హఠాత్తుగా కళ్ళముందు స్పటికంలాంటి నిష్కల్మషమైన నానీ రూపం గుర్తుకొచ్చింది "నానీ..."
"పూర్తి వివరాలు తెలీవు జయేంద్రా..." నానీ గుర్తుకొస్తుంటే ఆమె మనసు అదిరి పడుతూంది.
నడుపుతున్న కారు కీచుమంటూ ఆగింది. ఒక్క కుదుపుతో...
అక్కడ రోడ్డు వారగా ఓ యువకుడిపై హత్యాప్రయత్నం జరుగుతూంది. ధృడకాయులైన నలుగురు వ్యక్తులు బరిసిలతో ఆ యువకుడ్ని చీరే ప్రయత్నం చేస్తున్నారు.
శృతి ఇంకా తేరుకోనేలేదు.
కాని అప్పటికే కారుదిగిన జయేంద్ర వేగంగా అటు పరుగెత్తాడు జరుగుతున్న దారుణం ఆపే ప్రయత్నంగా.
అక్కడ ప్రాణాల కోసం పోరాడుతున్న యువకుడు భరత్... శివానంద్ కూతురైన సమీరకి ప్రియుడు.
అప్పటికే భరత్ మోచేతినుంచి రక్తం ధారకడుతూంది. అయినా మెరుపువేగంతో అటూ ఇటూ కదులుతూ ప్రత్యర్ధులనుంచి తప్పించుకుంటున్నాడు.
ఇప్పుడు జయేంద్ర మధ్యకి రావడంతో కొద్దిగా ప్రాణం లేచి వచ్చినట్టయింది.
ఊహించని ఈ అవాంతరం దుండగుల్ని ఎంత ఉద్రేకపరిచిందీ అంటే అప్పచెప్పబడిన కార్యక్రమం పూర్తి చేయడంలో ఎందరు అడ్డువచ్చినా ఆగేదిలేదన్నట్టు జయేంద్రపై కలియబడ్డారు...
ఓ బరిసె సూటిగా జయేంద్ర పొట్టని తాకబోయింది.
కారులో చేష్టలుడిగి చూస్తున్న శృతి ఆర్తనాదం గొంతు నుంచి వెలువడకముందే బరిసె తూలిపడడమూ జయేంద్ర మీద కలియబడిన వ్యక్తి నేలని కరుచుకోవడమూ క్షణాల్లో జరిగిపోయింది.
రక్తం విపరీతంగా పోవడంతో భరత్ కళ్ళు క్రమంగా మసకబారుతున్నాయి.
అయినా పిలవకుండా ప్రత్యక్షమైన దేవుడిలాంటి జయేంద్ర పోరాటాన్ని నిస్త్రాణగా గమనిస్తున్నాడు.
పదిమంది వున్నా పాములా ఒడుపుగా తప్పించుకుంటూ నలుగుర్నీ నాలుగు నిముషాల వ్యవధిలో నీరసపరిచాడు. ఎంత బలిష్ఠంగా వున్నా యింకా చెరగని అతడిలోని సౌకుమార్యం శృతిని నిర్విణ్ణురాలిని చేస్తుండగానే దుండగులు సమీపంలోని పొదల్లోకి పరుగుతీశారు.
ఇక్కడ తన పరాక్రమాన్ని ప్రదర్శించే అవకాశం చిక్కినందుకు గర్వంగా శృతిని చూడలేదు జయేంద్ర. అప్పటికే నేలపైబడి స్పృహతప్పిన భరత్ ని చేతుల్లోకి తీసుకుని కారులోకి చేర్చాడు.
"వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్ళాలి" స్వగతంలోలా అన్నాడు. అతడి చేతికి కర్చీఫ్ చుడుతూ.
"ప్రమాదకరమైన ప్రదేశంలో అడుగు పెట్టేటప్పుడు మరీ అంత తొందరపాటు మంచిదికాదేమో జయేంద్రా" అంది కారు నడుపుతూ. ఆమె ఇంకా తేరుకోలేదు.
"మన ఉనికి నలుగురికీ ఉపయోగకరం కావాలని తరచూ చెప్పే శృతీ, ఈ యువకుడు నలుగురిలో ఒకడేగా. ఆమె మాటల్ని ఆమెకే గుర్తుచేస్తున్నట్టుగా అన్నాను.
"అదికాదు జయేంద్రా...మీరు తలపడింది ప్రొఫెషనల్ గూండాలతో..."
"అంటే..." అంతవరకూ ఏమీ కానంత మామూలుగా అన్నాడు "మరో ప్రొఫెషనల్ అయితే తప్ప వాళ్ళతో కలియబడటానికి రూల్సు ఒప్పుకోవన్నది నీ థియరీ అనుకుంటాను..."
జయేంద్రవేపు తేరిపార దృష్టిని సారించలేకపోయింది. హఠాత్తుగా రాత్రి జరిగిన సంఘటన గుర్తుకురావడం కాకతాళీయమే అయినా కొన్ని క్షణాలపాటు మాటాడలేకపోయింది.
"ఏదో గుర్తుచేసుకుంటున్నట్టుంది" ఈ సారి మరీ ఉలికిపడింది.అతడు సునాయాసంగా తన మనసు చదివేయడంతో.
"నువ్వా...నేనా..." ఉక్రోషంతో అంది. "నేనన్నది నీకు అర్ధం కావడంలేదు జయేంద్రా. ప్రొఫెషనల్స్ తో కలియబడడం ఎంత ప్రమాదమో నువ్వూహించ లేకపోతున్నావు...ఒకవేళ వాళ్ళు నన్ను గుర్తుంచుకుంటే...ఇప్పటి అవాంతరానికి నిన్ను విడిచిపెట్టరు..."
శృతి నమ్మకం తప్పుకాలేదు..... కారుని వెనుకగా ఓ జీప్ వెంటాడుతూంది.
* * * *
ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో భరత్ కి చికిత్స చేయబడింది. బెడ్ పై ఉన్న భరత్ ఇంకా స్పృహలోకి రాలేదు.
అసలు మామూలుగా అయితే మెడికో లీగల్ కేస్ గా కేవలం గవర్నమెంట్ హాస్పిటల్లో మాత్రమే ట్రీట్ చేయాల్సిన ఆ కేస్ ని తిరస్కరించేవారే... ... ...కాని డాక్టర్ శృతి ఇన్ ఫ్లూయెన్స్ చేసింది. నాపల్లిలో ఆమెకు పరిచయంవున్న నర్సింగ్ హోమ్ కే తీసుకొచ్చింది.
మరో అరగంటకల్లా స్పృహలోకి వచ్చిన భరత్ తననే తదేకంగా చూస్తున్న జయేంద్రని కృతజ్ఞతగా చూసాడు. అనుకోకుండా హఠాత్ గా ప్రత్యక్షమై తన ప్రాణాలు కాపాడినందుకేమో విధేయతగా చేతులు జోడించబోతూ ఆగిపోయాడు చేయి సహకరించకపోవడంతో.
"రిలాక్స్" వారించాడు జయేంద్ర. "ఆర్యూ ఓ.కే"
భరత్ కళ్ళలో సన్నటి నీటిపొర...తలపంకించాడు నెమ్మదిగా.
అతడిపై కలబడిన వ్యక్తులెవరూ వాళ్ళకా అవసరమెందుకేర్పడిందో తెలుసుకునే ఆసక్తి లేదు జయేంద్రకి.
కాని భరత్ చెప్పాడు. "ఇలా ఎప్పటికైనా జరుగుతుందని వూహించాను. కాని ఇంత త్వరగా ఎదుర్కోవాల్సి వస్తుందని గ్రహించలేకపోయాను..."
"ఫర్ గెటిట్...ప్రమాదం తప్పిందిగా" మృదువుగా అన్నాడు జయేంద్ర.
"తప్పలేదు సర్...ఇప్పుడు మొదలైంది. ఇది నేను కడతేరిపోయేదాకా కొనసాగుతుంది" శివానంద్ ఎంప్లాయ్ చేసిన మనుషులే తనపై దాడిచేసినట్టు ఇందాక వారి మాటలమూలంగా అర్ధమైపోయింది. రోషమో లేక బలంతో తన ప్రేమకథకి ముగింపు పలికించాలనుకున్న ప్రత్యర్ధిపై కసో భరత్ దవడకండరాలు బిగుసుకున్నాయి. "మీ మూలంగా బ్రతికిన నేను ఇప్పుడు జాగ్రత్తగా వుండటమేకాదు కథని వాడూహించని మరో మలుపుకి తిప్పి నా కాసిని తీర్చుకుంటాను" గొణుగుతున్నాడు.
"పోలీస్ కంప్లయింటిస్తావా" సహకరించాలనుకున్న జయేంద్ర వాక్యం పూర్తికాకుండానే తల అడ్డంగా తిప్పాడు భరత్...
"ప్రత్యర్ధి పోలీసు బలగాన్నీ కొనేయగల సమర్ధుడు సర్... కాబట్టి అలాంటి పిచ్చిపని చేయను. నన్ను పిచ్చిగా ప్రేమించేవాడి కూతురి సహాయంతోనే వాడికి బుద్ధి చెబుతాను..."
అర్ధమైంది ఇది ఒక ప్రేమకథకి పర్యవసానమని.
భరత్ మనసులో ఓ పథకం రూపుదిద్దుకుంటున్న ఆ సమయంలోనే...
బయట కారిడార్ లో డాక్టర్ శృతి సిస్టర్ చంపతో మాటాడుతూంది. సిస్టర్ చంప పనిచేసేది ఆ నర్సింగ్ హోమ్ లోనే..."
"నానీ శవంకూడా దక్కలేదు శృతిగారూ...బాబాయ్ గారు రాత్రి నుండి వాడ్నే గుర్తు చేసుకుంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నారు. ఇక్కడ చిత్రం అది కాదు. ఆ అర్పం కాటుతో ముందు బలైంది కస్టమ్స్ ఆఫీసర్ డేవిడ్...అతని తల్లిని ఓదార్చడమూ ఎవరికీ సాధ్యం కావడంలేదు. ఎప్పుడూ కలివిడిగా హడావిడిగా వుండే దివ్యతేజ ఎపార్ట్ మెంట్సిప్పుడు ఒక స్మశానంలా..."
శృతి నిశ్చేష్టురాలై వింది. ప్రమాదానికి భయపడి జయేంద్రని దక్కించుకోవాలని తను దూరంగా పారిపోతే ఇరవై నాలుగు గంటల వ్యవధిలో తనకు ఇష్టులూ పరిచితులూ అయిన ఇద్దరు వ్యక్తులు ఇక్కడ జరిగిన మారణహోమంలో బలైపోయారు...
డేవిడ్ ప్రాణాలెలాపోయాయి.
ఇంకా ఏం కాబోతూంది. నానీ శవమేమైంది.
శృతి ఫాలభాగంపై స్వేదం ముత్యాల్లా పేరుకుపోతూంది.
అప్పుడు గుర్తుకొచ్చింది తను చేయాల్సిన కార్యక్రమం చాలా ఉందని...
మరో అయిదు నిముషాలలో జయేంద్రతోబాటు కారులో బయలుదేరింది శృతి.
ఉదయం పదిగంటలకే ఎండ తీవ్రమై చాలా చికాకుని కలిగిస్తున్న ఆ సమయంలో...
మెయిన్ గేటు దాటుతున్న కారు చప్పుడికి కాంపౌండ్ వాల్ కి సమీపంలో కుప్పల్లా విసిరేయబడివున్న మందుల 'కార్టన్స్' కొద్దిగా కదిలాయి.
వాటి దిగువగా మాటువేసిన పధ్నాలుగు అడుగుల 'మాంబా' క్రమంగా సహనాన్ని కోల్పోతూ హాస్పిటల్ వార్డుకేసి రోషంగా చూస్తూంది లోనికి ప్రవేశించే సరైన అదను కోసమన్నట్టుగా...
* * * *
"డాడీ" బయటికి వెళ్ళబోతున్న తండ్రి కాళ్ళను చుట్టేసింది లల్లీ...
"రేపేగా నా బర్త్ డే."
ఒక్క క్షణంపాటు ప్రసన్న గుండె లయ తప్పింది. ఎన్నిరోజులైంది లల్లీ తననింత ప్రేమగా పలకరించి. ఆనాటి తన తప్పిదాన్ని క్షమించి, ఎప్పటిలా లల్లీ ఒడిని చేరేసరికి ఒక్క ఉదుటున పైకెత్తుకున్నాడు.
మనసు అరల్లో నిక్షిప్తమైన శంకలన్నీ కరిగి నీరవుతున్నట్టు కళ్ళు చెమర్చుతుంటే "యస్..." తల పంకించాడు వివశుడౌతూ "రేపేనమ్మా నీ బర్త్ డే నిజంగా రేపే...నీ ఫ్రెండ్సుని, నా ఫ్రెండ్సునీ పిలిచి గ్రాండ్ గా చేస్తాను...నీకు చిరకాలం గుర్తుండిపోయేట్టు బ్రహ్మాండంగా చేస్తాను..."