Previous Page Next Page 
ఇది ఒక కుక్క కథ పేజి 3

    ప్రిన్సిపాల్ అదోలా స్వామివంక చూసి, "కష్టపడి చదువుకొనడానికి ప్రతివాడికీ నీకున్న లాంటి పరిస్థితులూ, స్కాలర్ షిప్పూ అవసరమనిపిస్తుంది. లేకపోతే ఈ దేశంలో కృషి, నిజాయితీ పెరగవు" అని "నువ్వు మాత్రం నీ లక్ష్యసిద్ధి అయిపోగానే ఈ రెండింటినీ వదిలిపెట్టేయకు. మంచి చెడ్డలతో నిమిత్తం  లేకుండా ఇప్పటి ప్రవర్తనను కొనసాగించు. డబ్బు సంపాదించలేకపోవచ్చు కాని అందువల్ల అంతులేని సంతృప్తి కలుగుతుంది. ఆ సంతృప్తి విలువ నీకు వృద్ధాప్యంలో కాని అర్ధంకాదు" అన్నాడు. స్వామి ఆయనవంకే ఆశ్చర్యపోతూ చూస్తుండగా "నీతో చిన్న పని ఉంది. పరీక్షలు రాసేక నాకోసారి కనిపించు" అన్నాడాయన. తర్వాత స్వామికింక మాట్లాడే అవకాశమివ్వకుండా "నువ్విక వెళ్ళొచ్చు" అన్నాడు.
                                  3
    "నమస్కారమండీ!" అన్నాడు స్వామి.
    "నమస్కారం. పరీక్షలెలారాశావ్?" అన్నాడు రుద్రరాజు.
    "చాలా బాగా రాశానని అనుకుంటున్నానండి!"
    "గుడ్! నా మాట గుర్తుంచుకొని పరీక్షలు కాగానే వచ్చావన్నమాట!"
    "అదొక్కటే కాదండి! ఇంకో చిన్న పని కూడా ఉందండి!" అన్నాడు నసుగుతూ స్వామి.
    "ఏమిటది?"
    "నా స్కాలర్ షిప్ అయిపోయిందండి! ఇంక నాకు చదువుకునే అవకాశం లేదు. ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేయాలి. మీరు దయతలిస్తే...." అని ఆగిపోయాడతను. ఎందుకంటే రుద్రరాజు అతనివంక హుంకరించి చూస్తున్నాడు.
    "మిస్టర్ స్వామీ! నువ్వు చేయవలసిన ప్రయత్నం ఉద్యోగం కోసం కాదు-పై చదువులకు. అందు గురించి నువ్వేమీ భయపడనక్కర్లేదు. పరీక్షలు కాగానే నిన్ను నా దగ్గరకు రమ్మన్నాను-ఎందుకో తెలుసా?" అన్నాడు రుద్రరాజు.
    "తెలియదండి!"
    "నీ భవిష్యత్ కు బాట వేయడానికి...." అని రుద్రరాజోక్షణం ఆగాడు. "ఇంతకీ నేను వేసేది బాట మాత్రమే! ఆ బాటపై నడిచేది నువ్వే. నువ్వు నడిచే తీరునుబట్టి ఆ బాటకు గమ్యం ఉంటుంది."     
    స్వామి ఏమీ మాట్లాడకుండా  ఆయనవంకే చూస్తున్నాడు. ఆయన మనసులోని ఉద్దేశ్యమేమిటో అతని ఊహకు అందడంలేదు.
    "మీనా!" అని పిలిచాడు రుద్రరాజు కాస్త గట్టిగా. 'వస్తున్నా' అన్న జవాబు ఆ వెనుకే ఒక అమ్మాయీ అక్కడికి వచ్చారు. కొంచెం హడావుడిగా వచ్చిన ఆ అమ్మాయి అక్కడున్న స్వామిని చూసి చటుక్కున ఆగిపోయింది.
    "నా కూతురు మీనాక్షి. కొడుకైనా, కూతురైనా ఇదొక్కర్తే నాకు" అన్నాడు రుద్రరాజు. కూతురువంక చూసి, "ఇలారామ్మా!" అన్నాడు. మీనాక్షి తండ్రిని సమీపించి ఆయన పక్కనే ఒదిగి కూర్చుంది.
    స్వామి ఆ అమ్మాయివంకే చూస్తున్నాడు. ఆమె వయసు పదిహేనో పదహారో ఉండవచ్చు. చూడడానికి అందంగా ఉంది. ఆకర్షణీయమైన చూపులు, అమాయకమైన ముఖం. ఈ అమ్మాయి గురించి ఆయన తనకు చెప్పడంలోని విశేషమేమిటా అని ఆలోచిస్తున్నాడతను. రుద్రరాజు మళ్ళీ మొదలుపెట్టాడు. "చాలా గారాబంగా పెరుగుతోంది. అయినా అల్లరి చేయదు. ఒక్కర్తే పిల్ల కావడంవల్ల దీని భవిష్యత్తు గురించి ఆలోచించడం మినహాగా ఇంకో పని లేదు నాకు. ఇప్పుడు ఇంటర్ సీనియర్ లోకి వచ్చింది. ఇంకా చదివించాలని అనుకుంటున్నాను."
    రుద్రరాజు మాట్లాడుతున్నంతసేపూ స్వామి వింటున్నాడు. ఆయన ఆగినప్పుడు ఆలోచిస్తున్నాడు. ఇంతవరకూ ఆయన చెప్పేది తెలిసింది కాని చెప్పబోయేది మాత్రం తెలియడంలేదు. కాసేపాగితే ఆయనే చెబుతాడు కదా అని అతనిప్పుడు ఆలోచించడం కూడా మానేశాడు. అప్పుడప్పుడా అమ్మాయి అతనివంకే దొంగ చూపులు చూస్తూండడం గమనించి, అతను తనలో తను నవ్వుకొంటూ సంతోషపడుతున్నాడు. ప్రిన్సిపాల్ గారు చెప్పబోయే దానికీ ఈ అమ్మాయికీ తనకూ ఏదో సంబంధముందని అతనికి అనిపించ సాగింది.
    "నువ్వు దీనికి ప్రైవేటు చెప్పాలి. చదువు మీద దీనికి నీ అంత శ్రద్ధ పుట్టించి నీకులా పరీక్షల్లో మార్పులు తెచ్చుకొనేలా చేయాలి. అందుకు ప్రతిఫలంగా నేను పై చదువులయేటంతవరకూ నీ ఖర్చులన్నీ భరిస్తాను" అన్నాడు రుద్రరాజు.
    స్వామికి ఇది కలా-నిజమా? అనిపించింది. అదృష్టం మరీ ఇంతలా తనను వెతుక్కుంటూ వస్తుందని అతననుకోలేదు. ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో అతనికి తోచలేదు.
    "నీకు ఇష్టమే కదమ్మా?" అన్నాడు రుద్రరాజు. మీనాక్షి సిగ్గుతో తల వంచుకొంది. "సరే, నువ్వు లోపలకు వెళ్ళు!" అన్నాడాయన. మీనాక్షి రెండంగల్లో ఇంట్లోకి వెళ్ళిపోయింది.
    "ఇప్పుడు నీ కింకో ముఖ్యమైన విషయం చెప్పాలి" అన్నాడు రుద్రరాజు. "అది నేను చెప్పబోయేముందు నీకు నేను చెప్పిన దంగీకారమవునో కాదో చెప్పు?"
    "సరే- అయితే మనం ఆ పక్కగదిలోకి వెడదాం" అన్నాడు రుద్రరాజు. స్వామి ఆయన్ను అనుసరించాడు.
    గది తలుపులు దగ్గరగా మాత్రం వేసి ఉన్నట్లున్నాయి- తోయగానే తెరుచుకున్నాయి. ఆ గదినానుకొని ఓ వసారా ఉంది. వసారాలో ఓ స్థంభానికి ఇనుప గొలుసులతో కట్టివేయబడి ఉంది- సింహంలాంటి ఓ ఆల్సేషియన్ కుక్క!
    ఆ కుక్కను చూడగానే స్వామి భయపడ్డాడు. అది చూడడానికి చాలా భయంకరంగా ఉంది. కాని అది స్వామిని చూసి మొరగలేదు.
    "మొరిగే కుక్క కరవదంటారు. ఇది మొరగని కుక్క. అలాగని ఇది అందర్నీ కరవదు. కరిచేముందు హెచ్చరికగా మొరుగుతుంది. హెచ్చరికను పాటించకపోతే కరుస్తుంది. మనిషి కంటె తెలివైనదీ కుక్క. నా అదృష్టంకొద్దీ నాకు దొరికింది. నా కూతురు తర్వాత ఇదే నా ప్రాణం. దీని పేరు రాజా. దీని ఔన్నత్యాన్ని తెలియబర్చడానికింత కంటె మంచి పేరు నాకు తట్టలేదు."
    స్వామి రుద్రరాజు చెప్పేవి వింటూనే ఆ కుక్కవైపు చూస్తున్నాడు. ఆ కుక్క తనను చూసి మొరగక పోవడం    అతనికి చాలా ఆశ్చర్యంగా ఉంది. సాధారణంగా కుక్కలు కొత్త వాళ్ళని చూస్తే పని ఉన్నా లేకపోయినా మొరుగుతుంటాయి.
    "నిన్ను చూసి ఈ కుక్క మొరగలేదంటే నీలోని మంచితనాన్ని ఈ కుక్క గుర్తించిందని అర్ధం. మనిషి ఆలోచనలను పసిగట్ట గలిగిన ఈ కుక్క చెడ్డవాళ్ళను చూసినపుడు మాత్రమే మొరుగుతుంది. మా ఇంటి మనుషులు తప్ప ఎవరు పెట్టినా ఏమీ తినదు. నేనాకుక్కను ఒక ఫారినర్ వద్దకొన్నాను. అతను నాకు చెప్పినదేమిటంటే-ఇది అత్యంత విశ్వాసపాత్రమైనది. యజమాని ప్రవర్తనకూ దీని ప్రవర్తనకూ సంబంధముంటుంది. ఇది నిజంగా అపూర్వమైన విషయం. దీన్నిక్కడ ఇలా గొలుసులతో బంధించడం తప్పు. అయితే ఎన్ని మంచి గుణాలున్నప్పటికీ ఇది కుక్కగదా! నిష్కల్మషమైన జంతువుగదా! ఏ దుర్మార్గుడైనా మిత్రుడి రూపంలో నా ఇంటికి వచ్చి నటిస్తూంటే-ఇది ఆ నటనను సహించలేక మీద పడుతుంది. నిజం తెలిసినా మనిషి కొన్ని విషయాల్లో అసహాయుడిగా ఉండిపోక తప్పదు. అందుకే పగటిపూట దీన్నిలా బంధించివుంచుతాను. రాత్రి ఇంట్లో ఇది స్వేచ్చావిహారం చేస్తుంది. ఆ దేవుణ్ణి కూడా ఇంట్లో చొరబడనివ్వదు" అన్నాడు రుద్రరాజు.
    "మీరు చెప్పేదంతా నిజమే అయితే విచిత్రమేనండి!" అన్నాడు స్వామి.
    "నిజమోకాదో ముందు ముందు నీకే తెలుస్తుంది. ఇంతకీ ఈ కుక్క గురించి నీకెందుకు చెప్పానో తెలుసా?" అన్నాడు రుద్రరాజు.
    స్వామి ఉలిక్కిపడి "తెలియదండి!" అన్నాడు.
    "నాకు తెలుసు-నేను చేస్తున్న పని అంత మంచిదికాదని. నా కూతురు పసిబాలిక కాదు. ఇప్పుడిప్పుడే యవ్వన ప్రాంగణంలో అడుగుపెడుతోంది. నువ్వూ యువకుడివి. ఇద్దర్నీ ఒక చోట చేరుస్తున్నాను. ఎందుకోసం? నా కూతురి తెలివితేటలు పెరుగుతాయనీ, ఒక పేదవాడికి సహాయపడినట్లవుతుందనీ భావించి ఈ ప్రమాదకరమైన పనికి పూనుకున్నాను. నేను పూనుకున్న పని ప్రమాదకరమైనదేనంటావా-కాదంటావా?" అన్నాడు రుద్రరాజు.
    "కాదండి! నా గురించి మీకు తెలిస్తే అలా అనుకోరండి! లక్ష్యసిద్ధి అయ్యేవరకూ నా దృష్టి మరే ఇతర విషయాల మీదకూ మళ్ళదు. బాధ్యతలను నిర్వహించడంలో ఎంత ఖచ్చితమైన వాడినో మీకు నిరూపించుకోగలను" అన్నాడు స్వామి ఆవేశంగా.
    రుద్రరాజు నవ్వాడు- "మనిషి దేవుడు కాలేడు. మనిషికి మనసు మీద పూర్తి అదుపు లేదు. అలా ఉన్నవాళ్ళను నేనింతవరకూ చూడలేదు. నీ మనసు ఎప్పుడయినా నీ అదుపు తప్పవచ్చు. అందుకే మీ ఇద్దరికీ నా కుక్క కాపలా ఉంటుంది. నీ ప్రవర్తనలో ఏ మాత్రం లోపం కనబడ్డా అది మొరిగి నిన్ను హెచ్చరిస్తుంది. అది మొరగవలసిన అవసరం కలగకుండా ప్రవర్తిస్తే-నువ్వు మనిషివి కాదు-దేవుడివవుతావు!"
    స్వామి ఆయన మాటలు ఆశ్చర్యంగా  విని- "మీరు నాకు అర్ధం కావడంలేదు" అన్నాడు.
    రుద్రరాజు మళ్ళీ నవ్వి- "నేను అర్ధమైనా కాకపోయినా నేను చెప్పే మాటలు విని అర్ధం చేసుకో. అరిటాకు, ముళ్ళు సామెత తెలుసుగదా-తప్పుగా ప్రవర్తించేది నువ్వయినా నా కూతురయినా నష్టపోయేది నువ్వే! నీ ప్రవర్తన సరిగా లేనపుడే కుక్క మొరుగుతుంది. మనిషి పొరబడవచ్చు. మనిషి చేసిన యంత్రం పొరబడవచ్చు. కానీ నా కుక్క పొరబడదు. అది మూడే మూడుసార్లు మొరిగి నిన్ను హెచ్చరిస్తుంది. ఆ తర్వాత ఈ ఇంట్లో నీకు స్థానముండదు" అన్నాడు.
                                 4
    "మీరు చాలా బాగా చెబుతారు పాఠం!" అంది మీనాక్షి.
    "అది నా బాధ్యత" అన్నాడు స్వామి.
    "మీ చదువుకాగానే లెక్చరర్ ఉద్యోగం చేయండి. చాలామండి విద్యార్ధులు సంతోషిస్తారు" అంది మీనాక్షి.
    "ఈ రోజుల్లో క్లాసుల్లో పాఠాలు వినే విద్యార్దు లెందరున్నారు? నేను లెక్చరర్ని కాకపోతేనే చాలామంది సంతోషిస్తారు."    
    "ఎందుకు వినరు పాఠం-బాగా చెప్పే మేస్టారుంటే?"
    "అయితే మీ క్లాసులో బాగా పాఠం చెప్పే మేస్టరొక్కరైనా లేరా? నేను చెబితే కాని పాఠాలు మీ కర్ధంకావడం లేదంటే....?"
    మీనాక్షి నవ్వి-"మీతో వాదించడం కష్టం. మీరు చాలా తెలివైనవారు" అంది. స్వామి ముఖం ఎర్రగా అయింది. అతనామెవంక అదోలా చూశాడు. ఆమె చూపుల్లో అభిమానం కనపడిందతనికి. "అలా అనేస్తే తెలివితేటలు వృద్ధిపొందవు. వాదించడానికి ప్రయత్నించాలి" అన్నాడతను మొహమాటాన్ని దాచిపెట్టుకునేందుకు ప్రయత్నిస్తూ.
    "నా కలాంటి బెంగలేదు. నాకు తెలివితేటలున్నా-లేకపోయినా, అనుకున్నవి  సాధించగలను. చిన్నప్పుడు అన్నీ అమ్మకు చెప్పి సాధించుకునేదాన్ని. కాస్త పెద్దయ్యాక అమ్మ నా మీద పెత్తనం మొదలుపెట్టింది. అందుకని ఇప్పుడు నాన్నకు చెప్పి సాధించుకుంటున్నాను. ఇంకాస్త పెద్దయ్యాక...." అని ఆగిపోయింది మీనాక్షి.
    "ఊఁ-చెప్పండి?" అన్నాడు స్వామి కుతూహలంగా.
    "అటు చూడండి __ అదెంత భయంకరంగా చూస్తోందో?" అంది మీనాక్షి.    

 Previous Page Next Page