Previous Page Next Page 
గిఫ్ట్ పేజి 39


    "అదికాదు మామయ్యా! సుఖదేవ్ పాండే అని M.D. చాలా పెద్ద డాక్టర్! మానసా నర్శింగ్ హోమ్ స్థాపించాడు. మానసిక వ్యాధులేవయినా సరే చాలా గొప్పగా ట్రీట్ చేస్తాడు." మనోజ్ మాట్లాడుతూవుంటే ఛటర్జీ మధ్యలో అడ్డుతగిలి నాకే మానసిక రోగం లేదు. అసలు నాకేదో వ్యాధి వుందని నీకెందుకు అనుమానం వస్తున్నదో నాకర్ధం కావటంలేదు...."

    "అది కాదు మామయ్యా!"

    "మాటల మధ్యలో అడ్డుతగలకు ఏదో చెబుతావ్! అది నాకు రుచించదు. నాకే వ్యాధీలేదు. డాక్టర్ల పేరు, వ్యాధి పేరు నా దగ్గర ఎత్తకు. నేనింక ఏ డాక్టర్ దగ్గరకీ రాను. నాకు రోగం వస్తే నా బంగారుతల్లి చూసుకుంటుంది. సరేనా!" అంటూ ఛటర్జీ భోజనం పూర్తి కావడంతో లేచి చెయ్యి కడుక్కోటానికి సింక్ దగ్గరకు వెళ్ళాడు.

    మనోజ్ యింకేం మాట్లాడగలడు?

    మతిమరుపు విషయం మావయ్యకి గుర్తుచేసి పెద్ద డాక్టర్ దగ్గరకి తీసుకెళదాం అనుకున్నాడు. ఆయన రానని మొరాయిస్తుంటే ఏం చేయగలడు?  

    "లాభంలేదు మామయ్యా! నా తెలివితేటలు నేరస్తుల ముందు పనిచేస్తాయి గానీ నీముందు బలాదూర్!" అనుకున్న మనోజ్ నోరు మూసుకొని తాను కూడా డైనింగ్ టేబుల్ ముందు నుండీ చేయి కడుక్కోటానికి లేచాడు.

    "బంగారు తల్లికి లెటర్ రాసిస్తానురా మనోజ్! మళ్ళీ మర్చిపోయానంటే లెటర్ రాయటం ఆలశ్యం అవుతుంది. అదేమో అక్కడ కంగారు పడుతుంది." అంటూ షింక్ దగ్గర చేయి కడుక్కుని తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు ఛటర్జీ.

    "లాభంలేదు. మరో దోవ చూడాలి మామయ్యని పెద్ద డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళటానికి" అనుకున్న మనోజ్ కొద్దిసేపు రెస్ట్ తీసుకోటానికి బెడ్ రూమ్ వైపు సాగాడు.


                                         29


    ఆ సాయంత్రం.

    పార్కులో

    స్కూటర్ దిగి లోపలికి వస్తున్న బబితని చూసి హాయ్!"  అన్నాడు మనోజ్ గాలిలో చేయి వూపుతూ.

    అతని కేసి చూసి ఓ అడుగు ముందుకువేసి "హోయ్!" అంది లలిత.

    "హాయ్ కి జవాబు హాయ్ గాని హోయ్ కాదు అమ్మాయీ!" చిరునవ్వుతో అన్నాడు మనోజ్.

    "మనం తెలుగువాళ్ళం. మళ్ళీ చెప్పాలంటే ఆవకాయ, కొరివికారం గోంగూర తినే ఆంధ్రులం. ఇంగ్లీషు వాళ్ళలాగా హాయ్ కి హాయ్ అనాలని ఎక్కడా లేదు. హోయ్ అనటంలోనే తెలుగువాళ్ళ తెలివి కనబడుతుంది. "మనోజ్ పక్కకి వచ్చి పచ్చికమీద కూర్చుంటూ అంది బబిత.

    రెండు చేతులూ తలక్రింద పెట్టుకుని పచ్చిక మీద ఎల్లకిలా పడుకున్న అతను ప్రక్కకి తిరిగి విష్ణుమూర్తి ఫోజులోకి మారి బబితని నఖశిఖ పర్యంతం ఒకసారి చూసి "ఆంధ్రులకి మరో పేరు వుంది. ఎడ్డెమంటే తెడ్డెం అంటారని. ఏ పని చేసినా ఒక ప్రత్యేక గుర్తింపుతో చేస్తారు. దేశమంతా జనతా పరిపాలన వచ్చినపుడు ఇక్కడ మాత్రం కాంగ్రెస్ వచ్చింది. ఆ తరువాత ఎన్నోచోట్ల కాంగ్రెస్ విజయభేరి మ్రోగిస్తే ఇక్కడ తెలుగుదేశాన్ని గెలిపించారు. నలుగురు నడిచే దారిలో నడవక పోవటమే మన తెలుగువాళ్ళ ప్రత్యేకత." నవ్వుతూ శెలవిచ్చాడు మనోజు.

    "బావుంది." నవ్వుతూ అంది బబిత.

    "బావుంది." ఆ వెంటనే అన్నాడు మనోజు.

    "ఏమిటి బావుంది?"

    "నీ నవ్వు, నీ డ్రస్సు, నీ మాటలు...."

    "చాలు, చాలు." అంటూ అతని పొగడ్తకి లోలోపల మురిసిపోతూ పైకి చిరుకోపంతో అంది.

    "అవునూ! నేను ఇక్కడ వున్నట్లు నీకెలా తెలుసు?"

    ఇన్ స్పెక్టర్ బుర్ర వుపయోగించి నేనిక్కడకి ఎలా రాగలగానో నువ్వే చెప్పు!" చెప్పగలిగితే గిఫ్ట్ కేసుల్ని నీవు సాల్వ్ చేయగలుగుతావు."

    "నీ కేసు వెరీ సింపుల్! బయట నేను ఎక్కి వచ్చిన స్కూటర్ వుంది. తమరు ఈ దోవలో వెళ్తూ వుంటారు. నా వాహనాన్ని చూసి నీ వాహనంగారు ఆటోమాటిక్ గా ఆగి వుంటారు. యామై కరెక్ట్?"

    "చాలా చక్కగా కనుక్కున్నావు మనోజ్!" మెచ్చుకోలుగా అంది బబిత.

    "ఇది చాలా చిన్న విషయం. కేసులు అలాకాదే! తలబ్రద్దలు కొట్టుకుంటున్నా చిన్న క్లూ కూడా అందటం లేదు. నేను ఈ వూరు ట్రాన్స్ ఫర్ అయివచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. నా ప్రాణానికి కేసులన్నీ అయోమయంగా వున్నాయి" బాధగా అన్నాడు మనోజ్.

    "డోంట్ వర్రీ! మైడియర్ యంగ్ బాయ్!" అంటూ చెట్టంత మనిషి ఇన్ స్పెక్టర్ మనోజు చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అంది బబిత.

    బబిత చేతిని మృదువుగా నొక్కి వదిలేస్తూ "నా తల్లే ఏం లాలింపు! ఏం లాలింపు!" అన్నాడు మనోజు.

    బబిత అందంగా సిగ్గుపడింది.

    "నీవలా కొరుక్కు తినేలాగా చూడకు. నేను ఆడపిల్లనని గుర్తొస్తుంది సుమా!" హెచ్చరికగా అంది బబిత.

    "నాకు ఇలాంటప్పుడే గుర్తొస్తుంది అబ్బాయినని__!" గబుక్కున ఆ మాట అనేసి తన తొందరపాటుకి నాలుక కొరుక్కున్నాడు అతను.

    "షేమ్ షేమ్, అబ్బాయి తాను అబ్బాయిని కాదని చెప్పేశాడు అల్లరిగా చప్పట్లు చరుస్తూ అంది బబిత.

    "అందమైన అమ్మాయి పక్కనే వుంటే ఏ పురుష పుంగవుడి మైండ్ సవ్యంగా పనిచేయదు, ఉదాహరణకి మేనక విశ్వామిత్రులు చాలనుకుంటాను. వయసులో వున్న మగాణ్ని మానవ మాత్రుడికి నీలాంటి అప్సరస దిగివస్తే కళ్ళు కాళ్ళు బుర్ర ఏదీ పని చేయదనుకో." బబిత చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా నొక్కి వదిలేసి చల్లగా శలవిచ్చాడు మనోజ్.

    "అమ్మాయిలని చూడంగానే బుర్ర పనిచేయటం ఆగిపోతే చాలా కష్టం అబ్బాయిగారూ! ఏ కేసూ పట్టలేరు సరికదా అంతా అయోమయం అవుతుంది. ఆ తర్వాత మీ పని గోవిందో హరి" అల్లరిగా అంది బబిత.

    "అందమైన అమ్మాయిలయేది అప్సరసలు దిగి వచ్చేది ఈ అబ్బాయిగారి బుర్ర సవ్యంగానే పనిచేస్తుంది. వక్కసారిగా గిర్రు గిర్రున తిరిగి సడన్ బ్రేక్ వేసినట్లు ఆగిపోదు. నీలాంటిది ఎదుట నిలిచి కన్నుకొట్టి కవ్విస్తుంటేనే ప్రమాదం వచ్చిపడేది."

    "ఏయ్!" అంటూ చేయి ఎత్తింది బబిత.  

 Previous Page Next Page