Previous Page Next Page 
చెక్ పేజి 40


    లోపలకెళ్లి కోడలిని ముద్దులతో ముంచెత్తింది. పాలేరుకి పది రూపాయలిచ్చి చాక్లెట్లు తెప్పించి డాక్టర్ తో సహా నర్సింగ్ హోమ్ లో వున్న పేషెంట్లందరికీ పంచింది. ఆ సాయంకాలమే ఇంటికొచ్చేశారు.

 

    సరస్వతికి గండం నుంచి బయటపడినట్టనిపించింది. సుందరబాబు ఎక్కడ రెండో పెళ్లి చేసుకుని తన కూతురికి అన్యాయం చేస్తాడేమోనన్న శంక తీరిపోయింది. ఎంతో తృప్తిగా వూపిరి పీల్చుకుంది.

 

    అనసూయమ్మ ఆనందాన్ని చూసి సుందరబాబు, ప్రసూన చాలా సంతోషించారు. తిరిగి ఆ ఇంటికి కళ వచ్చింది. ఊర్లోని వాళ్ళంతా ఆ శుభవార్త విని ఆనందించారు. స్త్రీలంతా ఇంటికి వచ్చి ప్రసూన అదృష్టాన్ని పొగిడారు. ఇంటికొచ్చిన ప్రతి ఒక్కరికీ కాఫీలిచ్చి సాగనంపింది అనసూయమ్మ.

 

    రోజులు గడిచే కొద్దీ సుందరబాబు జాతేగావ్ కు వెళ్ళాల్సిన సమయం దగ్గర పడింది.

 

    అంతదూరం ఇప్పుడు ప్రయాణం చేయడం మంచిది కాదని, తన కూతుర్ని మునగల పాళెంకు తీసుకెళ్ళి పురుడు పోయిస్తానంది సరస్వతి. పెళ్ళయిన ఈ ఆరేళ్ళలో ప్రసూన పుట్టింటికి పోయింది చాలా తక్కువ. అందువల్ల ఈ తొమ్మిది నెలలూ తనే వుంచుకుంటానంది సరస్వతి.

 

    ఈ విషయంలో తన అభిప్రాయమేమిటో చెప్పమంది అనసూయమ్మ కొడుకుని.

 

    "నిజమే అమ్మా, అంత దూరం ఈ సమయంలో ప్రసూనను తీసుకుపోవడం మంచిది కాదు. నేనొక్కణ్నే వెళ్ళి అక్కడ పనులు చూసుకుంటాను. ఇక్కడకంటే తను పుట్టింట్లోనే హాయిగా వుండగలదు. ఈ తొమ్మిది నెలలూ అక్కడే వుండనివ్వు. మధ్యమధ్యలో నువ్వెళ్లి చూసి వస్తూవుండు. ఇంతకాలం మనసుదీరా ప్రసూన పుట్టింట్లో గడపలేదు. ఏవో పనుల వత్తిడివల్ల తీరిక దొరకలేదు. ఈ సాకుతో నన్నా తనను పుట్టింటికి వెళ్ళనివ్వు. అక్కడ నాకేం పర్వాలేదు. ఎవరో ఒక వంటవాడ్ని కుదుర్చుకుంటాను" అన్నాడు.

 

    దీంతో అన్నీ నిర్ణయమైపోయాయి. ప్రసూన ప్రసవించాక ఇక్కడకు వచ్చేట్టు ఈలోగా సుందరబాబు కాంట్రాక్ట్ పని ముగించుకునేట్టు అనుకున్నారు.

 

    సుందరబాబు, ప్రసూన ఇద్దరూ అదే రోజు బయల్దేరారు. అనసూయమ్మను కూడా మునగలపాళెంలో వుండమని ప్రసూన పిలిచినా ఆమె ఒప్పుకోలేదు. ఇంటి దగ్గర వ్యవసాయం నిలిచిపోతుందని, తన మనవడికి ఇంకా సంపాదించి పెట్టాలని నవ్వుతూ చెప్పి కోడల్ని సాగనంపింది. సుందరబాబు భార్యకు కొంత డబ్బిచ్చి అవసరాలకు వాడుకోమన్నాడు.  

 

    అతన్ని రైలు ఎక్కించి త్వరలోనే రమ్మంది ప్రసూన. భార్యను ముద్దాడి శెలవు తీసుకున్నాడు సుందరబాబు. ట్రైన్ కనుమరుగయ్యేవరకు చేతులూపింది ప్రసూన. ఆమెకు మనసంతా దిగులుగా వుంది.

 

    ఆమె, సరస్వతి రేణిగుంట బస్టాండ్ కు వచ్చి బస్సెక్కి తమ వూరు వెళ్లిపోయారు.

 

    రోజులు గడుస్తున్నాయి.

 

    అనసూయమ్మకు వ్యవసాయంతోనే సరిపోతూ వుంది. కోడలు వెళ్ళిపోయి నెలయ్యాక ఒకసారి వెళ్ళి చూసొచ్చింది. ఆ తరువాత అయిదు నెలలు గడిచిపోయినా వెళ్ళలేకపోయింది.

 

    ఒక రోజు ప్రసూన దగ్గర్నుంచి వుత్తరం వచ్చింది. తనను ఒక్కసారి చూసి వెళ్ళమని. ఇక వుండబట్టలేక బయల్దేరింది. కోడల్ని పరామర్శించి వెంటనే వచ్చేసింది. అప్పుడే నాట్లు ప్రారంభం కావడంతో మరో రోజు వుండలేకపోయింది.

 

    నాట్లయిపోయి, శనగవిత్తనం వేసేసరికి మరో నాలుగు నెలలు గడిచిపోయాయి. రేపోమాపో కోడలు ప్రసవిస్తుందని నిమిషాలను లెక్కబెట్టుకుంటూ వుండిపోయింది అనసూయమ్మ.

 

    ఒకరోజు పొద్దునే మునగలపాళెం మనిషి వచ్చాడు. ప్రసూనకు కొడుకు పుట్టాడన్న వార్త అతను చెవిన వేశాడు. మరో మూడు రోజులకు హాస్పటల్ నుంచి వస్తుందని అప్పుడు రమ్మని చెప్పి వెళ్ళిపోయాడు అతను.

 

    ఊరికంతా తీపి పంచింది అనసూయమ్మ.

 

    ఎప్పుడెప్పుడు మూడు రోజులు అయిపోతాయా అని ఎదురు చూసింది. మూడు రోజులు కాగానే ఇక వుండలేకపోయింది. అప్పటికే తయారు చేయించిన వెండి మొలత్రాడు తీసుకుని మునగలపాళెం బయల్దేరింది.

 

    మనవడ్ని చూడగానే ఆమె ఆనందం పట్టలేక ఏడ్చింది. ఇంకా పురిటి వాసన పోని ఆ పసికందు ఎర్రగా, చెట్టుకు అప్పుడే కాచిన టమేటో పండులా వున్నాడు. అంతా తన కొడుకు పోలికేనని నిర్దారించుకుంది. వాడ్ని ముద్దులతో ముంచెత్తింది.

 

    ప్రసూన సుందరబాబుకు విషయం తెలుపుతూ వుత్తరం రాసింది. మరో పదిహేను రోజులకు పనంతా పూర్తయిపోతుందని, బిల్లు పాస్ కాగానే ఏకంగా వచ్చేస్తానని లెటర్ రాశాడు.

 

    మాట ప్రకారం పదిహేను రోజుల తరువాత వచ్చాడు సుందరబాబు.

 

    ప్రసూన ఆశించినట్టు అతను కొడుకును చూడగానే రియాక్టు కాలేదు. ఎదో బలవంతంగా వాడ్ని చూసినవ్వి ఇవతలకు వచ్చేశాడు. మంచిరోజు చూసి పంపండని ఆ సాయంకాలమే అత్త మామలతో చెప్పి వూరికి వచ్చేశాడు.

 

    తనను దగ్గరకు తీసుకుని, కొడుకును కన్నందుకు ముద్దులతో తన శరీరాన్నంతా ముంచేస్తాడనీ, గంటల కొద్దీ కబుర్లు చెబుతాడని, ఇంతకాలం తను ఎలా వున్నానో అడుగుతాడని, మరెన్నో వూహించుకున్న ప్రసూన సుందరబాబు ప్రవర్తనకు కొద్దిగా కలత చెందింది. ప్రయాణపు బడలిక వల్ల అలా వున్నాడేమోనని అనుకుంది. కానీ ఎక్కడో ఆమెకు అనుమానంగా వుంది. తన మోసం ఎక్కడ పసిగట్టాడోనన్న భయం మెల్లగా ఒళ్ళంతా పాకుతూ వుంది.

 

    తన బాధనంతా తల్లితో చెప్పుకుని ఏడ్చింది ప్రసూన. అనవసరమైన అనుమానాలకు తావివ్వవద్దని సరస్వతి కూతుర్ని వూరడించింది.

 

    మూడు నెలలు గడిచాయి. అనసూయమ్మ మాత్రం వారానికోమారు వచ్చి మనవడ్ని చూసి వెళుతూ వుంది. సుందరబాబు ఒక్కసారి కూడ రాలేదు. తన జీవితంలో గొప్ప విషాదం సంభవిస్తుందని అనిపించసాగింది ప్రసూనకు.

 

    ఇక ఒక్క క్షణం కూడా పుట్టింట్లో వుండలేకపోయింది. త్వరగా తనను అత్తింటికి పంపివేయమని చెప్పింది తల్లిదండ్రులకు. వాళ్ళకూ అల్లుడు రాకపోవడంతో లోపల కంగారుగాను వుంది.

 

    త్వరలోనే మంచి రోజు చూశారు. ఫలానా రోజు వస్తున్నట్టు సుందరబాబుకు వుత్తరం రాశారు.

 

    ప్రసూన, ఆమె తల్లి దండ్రులు ఆరోజు బయల్దేరి చెల్లూరుకు వచ్చారు. వాళ్ళు వచ్చేసరికి సుందరబాబు ఇంటి దగ్గర లేడు. ఏదో అర్జెంట్ పనిమీద తిరుపతికి వెళ్ళాడని చెప్పింది అనసూయమ్మ.

 

    అనసూయమ్మ మనవడికి దిష్టితీసి ఇంట్లోకి రమ్మంది. సుందరబాబు కావాలనే ముఖం తప్పించాడని ప్రసూనకు అర్థమైంది. ఆ రోజు సాయంకాలమే ప్రసూన తల్లి దండ్రులు మునగలపాళెంకు వచ్చేశారు.

 

    మరుసటి రోజు రాత్రి ఇంటికొచ్చాడు సుందరబాబు. ప్రసూన గుచ్చి గుచ్చి అడిగితే పొడి పొడిగా జవాబులు చెప్పాడు. ఎదో మొక్కుబడి కోసం కొడుకుని కాసేపు ఎత్తుకుని దించాడు.

 

    భోజనం ముగించి, డాబా మీదకు వెళ్ళాడు సుందరబాబు. ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్న ప్రసూన పరుగున వెళ్ళింది.

 Previous Page Next Page