Previous Page Next Page 
గిఫ్ట్ పేజి 40

    "చేయి ఎత్తంగానే సరిపోదు కోమలమైన చేత్తో వక్కటిస్తే జన్మ పావనం అయ్యేది. జన్మంతా గుర్తించుకునే వాడిని ప్చ్....దేనికయినా పెట్టిపుట్టాలి." వాపోతున్నట్లు అన్నాడు మనోజు.

    "ఇవాళ నీకేమయింది?" బబిత చిరునవ్వుతో అడిగింది.

    "ఇంకా ఏమీ కాలేదు" మనోజ్ అన్నాడు.

    "ఏం కావాలేంటీ?"

    "చాలా చాలా కావాలి. తమరిస్తానంటే వక్కటైనా బీరుపోకుండా వరుసపెట్టి లిస్ట్ చదువుతాను. చదవనా!" మనోజ్ ఉషారుగా అన్నాడు.

    పబ్లిక్ పార్కులో రొమాన్స్ పైగా ఇక్కడ వున్నది పోలీసు ఇన్ స్పెక్టరు. ఒక ప్రెస్ రిపోర్టర్ అండ్ జర్నలిస్ట్ పైగ వాళ్ళిద్దరూ వయసులో వున్న మగ ఆడ. కొన్ని విషయాలలో పత్రికలన్నీ వకటే అయినా సంచలనం కలిగించే వార్త అయితే అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాల్లాగా విడిపోయి పోట్లాటకి రెడీ అవుతాయి. ఎల్లో జర్నలిజం పత్రికలు వేయికళ్ళతో వార్తల కోసం ఎదురు చూస్తుంటాయి తనకి భయంలేదు. అలా అని నలుగురి నోళ్ళలో నానేపని ఎందుకు చేయాలి! తనకి మనోక్ అంటే ప్రాణం, మనోజ్ కి అంతే తనపై ఎంతో ప్రేమ అనురాగం....

    బబిత ముఖం పట్టుకుని నిమ్మదిగ కుదుపుతూ "ఏంటి ఆలోచిస్తున్నావ్! ఊహా సుందరుడి గురించా?" మనోజ్ నవ్వుతూ అడిగాడు.

    "ఉహూ మీ అంకుల్ గురించి." బబిత మాట మారుస్తూ సీరియస్ గా అంది.

    ఛటర్జీ పేరు ఎత్తేసరికి గాలి తీసిన బెలూన్ లాగా అయింది మనోజ్ పరిస్థితి, మౌనంగా వుండిపోయాడు.

    "మీ యింటికి వచ్చి మూడు రోజులు అయింది. అంకుల్ ఏం చేస్తున్నారు! ఏమంటున్నారు?" మనోజ్ మాట్లాడకపోయేసరికి బబిత అడిగింది.

    "నీవు రావటం లేదని ఈ మూడు రోజుల్లో మూడు వందల సార్లయినా అడిగివుంటారు."

    "అయ్యెయ్యో! అంకుల్ చేత అన్నిసార్లు అడిగించుకున్నానా! రేపు సాయంత్రం లోపల తప్పకుండావస్తాను."

    "అయితే అమ్మాయిగారి దర్శనభాగ్యం రేపు కూడా వుందన్నమాట. ఆ దేవుడు చల్లగ వుండుగాక."

    మనోజ్ దేముణ్ని దీవించటం చూసి ఫక్కున నవ్వింది బబిత.

    ఆ తర్వాత ఇరువురు బైట విషయాలు మాట్లాడుకుని వెళ్ళటానికి లేచారు.

    "తన మామయ్య విషయం వివరంగ బబితతో చర్చించాలనుకున్న మనోజ్ అది సమయము సందర్భము కాదని ఊరుకుండిపోయాడు.

    "మామయ్యకి బాగా మతిమరుపు ఎక్కువయింది. మాటల మధ్యలో ఒక మాట మాట్లాడాల్సింది. వేరే మాట మాట్లాడుతున్నాడు. భోజనం సరీగ చేయటంలేదు. డాక్టర్ దగ్గరకు రమ్మంటే రానని మొండికేస్తున్నాడు....అని బబితతో చెపితే నవ్వుతుంది. సమయంచూసి నెమ్మదిగా చెప్పాలి. బబిత ఏమంటుందో చూడాలి....

    అంతవరకే ఆలోచించాడు మనోజ్.

    పార్క్ లోంచి బైటికి వచ్చింతరువాత బబిత ముందుగా శలవు తీసుకుని వెళ్ళిపోయింది. ఆ తర్వాత మనోజ్ బైక్ ఇంటి ముఖం పట్టింది.


                                         30


    ఈ రోజు సాయంత్రం.

    ఛటర్జీ. మానసా నర్సింగ్ హోమ్ నుంచి బయటకి రావటం మనోజ్ చూశాడు. ఈ రోజే కాదు ఇంతక్రితం ఒకసారి కూడా అటు నుంచీ రావటం చూశాడు కానీ, నర్సింగ్ హోం నుంచీ బయటికి వచ్చాడు అని అనుకోలేదు.

    నాలుగు రోజుల క్రితం మాటల సందర్భంలో బబిత చెప్పింది. "అంకుల్ మానసా నర్సింగ్ హోమ్ నుంచి బయటకి వస్తున్నారు. నేను పలకరిద్దామనుకున్నాను గానీ, అర్జంట్ గా వెళ్ళాల్సినందువల్ల అలానే వెళ్ళిపోయాను. మీకు తెలిసిన వాళ్ళెవరయినా ఆ నర్సింగ్ హోమ్ లో చేరారా?"

    ఇదంతా చూస్తుంటే ఏదో వుందని అనిపిస్తోంది.

    ఛటర్జీ వెళ్ళిపోయిన తరువాత, క్షణకాలం అక్కడే నిలుచుని ఆలోచించి, నర్సింగ్ హోమ్ లోకి దారితీశాడు ఇన్ స్పెక్టర్ మనోజ్.

    ఇప్పుడు మనోజ్ మామూలు దుస్తులతో వున్నాడు.

    ఆ సమయలో పేషెంట్లు ఎవరూ లేనందువల్ల. డాక్టర్ సుఖదేవ్ పాండేను కలుసుకోవడం తేలిక అయింది.

    తను పోలీసు ఆఫీసర్ అని చెపితే డాక్టర్ సరగ్గా సహకరించడేమోనని, మనోజ్ తనని మామూలు వ్యక్తగా పరిచయం చేసుకున్నాడు.

    "మీ సమస్య ఏమిటో చెప్పండి?" సుఖదేవ్ పాండే చిరునవ్వుతో అడిగాడు.

    సుఖదేవ్ పాండేకు అరవై ఏళ్ళ వయస్సు పైనే వుంటుంది. ఎత్తుగా, లావుగా, తెల్లగా, అందమైన చిరునవ్వుతో ఆకర్షించే రూపంతో, మనిషిని చూడగానే సగం రోగం తగ్గినట్లు రోగికి అనిపిస్తుంది ఆయన మాట తీరు అమృతం చిలికించినట్లు వుంటుంది.

    "నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగటానికి వచ్చాను" మనోజ్ అన్నాడు.

    "ప్రశ్నలా?....ఓ....మీరు రైటరా?" అంత పెద్ద డాక్టర్ మనోజుని రచయితగా మరో విధంగా అర్ధం చేసుకుంటూ అన్నాడు.

    "నేను రైటర్ ని కాను" నోరు జారి గబుక్కున అనేశాడు మనోజ్.

    "ఐ.సీ! మీరు ఏ విషయంలో ప్రశ్నలు అడగదలచుకున్నారు?"

    "కొన్ని వ్యాధుల గురించి తెలుసుకుందామని ఆయా వ్యాధులు వున్న రోగుల ప్రవర్తన ఎలా వుంటుంది? ఈ వివరాలు కావాలి!"

    "ఎందుకు కావాలో మీరు చెప్పలేదు?" ఎదురుగా వున్న మనోజుని గుచ్చి చూస్తూ అడిగాడు సుఖదేవ్ పాండే.

    "చాలా అవసరమై అడుగుతున్నాను" అంతకంటే ఏమి చెప్పాలో తెలియక అన్నాడు మనోజు.

    "తగిన కారణం లేకుండా మేం చెప్పం." మొహమాటం లేకుండా చెప్పేశాడు సుఖదేవ్ పాండే.

    ఒక్కక్షణం ఆలోచించాడు మనోజు. "ఇంతకుముందు మీ దగ్గరికి వచ్చి బయటకు వెళ్ళింది మా మావయ్య పేరు ఛటర్జీ. ఆయన విషయంలో నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను" అని చెప్పాడు.  

 Previous Page Next Page