ఆ నీళ్ళపొరల మాటున ఇంకా ఇంకా ప్రపంచంలో వధింపబడుతున్న ఓ సత్యాన్ని రక్షించాలని ప్రయత్నించే యుగపురుషులున్నారా అని సంశయం.
"తాతగారూ.. ఆయనడుగుతున్నది ఓ పోలీసాఫీసరుగా కాదు. ఓ పసికందు తన మూలంగా ఆపదల్లో చిక్కుకుపోయాడే అని బాధపడుతున్న మనిషిగా. మీరు నిర్వర్తించాలనుకున్న ఒక ధర్మాన్ని తన భుజాలపైకి తీసుకోవాలనుకుంటున్న వ్యక్తిని మీరు నిరుత్సాహపరచడం న్యాయమా చెప్పండి" అర్థిస్తున్నట్టుగా అంది హరిత.
మంచానికి అతుక్కుపోయిన దేహంనుంచి బలాన్ని కూడట్టుకుంటూ ఓ చేతిని పైకి లేపాడు విశ్వేశ్వరశాస్త్రి.
అది ఆశీర్వదించగల ఓ తపస్వి కమండలమై భాసిల్లుతుంటే "సత్యమే వజయత్..." అన్నారు భారంగా యశస్వి తలపై ఆనించి "నేను చదువుకున్న వేదాలు, నేను దశాబ్దాలుగా పెంచుకున్న విశ్వాసాలు నన్ను వోడించి పరిహసిస్తున్నవేళ నేనున్నానంటూ నా నమ్మకాన్ని బ్రతికించాలని ప్రయత్నిస్తున్న ఓ పురుషోత్తముడా! నీకు నా ఆశీస్సులు" మనసులోనే అనుకున్నాడు.
ఆ తర్వాత ఒక్కో విషయాన్ని వివరించాడు.
"నానీ బ్రతికితే నిజం తెలిసిపోతుంది. అందుకే నానీనే అబద్ధంగా మార్చాలని నా కన్నకూతురు రాజారావుని పురిగొలిపింది. అది తెలుసుకున్న మరుక్షణమే నానీని యిక్కడనుంచి పంపాలని నన్ను బ్రతికించే మందు తీసుకురమ్మని రాజారావు కంటపడకుండా ఏడుస్టేషన్ ల దూరం ప్రయాణంచేసి అక్కడ ఒక వ్యక్తిని కలుసుకొమ్మన్నాను. హరివిల్లులో ఏడురంగులుంటాయని తెలీని ఆ పసికందుని ఒకే రంగుల సత్యం ఏడు సముద్రాల అవతలమాత్రమే వుంటుందీ, అది తెలుసుకురమ్మని బిడ్డని పంపిన నిస్సహాయుడైన తండ్రిలా మభ్యపెట్టి దూరం పంపాను. ఆ క్షణంలో అంతకుమించి నాకేం తోచలేదు. వాడెక్కడున్నాడో, ఎలా వున్నాడో అని అనుక్షణం కంగారుపడుతున్న నాకు మీరు చెప్పిన నిజంతో ఊరటగా వుంది. మీ అండ వాడికి లభ్యమైనందుకు ఆనందంగానూ వుంది."
యశస్వి సెలవు తీసుకుని బయటకు వచ్చాడు.
అంతవరకూ బయట నిలబడ్డ కాంతమ్మ, సరళ, చంద్రాన్ని ఇక "లోపలికి వెళ్ళొచ్చు" అన్నాడు సాలోచనగా చూసి.
నానీ విషయం ప్రస్తావించడానికి మనసు రాలేదు.
అసలు ఆ ఇంట విశ్వేశ్వరశాస్త్రి తప్ప నాని యోగక్షేమాలు కోరుకునే ఒక్క వ్యక్తయినా వుంటేగా...
"నేనూ వస్తాను" అన్నది హరిత స్థిరంగా కారును చేరాక.
"ఎక్కడికి?"
"నీతోబాటు ఎంతదూరమైనా" స్థిరంగా అంది. "అవును యశస్వీ! ఆకతాయిగా, అల్లరిగా నీతో స్నేహాన్ని మాత్రమే కోరుకోవడంలేదు. నీ కష్టసుఖాల్లో భాగస్వామిని కావాలనుకుంటున్నాను."
"గుడ్" నవ్వాడు ఆ స్థితిలోకూడా. "పెళ్ళికి ముందే సత్యభామలా నరకాసుర యుద్ధానికి నాకు తోడొస్తానంటే నాకూ అభ్యంతరం లేదు. కాని గనికొండ ఎనిమిదిగంటల ప్రయాణం. తట్టుకోగలవా..."
"అక్కడ పక్క విలేజ్ మార్టూరులో నా స్నేహితురాలు వుంది."
"నిజం" నాని బ్రతికేవున్నాడన్న ఆనందం అతడ్ని ఉత్తేజపరుస్తూంది.
"మనకి తప్పకుండా అవసరమైన సహాయం చేస్తుంది."
"నీలా తెలివున్న అమ్మాయేనా?"
"ఉన్నింటి అమ్మాయికూడా. పేరు రతి."
సరిగ్గా ఇదే సమయంలో...
బస్టాండులో ఓ మూల పార్శిల్సు వెనక నిద్రపోతున్న నానీ కళ్ళు తెరిచాడు.
కళ్ళు మండిపోతున్నాయి. కడుపు దేవుకుపోతూంది.
రాత్రి హరి వెంటాడుతుంటే తప్పించుకోవడానికని బస్ స్టాండ్ లోని గుట్టలుగా పడివున్న పార్శిల్స్ వెనక దాగొని అలాగే సొమ్మసిల్లి పడుకున్నాడు.
పాంటుజేబు చూసుకున్నాడు. రాందేవ్ ఇచ్చిన ఆ 'నిజం' భద్రంగా వుంది.
పార్శిల్సు వారగా నడుస్తుంటే కాళ్ళు తూలిపోతున్నాయి.
ఒకపక్క నిలబడి చుట్టూ చూశాడు హరికాని, రాజారావుకాని కనిపిస్తారేమోనని.
బస్టాండ్ అంతా సందడిగా వుంది. జనంతో. కాని వాళ్ళ జాడలేదు.
ఇక భయం లేదనిపించి నెమ్మదిగా బయటకు రాబోతుండగా ఎవరో ఒక వ్యక్తి వేగంగా వచ్చి పార్శిల్సు మూలన నక్కాడు.
వెనువెంటనే 'దొంగ దొంగ' అన్న అరుపుల్తో అటుగా జనం పరుగెత్తుకొచ్చి అటూ ఇటూ దిక్కులుచూస్తూ ఆగిపోయారు.
"ఇటే పోయాడు."
"ఇక్కడే వుంటాడు వెతకండి."
జనంలోంచి కేకలు వినిపిస్తున్నాయి.
"ఏమయింది?" ఎవరో అడుగుతున్నారు.
"మా ఆవిడ మెడలో లాకెట్ తెంపుకుపోయాడు" మరెవరో జవాబిస్తున్నారు.
అప్పుడు చూశాడు నానీ మూలనక్కిన వ్యక్తి పిడికిలిలోని బంగారపు లాకెట్ ని.
అర్థమైపోయింది అతడే దొంగని.
తను కనిపించకుండా జాగ్రత్తపడుతూ నక్కుతూ బయటకొచ్చాడు.
జనం దొంగజాడ గుర్తించక అటూ ఇటూ దిక్కులు చూస్తుంటే తనకు తెలిసిన 'నిజం' చెప్పాలని వారగా నిలబడ్డ ఓ వ్యక్తిని చేరిన నానీ చేతితో తట్టాడు.
"దొంగ"
మకిలిపట్టిన మొహంతో నిలబడ్డ నానీనే పరికించి చూస్తూ "ఎక్కడ" అన్నాడు ఆవ్యక్తి రహస్యంగా చెవిలో.
"అదిగో అక్కడ. వాటివెనుక."
"నిజం!"
"ఒట్టు"
అతడు తనను అభినందించాలని నానీ కోరుకోలేదు.
ఆ క్షణాన అంతటి నిస్త్రాణలోనూ ఒకనిజాన్ని చెప్పాలన్న తపన మాత్రమే.
ఆ వ్యక్తి నానీని పైకెత్తుకున్నాడు.
ఎందుకో ముందు అర్థంకాలేదు.
ఆ ప్రదేశంలోనుంచి దూరంగా తీసుకుపోతుంటే "అటెక్కడికి అంకుల్ దొంగవున్నది అక్కడన్నమాట" చేతిని పైకెత్తి చూపించబోయాడు.
నానీ చెంప పగిలిపోయింది.
అక్కడ వున్న వ్యక్తులు అప్పుడు చూశారు.