Previous Page Next Page 
చెక్ పేజి 39


    దాంతో పరమానంద భరితురాలైంది అనసూయమ్మ. ఊరి శివాలయంలో మకాం వేసిన స్వామీజీని తన ఇంటికి పిలుచుకు వచ్చింది ఆమె. ఆయనకు సకల వుపచారాలూ చేయసాగింది.

 

    స్వామిని సరాసరి తమ ఇంటికి తీసుకురావడంతో సుందరబాబు ప్రసూన ఇబ్బందిగా భావించారు. అప్పటికే స్వామి తన ఇంట్లో తిష్ఠ వేయడంతో ఇక చేసేది లేక వూరకుండిపోయారు.

 

    స్వామి ఆ ఇంటికి వచ్చిన వారం రోజులకు పుత్రకామేష్టి యాగం ప్రారంభించాడు. పూజగదిలో హోమం చేసి, పూజలు ప్రారంభించాడు.

 

    తన కిష్టం లేకపోయినా పూజా సామాగ్రినంతా ప్రసూన అమర్చేది. సుందరబాబు కాంట్రాక్ట్ పనులతో బిజీగా వున్నాడు. అయినా కొత్తగా మహారాష్ట్రలోని జాతేగావ్ లో కొత్తపనికి టెండరు వేశాడు. ఆ కాంట్రాక్ట్ పది లక్షలు. మరో కాంట్రాక్ట్ మిత్రుడితో కలిసి ఆ టెండర్ వేశాడు. ఆ పని వస్తే జాతేగావ్ లో సంవత్సరంపాటు వుండాల్సివస్తుంది. భార్యనూ తనతోపాటు తీసుకెళ్లి పని ముగిశాక తిరిగి వద్దామనుకున్నాడు. ఆ కాంట్రాక్ట్ పనికోసం రాత్రింబవళ్ళు తిరుగుతున్నాడతను.

 

    ప్రసూన పూజకు అలవాటుపడి, తను చెప్పకపోయినా పూజా పనులన్నీ చేస్తుండడం అనసూయమ్మకు ఆనందాన్ని ఇచ్చింది. ఈ యాగం ఫలించైనా తన కోడలు గర్భవతి అయితే చాలనుకుంది ఆమె.

 

    యాగం పదిహేను రోజులపాటు జరిగింది. యాగం మరో రెండు రోజుల్లో ముగుస్తుందనగా ప్రసూన తల్లి సరస్వతి చెల్లూరుకు వచ్చింది. పిల్లలు పుట్టకపోతే సుందరబాబు రెండో పెళ్ళిచేసుకుని తన కూతురికి అన్యాయం చేస్తాడనే భయం ఆమెకుంది. అందుకే ఇంట్లో పుత్రకామేష్టి యాగం జరుగుతూ వుందని తెలిసి కాస్త కుదుట పడింది.

 

    సరస్వతి అలా భయపడడానికీ కారణముంది. ఈ మధ్య కొందరు కొడుక్కి రెండో పెళ్ళి చేయమని అనసూయమ్మకు సలహాలిస్తున్నారని ప్రసూన తన తల్లికి ఉత్తరాలు రాసింది. దాంతో ఆమె కంగారు పడిపోయింది. చక్కటి కాపురం ఎక్కడ బ్రద్దలవుతుందోనన్న భయం ఆమెను వూపేస్తోంది. అందుకే తరచూ చెల్లురుకు వచ్చి అనసూయమ్మకు నచ్చజెప్పి వెళుతూ వుంది.

 

    అయితే సుందరబాబు తనకు అన్యాయం చేసి, మరో పెళ్ళి చేసుకుంటాడని ప్రసూన వూహించడంలేదు. తన అత్త పట్టుపట్టి మరో వివాహం జరిపిస్తుందన్న భయం ఏ మూలో వుంది. అందుకే అన్నీ తన తల్లికి రాస్తోంది.

 

    యాగం ముగిసింది. అవధూత మరో వారం రోజులపాటు వుంది. శాంతిచేసి వెళ్ళిపోతానని అన్నాడు. అనసూయమ్మ అందుకు ఆనందించింది. రోజుకో పూజ చేస్తున్నాడు అవధూత. ప్రసూన, సరస్వతి ఇద్దరూ ఆయనకు పరిచర్యలు చేస్తున్నారు.

 

    ఒకరోజు సుందరబాబు తిరుపతి నుంచి ఒక శుభవార్తతో తిరిగొచ్చాడు.

 

    ప్రసూనకోసం ఇల్లంతా చూశాడు. వంటింట్లో అనసూయమ్మ, సరస్వతి కూరగాయలు తరుగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు. అప్పటికి రాత్రి ఏడయింది. గ్రామం కాబట్టి అప్పటికే బాగా చీకటిగా వుంది. సాయంకాలం పూజ ముగించి, అప్పుడే వంట మొదలుపెట్టారు వాళ్ళు.

 

    "అమ్మా ! ప్రసూన ఎక్కడ?" అడిగాడు.

 

    "పైన డాబా మీదుంది నాయనా" అని చెప్పింది అనసూయమ్మ.

 

    ఎప్పుడెప్పుడు ఆ వార్త ప్రసూనకు చెబుదామా అనే ఆతృతతో మెట్లెక్కిపోయాడు సుందరబాబు.

 

    అతను వెళ్ళేసరికి స్వామి ఎదో చెబితే పడి పడి నవ్వుతోంది ప్రసూన. భర్తను చూడగానే మంచం మీంచి దిగింది ఆమె.

 

    స్వామితోపాటు మంచం మీద ఎదురుగ్గా కూర్చుని మాట్లాడే చనువు ప్రసూనకు వుందా అని ఒక్క నిముషంపాటు ఆశ్చర్యపోయాడు సుందరబాబు.

 

    "ప్రసూనా" అని పిలిచాడు.

 

    "ఎప్పుడొచ్చారు మీరు ? స్వామీజీ జోక్ చెబితే నవ్వుతున్నాను." అని అతని దగ్గరగా వచ్చింది ఆమె.

 

    "నీకో గుడ్ న్యూస్" అన్నాడు. అతని ముఖం సంతోషంతో వెలిగిపోతోంది.

 

    "ఏమిటి?"

 

    "ఆ కాంట్రాక్ట్ మనకే వచ్చింది. త్వరలోనే మనం జాతేగావ్ కు పోతున్నాం" అన్నాడు.

 

    "నిజంగానే" అని అతని రెండు చేతుల్నీ తన చేతుల్లోకి తీసుకుంది.

 

    స్వామీజీ ఈ మాటలకు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ వుండడాన్ని సుందరబాబు గుర్తించలేదు.

 

    "స్వామీ రండి కిందకు వెళదాం. మాతో పాటు మీరూ భోజనం చేద్దురుగాని" అని పిలిచింది ప్రసూన.

 

    అందరూ కిందకు వచ్చారు. అందరికీ కాఫీలు ఇచ్చింది ప్రసూన.

 

    ఇప్పుడెందుకు కాఫీ అని స్వామి మొహమాట పడ్డా "మా శ్రీవారికి మంచి కాంట్రాక్ట్ వచ్చినందుకు ఈ కాఫీ. అందుకే మీరు తప్పక తాగాలి" అని బలవంతం చేసింది ఆమె.

 

    సుందరబాబు స్నానంచేసి డ్రస్ మార్చుకున్నాడు.

 

    మరో నెలరోజులకు జాతేగావ్ కు ప్రయాణం. సుందరబాబు డబ్బు సమకూర్చుకోవడంలో మునిగిపోయాడు. ప్రయాణం మరో పదిహేను రోజులు వుందనగా స్వామి బయల్దేరాడు.

 

    ఆయనకు పట్టుబట్టలు, నూట పదమార్లు పళ్ళెంలో పెట్టి ఇచ్చింది అనసూయమ్మ.

 

    "స్వామీ ! మీరు చెప్పినట్టు నా కోడలు గర్భవతి అయితే అంతకంటే మించిన ఆనందం మరొకటి వుండదు నాకు. మీ ప్రయత్న లోపం లేకుండా పూజలు చేశారు. యాగాన్ని నిర్వహించారు. ఆ తరువాత ఇక మిగిలింది ఆ పరమేశ్వరుడి దయే. మా ప్రసూనకు నెల నిలుస్తుందని మీరు చెప్పారు. నా కొడుక్కి రెండో పెళ్లి చేయాలన్న ఆలోచనను విరమించుకోమన్నారు. అలానే స్వామీ! మీ వాక్కు ఫలించేలా ఆశీర్వదించండి స్వామీ" అని రెండు చేతులూ ఎత్తి మొక్కింది.

 

    "తథాస్తు" అని దీవించి స్వామి వెళ్ళిపోయాడు.

 

    ఆయన వెళ్ళిపోయినా అయిదు రోజులకు ప్రసూన కళ్ళు తిరిగి పడిపోయింది. వెంటనే ఆమెను ఎద్దుల బండిలో తీసుకుని రేణిగుంటకు వచ్చారు, డాక్టర్ ఏదో పరీక్షలు చేసి, ఏవో మందులిచ్చాడు. గంటలో తేరుకుంది ప్రసూన.

 

    నర్స్ తీసుకొచ్చిన రిపోర్ట్ చదివి "సుందరబాబు గారూ" అని ఎంతో సంతోషంగా పిలిచాడు డాక్టర్.

 

    సుందరబాబుతో పాటు, అనసూయమ్మ డాక్టర్ గదిలోకి వెళ్లారు.

 

    "సుందరబాబు ! నీకు శుభవార్తయ్యా ! నువ్వు తండ్రివి కాబోతున్నావ్. నీ భార్య గర్భవతి" అని చెప్పాడు డాక్టర్. ఆయన ఓ సారి సుందరబాబు దగ్గర నాటకం నేర్చుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన సుందరబాబుకు శిష్యుడు.

 

    ఆ మాట విని మురిసిపోయింది అనసూయమ్మ. ఆ సమయంలో ఆమెకు గుర్తుకొచ్చింది ఇద్దరే ఇద్దరు. ఒకరు భగవంతుడు, మరొకరు అవదూతానంద స్వామీజీ.

 Previous Page Next Page