Read more!
 Previous Page Next Page 
నిషా పేజి 3

    మసక చీకట్లు ముసరబోతున్నాయి.

    అడవిలో అదో పాడుబడిన భవంతి.

    గోడలు పెళ్లలూడిపోయి చెత్తాచెదారం పేరుకుని తేళ్లు, పాములు యధేచ్చగా సంచరించవచ్చుననిపించే గదిలో ఆ చెత్తలోనే ముందు స్పృహవచ్చింది మోహనవంశీకి.

    కాళ్లూ చేతులు తాళ్లతో కట్టబడి ఆ చెత్తలోనే స్పృహలేని స్థితిలో పడివున్న సౌదామినిని చూసేసరికి అతడి మనసు కలుక్కుమన్నట్టుగా అయింది.

    ఆమెను బంధవిముక్తి చేద్దామని లేవబోయాడు. తన పాదాల దగ్గరగా బిగించి కట్టడంవల్ల లేచి నిలబడడం సాధ్యంకాలేదు. చేతులు కూడా అలాగే బిగించి కట్టబడ్డాయి. కాళ్లు చేతులు సరిగా రక్తప్రసరణ జరుగక తిమ్మిరిగా, మొద్దుబారినట్లుగా వున్నాయి.

    ఎవరు తమనిక్కడ బంధించారు?

    ఆ చెంచులేనా?

    వాళ్లకు తమతో ఏం పని?

    సొమ్ముకోసం పట్టుకున్నారా? తనచేతికి ఓ ఖరీదైన వాచీ, మెడలో బంగారు గొలుసు, వేలికి వజ్రపుటుంగరం తప్ప ఇంకేం లేవు. సౌదామిని శరీరంమీద కూడా ఇంచుమించుగా అంతే వున్నాయి.

    అవి తమ వంటిమీదే భద్రంగా వున్నాయి.

    వాళ్లు తమని బంధించింది సొమ్ముకోసం కాదు.

    ప్రాణం కోసమా? దానికోసమే అయితే వాళ్లు జీపులో చొరబడినప్పుడే ఆ పని చేయవచ్చు.

    ఇంతదాకా తెచ్చింది మరెందుకోసం?

    పక్కకు పొర్లిగింతలు పెట్టి "సౌదీ" అని నెమ్మదిగా , ఆర్తిగా తట్టాడు మోహనవంశీ.

    ఆమెలో ఫఉలుకుపలుకు లేదు.

    గుండెలమీద చెయ్యుంచి చూసాడు. కదలిక తెలిసింది.

    "భగవంతుడా?!" భగవంతుడిని ఆర్తిగా తలచుకునే అవసరం అతడికి జీవితంలో మొదటిసారిగా వచ్చింది.

    గదిలో పూర్తిగా చీకటి ముసురుకుంది. ఏమీ కనిపించడంలేదు. వినిపించడంలేదు. ఆ నిశ్శబ్దంలో తన గుండె చప్పుడు తనకే భయంగొల్పుతూ వినిపిస్తోంది.

    కాటుకలాంటి నల్లటి చీకటికి కళ్లు అలవాటు పడబోతున్న సమయంలో భళ్లున తలుపులు తెరుచుకున్నాయి. ఒకడి చేతిలోని మండుతున్న కాగడా వెలుతురు ఎర్రగా గదిలో పరుచుకుంది.

    మోహనవంశీ చప్పున కళ్లు మూసుకున్నాడు.

    ఎవరో కాలితో తన్ని అటూ ఇటూ కదిలించారు.

    "ఇంకా స్పృహరాలేదా?"

    "ఊహూ"

    "వాడికి తెలివొస్తేనేకదా మన పని సాగేది"

    చెవులు దోరబెట్టి వింటున్నాడు మోహనవంశీ. ఆ మాట తీరు నాగరీకులదేగానీ చెంచులదికాదు. అయితే ఈ వచ్చినవాళ్లెవరు? అప్పుడే స్పృహలోకి వస్తున్నట్టుగా చిన్నగా కదిలి నెమ్మదిగా కళ్లు తెరిచాడు మోహనవంశీ. వెలుతురు అలవాటు తప్పినట్లుగా కళ్లు రెపరెపలాడించి చూసాడు. ఎదురుగా ఉదయం జీపులో జొరబడి తనను బంధించిన చెంచులే వున్నారు. కాగడాల ఎర్రటి వెలుతురులో వాళ్ల ముఖాలు భయానకంగా అగుపిస్తున్నాయి.

    వాళ్లు నిజంగా చెంచులుకాదు. ముఖాలు గుర్తుపట్టకుండా వుండడంకోసం ముఖాలనిండా నలుపుతెలుపు చారలు గీసుకుని చెంచువేషాలు వేసుకున్నారన్న విషయం అర్ధమైంది మోహనవంశీకి

    "తెలివొచ్చింది తెలివొచ్చింది" మోహనవంశీ కదలడం చూసి ఒకడు అరిచాడు.

    బాగా వొడ్డూ పొడుగు వున్న రంజిత్ దగ్గరగా వచ్చాడు. కాగడా అతడి ముఖం దగ్గరగా పెట్టి అడిగాడు  "మిమ్మల్ని ఎందుకు బంధించామో తెలుసా?"

    తెలీదన్నట్టుగా తలాడించాడు మోహనవంశీ.

    "ప్రాచీన నిధులకోసం అన్వేషిస్తున్న ముఠా మాది. మీ పాతకోటలో మీ ముత్తాత వాసుదేవరావు అపారమైన సంపద నిక్షిప్తంచేసారని తెలిసింది మాకు. ఆ నిధి రహస్యం తప్పక నీకు తెలిసే వుంటుందని నా నమ్మకం. ఆ రహస్యం చెప్పేస్తే మిమ్మల్ని సురక్షితంగా విడిచిపెట్టేస్తాం."

    "పాతకోటలో భూస్థాపితమైన నిధి వుందని వాళ్ళూ వీళ్లూ అనుకోగా నేనూ విన్నాను. కానీ అదెక్కడుందో నాకూ తెలియదు."

    "మీ ముత్తాత మీ తాతకు, మీ తాత మీ నాన్నకు, మీ నాన్న నీకు ఆ నిధి రహస్యం చెప్పలేదా?"

    "చెప్పలేదు"

    రంజిత్ కాలు ఫెడీమని మోహనవంశీ చెంపని తాకింది.

    పళ్లు పూర్తిగా కదిలిపోయినట్టుగా బాధ.

    "నేను నీతో ఊరికే కబుర్లాడదామని రాలేదు. ఒళ్లు దగ్గర పెట్టుకుని జవాబివ్వు. ఎంత త్వరగా నిజం చెబితే అంత త్వరగా నిన్ను పంపించేస్తాం. లేకపోతే చిత్రహింసలపాలవుతావు"

 Previous Page Next Page