Previous Page Next Page 
ఎ.కె.47 పేజి 3

 
   మహాహుషారుగా జీవితాన్ని అనుభవించవలసిన ఆ యువకుడు మట్టిపాలై పోవడానికి కారణం ఎవరు?

    గాఢ నిద్రలో స్వప్నాల తెప్పలపై తేలియాడుతున్న యువతను తట్టి లేపే ప్రయత్నం అవసరం.

    ఈత రాకముందే చెరువులో దూకి ఊబిలో చిక్కుకుని ప్రాణాలను తీసుకుంటున్న నవతరాన్ని హెచ్చరించడం అవసరం.

    చిల్లు పడవ నెక్కి సముద్రయానం చేస్తూ, ఆవలి తీరాన్ని చేర గలమని, సమాజాన్ని చేర్చగలమని భ్రమిస్తున్న యువతరానికి యథార్ధాన్ని చూపించే ప్రయత్నం ముఖ్యం.

    ఆ యత్నమే ఈ నవల __"ఎ. కె. 47"



                            *    *    *   


    మద్రాసు సెంట్రల్ స్టేషన్.

    సూపర్ ఫాస్ట్ రైలు కదులుతోంది.

    ఆఖరి క్షణంలో ఓ యువ జంట శక్తినంతా కూడగట్టుకుని పరుగు పరుగున వచ్చి  ఆ ట్రెయిన్ ను అందుకున్నారు.

    స్త్రీకి నిర్వచనంలా వున్న ఆ ముఖం తప్పిస్తే మిగిలిన కట్టు, బొట్టు అంతా పాశ్చాత్య నాగరికతకు ప్రతిబింబంలా వుందా యువతీ జీన్స్ ప్యాంట్, జిప్ షూస్, ఫుల్ హాండ్స్ చెక్స్ డిజైన్స్ షర్టు వేసి టకప్ చేసింది.

    స్త్రీ కళ్ళను సహజంగా బెదురు చూపులు చూసే లేడి కళ్ళతో పోల్చడం కేవలం ఆ కళ్ళకు అనిర్వచనీయమైన అందం వుందని చెప్పడానికే కావచ్చు. కాని ఆమె చూపులలో ఏమాత్రం బెదురు లేదు. పైపెచ్చు ఏకాగ్రత వుందీ!   
   
    ఆమె కళ్ళలో ఎంతటి రహస్యాలను అయినా దాచుకోగల నిశ్చలత వుంది.

    ఆ యువకుడిది నిండైన ఆకృతి. పదిమంది యువకుల స్వయంవరంలో కన్నెపిల్ల ఏరి కోరుకునే మగసిరి ఉట్టిపడుతున్నది యువకునిలో.

    పురుషునిలో ప్రధానంగా వుండే క్రౌర్యం ఆ కళ్ళలో వర్ణించవచ్చు. కాని అతని కళ్ళు చాలా నిర్మలంగా వున్నాయి!

    హాలాహలాన్ని మింగిన శివుడుగా అతని గుండెలో బడ బాగ్ని ప్రజ్వరిల్లుతున్నా, అన్నింటికీ తను అతీతుడనన్న భావన అతని కళ్ళలో కనిపిస్తున్నది.

    కదులుతున్న సూపర్ ఫాస్ట్ లో ఓ కంపార్ట్ మెంట్ లోకి అడుగుపెట్టిన ఆ యువజంట సర్దుకుని ఒకచోట కూర్చున్నారు. వాళ్ళ భుజాన వ్రేలాడుతున్న ఎయిర్ బ్యాగ్స్ తీసి సర్దారు.

    కట్టు, బొట్టు, స్త్రీ సహజమైన అలంకరణతో అజంతా శిల్పసుందరిని పోలి, అడుగడుగున తెలిగుదనం ఉట్టిపడుతున్న మరొక స్త్రీ అదే కంపార్ట్ మెంట్ లో కూర్చుని వుంది.

    ఆమె డాక్టర్ సునంద.

    హడావిడిగా వచ్చి కదులుతున్న ట్రెయిన్ ఎక్కిన ఆ యువజంటను చూసి చిరునవ్వు నవ్విందామె.

    సహజంగా వున్న ఆమె సౌదర్యం ఆ చిరుమందహసంతో ద్విగుణీకృతం అయింది.

    అందమైన అతివ ముఖంలో చిరుకోపం కనిపించినా, చిరుమందహాసం వికసించినా ఆ ముఖం మరింత ఆకర్షనీయంగా అగుపిస్తుంది.

    సూపర్ ఫాస్ట్ స్పీడందుకుంది.

    అప్పటి వరకు ఓ మూల ఒదిగి కూర్చున్న ఓ బిచ్చగాడు, జీవం వచ్చినట్టు లేచాడు.

    తన చేతిలో వున్న కరపత్రాలను ప్రయాణీకులందరికి పంచాడు....

    అది చదివిన ప్రయాణీకులు మొదట సంశయంలో పడ్డారు. నిర్ధారణ కోసం మరోసారి మరోసారి ఆ కరపత్రాల కేసి చూశారు.

    తెలియని భయం ఒక్కసారిగా అందరికీ ఆవరించింది. వాళ్ళ ముఖాలు పాలిపోయాయి. వాళ్ళ కళ్ళలో ఆందోళన, అలజడి.

    అందరి అంతరంగాలలోను జీవితం మీద ఆశ హఠాత్తుగా విశ్వరూపం దాల్చింది.

    కొన్ని కళ్ళు అదిరాయి. కొన్ని కళ్ళు చెదిరాయి. మరికొన్ని చమర్చాయి.

    కళ్ళలో తిరుగాడే నీరు కనిపించకుండా మేకపోతు గాంభీర్యంతో కొందరు కర్చీఫ్ ను ముఖానికి అడ్డుపెట్టుకున్నారు!

    అందరిలో కనబడుతున్న ఆందోళన ఆ యువ జంటలో కనిపించడం లేదు.

    డాక్టర్ సునందకు మొదట ఆశ్చర్యం కలిగింది. తదుపరి సంశయం,ఆపై అనుమానం పుట్టింది.

    అనుమానంగా మరొకసారి ఆ యువజంటను పరీక్షగా చూసింది. వాళ్ళ ముఖాలలో ఏ భావం వ్యక్తం కావడంలేదు.

    "ఎక్స్యూజ్ మీ _ఆ పుస్తకాన్ని నేను చూడవచ్చా?"

    ఏదో రకంగా ఆమెతో మాట కలపాలన్నట్టు అడిగింది సునంద.

    "కొత్తదేమీ కాదులెండి...." తలెత్తకుండానే సమాధానం చెప్పింది ఆ యువతీ. ఇన్_షర్ట్ యువతి.

    ఆ సమాధానం సునందను తృప్తిపరచలేదు. పోనీ, ఆ యువకునితో మాట కలిపితే?

    ఆ ఆలోచనలతో, అతను అప్పటి వరకు చదివి పక్కన పెట్టిన పుస్తకాన్ని తీసుకోవడానికి చేయి చాచింది సునంద.           
 

 Previous Page Next Page