి ఉంచుతున్నాం. ఆ ప్రోగ్రాములు వరుసగా రెండ్రోజులు చూస్తే చాలు గుండెన్నా ఆగిపోతుంది, పిచ్చన్నా ఎక్కుతుంది. అక్కడితో అతనెగిరిపోతాడు.
సెన్సార్ అధికారికి వాళ్ళు అనుమతించిన సినిమాలన్నీ వరుసగా ఇరవైనాలుగ్గంటలూ వీడియోలో చోపిస్థాఅమ౧ దాంతో మెంటల్ వచ్చేయటం ఖాయం.
"మరి ఎలక్ట్రిసిటీ బోర్డ్ అధికారి సంగతేమిటి? అతనికెలా హాని కలుగుతుంది?"
"ఎలక్ట్రిసిటీ స్టవ్ మీద కిడ్నాప్ అయిన వాళ్ళందరికీ అతనే భోజనం వండాలి"
"దానివల్ల అతని ప్రాణానికేమీ హాని కలగదు కదా!"
"అతని ప్రాణానికే కాదు- మేము కిడ్నాప్ చేసిన వారందరూ కూడా చావటం ఖాయం."
"ఎలా?"
"పవర్ కట్ వల్ల వంట ఎప్పటికీ అవదు కదా-"
పోలీస్ అధికారులు ఏం చేయాలో తెలీక తలలు పట్టుక్కూర్చున్నారు.
మైక్ లో ఆ యువకులు చేస్తున్న ప్రకటన వినిపించింది మాకు. "పోలీసులు ఈ కాలనీని చుట్టుమిట్టినట్లు మాకు ఇన్ ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు కనీసం నెలరోజులయినా ఇలాగే చుటముట్టి వుండాలని కోరుతున్నాం! దీనివల్ల దొంగల బెడద మా కాలనీకి తప్పిపోతుంది."
* * *