"మీ వారి గురించే మాట్లాడాలి. మా యింటికి రండి..."
"ముక్త! అక్కా చెల్లెళ్ళలా మసలమని నీ గురించి వారు నాకు చెప్పారు. నువ్వు నన్ను నువ్వనకపోతే- ఏ చనువుతో - ఏ పేరంటమూ లేకుండా మీ యింటికి రాను..." అంది సంధ్య.
"అక్కా! అర్జంటుగా నీతో మాట్లాడాలి. మా యింటికిరా -" అంది ముక్త లా మాట్లాడినందుకామె అదోలాగుంది.
కాసేపట్లో కారామె యింటి ముందాగింది.
డ్రైవర్నో గంట పోయాక రమ్మని పంపేసింది సంధ్య.
ముక్త ఆమెను సాదరంగా ఆహ్వానించింది. సంధ్య ఇల్లంతా చూసి- ఎంత బాగా సర్దుకున్నారని మెచ్చుకుంది.
"మీ యింటితో పోలిస్తే-ఇదేముంది?" అంది ముక్త.
"మా యింట్లో ఉన్నది వైభవం. మీ యింట్లోది అభిరుచి...." అంది సంధ్య.
"వైభవంలో అభిరుచి ఉండదా?"
"ఉండొచ్చు. కానీ అభిరుచికి వైభవం అవసరం లేదు...."
"నువ్వు చాలా బాగా మాట్లాడగలవు..."
"అంతా మావారిదగ్గర నేర్చుకున్నాను...."
ముక్త వెంటనే-"నీకు మీవారంటే ఆరాధన-కదూ?" అంది.
"ఏ భార్యకు భర్తంటే ఆరాధన ఉండదు?" అంది సంధ్య.
ముక్త మాట్లాడలేదు.
"మా వారికి అందముంది, పర్సనాలిటీ ఉంది, సంభాషణా చాతురి ఉంది, హోదా ఉంది, డబ్బుంది. అటువంటి వారినారాధించకపోతే ఆ భార్యలోనే ఏదో లోపముండాలి...." అంది సంధ్య.
"కానీ మెరిసేదంతా బంగారం కాకపోవచ్చు...." అంది ముక్త.
"అంటే?"
"మీవారి గురించి నేను చెడ్డగా విన్నాను...."
సంధ్యముఖం ఎర్రబడింది- "చెడ్డగా అంటే?"
"వారి ప్రవర్తన మంచిదికాదుట..."
"వ్యాపారంలో సీదాసాదాగా పైకొచ్చేవారుండరు..."
"ప్రవర్తన అంటే వ్యాపారానికి సంబంధించిందికాదు...ఆయన వ్యక్తిత్వానికి సంబంధించింది...."
"చెప్పు...." అంది సంధ్య.
"ఆయన ఆడపిల్లల్ని వలలో వేసుకుందుకు ప్రయత్నిస్తారుట...."
సంధ్య నవ్వి - "ఆడపిల్లల వలలో ఆయన పడకుండా ఉండాలని నాకోరిక. వలలో వేసుకుందామన్నా ఆయనకా అవకాశ మేదీ?" అంది.
"అంటే?"
"ఆయన వల వేద్దామానుకునేలోగానే వాళ్ళాయనపై వల విసురుతున్నారు. ఆయన పొజిషన్ అలాంటిది..."
"తనకీ- ఆయన పొజిషన్ కీ సంబంధమేమిటి?"
"కంపెనీ ఆయనవల్ల బాగా వృద్దిలోకొచ్చింది. ఇతర కంపెనీలాయన్నులాగాలని చూస్తున్నాయి. కొందరికాయన పతనమైతే చాలు. మరి కొందరికైతే ఆయన్ను తమవైపు ఆకర్షించుకోవాలనుంది...." అని -"అందుకోసం ఆయనపై ఆడపిల్లలను ప్రయోగిస్తారు. అర్ధమయిందా?" అంది ముక్త.
"ఏం విన్నావో చెప్పు..."
"ఆయనే ఆడపిల్లలవెంట పడతారనీ... అవతల యువతి వివాహితా కాడా అన్న విచక్షణకూడా చూడరనీ...."
సంధ్య నవ్వి- "ఎవరు చెప్పారు?" అంది.
ముక్త తడబడింది.
సంధ్య తనే మళ్ళీ- "వారుగానీ నీతో మాట్లాడేరా?" అంది.
"లేదు-" అంది ముక్త వెంటనే.
"ఒకవేళ వారు నీతో చనువుగా మాట్లాడినా తప్పుగా అర్ధం చేసుకోకు"
"ఎందుకని?"
"ఒక వయసులో మగాడికి ఆడది- ఆడదానికి మగాడు గొప్ప ఆకర్షణ! ఆ ఆకర్షణలోంచి బైటపడి తప్పించుకోవడం ఎక్కడో మహాత్ములకు తప్ప సాధ్యపడదు. మావారికి తన ప్రవర్తన గురించి పట్టుదల ఉంది. వారిపై నాకు నమ్మకముంది. కానీ ఒకోసారి తన మనసు చలిస్తుందేమోనని వారిభయం. పరాయి స్త్రీలతో చనువుగా ఉండడంద్వారా- అనుకోకుండా ఎదురయ్యే ఆకర్షణలనుంచి తప్పించుకోవడానికి వీలవుతుందని ఆయన అనుకుంటారు..."
"అదెలా సాధ్యం?"
"నిగ్రహానికికూడా ప్రాక్టీసుండాలికదా! భార్యముందు చేసే ప్రాక్టీసు ప్రాక్టీసు కాదు. అలవాటుపడ్డ మనిషి కాబట్టి..." అంది సంధ్య- "అందుకని మావారు కొత్త వారితో చనువుగా ఉంటూంటారు. ఒకసారేమయిందో తెలుసా? వారూ-మరదలూ ఒక రాత్రంతా ఒకేగదిలో పడుకున్నారు. నేను తనను గమనిస్తున్నట్లుకూడా వారికి తెలియదు. ఇద్దరూ శుభ్రంగా వళ్ళెరక్కుండా పడుకున్నారు. వాళ్ళను కాపలా కాసి కాసి నాకే నిద్రలేదు...."
"నువ్వు చెబుతున్నది నాకు చాలా చిత్రంగా ఉంది-" అంది ముక్త.
"వారంటే నాకు ఆరాధన! వారిపట్ల నాకు పూర్తి నమ్మకం. వారి ప్రవర్తన సరైనది కాదనడానికి కళ్ళారా చూడగల ఋజువు లభిస్తే నా కళ్ళే నన్ను మోసం చేస్తున్నాయనుకుంటాను తప్ప వారి ననుమానించను_" అంది సంధ్య.
"నీ నమ్మకం నీ భర్తను పాడు చేయడమే కాదు. ఎందరో పతివ్రతలను పతితల్ని చేస్తుంది-" అద్న్హి ముక్త.
"పతివ్రతలు పతితలు కాలేరు-" అంది సంధ్య.
"ఎందుకు కాలేరు?"
"తమను తాము రక్షించుకొనేందుకు పతివ్రతలు భర్తలపై ఆధారపడరు. తాము పూర్తిగా అసహాయులైనపుడు దేవుడే వారిని రక్షిస్తాడు..."
"అలా రక్షించక పోతే?"
"వారు పతివ్రతలు కారని అర్ధం..."
"నీ భర్త సరైన వాడు కాదనడానికి నాకు కొన్ని ఋజువులు లభించాయి. కాస్త ముందడుగు వేస్తే విషయం నీ ముందుకూడా ఋజువు చేయగలను..."
"ఏమిటి నీ ఋజువులు?"
"ఇప్పుడు చెప్పను..."
"ఎప్పుడు చెబుతావు?"
"అదీ నాకు తెలియదు. నేను రిస్కు తీసుకోవాలి. నాకు దేవుడి మీద నమ్మకం లేదు..." అంది ముక్త.
"దేవుణ్ని నమ్ము. తన భక్తుల కాయనెప్పుడూ అన్యాయం చేయడు...."
"తప్పు చేసిన వాళ్ళే దేవుణ్ని నమ్ముతారని మా నాన్నగారంటారు...."
సంధ్య ముఖం పాలిపోయింది"-నేను తప్పు చేశానంటావా?"
"నీభర్తనంతలా నమ్మడం నువ్వు చేస్తున్న తప్పు. అందువల్ల అతడు బరితెగించి ప్రవర్తించే అవకాశముంది..."
"నువ్వు మా వారినెందుకు పట్టించావు?" అంది సంధ్య.
"ఆలోచిస్తే నీకూ మీ వారి గురించి అర్ధమవుతుంది. అతడు నిన్ను వెర్రిబాగులదాన్ని చేసి ఆడిస్తున్నాడు. లేని పక్షంలో తను ప్రత్యేకించి ఆడవాళ్ళతో చనువుగా మాట్లాడడమెందుకు? మరదలితో ఒక్కడు వేరేగదిలోపడుకోవడమెందుకు?"
సంధ్య ఏదో చెప్పబోయి ఆగిపోయింది. కాసేపుండి నెమ్మదిగా -"నీకు మావారి మీద దురభిప్రాయం కలిగింది. ఎందుకో చెబితే పోగొట్టగలను...." అంది.
"మీవారి మీద ఆడ పిల్లలు వలలు విసురుతున్నారన్నదబద్దం. అతడే ఓ ఆడపిల్ల మీద వల విసురుతున్నాడిపుడు...."
"ఎవరామె?"
"ఎవరైనా ఆమె పతివ్రత!"
"ఎవరా పతివ్రత?" అంది సంధ్య.
"ఎవరైనా ఈపరిస్థితినుంచెలా బైటపడాలా అని ఆమె భయపడుతోంది. ఆమెకు భర్తే ప్రాణం. భర్తే లోకం భర్తే దైవం. కానీ ఆ భర్తనే రూపు రేఖలు లేకుండా నాశనం చేయగలడు నీ భర్త. అందుకే ఆమె భయపడుతోంది....'
"ఇందుకు రుజువుందా?"
"ఋజువు నీకు చూపిస్తాను. నమ్ముతావా?"
"నువ్వు చూపిస్తే నమ్ముతాను..." అంది సంధ్య.
"చూపాలనే ఉంది. కానీ నేను భయపడుతున్నాను. ఋజువు చూపడానికి కొంత రిస్కుతీసుకోవాలి. అప్పుడు దేవుడు రక్షించకపోతే?"
"మావారు నిజంగానే ఓ ఆడ పిల్లపై వల విసిరితే, ఆమె పతివ్రతే అయితే నీకేమీ భయం అవసరం లేదు. రక్షించడానికి నేనున్నాను. నేనే దేవుణ్ణనుకో...నన్ను నమ్ము...." అంది సంధ్య గంభీరంగా.
"అక్కా!" అంది ముక్త అప్రయత్నంగా.
"మా వారే మనిద్దరికీ ఈ వరస కలిపారు. అందువల్ల అక్కగా నాకు నీ బాధ్యత ఉంది నీ సమస్యేమిటో నిర్మొహమాటంగా చెప్పు. నేను చేయగలిగింది చేస్తాను...." అంది సంధ్య.
"ప్రస్తుతానికి నువ్వేమి చేయనవసరం లేదు. మీ వారినో కంట కనిపెడుతూండు_" అంది ముక్త.
6
"నువ్వింట్లో అడుగు పెట్టిన వేళావిశేషం మంచిది. ఆఫీసులో నాకు మంచి ఫ్యూచర్ కనబడుతోంది-" అన్నాడొకరోజున గౌతమ్ భార్యతో.
"ఫ్యూచర్ ఎలా కనబడుతుందండీ?" అంది ముక్త.
"బాస్ నన్ను విపరీతంగా అభిమానిస్త్జున్నాడు. కొన్నాళ్ళపాటు నిన్ను గమనిస్తూంటాను. నాకు నచ్చితే నా తర్వాత నా అంతటివాణ్ణి చేస్తానని ఆయన నాతో అన్నాడు..." సంతోషంగా అన్నాడు గౌతమ్.
భర్త ముఖంలోని సంతోషం ముక్తను భయపెట్టింది.
"ఒకవేళ మీ బాస్ కు మీరు నచ్చకపోతే?" అందామె.
"ఎందుకు నచ్చను?"
"ఎందుకంటే ఏం చెప్పగలం? దురదృష్టమనుకోండి..."
"నువ్వుండగా దురదృష్టం నావంక కన్నెత్తికూడా చూడలేదు...."
ముక్త ఉలిక్కిపడి భర్తవంక పరీక్షగా చూసింది. అతడి ముఖంలో ఆమెకు భానుప్రకాష్ కనిపించాడు.
"అందమైన భార్యలు ప్రగతికి సోపానాలు..." అంటున్నాడతడు
"ఏమన్నారూ?" అందామె.
"నువ్వు నా అదృష్టానివంటున్నాను..."
"అదృష్టమంటే ఎలాంటి అదృష్టాన్ని?"
"చెప్పడం నాకు చేతకాదు..."
"మీలో సమర్ధత ఉంది. అందుకే మీ బాస్ మిమ్మల్నభిమానిస్తున్నారు. బాస్ కు మీ అవసరముంది. మీరు లేకుండా ఆయన కంపెనీ నడవదు. అలాంటప్పుడొకసారి అసూయకూడా బయల్దేరుతుంది. మీ బాస్ మిమ్మల్నుద్యోగంనుంచి తొలగించవచ్చు. అప్పుడు మీకు మరో కంపెనీ స్వాగతం పలుకుతుంది..." అంది ముక్త.
"ప్లీజ్ ముక్తా! నువ్వలా మాట్లాడవద్దు-" అన్నాడు గౌతమ్.
"ఎందుకని?"
"ఉద్యోగం విషయంలో నేను నువ్వనుకున్నంత గొప్పవాణ్ణి కాను. మా నాన్న గారి రికమెండేషన్ మీద వచ్చిందీ ఉద్యోగం నాకు. ఇదిపోతే ఎక్కడకు వెళ్ళినా ఈ ఉద్యోగమెందుకు పోయిందో సంజాయిషీ యిచ్చుకోవాలి. మా బాస్ బాగా పలుకుబడి ఉన్నవాడు పగబట్టాడంటే ఈ చుట్టుపక్కలెక్కడా నాకు మంచినీళ్ళుకూడా పుట్టవు"
భర్త కళ్ళలోని భయాన్ని స్పష్టంగా చదివింది ముక్త.
"అంటే మీరు పూర్తిగా మీ బాస్ పై ఆధార పడిపోయారు భవిష్యత్తుకోసం-" అంది ముక్త.
"అసలా ఆధారం దొరకడమే ఓ అదృష్టం. దొరికిన ఆధారాన్నీ వదులుకోలేను..." అన్నాడు గౌతమ్.
"చాలా బాగుంది. ఇలాగైతే మీరు బాస్ కి పూర్తిగా లోకువైపోతారు అతడొకరోజున మీనుంచి ఎలాంటి ప్రతిఫలాన్నైనా కోరవచ్చు..."
"ఆయన నానుంచి ప్రతిఫలమెందుకు కోరతాడు? కోరినా నేనాయనకివ్వగలిగిన దేముంది?" అన్నాడు గౌతమ్.
ముక్త మాట్లాడలేదు.
"మంచి మూడ్ పాడుచేసేశావు ముక్తా!" అన్నాడు గౌతమ్.
"నా మూడ్ కూడా పాడయింది. తనభర్త అందరికంటే అధికుడిగా ఉండాలని ఏ భార్యయినా కోరుకుంటుంది. మీరు బాస్ కి బానిసలని తెలిస్తే నాకెంతో బాధగా ఉంది-" అంది ముక్త.
"బాస్ కి బానిస కావడంలో వింతేముంది? అది మన దేశ సాంప్రదాయం?" అన్నాడు గౌతమ్.
"మీ బలహీనతను మన సంప్రదాయానికంటగట్టకండి-"
"నీకు ప్రపంచం తెలియక అలాగంటున్నావు..." అన్నాడు గౌతమ్.
హైస్కూల్లో హెడ్మాస్టరుకి మిగతా టీచర్సు బానిసలు. వ్యక్తిత్వముండి ఎదిరించినవాడు మన్య ప్రాంతాలకు ట్రాన్స్ ఫరవుతాడు. యూనివర్శిటీలో ప్రొఫెసరుకి మిగతా స్టాఫంతా బానిసలు. వ్యక్తిత్వం చూపాలనుకుంటే చాలు- భవిష్యత్తును కోల్పోతాడు. ఇది విద్యారంగం.
లేబరేటరీల్లో డైరెక్టరుకి సైంటిస్టులు బానిసలు. స్వతంత్ర భావాలున్నవాడు నోబెల్ ఫ్రైజుకొట్టే విశేషం కనిపెట్టినా అది లాబొరేటరీ గోడలు దాటి బయటకురాదు. అది వైజ్ఞానిక రంగం