Previous Page Next Page 
కోమలి పిలుపు పేజి 40

    ఏమనాలో నాకు అర్ధంకాలేదు ఆమె చెప్పే మాటల్లో నిజం వుందనిపిస్తుంది. సరైన తర్కంతో ఆమె మాటల్ని ఖండించాలనిపిస్తుంది తప్పితే-అది నిజంగా ఒప్పుకోవాలనిపించడం లేదు.
   
    "నా గురించి నాకంటే నీకే బాగా తెలుసు. కానీ కోమలీ-ఒక్కమాట చెబుతాను నేను నిజంగా నీ ప్రేమ గురించి అర్ధం చేసుకున్నది ఈ రోజునే! నీ మీద నాకుండే దురభిప్రాయాలన్నీ ఈ రోజుతో తొలగిపోయాయి. బహుశా ఈ రోజునుంచి మనసుతో నిన్ను ఆరాధిస్తానేమో కూడా తెలియదు. అయితే నీకు దగ్గరగా రాగలనని మాటఇవ్వలేను ఎందుకంటే-నా ఆశయాల విలువ ఏ పాటిదో నాకు తెలియదు. నా ఆదర్శాల బలం ఎంతటిదో నాకు తెలియదు. కానీ ఒక అజ్ఞాతశక్తి నన్ను సదా కాపాడుతుంది. నన్ను నా ఆదర్శాలకు, ఆశయాలకు, దూరం కాకుండా చేస్తుంది. నేను కారణజన్ముడినేమో! ఈ రోజుతో నేను పతనం అవుతున్నట్లే అనుకున్నాను. కాని అలా జరగలేదు. నాభావాలు విడిచిపెట్టకూడదేమోననిపిస్తుంది. కొంత కాలం పాటు నేను నా గురించి బాగా ఆలోచించుకోవాలి. నన్ను నేను సమీక్షించుకోవాలి. నా జీవితాన్ని నేను అవగాహన చేసుకోవాలి. అప్పుడు మనం మళ్ళీ కలుసుకుని మాట్లాడుకుందాం. అంతవరకూ మనం దూరంగా వుందాం_" అన్నాను.
   
    కోమలి చూస్తూండగా నేను అక్కడ్నించి బయటపడ్డాను. నా మనసులో నేను శ్రీమతి విలాస్ గురించి వెళ్ళాననీ-శ్రీమతి విలాస్ కోమలి అయినంత మాత్రాన నా కార్యక్రమానికేమీ భంగం రాదని-స్పురణకూడా కలుగలేదు.
   
                                                                        O    O    O    O
   
    పద్మిని ఇంటికి వచ్చేసింది.
   
    నా బలవంతం మీద అత్తయ్యగారిని మా ఇంటికి తరలించాను.
   
    ఆవిడకింకా ఒంట్లో కుదుటపడలేదు. ఎలాగో గడుపుకుంటానని ఆవిడ అంది. ఎన్నడూ లేనిది నేను అవధులు దాటి బ్రతిమాలడం వల్ల సిగ్గుపడుతూనే ఆవిడ ఒప్పుకుంది.
   
    మామయ్యగారుకూడా నా అభిమానానికి ఎంతో సంతోషించాడు.
   
    మనం జీవితంలో యధాలాపంగా ఎన్నో పనులు చేస్తూ వుంటాం.
   
    స్నేహితుడెవరికైనా నా వంట్లో బాగోలేదంటే- "మా ఇంట్లో వచ్చివుండకూడదోయ్" అంటాం. అతడు థాంక్స్ చెబుతాడు. అతడు రావాలని మనం అనుకోము. వచ్చి ఉండాలని అతడనుకోడు.
   
    యధాలాపంగా ఇచ్చే ఆహ్వానానికీ, మనస్ఫూర్తిగా ఆహ్వానించాను. అత్తయ్యగారు మాఇంట్లో ఉండేటట్లూ-మామయ్య గారు వీలునిబట్టి ఇంటికి వస్తూ పోతూ ఉండేటట్లూ ఏర్పాటయింది. ఆయనకిద్దరు మగపిల్లలు ఇద్దరూ వేరే చోట చదువుకుంటున్నారు. ఆడపిల్లలు లేరు. అందుకే పద్మిని అంటే అంత అభిమానం!
   
    నేను మనస్ఫూర్తిగా అత్తయ్యగారిని ఆహ్వానించాను. అందుకు అభిమానం కారణమని వారనుకుంటున్నారు. స్వార్ధం కారణమని నాకు తెలుసు.
   
    విలాస్ నా భార్యపైన వల విసరడానికి సిద్దంగా వున్నాడు. అందుకు మా ఇల్లెంతో అనువుగా వుంది.
   
    ఇంట్లో పద్మిని ఏకాంతంగా వుంటుంది.ఆమె ఏకాంతానికి భంగం కలిగిస్తే తప్ప నేనింకే విషయాలూ ఆలోచించలేను.
   
    అత్తయ్యగారి అనారోగ్యం నా అదృష్టమే అనాలి! ఆ మాట  ఆవిడతో అన్నాను కూడా!
   
    "మీరిలా మా ఇంటికి వచ్చి ఉండడంవల్ల-మీ అనారోగ్యం కూడా మా అదృష్టమనిపిస్తున్నది."
   
    కృతజ్ఞతాభావం నా కనులలో స్పష్టంగా కనిపిస్తూ వుంటే ఆవిడ నా అభిమానానికి ఇంతా అంతా నరాని ఆనందం పడింది.
   
    తనవారిని అంతగా గౌరవించాలని పద్మిని కూడా ఎంతో సంతోషించింది. "మీ మంచితనం గురించి నాకు తెలుసు. కానీ మరీ ఇంత మంచివారని అనుకోలేదు."
   
    పద్మిని నన్ను సమీపించి నపుడల్లా, ఆమెను నేను దగ్గరగా తీసుకున్నప్పుడల్లా నాకు మాధవరావు గుర్తు వస్తున్నాడు.
   
    ఆమెను గతంలోలా ఆదరించలేకపోతున్నాను.
   
    ఇదామె గ్రహించిందో లేదో....కాని నాతో ఏమీ అనలేదు.
   
    పద్మిని భవిష్యత్తు గురించి నేను ఆలోచిస్తున్నాను.
   
    ఆమెను నేనేం చేయాలి? నా మనసామెను క్షమించలేదు. విలాస్ ఆమె చుట్టూ వల పన్నుతున్నాడు.
   
    ఆమెను వలలో చిక్కుకునేలా చేసిప్-వేటగాడి పరం చేస్తే...
   
    విలాస్ ఒకందుకు పద్మిని వెంటపడ్డాడు. నేను ఆ విషయంలో అతడికి సహకరించి పద్మిని పీడను వదుల్చుకుంటే?
   
    ఇప్పుడు నా మనసు కోమలి చుట్టూ తిరుగుతుంది.

 Previous Page Next Page