Previous Page Next Page 
బ్లాక్ మాంబా పేజి 40


    ఆ నిశీధివేళ మంగళవాద్యాలు నిశిరాత్రి వణికేట్టు నిశ్శబ్దాన్ని భంగపరుస్తున్నాయి.

    అప్పటికే నేలపై ఆహ్వానితుల నడకలతో పెళ్ళికి వచ్చిన బంధుమిత్రుల సర్దుతో సహనం నశించిన 'మాంబా' ఇంటి ఆవరణ చీకటిలో నెమ్మదిగా ప్రాకుతూంది.

    బయటికి కాదు...తన శరీరంపై సమ్మెట్లలా మోదుతున్న శతృవులంతా ఆసీనులైన కుర్చీల వేపు...

    మండపం చుట్టూ అలంకరించబడిన విద్యుద్దీపపు కాంతులు ప్రహరీగోడని చేరలేక మధ్యలోనే ఏటవాలుగాపడి నేలనున్న గుడ్డపై మంద్రంగా మెరుస్తున్నాయి.

    ఒక ఉన్మాదపు ఊపుకోసం ఓ క్షణం ఆగిన మాంబా పొడవైన ఒంటిని బలంగా కూడగట్టుకుంటూంది.

    మసక వెలుతురులో దాని శరీరం నల్లని ఉరితాడులా నేలని అతుక్కుని వివశత్వంగా కదులుతూంది.

    సరిగ్గా అప్పుడు ఆ ఇంటి ద్వారం దగ్గర ప్రభుత్వ వాహనం దిగాడు ఆర్ధికశాఖమంత్రి నాగరాజు.

    అక్కడకు వచ్చింది నిజానికి ఆ వధూవరుల్ని ఆశీర్వదించాలని కాదు...

    వధువు తండ్రయిన ఓ ఎమ్మెల్యేని తను అసమ్మతివర్గంలోకి మళ్ళించుకుని అతిత్వరలో ముఖ్యమంత్రిపై అవిశ్వాసాన్ని ప్రకటించే బలాన్ని కూడగట్టుకోవాలని.

    దిగుతూనే అక్కడి వాళ్ళని చూస్తూ చేతులు జోడించాడు.

    అనుకోని ఆలస్యానికి నొచ్చుకుంటున్నట్టు మొహంలో వెంటనే బాధని అభినయించాడు.

    ఆలస్యానికి అసలు కారణం...అతడు పదినిముషాల క్రితమే ప్రదీప్ సక్సేనాని కలిశాడు...బ్లాక్ మాంబా ముఠాలోని అతి ముఖ్యుడైన సక్సేనాతో మాట్లాడి అడ్వాన్స్ గా కొంత డబ్బునిచ్చి రేపటినుంచి జంటనగరాలలో సాగించాల్సిన 'స్నేక్ టెర్రరిజం' ఓ ఒప్పందమూ పూర్తిచేసుకున్నాడు.

    నాగరాజు చాలా ఆనందంగా ఉన్నాడు. సరిగ్గా మరో పన్నెండు గంటల్లో జంటనగరాల ప్రజల యిళ్ళల్లో మొన్నటిలా పాములు ప్రవేశిస్తాయి.

    ఈ రోజు జరిగిన పాముకాటు చావుల్నిమించి మరణాల సమాఖ్య వందలకి చేరుకుంటుంది.

    రాష్ట్రప్రభుత్వ శాంతి భద్రతలు పరిరక్షించే శక్తిలేక బెంబేలు పడుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది.

    అది అవకాశంగా తీసుకున్న తీరు ముఖ్యమంత్రిపై ధ్వజం లేవనెత్తి ప్రజల ఆగచాట్ల విషయంలో గుండెలు బాదుకుంటూ తను పేర్చుకున్న బలంతో గెలుపుసాధించి తనే ముఖ్యమంత్రి అవుతాడు.     

    ఆలోచనలు మనసులో ఆనందార్ణవంగా మార్చుతుంటే తన ఈ ఆలస్యం రేపు విషమై ఎల్లుండు తనకు అమృతతుల్యం కాగలుగుతున్న సంతృప్తితో ఇక ఆలస్యం అమృతం విషం అన్నట్టు ఎదురుగా వచ్చిన వధువు తండ్రిని కావలించుకున్నాడు...

    హఠాత్తుగా పందిట్లో పైకిలేచి తనకు అభివాదం చేస్తున్న జనాన్ని చూస్తూ కొద్దిపాటి ఉన్మాదంతో వెనుకనుంచి మండపాన్ని చేరాలనుకున్నాడు...

    అక్షింతలు అందుకుని అయిదడుగుల దూరం నడిచాడో లేదో నేలపై గడ్డితో ఏదో కదిలిక అలికిడైంది.

    ముందు అర్ధం కాలేదు.

    అక్కడో పామువుందన్న విషయం స్పురణకు రాగానే వేగంగా వెనక్కి పరుగెత్తబోయాడు, కాని అప్పటికే ఆలస్యమైంది.

    రెప్పపాటులో మాంబాతోక 'చర్నాకోల్'గా మారి అతడి కాళ్ళను చుట్టింది.

    డబ్బున నేలపై పడ్డాడు.

    పందిరిలో ఆర్తనాదాలు ఉధృతమై అంతా కకావికలై పరుగెడుతూ చూసారు.

    చీకటిలో ఓ నల్లని సర్పం నాగరాజు చెంపపైగా కాటేసి నోరుతెరిచి పరిసరాల్ని చూస్తుంది.

    అంతసేపూ వున్న చైతన్యం మాయమై క్షణంలో స్మశాన వాటికగా మారింది.

    ప్రభుత్వం కూలకముందే నేలకూలిన నాగరాజు ఇప్పుడు బాధతో అరుస్తున్నాడు. పైకి లేవబోతూ ధనువులా వంగి వేదనతో కదిలిపోతున్నాడు...

    ఫళుక్కుమన్న శబ్దం...

    రాష్ట్రాన్ని పాలించాల్సిన నాగరాజు వెన్నముక విరిగిపోయింది.

    ఇప్పుడు 'మాంబా' చీకటిలో దూసుకుపోతూంది.


                         *    *    *    *


    "నగరాన్ని వణికించే నికృష్ట సర్పము...చివరికి నా మంత్రివర్గ సహచరుడూ నాకు అత్యంత సన్నిహితుడూ అయిన నాగరాజునే కాటేసి నా గుండెలను సెగలతో నింపాలా సిగ్గు సిగ్గు" ముఖ్యమంత్రి స్వగతంలా కుమిలిపోతుంటే ఉదయాన్నే రప్పించబడిన ప్రెస్ రిపోర్టర్సంతా ఏకాగ్రతగా ఆయన నటనా వైదుష్యాన్ని పరిశీలిస్తున్నారు...

    "విలేఖరులారా...దీనికి మేము విలపిస్తున్నాం. నాగరాజు మరణంతో నా కుడి భుజమే కూలిందని వక్కాణిస్తూ ఆయన కుటుంబానికి మా ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తున్నాం..." ఉద్విగ్నతణి మొహంలోకి రప్పించుకుంటూ బాధగా పిడికిలి చెంపక్రిందుగా ఆనించి మోచేయి టేబుల్ పై వుంచారు... "ఎంతటి దుర్విది ఇది...నిష్కళంక మిత్రుడే...నిర్మల మనస్కుడై విటలాక్షునివోలే నిఖిల లోకోన్నతియే న్యాయంగలవాడై నిద్రాణమైన జాతిని జాగృతంచేసే నిబద్ధత గలవాడై నియోగ్యకార్యాచరణ నిరంకుశుడై నిరంతర నిరవధిక నిరాఘాట కృషీవలుడై నిరూపిత నిర్ఘాత నిర్దోష నిష్టిత ప్రభంజనుడై భాసిల్లిన నా నాగరాజుకా ఈ నిర్యాణం" సుదీర్ఘంగా నిట్టూర్చారు. "ఒక ధృవతార రాలిపోయింది. ఈ దేశచరిత్రలో వెలకట్టలేని ఓ పుట తిరిగిపోయింది" ఈసారి రెండో పిడికిలిని మరో చెంపకి ఆనించి రెండు సెకండ్లపాటు మౌనంగా ఉండిపోయారు.      

    "ఒకపక్క ప్రజల ఆర్తనాదాలు...మరోపక్క అధినేతల నేలకూలడాలూ...లేదు" ఉక్రోషంగా తలపైకెత్తాడు. "ఇది ఇలా జరగటానికి వీల్లేదు. నా సోదర ప్రజానీకం ఈ పాము కాట్లకు బలికావడం నేనిక హర్షించేదిలేదు. మరణమే తప్పనినాడు ముందు సర్పాలకు నా ప్రాణం అర్పిస్తాను...మృత్యువుతో ముఖాముఖీగా పోరాటమేతప్పనినాడు ముందు నా గుండెల్ని ఎదురొడ్డుతాను. ఆ సర్పానికి లేక సర్పాలకి ఇదే నా సవాల్...ఈ క్షణం నుంచే నేను జనంకోసం విజయుడు కాబోయే జనమేజయుడిగా మారుతున్నాను. సర్పయాగానికి నడుంకడుతూ పండితుల్ని రప్పిస్తాను."

    చెప్పింది సగానికిపైగా అర్ధంకాని ఓ విలేఖరి "పండితులా" అన్నాడు.

    "అవును...ఈ యాగాలని నిర్వర్తించే పండితులు."

    "నిజంగా నిర్వహిస్తారా?"

    "మాట తప్పడం మ చరిత్రలోనే లేదు...ఈ వారాంతంలోగా ప్రారంభిస్తాను."

    "ఎక్కడ?"

    "పేరేడ్ గ్రౌండ్స్ లో."

    "ఒంటిస్థంభం మేడ కట్టించుకుంటామన్నారు."

    "అవును...కాంట్రాక్టర్ శివానంద్ గారు ఇప్పటికే ఏర్పాట్లలో మునిగివున్నారు."

    "ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలకి మీరిచ్చేసందేశం..."

    "ఈ దేహం అశాశ్వతం...బ్రతుకుదాహం మూర్ఖత్వం..." ఆవేశంగా పైకిలేచాడు. చివరివాక్యం క్లారిఫికేషన్ కోసం లేచిన విలేఖర్లు నిశ్చేష్టులై చూస్తుండగానే ఆవేశంగా పక్కగదిలోకి నడిచిన ముఖ్యమంత్రి ప్రశాంతంగా కూర్చుని అతి ముఖ్యుడైన తన మేనల్లుడ్ని చూస్తూ అన్నారు "ఒక అడ్డం తొలగిపోయింది."

    "ఏమిటది" టక్కున అడిగాడు పి.ఏ.

    "నా అంతం చూడాలనుకున్నా లుచ్చానాకొడుకు నాగుకాటుతో బలై నా సమస్యని పరిష్కరించాడు."

    సరిగ్గా ఇదే సమయంలో...

    డాక్టర్ శృతి నడుపుతున్న కారు నగరంవేపు దూసుకొస్తూంది. సమీపంలో కూచున్న జయేంద్ర యధాలాపంగా బయటికి చూస్తున్నాడు.

    శృతి ఎప్పటిలా లేదు. అసలు రాత్రి జరిగిన సంఘటననుంచి ఆమె ఇంకా తేరుకోలేదు. ఇంత జరిగినా అసలేమీ జరగనట్టు మాటాడుతున్న జయేంద్ర స్థితి ఆమెకు అర్ధంకావడం లేదు...

    నిన్న రాత్రి నలిగిన శరీరం తన నగ్నదేహంపై చెరగని అతడి పంటిగాట్లు పదేపదే గుర్తుకొస్తుంటే సూటిగా అతడి కళ్ళల్లోకి చూడలేకపోతూంది.

    మరో పదికిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తే సిటీలో అడుగుపెట్టినట్టే. అప్పుడు పెదవి విప్పిందామె. "మాంబా నగరంలో ప్రవేశించింది జయేంద్రా...వూహించలేని మారణహోమాన్ని సృష్టిస్తూంది. నిన్న నానీ చదువుకునే డెవొడిర్స్ స్కూల్లో ప్రవేశించి సుమారు పదకొండుమంది పిల్లల్ని..."

    ఉలికిపాటుగా చూసాడు.

 Previous Page Next Page