కోమలి నన్ను ప్రేమించింది. నేనే సర్వస్వమూ అనుకుంది. మా అవివాహం జరిగిందంటే-మాధవరావు వంటివారు నా మనసులో కల్లోలం సృష్టించగలిగి ఉండేవారుకాదు.
జీవితంలో కోమలిని తిరస్కరించి పొరపాటు చేశాను.
తొలిప్రేమను నాకు అందించాలని వచ్చిన కోమలి పిలుపును వరించలేకపోయాను.
ఇప్పుడనుభవిస్తున్నాను.
నేను ఆదర్శాలకు కట్టిబడి ఉండాలనుకున్నాను. ఫలితంగా నాకు లభించిన దేమిటి?
డాక్టర్ విలాస్ కు ఏం జరిగిందో నాకూ అదే జరిగింది.
నన్ను ప్రేమించిన కోమలి అతడి భార్య అయింది. మాధవరావును ప్రేమించిన పద్మిని నాకు భార్య అయింది.
విలాస్ కు ఆదర్శాలు లేవు. కానీ జీవితంలో అతడు పోగొట్టుకున్న దేముంది? ఇంకా చెప్పాలంటే కోమలి పవిత్రురాలు. పద్మిని పవిత్రతను కూడా కోల్పోయింది.
అతడు అన్నీ అనుభవిస్తున్నాడు.
పద్మిని ఒకసారి చెడిపోయింది. ఆమెను విలాస్ సులభంగా లొంగదీసుకోగలడు. ఆ వంకతో ఆమెను వదుల్చుకొని-కోమలిని నా భార్యగా పొందితే.
కోమలి తప్పక అందుకు ఒప్పుకుంటుంది. నాకోసం ఈ ప్రపంచంలో సాధ్యపడే ఎటువంటి త్యాగమైనా చేయగలనన్నదామె.
నా ఆలోచనలొక రూపుదిద్దుకుంటున్నాయి. ఈ విషయమై కోమలిని సంప్రదించాలనుకున్నాను.
కోమలి తన కార్యక్రమాలను ప్రతిరోజూ నాకు తెలివిగా తెలియజేస్తూనే వుంది.
"ఇంట్లో కూరలులేవు మధ్యాహ్నం బజారుకెళ్ళి మీరొచ్చేసరికి వచ్చేస్తాను." అని గట్టిగా భర్తతో అంటుందొకరోజు.
"ఈరోజు మాన్ షోకి వెడుతున్నాను. ఎవరయినా వస్తే కాస్త కబురందుకోండీ" అని పద్మినికి చెబుతుందొకరోజు.
నేనామెను కలుసుకోవాలనుకున్న రోజున ఆమె నూన్ షోకి వెళ్ళింది.
నేను ధియేటర్ వద్దకు వెళ్ళాను. నేను వెళ్ళిన కొద్ది క్షణాలకు ఆమె వచ్చింది. ఇద్దరం ఒకరినొకరు చూసుకున్నాం. పలకరించుకున్నాం.
"నీతో మాట్లాడాలి" అన్నాను.
"నీ యిష్టం" అన్నదామె.
ఇద్దరం కలసి పార్కుకు వెళ్ళాం.
"నేనో నిర్ణయానికి వచ్చాను" అన్నాను.
"ఏమిటది?"
"నీ పిలుపు నాకోసం ఎన్నడూ వుంటుందని అన్నావు కదూ!"
"అవును..."
"నేను నీ పిలుపును అందుకో బోతున్నాను"
"అంటే?" ఆశ్చర్యానందాలామె ముఖంలో స్పష్టంగా అగుపించాయి.
"చెప్పుకో!" అన్నాను.
కోమలి అదోలా నవ్వింది.
"చెప్పుకోలేవు అవునా?"
"నువ్వు మగాడివి నేను ఆడదాన్ని ఆడది పిలిచింది మగాడు వచ్చాడు" అన్నదామె.
"కాదు..."
"మరి...?"
"నేను నిన్ను వివాహం చేసుకుంటాను"
కోమలివంక చూశాను. పక్కలో బాంబు పడ్డట్లు ఉలిక్కిపడ్డదామె. భయం, విస్మయం ఆమె కనులలో స్పష్టమవుతున్నాయి.
"నా మాట వినపడలేదా?" అన్నాను.
"ఏమన్నావ్?" అన్నదామె.
మళ్ళీ చెప్పాను.
"మరి పద్మిని సంగతేమిటి?"
"ఆమెను విలాస్ కు వదలిపెట్టేశాను"
కోమలి ఆశ్చర్యపడింది. ఇద్దరం కాసేపు తర్జన భర్జన చేశాం.
విలాస్ పద్మినిని వశపర్చుకోగలడు. ఈ ప్రపంచంలో ఏ ఆడదాన్నయినా అతడు వశపర్చుకోగలడు. ఒకసారి అతడి వశమైనదంటే ఆమె అతడి చుట్టూ తిరగడం ప్రారంభిస్తుంది.
ఇది కోమలి అభిప్రాయం.
"మరి నీ సంగతేమిటి?"
"అతడెలాంటివాడయినా అతన్ని వదులుకుని రావడం నాకూ కష్టమే! నీకోసం అయితే మాత్రం నేనేమయినా కాని నాకు నీలోని మార్పు ఆశ్చర్యం కలిగిస్తుంది" అన్నది కోమలి.
నేనామెకు వివరించాను.
ఈ కొద్దిరోజుల్లోనూ నేను నన్ను అపార్ధం చేసుకునేందుకు ప్రయత్నించాను. కోమలి ఆకర్షణకు లొంగకుండా శ్రీమతి విలాస్ కు లొంగిపోవడంలోని ఆంతర్యం కొంత వరకూ అర్ధం చేసుకున్నాను.
నేను, పద్మిని ఎన్నోసార్లు బస్సుల్లో ప్రయాణం చేశాం. అపరిచితులు తప్ప పరిచితులెవ్వరూ ఆమె పక్కన కూర్చునేవారుకాదు. ఆమె పక్కన పరాయి మగవాడు కూర్చోవడం నాకు అభ్యంతరం కాదు. అలా కూర్చున్న వాడు నాకు తెలిసినవాడైయుండకూడదు.


