Previous Page Next Page 
మేడలో నీడలు పేజి 41


    "పాపం బుద్ధిమంతుడు" అన్నది తల్లి.

 

    "ఈయన లేకపోతే చాలా యిబ్బంది పడివుందుము కదా" అన్నది వసంతబాల తల్లి ఆ మాట అనగానే.

 

    ఆమె కూతురివైపు చూసింది. అనుకోని విధంగా ఆమెమీద ఎనలేని జాలి కలిగింది. ఇది వట్టి పిచ్చితల్లి. అమాయకురాలు. ఈ లోకం ఆమెని సులభంగా మోసం చేసివేస్తుందేమోనన్న భయం కలిగింది.

 

    "వసంతా!" అంది గాద్గాదికంగా.

 

    "ఏమిటమ్మా?" అంది కూతురు ఆ కంఠధ్వనికి చకితురాలయి.

 

    "ఏమీలేదు. ఏమీలేదు" అని తప్పించుకోజూసింది.

 

    "కాదమ్మా. ఏదో వుంది. చెప్పాల్సిందే" అని వసంతబాల బలవంతం చేసింది.

 

    "ఏమీ లేదమ్మా! నువ్వింత అమాయకురాలవు. నేను లేకపోతే..."

 

    కూతురు ఒక్కసారిగా నిలువునా వొణికి "అదేమిటమ్మా! అర్థాంతరంగా స్టేషన్ లో ఇలాంటి మాటలు..."


    
    "ఏమీ లేదమ్మా! ఏదో ఆవేశంలాంటిది కలిగింది అంతే" అని తల్లి చెంగుతో కళ్ళు తుడుచుకుంది.

 

    మూడు నిముషాలు గడిచాక రామం వచ్చాడు. "రండి కనెక్షన్ ట్రైన్ లైన్ మీదికి వస్తోంది. ఇంకో పావుగంటలో బయల్దేరుతుంది" అన్నాడు.

 

    అంతా కలిసి నడవసాగారు.

 

    కాసేపయినాక వాళ్లు ఎక్కిన డీజిల్ బండి క్రమంగా వెంకటకృష్ణరాయపురం, సర్పవరం దాటి కాకినాడ చేరుకుంది.

 

    వాళ్లు ఎంత వారిస్తున్నా వినకుండా అతను గాంధీనగర్ దాకా వాళ్ళతో వెళ్లి ఇంటిదగ్గర దిగబెట్టాడు.

 

    "చాలా థాంక్స్ అండీ. లోపలకు వచ్చి వెళ్ళండి" అంది వసంతబాల.

 

    "అబ్బ! ఇప్పుడు రాలేనండీ. వీలు చూసుకుని సాయంత్రమో రేపో వస్తాను."

 

    "నీ మేలు మరిచిపోలేము నాయనా. తప్పకుండా వస్తూ వుండు" అంది తల్లి.

 

    "అలాగేనండీ" రామం రిక్షా ఎక్కి ఇంటిదారి పట్టాడు.


                                                                           12


    "ఎవరూ?" అన్నారు విశ్వనాథంగారు అడుగుల చప్పుడు విని.

 

    "నేను నాన్నగారూ!"

 

    విశ్వనాథంగారు ఈజీచైర్ లో కొంచెం ముందుకువంగి "నువ్వా రామం? ట్రైన్ ఆలస్యంగా వచ్చిందా ఏం?" అన్నారు.

 

    "అవునండీ."

 

    "రెండు మూడు రోజుల్నుంచీ వస్తావని ఎదురు చూస్తున్నాంరా. వెళ్లిన పని సక్సెస్ ఫుల్ గా అయిందా?"

 

    "అయిందండీ. అక్కడ మంచి ఆర్డర్లు సంపాదించాను. ఈ ఏడాది బిజినెస్ ఇంకా ఇంప్రూవ్ అవుతుందండి. మరో పదివేలన్నా పెరుగుతుందని అంచనా వేస్తున్నాను. మా సోప్సుకి మంచి డిమాండ్ వస్తోంది."

 

    ఆయనకు కొడుకుమీద ఎనలేని జాలి, వాత్సల్యం కలిగాయి. అతను ప్రయాణపు బడలికతో మరీ డస్సిపోయి వున్నాడు. "మధ్యాహ్నం అన్నం తిన్నావా?" అని అడిగారు ఆదరంగా.

 

    "లేదండీ. టిఫిన్ తీసుకున్నాను."

 

    "అందుకనే బాగా బలహీనంగా కనిపిస్తున్నావు. పోయి స్నానంచేసి ఏమైనా తీసుకో. వెళ్ళు."

 

    రామం తన గదిలోకి వెళ్ళి బద్ధకంగా కుర్చీలో కూర్చుని హమ్మయ్య అనుకుంటూ వెనక్కి వాలాడు. మధ్యాహ్నం మూడుదాటింది. మాఘమాసం కావటంవలన ఎండలు యిప్పుడిప్పుడే ముదురుతున్నాయి. ఈ కాలంలో కాకినాడలో రాత్రిళ్ళు చలీ, పగలు ఎండ జోరుగా వుంటాయి.

 

    అడుగుల చప్పుడైతే కళ్లు విప్పి చూశాడు. ఎదురుగా ఆశ నిలబడి తిలకిస్తోంది అతడ్ని.

 

    "మంచి ఎండలో వచ్చావన్నయ్యా."

 

    "అవును ఆశా... నువ్వలా వున్నావేం?"

 

    ఆశ ఇంతకు ఓ గంట ముందువరకూ ఏడ్చివుంది. తర్వాత పుట్టంతా మునిగిపోయినట్లు తల్లి కేకవేస్తే లేచి క్రిందకు వెళ్లింది.

 

    "ఏమి లేదన్నయ్యా! ప్రొద్దుటినుంచీ బాగా తలనొప్పిగా వుంది. అందుకని..."

 

    ఓ క్షణం ఆగి ఆమె "అన్నయ్యా! మెడ్రాస్ నుంచి నాకేం తెచ్చావు?" అనడిగింది చిన్నపిల్లలా.

 

    "వంద రూపాయలుపెట్టి మంచి చీరె తీసుకువచ్చాను ఆశా! అది కట్టుకుని నువ్వలా ముందు నిల్చున్నావంటే ఆ సన్యాసి రాఘవుడు ఐస్ అయిపోవాలి. అన్నట్టు అతనేమైనా ఉత్తరం రాశాడా?"

 

    అతను ఆశ పెనిమిటిని సన్నాసి అనీ, బడుద్ధాయి అనీ సంబోధిస్తూ వుంటాడు. అతనలా అనటం వాళ్ళకూ అలవాటయిపోయింది. తన చెల్లెలికి చాలా అన్యాయం జరిగిపోయిందనీ, ఆమెకే విధంగానూ తగని వాజమ్మ దొరికాడనీ అతననుక్షణం బాధపడుతుంటాడు.

 

    "రాశాడన్నయ్యా!"

 

    "ఏమంటాడు? ఎప్పుడొస్తాట్ట? లేకపోతే మమ్మలెవర్నయినా తీసుకొచ్చి దిగబెట్టమంటాడా?"

 

    ఆశ అసలు విషయం అతనికి చెప్పటం ఇష్టంలేక "వీలు చూసుకుని వస్తానన్నారన్నయ్యా" అంది.

 

    "నీకోసం తెచ్చిన చీర తీసియిస్తాను వుండు ఆశా" అంటూ రామం కుర్చీలోంచి లేవబోతున్నాడు.

 

    "తొందరేముందిలే, అన్నయ్యా! బాగా అలిసిపోయి వున్నావు. స్నానం చేయటానికి రమ్మంటూంది అమ్మ. వేడినీళ్ళు పెట్టింది రా మరి" అంటూ ఆమె అతన్ని బలవంతంగా లేవతీసి క్రిందకి తీసుకువెళ్లింది.

 Previous Page Next Page