Previous Page Next Page 
ఆడపడుచు పేజి 4

    ముందు ముందేం జరుగుతుంది?   
    ఏదో జరుగుతుందనే ముక్తకు అనిపిస్తోంది.   
    ఏం జరుగుతుందో కూడా ఆమెకు చూచాయగా తెలుస్తోంది.   
    ఏదో కొత్త భయమామెనావహించగా-మనసు స్థిమితం తప్పడం వల్ల ఆమె ఏపని మీదా దృష్టి మళ్ళించ లేకపోతోంది.   
    ఆమె అలాంటి స్థితిలోనే ఉండగా గౌతమ్ ఇల్లు చేరుకున్నాడు.   
    వస్తూనే అతడుత్సాహంగా భార్యను కౌగిలించుకుని ఉక్కిరి బిక్కిరి చేశాడు.   
    "ఏం జరిగిందండీ?" అంది ముక్త ఆశ్చర్యంగా.   
    "ఆఫీసులో మన హోదా పెరిగింది-"   
    "ఎలా?"   
    "మనింట్లోకి ఫోన్ వస్తోంది..."   
    "ఎందుకు?"   
    "ఎందుకేమిటి? ఆఫీసులో నాపై అధికారికే ఫోనులేదు. ముఖ్యమైన ఆఫీసు పనుల నిమిత్తం నాకు ఆఫీసు ఫోనొచ్చింది.....బాస్ ఇన్ ఫ్లుయన్స్ వల్ల బహుశా వారం రోజుల్లోనే మనకు ఫోన్ రావచ్చు..."   
    "బాస్ అంటే..."   
    "వేరే చెప్పాలా? ఈ రోజే పేరంటానిక్కూడా వెళ్ళొచ్చావు...."   
    "భానుప్రకాష్ గారా?" అంది ముక్త.   
    "అవును..."   
    ముక్త చటుక్కున- "ఈ ఫోన్ విషయం మీ కెప్పుడు తెలిసింది?"   
    "పావు తక్కువ అయిదుకి. ఆఫీసులో బాస్ అందరిముందూ ఎనౌన్స్ చేశాడు. చాలామంది అసూయపడ్డారు. చాలాకాలంగా ఈ ఫోన్ శాంక్షన్ తమకొస్తుందంటే తమ కొస్తుందని అంతా ఆశపడుతున్నారు. నా కొస్తుందని నేనుకలలో కూడా అనుకోలేదు. ఇటీజే ప్లెజంట్ సర్ప్రయిజ్...." అన్నాడు గౌతమ్.  
    "ఆయన మీకిది పావు తక్కువ అయిదుకి చెప్పారా?"   
    "అవును- ఏం?"   
    ముక్త నిట్టూర్చింది. పేరంటంలో తన్ను కలుసుకుని మాట్లాడినాకనే భాను ప్రకాష్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.   
    అతడు తనకు శక్తి చూపిస్తున్నాడు   
    "ఈ వార్త నీకు నేననుకున్నంత సంతోషం కలిగించినట్లులేదు..." అన్నాడు గౌతమ్ నిరుత్సాహంగా.   
    "ఫోన్ వస్తే మనమేం చేసుకుంటాం? దాని వల్ల మనకేం లాభం?"   
    "కంపెనీ మనకు ఫోనిచ్చిందంటే మన అంతస్థు పెరిగిందన్నమాట... మనింట్లో ఫోనుందంటే చుట్టు పక్కల మన కెంతపేరు? ముక్త! నువ్వు  పాదం పెట్టిన వేళ మంచిది. మనింట్లోకి ఫోన్ వస్తోంది. ఆ తర్వాత కారు..."   
    "కారా? అప్పుడే మన కంత డబ్బా? అంది ముక్త ఆశ్చర్యంగా.   
    "అంతా నీ విశేషం. ఏమొచ్చినా నీకారణంగానే...." అన్నాడు గౌతమ్ అభిమానంగా.   
    "నువ్వు కార్లలో తిరగ్గలవు. మేడల్లో మసలగలవు. ఫోన్లో మాట్లాడగలవు...." అన్న భానుప్రకాష్ మాటలామెకు మళ్ళీమళ్ళీ గుర్తొస్తున్నాయి.   
    "ఏమొచ్చినా నీ కారణంగానే..." అన్నాడు గౌతమ్.   
    "నువ్వునాకు నచ్చావు-" అన్నాడు భానుప్రకాష్.
    ఇవన్నీ కలిపితే...
    "ఏమిటదోలాగున్నావు?" అన్నాడు గౌతమ్.
    "బానే ఉన్నానే!"
    "లేదు. రోజులా లేవు నువ్వు..."
   ముక్త ముక్తసరిగా నవ్వింది.
    "పేరంటంలోగానీ ఎవరేనా ఏమైనా అన్నారా?"
    ముక్త తల అడ్డంగా ఊపింది.
    "అసలు నిన్నడగనే లేదు. పేరంటం విశేషాలేమిటి?"
    చెప్పాలని ముక్తకు నోటి చివరిదాకా వచ్చింది.  
    "సంస్కారం గురించి ఆలోచించే ముందు-ఈ సంభాషణను నీ భర్తకు చెప్పుకోగలవేమో ఆలోచించు. అతడి సంస్కారం గురించి తెలుస్తుంది నీకు-" అన్న భానుప్రకాష్ మాటలామె నప్పుడు హెచ్చరించాయి.  
    భానుప్రకాష్ తనతో మాట్లాడినాకనే భర్తకు ఫోన్ సదుపాయమిచ్చాడు. ఈ విషయం గౌతమ్ కు తెలిస్తే ఏమనుకుంటాడు?
    "గౌతమ్ సంస్కారాన్ని నేను శంకించకూడదు_" అనుకుంది ముక్త.
    అయితే ఆమె రిస్కు తీసుకోలేదు.
                                                                             4
    గౌతమ్ ఆఫీసుకు వెళ్ళిపోయాడు.
    అంట్లుతోమి, బట్టలుతికి పనిమనిషి వెళ్ళిపోయింది.
    నవల నొకటి తీసుకుంది ముక్త.
    పుస్తకాలంటే ఆమెకిష్టం. పుస్తకాలంటే కబుర్లంటే యింకా యిష్టం. కబుర్ల కెవరూ దొరకనప్పుడు పుస్తకాలు చదువుతుందామె.
    నవల ఆమె అభిరుచులకు తగ్గట్లుగానే ఉంది.
    ఒక స్త్రీ - ఇద్దరు ప్రేమికులు...
    ఇద్దరిలో ఒకడు దుర్మార్గుడు, ధనవంతుడు.
    రెండోవాడు మంచివాడు, పేదవాడు.
    స్త్రీ రెండోవాన్ని ప్రేమించింది. కానీ ఆ స్త్రీ తండ్రికి క్యాన్సర్. జబ్బుకు వైద్యం చేయించాలంటే డబ్బు, పలుకుబడి కావాలి.
    దుర్మార్గుడు స్త్రీకి సాయం చేస్తానన్నాడు. ఆమె తనను పెళ్ళి చేసుకోవాలని షరతు పెట్టాడు. ఆమె తనను పెళ్ళి చేసుకుంటే ఆమెకోసం తన జీవిత పథాన్ని మార్చుకుని మంచివాడినై పోతానన్నాడు. ఆమె తనను కాదంటే మరింతగా చెడిపోతాననీ-అందుకామె బాధ్యురాలవుతుందనీ బెదిరించాడు.
    ఒకపక్క జబ్బులో బాధపడుతున్న తండ్రి...
    మరొకపక్క నూరేళ్ళ పంటకై ఎదురుచూసే పేదప్రియుడు...
    ఆమె ఏం చేయాలి?
    కొంచెంగా అటూ యిటూ మార్పులతో శతాబ్దాలుగా కవులను, రచయితలను ప్రభావితం చేస్తున్న కధ యిది.
    నవలా రచయిత నేర్పుగా కధను నడిపిస్తున్నాడు.
    ముక్త నవల చదువుతూ లోకాన్ని మరిచిపోయింది.
    టెలిఫోన్ ట్రింగుమనేవరకూ ఆమె నవలాలోకంనుంచి బైటపడలేదు.  
    "హలో!" అందామె.
    "మాట్లాడేది ముక్తకదూ?" అంధవతలిగొంతు.
    "అవును-మీరెవరు?"  
    "భానుప్రకాష్..."   
    ఉలిక్కిపడింది ముక్త. నవల కలిగించిన ముక్తంతా విడిపోయిందామెకు.   
    "ఫోన్ బాగా పనిచేస్తోందా?" అన్నాడు భానుప్రకాష్.   
    "ఊ"   
    "అప్పుడప్పుడు నీతో కబుర్లు చెప్పుకుందుకు వీలుగా ఉంటుందని నేనే మీయింట్లో ఫోన్ ఏర్పాటు చేయించాను...."   
    "తెలుసు..."   
    "తెలివైన దానివి నువ్వు..."   
    "థాంక్స్..."   
    "ఒప్పుకుంటే చాలదు. నీ తెలివి చూపించాలి...."   
    "అంటే?"   
    "ఆధునిక ప్రపంచంలో భర్తల ప్రగతికి-అందమైన భార్యలే సోపానాలు..." అన్నాడు భానుప్రకాష్.   
    "ఇలాంటి మాటలు నాకు నచ్చవు...."   
    "చిన్నప్పుడు మానాన్న రోజూ చదువుకోమని నీతిబోధ చేస్తే నాకు నచ్చేది కాదు. అయినా విన్నాను. చదువొచ్చింది..."   
    "అయితే..."   
    "ప్రతి విషయంలోనూ ప్రగతి పధానికి కొన్ని మార్గాలుంటాయి. అవి మనకు నచ్చకపోయినా అనుభవజ్ఞులు చెబితే వినాలి..."   
    "ఒక వయసు దాటేక మనిషికెవరి సలహాలూ అవసరముండవు..."   
    "నిజం చెప్పావు. కానీ నీకింకా ఆ వయసు దాటలేదు..."   
    "ఇంతకీ మీరేం చెప్పదల్చుకున్నారు?"   
    "మీరు కాదు - నువ్వు..."   
    ముక్త ఫోన్ పెట్టేయాలనుకుంది కానీ అది సరికాదనిపించి- "అంత సులభంగా నేనందర్నీ నువ్వనలేను...." అంది.   
    "సులభ పద్దతి నేను చెబుతానుగా...."   
    "వద్దు...." అంది ముక్త.   
    "ముక్తా! ఒకరికొకరెదురైనప్పుడెన్నో మాట్లాడుకోవాలనిపిస్తుంది. మొహమాతం అడ్డొస్తుంది. అలాంటప్పుడుత్తరాలు పనికొస్తాయి. మనిషికి నోటితో చెప్పలేనివి ఉత్తరాల్లో అక్షరాల రూపంలో చెప్పుకోవచ్చు. కానీ అందరికీ ఉత్తరాలు రాయడం రాదు. పెదవి పలికించే అక్షరాన్ని కాగితం మీదకు తరలించడం ప్రత్యేక మైన కళ. ఆ కళలో ప్రావీణ్యంలేక ఎందరో స్నేహితులయి ఎదుటపడి మాట్లాడుకోలేక, అటు ఉత్తరాలు రాసుకోలేక - ఒకరికొకరు క్రమంగా దూరమైపోయారు. మన కలాంటి దుర్గతి లేదు. మనముత్తరాలు రాసుకోనవసరం లేదు. మాట్లాడుకునేటప్పుడు ఒకరికొకరెదురు పడనవసరమూ లేదు. ఫోనుంది. నిస్సంకోచంగా, చనువుగా మాట్లాడుకుందాం..."   
    "మాట్లాడుకోవడానికేముంది?" అంది ముక్త.
       "నువ్వు నా అందాన్ని పొగుడు. వింటాను..."   
    "నావల్లకాదు..."   
    "పోనీ- నీ అందాన్ని నేను పొగుడుతాను. విను..."   
    "వాటీజ్ దిస్ మిస్టర్ భానుప్రకాష్...." అంది ముక్త.   
    "దిసీజ్ ఫర్ మై ఇన్ స్పిరేషన్..."   
    "మీ ఇన్ స్పిరేషన్ తో  నాకేంపని?"   
    "నా ఇన్ స్పిరేషన్ వల్ల లాభమంతా నీకే! ఇన్ స్పిరేషన్ తో నేను కంపెనీ గురించి పాటుబడలేదు. కంపెనీ వృద్దిపొందుతుంది. కంపెనీతోపాటే నీ భర్త కూడా!"   
    ముక్త మాట్లాడలేదు.   
    "ఫోన్ పెట్టేయకు. నేనింకా మాట్లాడుతున్నాను..."   
    ముక్త వింటోంది. అతడామె అందాన్ని పొగుడుతున్నాడు.   
    పేరంటంలో ఆమె ఎలా తనకు కనబడిందో వర్ణిస్తున్నాడు.   
    ఆ వర్ణనలో అసభ్యత లేదు. కవిత్వముంది.   
    ఆ పొగడ్తలామెకు సంతోషం కలిగించలేదు.   
    "ఎలా ఉన్నాయి నా మాటలు?" అన్నాడు భానుప్రకాష్ చివర్లో.   
    "అంటే?"   
    "నీ అందానికి న్యాయం చేకూర్చానా?"   
    "నాకు పెళ్ళి కాగానే నా అందానికి న్యాయం జరిగింది. వేరెవ్వరూ నా అందానికి న్యాయం చేకూర్చనవసరం లేదు..."   
    "ముక్తా! భర్త వేరు, స్నేహితుడు వేరు. ఈ తేడా తెలుసుకునే సంస్కారం నువ్వు పెంచుకోవాలి. ప్రస్తుతానికి సెలవు..."   
    అవతల ఫోన్లో క్లిక్ మన్న చప్పుడు వినిపించింది.   
    ముక్త తనూ ఫోన్ పెట్టేసింది.   
                                                5   
    వారంరోజుల్లో ముక్తకు భానుప్రకాష్ నుంచి నాలుగుసార్లు ఫోన్ వచ్చింది.   
    అతడి మాటల్లో సభ్యత లోపించడంలేదు. కానీ అతడి ఊహలు మాటల్లో స్పురిస్తున్నాయి. ముక్తకు చాలా యిబ్బందిగా ఉంటోంది.   
    స్నేహం పేరిట అతడు చనువు పెంచుకుంటున్నాడు.   
    ఆఫీసులో గౌతమ్ కు ప్రత్యేకమైన గౌరవం లభిస్తోంది.   
    "అందమైన భార్యలు - భర్తల ప్రగతికి సోపానాలు...."   
    ఇదీ భానుప్రకాష్ అభిప్రాయం.   
    అతడు తననుంచి ఏమాశిస్తున్నాడు?   
    ఈ విషయంలో భానుప్రకాష్ ముందడుగు వేయకుండా ఎలా ఆపాలి?   
    అప్పుడామెకు సంధ్య గుర్తుకొచ్చింది.   
    సంధ్య తననెంతో ఆప్యాయంగా ఆదరించింది. ఆమెకు భర్త గురించిన నిజం తెలుసా? తెలియక పోతే తను చెబితే....?   
    ముక్త సంధ్యను ఫోన్లో పలకరించింది.   
    "ఫోన్లో ఏం మాట్లాడు కుంటాం? కాసేపు మా యింటికి రాకూడదూ?" అంది సంధ్య.   
    ముక్త సరే ననాలనుకుంది. కానీ...   
    పేరంటం జరుగుతున్నప్పుడే భానుప్రకాష్ వచ్చేసి తనతో తను కోరిన విధంగా మాట్లాడగలిగాడు. ఇప్పుడు మళ్ళీ యింటికి వస్తే....   
    "నేను మీ యింటి కొచ్చాను. మీరే ఓ సారి మా యింటికి రావాలి...
    "మీరు కాదు - నువ్వు..." అంది సంధ్య.
    చటుక్కున ముక్తకు భానుప్రకాష్ మాటలు గుర్తు కొచ్చాయి.
    "అంత సులువుగా కొత్త వారిని నేను నువ్వన లేను..."
    "కానీ మావారి మాట నాకు శిలాశాసనం...."

 Previous Page Next Page