నానీ నీరసంగా మూలుగుతూ మరేదో అనబోతుంటే మరోదెబ్బ...
"వెధవసన్నాసీ... అమ్మేదో అందని అలిగి ఇంటిపట్టున వుండకుండా వూరిమీద పడతావా" ఎడాపెడా చెంపలు వాయిస్తూ దూరంగా తీసుకుపోతున్నాడు.
జోక్యం చేసుకోబోయిన కొందరు వ్యక్తులు ఆగిపోయారు.
నానీ...
నిన్నటి ఓ ప్రముఖ రాజకీయనాయకుడి అవకాశవాదాన్ని ఇంకా జీర్ణించుకోలేదు.
ఇప్పుడు మరో చేదు అనుభవం.
ఒక చిన్న ప్రపంచపు సరిహద్దుల్ని దాటి కొన్నిరోజుల క్రితమే సువిశాల విశ్వంలో అనుకోకుండా అడుగుపెట్టిన నానీ ఇక్కడ మాలిన్యానికి నిర్వచనం తెలీక ఊపిరందని ఓ నిజంలా గిలగిలా కొట్టుకుంటుంటే...
నానీని ఎత్తుకున్న ఆ వ్యక్తి ఓ ఫర్లాంగుదూరంలోని నిర్జన ప్రదేశానికి అతడ్ని తీసుకొచ్చి విసురుగా నేలపై కుదేశాడు.
"దొంగనాయాలా"
ఒక్కో అడుగు ముందుకేస్తున్న ఆ వ్యక్తి ఎవరో, తననెందుకు హింసిస్తున్నాడో తెలీని నానీ గుడ్లనీళ్ళు కక్కుకుంటూ బిక్కమొహం వేసుకుని చూస్తున్నాడు భయంగా.
"పెద్ద మొనగాణ్ననుకున్నావా... వేలెడు లేవు."
అప్పటికే ఆ వ్యక్తి మరీ దగ్గరవుతూ సమీపించడంతో "నన్ను కొట్టకు అంకుల్..." అంటూ వెక్కిపడుతూనే ఆ వ్యక్తికాళ్ళను చుట్టేశాడు.
ఆ వ్యక్తి జాలిపడలేదు.
జాలి అన్నది తమ నిఘంటువులోనే లేదని నిరూపించే వ్యక్తులు యీ ప్రపంచంలో వుంటారని తెలియచేయటానికి కంకణం కట్టుకున్నట్టు అమాంతం నానీ జుట్టుపట్టుకున్నాడు.
ప్రాణాలు కడగంటిపోతుంటే "నన్నెందుకు కొడతావంకుల్? నేనేం తప్పు చేశానూ...?" అన్నాడు నీరసంగా వణికిపోతూనే.
"ఏంతప్పా? నువ్వక్కడ చెప్పబోయింది."
"వద్దంకుల్... దొంగ నిజంగా అక్కడున్నాడు. నేను నిజమే చెప్పాను."
ఆ వ్యక్తి చేయి ఫెడీల్మని నానీచెంపని తాకింది మరోమారు... "అదేరా... అదే తప్పు."
అప్పటికీ నానీకి తోచలేదు.
"నా కొడకా... నాకు చెప్పావుగాని అదే మరోడెవడైనా వింటే మావాడు పట్టుబడిపోయేవాడు. ఆ తర్వాత జనం వాడి కాళ్ళూ చేతులూ విరగ్గొట్టేవారు. నిజం చెప్పాడట... నిజం..."
అసలే నిస్సత్తువ. దానిపై ఒక పసికందుపై అంతగా చేయిచేసుకుంటారా? అని నానీసైతం ఆశ్చర్యపోయేటట్టు ఆ వ్యక్తి సాగిస్తున్న హింస నానీ ఆలోచించగలిగే శక్తిని హరించేసింది.
ఈ ప్రపంచంలో వేటాడబడే విషయాల్లో 'నిజం' కూడా ఒకటని తెలీని నానీ క్రమంగా స్పృహని కోల్పోయాడు.
ఇప్పుడు నానీ పెదవుల మధ్య నుంచి దాగలేని నిజంగా... రక్తం పైకి చిమ్ముతోంది.
* * *
సుమారు ఏడుగంటలు ప్రయాణంచేసిన ఫియట్ మధ్యాహ్నం దాటాక మూడున్నర గంటల ప్రాంతంలో మార్టూరుని చేరుకుంది.
అప్పటికే హరిత బాగా అలసిపోయింది.
కాని తన అలసట కనిపించకుండా ఉత్సాహాన్ని నటిస్తోంది.
ఆ ప్రయాణంలో యశస్వి సామర్లకోటలో ఓ అరగంట మాత్రమే ఆపాడు అదీ హరితకోసమని. హరితకూడా భోంచేయలేదు. కొద్దిగా టిఫిన్ చేసింది.
బయలుదేరేముందు తండ్రికి మాటమాత్రం ఫోన్ చేసి చెప్పింది. ఓ మూడు రోజులపాటు యశస్వితో వూరెళుతున్నట్టు.
పట్టినపట్టు విడవని మొండిపిల్లగా తెలిసిన పాండురంగారావు హరితని కాదనలేదు.
పెళ్ళికాకుండా యశస్వితో అలా వెళ్ళడమన్నది మామూలుగా అయితే అబ్జెక్ట్ చేసేవాడేమోగాని ఇప్పటిస్థితిలో ఆమెను నిరుత్సాహపరచడానికి ఆయనకీ మనస్కరించలేదు.
మార్టూరు గ్రామంలో ప్రవేశించాక రతి ఇంటి అడ్రసుకోసం ఓ చోట ఆపి ఎంక్వయిరీచేసింది.
మరో అయిదునిముషాలలో కారు ఓ పెద్ద లోగిలిలాంటి ఇంటి పోర్టికోలో ఆగింది.
ఎప్పుడో కాలేజీలో క్లాస్ మేట్ అయిన హరితని చూడగానే ముందు అవాక్కయిపోయిన రతి ఆ తర్వాత సాదరంగా లోపలికి ఆహ్వానించింది.
"రియల్ సర్ ప్రైజ్" సోఫాలో కూర్చున్నాక నవ్వుతూ అంది రతి.
అన్ని వివరాలు తెలియపరచలేదు హరిత. ముక్తసరిగా యశస్విని తన 'వుడ్ బి'గా పరిచయం చేసి ఆరోజు దినపత్రికలో పడిన నానీఫోటోని చూపించింది.
"నానీ మావాళ్ళ అబ్బాయి. తప్పిపోయాడని మేమంతా వెతుకుతూంటే ఇదిగో యిలా పేపర్లో ప్రత్యక్షమయ్యాడు. గనికొండ ఈపక్క విలేజ్ కాబట్టి వెళుతూ నిన్ను కలుసుకోవాలనిపించింది."
"యు హేవ్ డన్ గుడ్ థింగ్... ఎందుకంటే" రతి ఓక్షణం ఆగింది.
"నానీని ఇలా వాళ్ళు వాడుకోవడం చూసి నేనూ ఆశ్చర్యపోయాను కాబట్టి" క్లుప్తంగా చెప్పింది. నానీ కారులో తనను మార్టూరువరకూ 'లిఫ్టు' అడిగిన విషయం ఒక్కటిని....
ఈసారి ఆశ్చర్యపోవడం యశస్వివంతైంది.
"నిజానికి నానీ వివరాలు నేను పూర్తిగా తెలుసుకోలేదు. కానీ పరిచయమైన కొన్నిగంటల్లో ఓ ఇంటిలిజెంట్ బోయ్ గా మాత్రం అర్థమైంది. అసలు హోం మినిస్టరు కారుముందుకి ఎలా వెళ్ళాడూ, ఎవరు తరుముతూండగా ఆయన రక్షించాడూ...? అన్నది నేనూ ఊహించలేకపోయాను. అదే విషయం మా కజిన్ను అడిగి తెలుసుకోవాలనుకున్నాడు.
"ఆయనెవరు?" హరిత అడిగింది.
"రాందేవ్ అని... నిజం పత్రిక చీఫ్ రిపోర్టర్... నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ కి వెళుతూ నా దగ్గరకి వచ్చాడు కూడా."
"ఆయనెక్కడుంటారు?"
రతిమొహంలో రంగులు మారిపోయాయి హఠాత్తుగా.