Previous Page Next Page 
ఎ.కె.47 పేజి 5


    వాయుదూత్ తమిళనాడు దాటి ఆంధ్రప్రదేశ్ గగనతలంలోకి ప్రవేశించింది.

    రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో సిగ్నల్స్ ఇచ్చారు.

    ఇక, నిమిషాలలో అది లాండ్ కావాలి.

    వి.వి.ఐ.పి.ని చూడడానికి వచ్చిన మంత్రులు, ఎం.ఎల్.ఏలు, జిల్లా పరిషత్తు చెయిర్మన్, కలక్టరు, కమిషనర్లు, మిగిలిన డిపార్ట్ మెంట్స్ హెడ్స్, పార్టీ కార్యకర్తలతో విమానాశ్రయం నిండివుంది.

    వాయుదూత్ శబ్ద తరంగాలు రానురాను ఎక్కువగా వినిపించవలసిందిపోయి, దూరమయిపోతున్నాయి.

    నిమిషాలు గడచిపోయాయి.

    అప్పటికే వాయుదూత్ రేణిగుంట ఎయిర్ బేస్ ను వాయువేగంతో దాటిపోయింది.

    అంతా ఖిన్నులయ్యారు.

    వాయుదూత్ లోపల....

    పైలట్ ఇద్దరికి సాయుధు లిద్దరు రైఫిల్స్ ను గురిపెట్టారు.

    వారి సూచన ప్రకారం వాయుదూత్ ప్రస్తుతం విశాఖపట్నం వైపుకు పయనిస్తున్నది.

    "ప్లేన్ హై జాకింగ్, ప్లేన్ హై జాకింగ్" ప్రయాణీకులలో కలవరం పుట్టింది.

    "ఎవరు చేస్తున్నారు?" ప్రశ్న.

    "ఎందుకు చేస్తున్నట్టు?" మరో ప్రశ్న.

    జవాబు లేని ప్రశ్నలతో ప్రయాణీకులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సతమత మౌతున్నారు.

    వి.వి.ఐ.పికి సెక్యూరిటీ ఆఫీసరుగా వున్న విక్రమ్ చేయి రివాల్వర్ మీదకు వెళ్ళింది.

    అప్పటికే ఆలశ్యం అయిపోయింది.

    సాయుధు డొకడు తన చేతిలో వున్న రివాల్వర్ ను అతని నుదిటికి గురిపెట్టి, రెండవ చేతిలో అతని చేతిలోని రివాల్వరును లాగివేశాడు.

    విక్రమ్ మరొక ప్రయత్నంగా సీట్లోంచి లేవబోయాడు.

    "నో....డోంట్ మూవ్! ఎవ్వరైనా సరే మమ్మల్ని ప్రతిఘటిస్తే కాల్చిపారేస్తాము!" మరొక సాయుధుడు హెచ్చరించాడు.

    ఇక తను చేసేది ఏమీ లేనట్టు నిస్సహాయంగా తన సీటులో చతికిలపడిపోయాడు విక్రమ్.

    కాలం యధావిధిగా దొర్లి పోతున్నది. కాలం గడుస్తున్న కొలదీ విమానంలోని ప్రయాణీకులు ఎదుర్కోవలసిన రిస్క్ పెరిగిపోతున్నది.

    నాన్_స్టాప్ గా వాయుదూత్ ఆకాశంలో ఎగరడం వలన ఫ్యూయల్ అయిపోవచ్చు. ఈలోగా సాంకేతిక లోపాలేమైనా కలిగితే ఇంజన్ ఫెయిల్ కావొచ్చు.

    ప్రభుత్వానికి హైజాకర్లకు ఒక అంగీకారం కుదిరే వరకు వాయుదూత్ ఎక్కడా లాండ్ అయ్యే అవకాశం లేదు.

    జరగబోయే పరిణామాలు ఊహించడానికే భయంగా వున్నాయి.

    ప్రయాణీకులంతా మృత్యుముఖానికి చేరువలో వున్నారు. వాళ్ళ గొంతులు తడారిపోతున్నాయి.

    వాళ్ళ అవస్థను గమనించిన ఒక హైజాకర్ మైక్ లో అనౌన్స్ చేశాడు. "ప్రయాణీకుల్లారా! మీరంతా కంపర్ట్ బుల్ గా ఫీలవ్వండి. మీకేమీ ప్రమాదం లేదు. మాకు కావలసింది వి.వి.ఐ.పి.మాత్రమే! మీకు కావలసినవి ఎయిర్ హోస్టెస్ సర్వ్ చేస్తుంది...." అంటూ కళ్ళతో ఆమెకు సైగచేశాడు.

    ఎయిర్ హోస్టెస్ చకచకా ప్రయాణీకులందరికి కూల్ డ్రింక్స్ సర్వ్ చేసింది.

    ఆమె సెక్యురిటీ ఆఫీసరు విక్రమ్ కు కూల్ డ్రింక్ ఆఫర్ చేస్తున్న సమయంలోనే, అతనొక ప్యాకెట్ తెరిచి కూల్ డ్రింక్స్ లో ఏదో పౌడరు కలిపాడు. ఎయిర్ హోస్టెస్ కు క్రీగంట సైగ చేశాడు.

    ఆమె తన కర్తవ్యాన్ని గుర్తించి, ఆ  కూల్ డ్రింక్స్ ను హైజాకర్లకు అందించింది.

    "థాంక్స్" ఫార్మల్ గా అని వాళ్ళు కూల్ డ్రింక్స్ అందుకున్నారు.

    క్షణం గడిచిన తరువాత ఆ డ్రింక్స్ ను పైలెట్స్ ఇద్దరికి అందించారు తాగమన్నట్టు హైజాకర్లు.

    ఎయిర్ హోస్టెస్ తో పాటు విక్రమ్ ముఖాన కత్తివేటుకు నెత్తురు చుక్క లేనట్టయింది.

    ప్లేన్ యథావిధిగా ఉపరితలంలో ఎగురుతూనే వుంది.


                           *    *    *


    వి.వి.ఐ.పి ల భద్రత విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సెక్యూరిటీ, ఇంటిలిజెన్స్ విభాగాలు అప్పుడప్పుడు తమ విద్యుక్తధర్మాన్ని నిర్వర్తించడంలో విఫలమవుతూనే వుంటాయి.

    పాశ్చాత్య దేశాలలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందినా, పోలీస్ కమ్యూనికేషన్స్ ఆధునీకరణ చేసినా, వాళ్ళు కూడ వి.వి.ఐ.పి. ల సెక్యూరిటీ ఘోరంగా విఫలమైనట్టు చరిత్రలో అనేక అనుభవాలు వుండనే వున్నాయి.

    అలా అని ఏ ప్రభుత్వం వి.వి.ఐ.పి. ల భద్రత విషయంలో ఉదాసీనంగా వ్యవహరించదు. అదీ ఎంత కష్టసాధ్యమైనా, ఖర్చుతో కూడినదైనా రాజీపడదు. సెక్యూరిటీ మరింత పటిష్టం చేయడానికి, అత్యంత ఆధునీకరణతో పాటు మార్పులు, చేర్పులు చేయడానికి ఏ ప్రభుత్వం వెనుకాడదు.                               

 Previous Page Next Page