Previous Page Next Page 
మేడలో నీడలు పేజి 39


    వసంతబాల నల్లబడిన ముఖంతో "ఏం మాటలమ్మా అవి? నువ్వలా మాట్లాడితే నేను యింట్లోంచి పారిపోతాను" అంది.

 

    ఆవిడ శుష్కమందహాసం చేసి "నేను ఏ మాటలన్నా రోజూ పారిపోతానని బెదిరిస్తూనే వుంటుంది మా అమ్మాయి. మీది యీ వూరేనా బాబూ?"

 

    "కాదండీ కాకినాడ."

 

    కాకినాడ అనగానే ఆమెముఖంలో వూహించలేనంత ఉత్సాహం త్వరితగతిని ఆవహించింది. "ఏమిటి! కాకినాడే! మాకు అక్కడ ఇల్లు ఒకటి వుంది" అంది.

 

    "మీడీ కాకినాడేనా?" అనడిగాడు రామం ఆశ్చర్యంగా.

 

    'కాదు. కాని అక్కడ చాలారోజులు వున్నాను. దరిమిలాను అక్కడే ఇల్లొకటి చూసి కొన్నాను."

 

    "అయితే మీరక్కడికి తరచు వస్తూంటారన్నమాట."

 

    "అబ్బే లేదు. నేనా ఊరు విడిచిపెట్టి పదిహేను సంవత్సరాలయింది. మళ్ళీ ఆ ఛాయలకి పోలేదు."

 

    "అయితే యిప్పుడప్పుడే మీరావైపు రారన్నమాట."

 

    ఆవిడ అతని మాట నిజం కాదని తెలుస్తూ "వస్తున్నాను. నేనక్కడికి నాలుగయిదు రోజుల్లో బయలుదేరుతున్నాను" అంది.

 

    రామం, వసంతబాలా ఇద్దరుకూడా ఒకేసారి నివ్వెరపోయారు.

 

    "ఏమిటి? నువ్వు ఈ మధ్య అంటున్న మాట నిజమేనేమిటి అమ్మా? నేనింకా పరిహాసానికనుకున్నాను" అంది కూతురు పాలిపోయిన ముఖంతో.

 

    ఆమె తనప్రక్కన కూర్చున్న కుమార్తె భుజంమీద ఆప్యాయంగా చెయ్యివేసి నొక్కుతూ "నిజమేనమ్మా! నా వంట్లో బాగుండటల్లేదని నీకు తెలుసుకదూ! కాకినాడ అంటే నాకు ప్రత్యేకాభిమానం వుంది. అక్కడ ఆరోగ్యంకూడా బాగుంటుంది. కొన్నిరోజులపాటు అక్కడకు పోయి మన ఇంట్లో వుందామనీ..." అంది.

 

    "అవునండి. కాకినాడ వాతావరణం చాలా ఆరోగ్యదాయకంగా వుంటుంది. మీరు తప్పకుండా బయలుదేరండి" అన్నాడు రామం ఉత్సాహంగా.

 

    "నువ్వక్కడ ఏం చేస్తుంటావ్ బాబూ?"

 

    "నేను సోప్ ఇండస్ట్రీస్ ఓపెన్ చేశానండీ. బాగానే సాగుతోంది. ఆ పనిమీదే ఇక్కడికి వచ్చాను. అనుకోకుండా మిమ్మల్ని కలుసుకోవటం తటస్థించింది. నాకూ ఇక్కడ నాలుగైదు రోజులుదాకా పనివుంది. మీకభ్యంతరం లేకపోతే మీరు నాతోరండి."

 

    ఆవిడకూడా సంతోషించి "అభ్యంతరం దేనికి నాయనా? మాకు తోడు ఎవరూ లేరు. అండగా వుంటావు. సమయానికి నీలాంటి బుద్ధిమంతుడు పరిచయం కావటం మా అదృష్టం" అంది.

 

    వసంతబాల మాత్రం తల్లికి దగ్గరగా జరిగి విచారగ్రస్తమైన ముఖంతో కూర్చుంది. ఈ అనుకోని ప్రయాణం ఆమెకు సమ్మతంగా వున్నట్లు లేదు.

 

    తరువాత కాసేపు వుండి రామం వచ్చేశాడు.

 

    అనంతరం అక్కడ వున్న వారంరోజుల్లోనూ రెండుమూడుసార్లు వాళ్ళని కలుసుకున్నాడు. ప్రయాణానికి కావల్సిన సదుపాయాలన్నీ తనే చేసి పెట్టాడు. టిక్కెట్లు కూడా తనే రిజర్వు చేయించాడు. చివరకు బయలుదేరారు.

 

    రైలు రాజమండ్రి స్టేషనులో ఆగింది. మధ్యాహ్నం పన్నెండు కావస్తోంది.

 

    "మీకు ఆకలి వెయ్యటంలేదూ? ఏమైనా తెప్పించమంటారా!" అని అడిగాడు రామం వసంతబాల తల్లిని.

 

    "నాకేమి వద్దు బాబూ! రైలు ప్రయాణాల్లో ఏమన్నా తిన్నానంటే వంటికి పడదు. మీరిద్దరూ ఏమైనా తీసుకోండి."

 

    రామం వసంతబాలవంక ప్రశ్నార్థకంగా చూశాడు.

 

    "బ్రెడ్ కాఫీ తీసుకుంటాను. అంతకుమించి ఏమీ వద్దు" అన్నదామె.

 

    కంపార్ట్ మెంట్ దగ్గరకు వచ్చిన కేంటీన్ బాయ్ ని తమకిద్దరకూ బ్రెడ్, కాఫీ తీసుకురమ్మనమని ఆర్డర్ చేసి, "పోనీ మీరు పళ్ళయినా తీసుకోండి" అన్నాడు ఆవిడతో.

 

    ఆవిడ ఈ కోరికని కూడా మర్యాదగా తిరస్కరించింది.

 

    వసంతబాల కిటికీ దగ్గరకు జరిగి స్టేషన్ లోని సందడిని, హడావుడిగా తిరుగుతున్న మనుషుల్ని ఆసక్తిగా తిలకిస్తోంది. "మీరింక ఎక్కడకూ కదలకుండా కాకినాడలోనే సెటిల్ అయిపోండి. చాలా ప్రశాంతమైన ఊరు. రిటైరయిన ఆఫీసర్లు వాళ్ళంతా ఇక్కడే వుండటాన్ని వాంఛిస్తారు" అన్నాడు రామం ఆవిడతో.

 

    ఆవిడ శుష్క మందహాసం చేసి "ఉండిపోతే మరి మా అమ్మాయి సంగతో?" అంది.

 

    "ఏం! మీ అమ్మాయికి?"

 

    "అది చిన్నప్పటినుంచీ మెడ్రాస్ లోనే పెరిగింది. దాని స్నేహితులూ, కాలక్షేపం, కళాసాధన అన్నీ అక్కడనే. కాకినాడలో దానికెవరూ తెలీదు. ఆ వనవాసం ఎన్నాళ్ళు చేయగలదు?"

 

    "మనసు వుంటే అన్నీ ఎక్కడైనా కుదురుతాయండీ! అలవాటయితే అన్నీ సరిపోతాయి."

 

    ఆమె దీనికేమీ బదులు చెప్పలేదు. తల ఊపుతూ ఊరుకుంది.

 

    రామం అంతటితో ఊరుకోకుండా "స్త్రీ యొక్క కళారాధన గురించి మీ ఉద్దేశం ఏమిటి? ఒకరు జీవితంలో మిగతా అంశాలన్నీ విస్మరించి ఒక్క కళతోనే సంతృప్తులవటం సాధ్యమంటారా" అని అడుగుతూ, కిటికీదగ్గర కూర్చున్న వసంతబాల వంక వోరగా చూశాడు. ఆమె ఈ ప్రశ్న విన్నదో లేదోగాని విన్నట్లు హావభావాలేమీ ప్రదర్శించలేదు.

 

    "సాధ్యపడదు"

 

    "మరి ఎంతదూరం ఈ సాధన? ఎంతోమంది కళోపాసకుల్ని చూస్తున్నాను. కొన్నాళ్లు గడిచాక ఆ ఏకాంత జీవితం భరించలేక గార్హస్థ్య జీవితంలోని విలువను గ్రహించి, అది పొందాలని తహతాహపడేవారే. చివరకు వాళ్ళు సంపాదించినది ఏమిటి?"

 

    "ఏమీ కాదు! వ్యక్తికి మార్పు సహజం. ఒక దశలో వారి అభిరుచులు పరాకాష్టనందుకుంటూ వుంటాయి. ఆ వేడిలోనే వారు కీర్తి శిఖరాలను చేరుకోటమో, చేరుకోలేక మామూలుస్థితికి తిరిగి రావటమో జరుగుతుంది. అతను కీర్తి పతాక దిగ్విజయంగా ఎగరేసినా... దానికోసం శాశ్వతంగా జీవితాన్ని అంకితం చేసుకోనక్కర్లేదు. అందులో పరిపూర్ణ తృప్తుడయాక వెనక్కి తిరిగివచ్చి తన మనస్సు నిజంగా కాంక్షించే జీవనపథాన్ని అవలంబించవచ్చు. రెండూ సహజ జీవితాలే. అసలు రెండూ ఒకేకాలంలో కూడా నిర్వర్తించవచ్చు."

 Previous Page Next Page