Previous Page Next Page 
బ్లాక్ మాంబా పేజి 39


    "దీనికి జవాబు చెప్పాలీ అంటే పామువిషాలూ, మనిషి శరీరంపై అవి కలిగించే ప్రభావాల గురించి లోతుగా వెళ్ళాల్సి వుంటుంది. పాము విషాల్ని హిమోటాక్సిన్స్ కార్డియో టాక్సిన్ న్యూరోటాక్సిన్ గా విభజిస్తే మొదటి రెండువర్గాలకి చెందిన టాక్సిన్ సామాన్యంగా కట్లపాము కాటేసిన మనిషి శరీరంపై గట్టి ప్రభావాన్ని చూపుతాయి. కట్లపాము విషంలో వున్న ఎంజైమ్స్ ని ప్రోటియోలైసిన్స్, లెసిథినేసిస్, ఫాస్ఫోడై ఎస్టిరేసిస్ గా వర్గీకరిస్తాం.

    ఇందులో ప్రోటియోలైసిన్స్ అనే ఎంజైమ్స్ మనిషి శరీరంలోని ఫైబ్రోనోజిన్ ప్రోటోక్స్ పై ప్రభావాన్ని చూపుతాయి. దానివల్ల రక్తం గడ్డకట్టే శక్తిని కోల్పోతుంది. రక్తస్రావం ఏర్పడుతుంది. అంటే దానిమూలంగానే రక్తం మనిషి ముక్కు రంధ్రాలద్వారాగాని, నోటి ద్వారాగాని బయటికి చిమ్ముతుందన్నమాట.

    ఇక రెండవది లెసిథినేసిస్...ఇది కాటేయబడిన వ్యక్తి మెదడు నరాలలో అధిక శాతంలోవున్న లెసిథిన్ అనే క్రొవ్వును దారుణంగా కరిగించి మెదడు పనిచేసే శక్తిని హరించివేస్తుంది. మూడవది ఫాస్ఫో డై ఎస్టిరేసిస్... పాము విషంలోని ఎంజైమ్స్ రక్తనాళాల్లోని క్రొవ్వుని D.N.A, R.N.A. అనే న్యూక్లియర్ ఏసిడ్స్ ని కరిగించి ప్రాణహాని కలుగచేస్తాయి.

    ఇందులో అతిముఖ్యమైన ఎంజైమ్స్ 'హాయాలూ రానిడెస్' ఇది త్రాచు కాటువేయగానే మనిషి శరీరమంతా వ్యాపించేట్టు చేస్తుంది.

    ఇవన్నీ ఈ దేశానికి సంబంధించిన ప్రమాదకరమైన విషసర్పాలకు సంబంధించిన వివరాలు..... ఇకపోతే "ఇప్పుడు చనిపోయిన వ్యక్తుల్ని అటాప్సీ చేసాక ఇలాంటి మార్పులతోబాటు మరో అతిముఖ్యమైన విషయం గమనించడం జరిగింది." 

    అప్పుడు కళ్ళు తెరిచాడు డి.జి.పి. బడలికగా.

    'ఏమిటది?"

    "మరణించిన ప్రతివ్యక్తి వెన్నెముక విరిగి వుంది. అంతకుమించి రక్తంలో న్యూరోటాక్సిన్ ఎక్కువగా కనిపిస్తుంది."

    "భయంతో మనిషి నేలపై పడేటప్పుడు వెన్నెముక విరిగి వుండొచ్చుగా?" ప్రసన్న అడిగాడు.

    "నో...అలా అందరికీ కామన్ గా జరిగే అవకాశంలేదు. సో..." ఓ క్షణం ఆగిన డాక్టర్ తాజుద్దీన్ నెమ్మదిగా అన్నాడు. "సర్పాన్ని చూస్తే తప్ప ఇక్కడి ఏ విషప్రభావం ఎక్కువగా పని చేసిందీ చెప్పడం కష్టం."

    "ఒకవేళ చూడగానే గుర్తించగలరా..." కమీషనర్ వెంటనే ప్రశ్నించాడు...

    సాలోచనగా చూస్తూ వుండిపోయాడు డాక్టర్.... ఫోరెన్సిక్ సెన్సులో అతడికి రెండు దశాబ్దాల చరిత్ర వుంది. "సర్పం తోక లక్షణాలనుబట్టి దాని పొట్టపై వున్న పొలుసుల్ని తలమీద వున్న పలకాల్ని పరిశీలించి విషసర్పమో లేక విషరహిత సర్పమో చెప్పగలనేమోగాని ఒకవేళ ఇక్కడ కాటేసిన సర్పాన్ని నేను చూసిన అది ఏ జాతికి చెందినదో బహుశా చెప్పలేనేమో కూడా..."

    "దెన్ హౌ" నిస్సహాయంగా కణతలు నొక్కుకున్నాడు డి.జి.పి.

    "పార్దన్ మి సర్" ప్రసన్న జోక్యంచేసుకున్నాడు. "ఇక్కడ మనకి ఈ దారుణాలకి కారణమైన సర్పమేదో తెలుసు కోగలగడం ఒక్కటేకాదు. అది ఏ జాతికి చెందినదైనా కానీ జరుగుతున్న ప్రమాదాల్ని వారించడం ముఖ్యమైనదని నా అభిప్రాయం..." 

    "మిస్టర్ ప్రసన్నా మరో అనివార్యమైన వాస్తవాన్ని చెప్పడానికి సిద్ధపడ్డాడు డాక్టర్ తాజుద్దీన్. "అది ఏ జాతికి చెందిన సర్పమో తెలీనినాడు బహుశా మన ఏంటీవీనమ్ సీరమ్ ఇకముందు కాటుకి గురయ్యే వ్యక్తుల్ని కాపాడలేకపోవచ్చు."

    "ఆ వివరాలు తెలియకపోయినా కాటేయబడిన వ్యక్తి పోలీవీనమ్ సీరమ్ ని ఉపయోగించి రక్షించొచ్చుగా."

    "అది మనదేశంలోని సర్పాలకి సంబంధించిన శాస్త్ర జ్ఞానంలో తయారుచేయబడింది. నాకున్న అనుభవం చెబుతూంది ఇది మనకు తెలీని మరో విషసర్పమని..."

    "అలాంటప్పుడు తెలుసుకునే అవకాశం లేదా?" అడిగాడు డి.జి.పి.

    "యస్. వుంది..." ఓ క్షణం అందరివేపూ చూస్తూ అన్నాడు డాక్టర్ తాజుద్దీన్. 'సర్పాల గురించి స్టడీ చేసే 'హిర్పటాలజీ' సర్పాల గురించి ప్రత్యేకంగా రిసెర్చి చేసిన సర్పెంటాలజీ నిపుణులు మాత్రమే ఈ విషాన్నిబట్టి అదేజాతికి చెందిన సర్పమో చెప్పగలరు. హెర్టటాలజీ సర్పెంటాలజీ మాత్రమేగాక టాక్సికాలజీ సైతం రిసెర్చి చేసిన వ్యక్తి మన దేశంలో ఉన్నది ఒక్కరే..."

    "ఎవరు?" డి.జి.పి. ఉత్కంఠగా చూశాడు.

    "ప్రొఫెసర్ సంఘమిత్ర! ఆయన్ని రప్పించగలిగితే చాలా ప్రశ్నలకి జవాబును పొందగలం..."

    "కాని ప్రస్తుతం ఆయన ఊళ్ళో లేరు" డాక్టర్ శృతి చెప్పిన విషయం గుర్తుచేసుకుంటూ అన్నాడు డి.సి.పి. ప్రసన్న.

    "ఎక్కడున్నా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆయన్ని రప్పించడం అవసరం..."

    ఆ గదిలో హఠాత్తుగా నిశ్శబ్దం ఆవరించింది.

    ముందు లేచింది డి.సి.పి. ప్రసన్న...

    ఉదయం ఇంటి దగ్గరలేని డాక్టర్ శృతి ఒక్కరే ఈ విషయంలో సహకరించగలదన్న నమ్మకంతో తన అధికారుల దగ్గర అనుమతి తీసుకొని బయటికి నడుస్తున్న ప్రసన్న హాస్పిటల్ ఆవరణలో ఆగిపోయాడు ఓ క్షణం.

    అక్కడ తమ పిల్లల శవాల్ని తీసుకువెళ్ళాలని ఎదురుచూస్తున్న పేరెంట్స్ కనిపించారు. నవమాసాలు మోసి కన్న తమ బిడ్డల బ్రతుకులింత అర్ధాంతరంగా ముగిసిపోయిన తల్లులు హృదయవిదారకంగా రోదిస్తున్నారు.

    అది మాత్రమే కాదు అతడ్నంతగా కలవరపరిచింది.

    ప్రసన్నకి అభిముఖంగా ఒక బ్రహ్మజ్ఞానిలా నిలబడివున్నాడు విశ్వేశ్వరశాస్త్రి...ఉదయం తన మనవడ్ని గడుగ్గాయిగా పరిచయం చేసిన ఓ వృద్ధుడు...

    "నన్నొక్కసారి నానీని చూడనిస్తావా బాబూ!"

    పక్కలో బాంబుపడ్డట్టు అదిరిపడ్డాడు ప్రసన్న.

    "అంటే నానీ..." ప్రసన్న గొంతు తడబడుతూంది.

    "ఆ సర్పం ప్రవేశించింది నానీ ఉన్న క్లాస్ రూమ్ లోకే బాబూ- చనిపోయిన వాళ్ళంతా వాడి క్లాసుపిల్లలే..." ఏ స్వప్నాల భారంతోనో ఆయన గొంతు స్వల్పంగా అదిరిపడుతూంది. నిభాయించుకుంటున్నా ఆయన నిగ్రహం ఏ క్షణంలోనైనా సడలి నేలకూలేట్టున్నారు... "వాడు గడుగ్గాయి మాత్రమే కాదు...కారణజన్ముడని యిన్నాళ్లు అనుకునేవాడ్ని...ఎన్నెన్ని ఆపదల్ని తట్టుకున్నాడు...ఆ చిన్నవయసులోనే ఎన్ని అనుభవాల ఖనిగా మారిపోయాడు...ఏడీ...పిచ్చివెధవ... ఇప్పుడు వృద్దుణ్ని ఒంటరివాడ్ని చేసి తన దారి తను చూసుకున్నాడు" క్రమంగా అతడి నేత్రాలు నీటికుండలవుతున్నాయి. "ముందు నాకు తెలీదు బాబూ...ముసలివాడ్ని కదా... అందరి మనసులూ గెలుచుకున్న మార్కండేయుడు ఏ ఇంట ఆడుతున్నాడో ఏ కంటనీళ్లు తుడిచి ఓదార్చుతున్నాడో అనుకున్నానుగాని ఇదిగో నా బిడ్డలాంటి 'చంప' చెప్పింది అక్కడో అఘాయిత్యం జరిగిపోయిందని. వాడు ఆ పాముకి ఎదురయ్యేటప్పుడు తప్పకుండా నన్ను గుర్తుచేసుకుంటాడు అమ్మ లేదుగా... అందుకే నొప్పికలిగేటప్పుడు అమ్మా అని అరిచినా ఈ తాతయ్యనే జ్ఞప్తికి తెచ్చుకుంటాడు...శవాన్ని చూస్తే మీకే తెలుస్తుంది. రోజూ నా గుండెల మీద నిద్రపోయేవేళ ఎలా రెప్పలు మూసుకుంటాడో ఎవరూ లేకపోయినా ఈ తాతయ్య ఉన్నాడన్న ధీమా వాడి మొహంలో ఎంత స్పష్టంగా కనిపిస్తుందో మీరు చూద్దురుగాని...'ఒక్క అవకాశం... వాడ్ని వెంటనే చూసే ఆ ఒక్క అదృష్టమూ..." ఆయన గొంతు రుద్ధమైపోతుంటే నానీని ప్రతిక్షణమూ తన బిడ్డగా భావిస్తూ రోజూ చాక్ లెట్స్ అందించేసి సరే చంప అశ్రుపూరిత నయనాలతో ఆయనకి ఆసరా ఇచ్చింది. 

    డిసిపి ప్రసన్న నుదుట స్వేదం అలుముకుంది.

    మొన్న ప్రమాదం తెలిసీ లల్లీని శృతి స్థావరానికి పంపేడు.

    ఈ రోజు పొంచివున్న మృత్యువు సంగతి తెలియకుండా తనే నానీని మృత్యువాకిటిదాకా తోడుగా అనుసరించాడు.

    ఏ తండ్రి మనసు కదిలిందో లేక జీపులో తాను ఉదయం తీసుకువెళ్ళిన పాలుగారే ఆ పసికందురూపమే గుర్తుకొచ్చిందో అతడి కనుకొలుకుల్లో ఓ నీటిబొట్టు నిలిచింది.

    వెనక్కి మరలుతూ విశ్వేశ్వరశాస్త్రి చంపలతోబాటు మార్ట్చురీ గదివేపుకి నడిచాడు.

    అప్పుడు సమయం రాత్రి పన్నెండు గంటలు కావస్తూంది.


                                                             *    *    *    *


    "మాంగల్యం తంతునానేమమ జీవన..."

    తెల్లవారటానికి సరిగ్గా రెండు గంటల నలభై నిముషాల వ్యవధి ఉందనగా అందంగా అలంకరించబడిన పెళ్ళి మండపంలో వధువు మెడలో తాళి కడుతున్నాడు వరుడు...

 Previous Page Next Page