Previous Page Next Page 
మేడలో నీడలు పేజి 40


    తను అనుకున్నట్లు ఆమె మూర్ఖురాలు కాదని తెలుసుకున్నాడు రామం.

 

    "అట్లాగే మా అమ్మాయి విషయంకూడా. అది పైకి రావాలనే కాంక్ష నాకు ఎంత వుందో. దాని జీవితం మూడుపూవులూ, ఆరుకాయలుగా వుండాలన్న ఆశకూడా అంతే వుంది."

 

    కాఫీ టిఫిన్ వచ్చాయి.

 

    రామం, వసంతబాల కబుర్లు చెప్పుకుంటూ ఫలహారం ముగించి కాఫీలు త్రాగేశారు. అప్పటికి ట్రైన్ కదలటానికి యింకా ఓ పదినిముషాల వరకూ టైం వున్నదని తెలిసింది.

 

    "అలా బుక్ స్టాల్ వరకూ పోయివద్దాము" అని అతడామెను అడిగాడు.

 

    "పోయిరామా అమ్మా!" అనడిగింది వసంతబాల తల్లిని.

 

    "వెళ్ళిరండి."

 

    ఇద్దరూ కంపార్టుమెంటు దిగి బుక్ స్టాల్ వైపు నడవసాగారు.

 

    "మీ నాన్నగారెప్పుడు పోయారు" అనడిగాడు రామం హఠాత్తుగా.

 

    "నాన్న...!" ఆమె ఉలిక్కిపడింది. "ఏమో నాకు సరిగ్గా తెలియదు" అంది కంపితస్వరంతో.

 

    అతడామెలో వచ్చిన మార్పును గమనించాడు. "క్షమించండి. మీకు కష్టం కలిగించినట్లున్నాను" అన్నాడు.

 

    "అబ్బే లేదండి, కష్టమెందుకు? నా చిన్నతనంలో ఎప్పుడో నాన్నని చూచాను అంతే..."

 

    రామం ఆమెవంక చూశాడు. చూస్తున్నకొద్దీ ఆమె అంటే ఆప్యాయత ఉబుకుతోంది అతన్లో.

 

    "మన పరిచయం చాల విచిత్రంగా అయింది కదూ?" అన్నాడు.

 

    వసంతబాల నవ్వింది. "చిత్రంగా అవలేదు. మీరంతట మీరే కావాలని చేసుకున్నారు కదూ?" అంది.

 

    "మీ కౌశలం చూసి నేను ముగ్ధుణ్నయ్యాను కాబట్టి!"

 

    "మీరు మాట తప్పుతున్నారు. నేను చేసిన నాట్యం అన్నారు. మరచిపోయారా?" అన్నదామె జ్ఞాపకం చేస్తూ.

 

    "అబ్బ! మీ ఆడవాళ్ళకి యింత జ్ఞాపకశక్తి వుండటం మాకు ప్రమాదమే సుమండీ."

 

    ఇద్దరూ బుక్ స్టాల్ దగ్గరకు చేరుకుని అక్కడున్న పుస్తకాలు తిరగెయ్యసాగారు. సేల్స్ మేన్ కొంచెం దూరంలో వున్నాడు. చుట్టుప్రక్కల ఎవరూ లేరు.

 

    ఆమె ఒక ఇంగ్లీషు నవలని తిరగవేస్తూ వినిపించీ, వినిపించనట్లుగా "పెళ్ళయిందా?" అంది.

 

    రామం కొంటెగా "ఆ పుస్తకం ఇక్కడ లేదనుకుంటానండీ" అన్నాడు.

 

    వసంతబాల అతనివంక తిరిగి "ఆ పుస్తకం కోసం నేను వెతకటం లేదండి, ప్రక్కనున్న మనిషి విషయం..." అంది.

 

    "అయింది" అన్నాడు రామం.

 

    ఆమె కుతూహలంగా "ఏం చదువుకున్నారేం ఆవిడ?" అనడిగింది.

 

    "ఇంచుమించు మీ అంతే చదువుకుంది!"

 

    "అందంగా వుంటుందా?"

 

    "ఆ రోజుల్లో కాలేజీ బ్యూటీగా ప్రసిద్దికెక్కింది."

 

    "ఆమెగార్ని నాకు చూపిస్తారా మరి?"

 

    "ఎలా చూపించనూ... ఇక్కడ లేనిదే!"

 

    "అదేం?"

 

    "ఆమె నన్ను విడిచి వెళ్ళిపోయింది!"

 

    ఆమె అతనివంక పరీక్షగా చూసింది. అతను చెప్పినదంతా అబద్ధమని ఈ మాటతో పూర్తిగా రూఢి చేసుకుంది.

 

    "నేను నమ్మను" అంది.

 

    "ఏమో!"

 

    "మీలాంటివార్ని విడిచి ఎవరైనా వెళ్లిపోతారంటే ఎలా నమ్మటం!"

 

    "ఏం? నాలో ప్రత్యేకత ఏముంది? ఆమె డ్యాన్సింగ్ నేర్చుకుంటానంది. నేను వద్దన్నాను. అంతే వెళ్ళిపోయింది."

 

    వసంతబాల ఫక్కుమని నవ్వింది. "ఎవరైనా డ్యాన్సింగ్ నేర్చుకోవద్దన్నంత మాత్రాన బంగారంలాంటి భర్తని విడిచి వెళ్లిపోతారండీ. భలేవారే! అదిగో గంట కొడుతున్నారు. త్వరగా వెడదాం రండి. అమ్మ గాభరా పడుతూంటుంది" అని తొందర చేసింది.

 

    ఇద్దరూ గబగబా నడిచి రైలు సరిగ్గా బయల్దేరబోయే సమయానికి కంపార్టుమెంటు చేరుకున్నారు. వసంతబాల తల్లి నిజంగానే గాభరాపడుతూ కూర్చుంది. వాళ్ళిద్దరూ లోపలికి ఎక్కబోతూండగా "హమ్మయ్య వచ్చారా? అక్కడ కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోయారేమోనని హడలి చస్తున్నాను" అంది కుదుటపడి.

 

    వసంతబాల లోపలికి ఎక్కి తల్లిపక్కకి వచ్చి కూర్చుని "నీదంతా భయమమ్మా! రాకుండా ఎక్కడికి పోతాను...?" అంది ఆమె భుజంచుట్టూ చెయ్యివేసి గారాంచేస్తూ.

 

    రైలు కదిలింది.

 

    ముగ్గురూ ఏవో కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు.

 

    మరో గంటన్నరసేపు నిర్విరామంగా ప్రయాణం చేసి సామర్లకోట చేరుకుంది రైలుబండి. రామం పెట్టెదిగి పోర్టర్ ని కేకేశాడు. నెమ్మదిగా సామానంతా లోపలినుంచి దింపేశాక "మీరిక్కడే వుండండి. కనెక్షన్ ట్రైన్ ఎంతసేపట్లో వుందో కనుక్కుని వస్తాను" అని రామం అటుకేసి వెళ్ళాడు.

 Previous Page Next Page