"నేనే..." యశస్వి కంఠం వినిపించింది.
"వాటె సర్ ప్రైజ్" గొంతులో అణువంత లాలిత్యాన్ని నింపుకుని "వేకువనే వలపు పుట్టుకొచ్చిందేమిటి" అంది గోముగా.
"వెంటనే రా హరితా..." యశస్విగొంతు ఉత్సాహంగా పలికింది "నీతో మాట్లాడాలి."
"ఉన్న పళాన రమ్మంటే ఎలా?" రాస్పె బెరీ, స్ట్రాబెరీలతో ఆలివ్ ఆయిల్ కలుపుకుని అందులో అప్పుడే జలక్రీడలాడిన క్లియోపాత్రా గొంతులోని మార్దవం నింపుకుని ఫోంబెడ్ పై పడుకుని తమకంగా అంది.
"ఎలా వున్నానో తెలుసా?"
"చెప్పు" యశస్వి గొంతులో ఇందాకటి ఉద్వేగం లేదు.
"మరేం... నీటితుంపరల తాకిడికి కందిపోయిన గులాబీ రెమ్మలా వున్నాను. ఉదయ పవనాల స్పర్శకి ఒళ్ళిచ్చి ఆ పులకింతలో ప్రియుడి సమాగం కోసం అంగలార్చుకుపోయే 'జారినా ఇవనోమో' లాగా వున్నాను."
"ఆవిడెవరు?"
"రష్యా చక్రవర్తుల కాలంలో వలచిన ప్రియుడిచేత వెన్నతో ఒళ్ళంతా మర్దనా చేయించుకున్న నాలాంటి ఓ ముగ్ధ."
"అంటే ఇప్పుడు స్నానానికి సిద్ధంగా వున్నావన్నమాట."
"ఆహ... సగం స్నానంలోవున్నాను. నీ స్వప్నంలోంచి సగంలోనే తేరుకుని ఇలా బయటకొచ్చాను."
"అవునూ... నిన్నరాత్రి బాగా టెన్షన్ లో మొహం మాడ్చుకుని కూర్చున్న వాడివి. వేకువనే ఇంత ఉత్సాహంతో మాట్లాడుతున్నావేంటి?" అంది.
"నానీ ఆచూకీ తెల్సింది."
"వ్వాట్...?"
"నిజం హరితా... నానీ బ్రతికేవున్నాడు. అంతవరకు నిజం"
హరిత ఆలస్యం చేయలేదు.
మరో పదిహేనునిముషాలలో యశస్వి అపార్టుమెంటుని చేరుకుంది. "నానీ గురించి ఎలా తెలిసింది?"
ఆరోజు దినపత్రిక ముందుంచాడు.
"అగ్రకులంపై దళితుల తిరుగుబాటు" అన్నమకుటంతో వున్నవార్తకి పైగా అప్పారావు చేతుల్లో నానీని చూసింది.
"ఈ బాబు..." తొట్రుపాటుగా గొణిగింది. "ఆరోజు ట్రైన్ లో..."
"వ్వాట్..." యశస్వి భృకుటి ముడిపడింది.
"గాడ్... నిజం యశస్వి... ఆరోజు నేను ఫ్రెండు పెళ్ళికి విజయవాడ వెళ్ళేటప్పుడు భయంతో నేనున్న కూపేలోకి వచ్చాడు. ఆ తర్వాత..." మొత్తం గుర్తుచేసుకోడానికి ఆమెకి పట్టింది ఒక్కనిముషం మాత్రమే. "ఆ తర్వాత బ్రతికించే మందుకోసం ఏడోస్టేషన్ లో దిగాలన్నాడు."
"ఏడో స్టేషన్ లోనా?"
"అవును. స్టేషన్ పేరు చెప్పకుండా ఏడో స్టేషన్ లో దిగాలంటే నేనూ ఆశ్చర్యపోయాను."
ఆమె చెప్పకుపోతూనే వుంది.
యశస్వి మెదడు పదునుగా పనిచేయడం మొదలుపెట్టింది. "సో... నానీ అలా వెళ్ళాడూ అంటే అర్థం బలవంతంగా పంపించబడ్డాడు. ఐ మీన్ ఒక ప్రమాడంనుంచి తప్పించే ప్రయత్నంలో అప్పటికప్పుడు తోచిన పద్ధతిలో పంపించేశారు. యస్... ఐ గాటిట్..."
"ఏంటి" విస్మయంగా అడిగింది హరిత.
"నీకు తెలిసినదాన్ని బట్టి నానీపై అమ్మతర్వాత అంతటి ప్రభావం గల వ్యక్తి తాతయ్య విశ్వేశ్వరశాస్త్రి... కాబట్టే మంచంపట్టిన ఆ తాతయ్య బహుశా నానీపై జరగబోయే హత్యాప్రయత్నాన్ని ముందే గుర్తించి అలా మభ్యపెట్టి పంపించి వుంటాడు. ఆ తర్వాత యాదృచ్ఛికంగా కాక ఎవరో తరుముతున్నప్పుడు హోంమినిష్టర్ కారుముందు పడిపోతే దాన్ని తన అవకాశానికి వినియోగించుకుని వుంటాడు అప్పారావు" ఎనలిటికల్ గా చెప్పుకుపోతున్నాడు.
ఓ క్షణం బాధగా తలపంకిస్తూ "డేమిట్... నానీ అంత దూరం వెళతాడని వూహించలేకపోయాను. లేకపోతే చంద్రం నానీ కనిపించటంలేదని స్టేషన్ లో ఇచ్చిన ఫోటోని ఈపాటికి పత్రికలో పబ్లిష్ చేయించి వుండేవాణ్ని. ఈ సరికే నానీ మనకి దక్కుండేవాడు" అన్నాడు గొణుగుతున్నట్టుగా.
"ఇప్పుడు మాత్రం ప్రాబ్లమేంటి...." ఆదుర్దాగా అడిగింది.
"నీకు తెలీదు హరితా! ఈ ఒక్క వార్త పబ్లిష్ కావడంతో నానీ ఓ అతి ముఖ్యమైన సంఘటనలో కీలకమైన పాత్రగా మారిపోయాడు. జాగ్రత్తగా నానీని ఈ ఊబినుంచి బయటికి లాగకపోతే వాడి ప్రాణాలకే ప్రమాదం."
"అదెలా?"
"నానీ ఇప్పుడు నిజం చెబితే అది హోంమినిష్టర్ పరువు బజార్న పడటానికి ఓ కారణమౌతుంది. నా అంచనా తప్పుకాకపోతే నానీ ఎవరో హోంమినిష్టర్ కి ఈపాటికే తెలుసుంటుంది. కాబట్టి తనవాళ్ళని రక్షించుకునే ప్రయత్నంలో ఇప్పుడు నానీ ప్రాణాలు తీయించే ఏర్పాట్లు చేసివుంటాడు."
"వాట్... తనవాళ్ళంటే."
"పావని మరణానికి సంబంధించిన అసలు నిజం బయటకు రాకూడదనుకునేవాళ్ళు. ఆ విషయాన్ని లోతుగా పరిశోధించాలనుకుంటున్న నన్ను ఆ అప్పారావు పలుకుబడితో ట్రాన్స్ ఫర్ చేయించాలనుకుంటున్నవాళ్ళు."
హరిత స్థాణువులా వుండిపోయింది.
"అమ్మలా అన్నం పెట్టిన ఆంటీ... నీకు నా దణ్నం."
ఆరోజు ట్రైన్ లో నానీ రాసిన ఆ ఒక్కవాక్యమూ గుర్తుకొచ్చిన హరిత కనుకొలుకుల్లో అసంకల్పితంగా ఓ నీటిబొట్టు నిలిచింది.
"ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావ్?" అడిగింది నిర్లిప్తంగా.
"నిజాన్ని లోతుగా తవ్వింది నేను హరితా... ఆ గొయ్యి నానీకి సమాధి కాకూడదు. అప్పుడు నేను మిగలడమూ నిజం కానక్కర్లేదు" యధాలాపంగా అన్నాడు "కమాన్."
* * *
"మీరు దాచి ప్రయోజనం లేదు. నానీ మీకేకాదు ఇప్పుడు నాకూ ఆప్తుడే... నానీ ప్రాణాలు మీకే కాదు నాకూముఖ్యమే. ప్లీజ్... చెప్పండి!" యశస్వి ఆర్థిస్తుంటే చాలాసేపటిదాకా నిశ్శబ్దంగా వుండిపోయిన విశ్వేశ్వరశాస్త్రి నెమ్మదిగా తలతిప్పి చూశాడు.
అప్పటికి అరగంటగా సందిగ్ధంలో మిగిలిపోయిన ఆ వృద్ధుడికళ్ళల్లో అస్పష్టంగా నీళ్ళు నిలిచాయి.