Previous Page Next Page 
స్వర బేతాళం పేజి 3

    "లేదు."

    "థాంక్స్ డాక్టర్! దట్సాల్."

                               *    *    *

    "మిస్టర్ జస్టిస్....భారత న్యాయశాస్త్ర చరిత్రలోనే అపూర్వమైన కేసు ఇది. నలుగురూ  చూస్తూ వుండగా ముద్దాయి ఈ హత్య చేశాడనీ, ఇది అమానుషమైన చర్య అనీ భావించి క్రింది కోర్టు ముద్దాయికి ఐ.పి.సి.302 సెక్షన్ క్రింద  యావజ్జీవ కారాగారశిక్ష  వేసింది. కానీ మిస్టర్ జస్టిస్ - ఈ కేసుని సమూలంగా వేరే దృక్పధంతో చూడాలని నేను వేడుకుంటున్నాను. ఈ హత్య చేసింది ముద్దాయికాదు, ఒక దెయ్యం! కోర్కె తీరక ఆత్మహత్య చేసుకున్న సోమశేఖరం ఆత్మ ముద్దాయి మీద మానసికమైన వత్తిడి తీసుకొచ్చింది. దాన్నే తార్కికంగా - ఒక డాక్టర్ భాషలో చెప్పాలంటే-సోమశేఖరం  ఆత్మహత్య వార్తవిని  ముద్దాయి మానసికంగా  బలహీనుడయ్యాడు. పారనాయిడ్ స్కిజోఫ్రెనియా  అటాక్డ్ హిమ్. మిస్టర్ జస్టిస్....ఒక పని  చేసేటప్పుడు  ఆ పని చేస్తున్న వ్యక్తి తను చేస్తున్న  పనేమిటో తెలియని  స్థితిలో వుంటే ఆ నేరం అతడికి  అంటదని సెక్షన్ 84 -ఐ.పి.సి. చెబుతోంది. కాబట్టి  నా క్లయింటు నేరస్తుడు కాడు. ఈ హత్య చేసింది -మామూలు తెలుగు భాషలో  చెప్పాలంటే....ఒక దెయ్యం."


        ప్రారంభం

        అవును.

    ప్రతీ కథా ఎక్కడో  ఒకచోట నుంచి ప్రారంభం కావాలి.

    ఈ కథ పద్మజతో ప్రారంభించటం మంచిది. అయితే ఈ కథలో పద్మజ హీరోయిన్ కాదు. ఆమె ఒక దురదృష్టవంతురాలు. విధికి బలి అయిపోయిన  వంచితురాలు. అయినా కోర్టు కేసులో, న్యాయశాస్త్ర చరిత్రలో ఒక అపూర్వమైన  జడ్జిమెంటుకి తార్కాణంగా ఆమె పేరు నిలిచిపోతుంది. సోమశేఖరం కూడా ఈ కథలో  హీరో కాదు. ఆ మాట కొస్తే అతడు మరీ దురదృష్టవంతుడు. మరణించాక  కూడా ప్రజలు అతన్ని అసహ్యించుకుంటున్నారు. అతడి ప్రేమించే హృదయాన్ని, భావుకత్వాన్నీ, మంచితనాన్నీ  కేవలం కొందరే  అర్ధం చేసుకున్నారు. మరణించాక కూడా ప్రేయసి తనతోనే  కలిసి వుండాలని కోరుకోవటమే  అతడి తప్పు  అని చాలామంది  భావించారు. "వెళ్ళిపో - వెళ్ళిపో" అని అతని ఆత్మని ప్రార్ధించారు, పూజలు జరిపారు.

    ఆ కథలో మరో పాత్ర గిరి.

    అతడి కథే ఈ నవలంతా కాబట్టి ఇక్కడ అతడి గురించి చెప్పటం అవసరం.

    మధ్యలో ముగిసిపోయే  పాత్రలతో  ఈ కథని ప్రారంభించటం మంచిది. అందుకని పద్మజ, శేఖరులతో ప్రారంభిస్తాను.


                                 1

        మాయమైన నౌకలో మారణాయుధాలు వున్నాయా ?

    గత నెలలో మన దేశానికి చెందిన నౌక ఒకటి అరేబియా సముద్రంలో ఉన్నట్లుంది మాయమైపోయిందనే వార్త వచ్చింది. ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన ఈ నౌకలో  యాభైమంది సిబ్బంది వున్నారు. ఎవరి జాడా తెలియలేదు. ఈ విషయమై ప్రభుత్వాన్ని ప్రశ్నించగా అది ప్రయాణయోగ్యం కాని నౌక అనీ, బహుశా నడి సముద్రంలో  మునిగిపోయి  వుంటుందని  ప్రభుత్వం సమాధాన మిచ్చింది. అయితే ఈ నౌకలో వున్నది  కేవలం కొన్ని ఇంజనీరింగ్ పరికరాలు మాత్రమే అన్న వార్త అబద్ధం అని విశ్వసనీయ వర్గాలద్వారా  తెలియవచ్చింది. ఈ నౌకలో  మిలటరీకి సంబంధించిన యుద్ధ పరికరాలు  ఉన్నాయనీ, బహుశా ఈ నౌక దారి మళ్ళింపబడి  వుండవచ్చుననీ  ఒక వార్త! అదే నిజమైన పక్షంలో  ఇది తీసి పారేయాల్సిన విషయం కాదు. ఇప్పటికే  దేశం అల్లకల్లోలంగా  వుంది. ఈ ఆయుధాలు పడకూడనివాళ్ళ  చేతిలో పడితే దేశం  అరాచకమై పోతుందనడంలో సందేహం లేదు. ప్రభుత్వం వెంటనే ఈ విషయమై దర్యాప్తు చేయించాలని మీ పత్రిక ద్వారా విన్నవించుకుంటున్నాం."

    చేతిలో  పుస్తకం ప్రక్కన  పెట్టి ఫోన్  తీసి నంబర్ డయల్ చేసింది పద్మజ.

    "సోమశేఖరం హియర్" అవతలి నుంచి వినిపించగానే __

    "ఒక్కసారి ఇక్కడకు రాగలరా ?" అని అడిగింది.

    "ఇప్పుడే వస్తున్నాను" ఫోన్ పెట్టేశాడు.

    రిసీవర్ క్రెడిల్ మీదుంచి  ఆలోచనలో  పడింది పద్మజ.

    'భారతదేశం అంటే పుణ్యభూమి అనే ప్రొద్దుట లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు  ప్రతి పనికీ దైవస్మృతి చేసుకునే ప్రజలున్న ధర్మభూమి  అని గొప్పగా  చెప్పుకుంటాం. ప్రతి వీధికి  ఒక గుడి, ప్రతి గుడికీ ఒక్కో దేవుడూ వెలసిన దేశం.  పండుగ వచ్చిందంటే  ప్రతి పుణ్య స్థలంలోనూ  జనం కిట కిట లాడుతుంటారు. పదిహేనురోజులకో పండుగ వస్తూనే వుంటుంది. ఇంతటి దైవభక్తి, పాపభీతి  వున్న మీ కర్మ భూమిలో రోజురోజుకీ  ఇన్ని అకృత్యాలు జరుగుతున్నాయి  ఎందువల్ల ? లోపం ఎక్కడుంది ?'

    తలుపుమీద టక్...టక్ మని రెండుసార్లు చప్పుడవడంతో ఆ ఆలోచనల్లోంచి  బయటపడింది పద్మజ.

    "కమిన్ !"

    లోపలకు వచ్చాడు సోమశేఖరం. అతని దృష్టి టేబుల్ మీదున్న ఫైలుమీదా, పుస్తకం మీదా పడింది.
   

 Previous Page Next Page