Previous Page Next Page 
ఎ.కె.47 పేజి 4


    "నో....!" అతని చూపులు తీక్షణంగా మారాయి.

    "సారీ...." సునంద వెంటనే చేతిని వెనక్కు తీసుకుంది.

    అతను బొమ్మల భారతాన్ని, ఆ యువతి భగవద్గీతను ఆ సమయంలో ఎందుకు అంత ఏకాగ్రతతో చదువుతున్నారో మొదట అర్ధంకాలేదు. నిజానికి, పురాణాలను, గీతను చదువుకునే వయసు కాదు వాళ్ళది!

    కాని, సూక్ష్మంగా ఆలోచిస్తే వాళ్ళ అభ్యసన అర్ధమవుతుంది. ఇద్దరూ అన్నింటికీ అతీతంగా వుండడానికే వాటిని సాధన చేస్తున్నారేమోనని అనిపిస్తుంది.

    రాబోయే ఉపద్రవం గురించి ముందుగా ఊహించుకుని ఖంగారు పడుతున్న మిగిలిన ప్రయాణీకులకు ఆ జంటకు తేడా అక్కడే వున్నది!

    సూపర్ ఫాస్ట్ రైలు గూడూరు జంక్షన్ దాటిపోయింది.

    ప్రయాణీకులు కొందరు ఖంగారుగా చెయిన్ లాగడానికి ప్రయత్నించారు.

    వాళ్ళ చేతులు చెయిన్ మీదకు వెళ్ళగానే, శరీరంలో ఏదో విద్యుత్ ప్రవహిస్తున్నట్టు అచేతనులయ్యారు.

    'ఈ సూపర్ ఫాస్ట్ లో వి.వి.ఐ.సి. ప్రయాణం చేస్తున్నాడు. ట్రెయిన్ ను మేమే సాబటైజ్ చేశాం. అతి తెలివిగా ఎవరైన చెయిన్ లాగారో ట్రెయిన్ బ్లాస్ట్ అవుతుంది. వేగం వంద కిలోమీటర్లకు తగ్గిందో_ట్రెయిన్ కింద అమర్చిన బాంబులు బ్లాస్ట్ అవుతాయి. జాగ్రత్త! ట్రెయిన్ ను మేము ఆపేవరకు ఎవ్వరూ ఏ ప్రయత్నం చేయకుండా బుద్దిగా కూర్చోండి.' ప్రయాణీకులకు బిచ్చగాడు ఇచ్చిన కరపత్రంలోని హెచ్చరిక గుర్తుకు రావడంతో ఆపసోపాలెత్తుతున్నారు.

    సూపర్ ఫాస్ట్ రైలు ఎవ్వరితోను రాజీపడనట్టు గంటకు వందకిలోమీటర్ల వేగంతో దూసుకుపోతూనే వుంది.....


                           *    *    *


   
    స్టేట్ గెస్ట్ హౌస్.

    ప్రోటోకాల్ ప్రకారం వి.వి.ఐ.పి.కాన్వాయ్ ని ఆర్డర్ లో పెట్టించాడు పైలట్ ఆఫీసరు రవితేజ.

    సరిగ్గా కాన్వాయ్ బయలుదేరుతుండగా రెండు కార్లు వచ్చి ఆ కాన్వాయ్ లో కలిసిపోయాయి_ఒకటి ఎడ్వాన్స్ పైలట్ గా, మరొకటి వి.వి.ఐ.పి.స్పేర్ కారుగా.

    ఎడ్వాన్స్ పైలట్ గా వున్న ఇన్ స్పెక్టర్ గోపాల్ వైర్_లెస్ సెట్లో రవితేజకు జరిగిన మార్పును తెలియజేశాడు.

    రవితేజ తన కారును ఎడ్వాన్స్ గా ముందుకు పోనిచ్చాడు. ఇప్పుడు పైలట్ గా గోపాల్ కారు వుంది దాని వెనుకే వి.వి.ఐ.పి.కారు. దాన్ని వెన్నంటి స్పేర్ కారు వున్నాయి.

    కాన్వాయ్ మద్రాసు సిటీ దాటింది.

    పైలట్ కారు పోతున్న వేగాన్ని అందుకోవడానికి వి.వి.ఐ.పి.కారు డ్రయివరు యాక్సిలేటరును మట్టానికి తొక్కాడు. అది పెట్రోల్ కారు కావడంతో ఇట్టే స్పీడందుకుంది. 

    వెనుకనే వస్తున్న స్పేర్ కారు కూడా అదే వేగంతో వి.వి.ఐ.పి.కారును వెంబడించసాగింది.

    మిగిలిన కాన్వాయ్ వెనకబడిపోయింది.

    పైలట్ ఆఫీసరు గోపాల్ రూట్ మార్చాడు.

    ట్రాఫిక్ రూల్స్ కు వ్యతిరేకంగా కాన్వాయ్ ఒన్_వేలో వెళుతున్నది.

    ట్రాఫిక్ పోలీసులు తెల్లబోయినట్టు గుడ్లప్పగించి చూస్తున్నారు.

    వి.వి.ఐ.పి.కారులో ముందు సీటులో కూర్చున్న సెక్యూరిటీ ఆఫీసరు మహేంద్ర రివాల్వర్ బయటకు తీసాడు.

    సరిగ్గా అదే సమయంలో పైలట్ కారు రోడ్డుకు మధ్యగా సడన్ బ్రేకు వేయడంతో "కీచు" మని శబ్దం చేస్తూ ఆగింది. దానివెనుకనే వున్న వి.వి.ఐ.పి.కారు డ్రయివరు ప్రమాదాన్ని గమనించి సడన్ బ్రేక్ వేశాడు.

    అప్పటికే వి.వి.ఐ.పి.కారు స్కిడ్ అయి పైలట్ కారు వెనుక భాగాన్ని గుద్దింది.

    వి.వి.ఐ.పి.కారు విండ్ స్క్రీన్ పగిలి గాజుముక్కలు చెల్లాచెదురయ్యాయి.

    వి.వి.ఐ.పి. వెనుకనే వున్న స్పేర్ కారు డోర్స్ తెరచుకుని దిగిన సాయుధులు వి.వి.ఐ.పి.కారును ముట్టడించారు.

    ఈ హఠాత్ పరిణామాన్ని ఊహించని సెక్యూరిటీ ఆఫీసరు మహేంద్ర ఖంగుతిన్నాడు.

    తన చేతిలోనుంచి జారి క్రిందపడిన రివాల్వరును అందుకునే ప్రయత్నంలో మహేంద్ర వున్నప్పుడే సాయుధులు అతడిని పెడరెక్కలు విరచి తాళ్ళతో బంధించారు.

    సాయుధులు వెనువెంటనే వి.వి.ఐ.పి.ని, సెక్యూరిటీ ఆఫీసరు మహేంద్రను స్పేర్ కారులోకి ఎక్కించారు.

    అప్పటి వరకు తమ చెరలో వున్న ఇన్ స్పెక్టర్ గోపాల్ కూతురు శాలినిని కిందకు తోసివేశారు.

    ఇన్ స్పెక్టర్ గోపాల్ చూస్తుండగానే ఆ కిడ్నాప్ యదేఛ్చగా జరిగిపోయింది.


                          *    *    *    


   
    మీనంబాక్కం విమానాశ్రయం.

    వాయుదూత్ టేకాఫ్ తీసుకుంది.

    మరికొద్ది నిమిషాల్లోనే అది గగనతలంలో విహంగంలా ఎగిరిపోయింది.
 

 Previous Page Next Page