2
రోజులు గడుస్తున్నాయి.
దార్కా గురువు దగ్గర ఒక్కొక్క మంత్రమే నేర్చుకుంటున్నాడు. అతడెంత తొందరగా ఆ విద్యని అవగాహన చేసుకున్నాడంటే - గురువైన విషాచికే అది ఆశ్చర్యంగా వుంది. శరీరాన్ని ఎండబెట్టి, చలికి వణికించి ఎన్నో బాధలకు గురవటాన్ని శరీరానికి ఎండబెట్టి, చలికి వణికించి ఎన్నో బాధలకు గురవటాన్ని శరీరానికి నేర్పిన మహా మహా మంత్రగాళ్ళు కూడా చూపించలేని ఏకాగ్రతని అతడు చూపించాడు. తన ఎన్నిక తప్పనందుకు విషాచికి ఆనందంగా వుంది.
రెండు సంవత్సరాలు గడిచినయ్.
దార్కాకి పన్నెండు సంవత్సరాలు వచ్చినయ్. వయసుకి మించిన ఎత్తుతో బలంగా తయారయ్యాడు. కొద్దికొద్దిగా నూనుగు మీసాలు వచ్చినయ్. అన్నిటికన్నా మించినది అతడి కళ్ళలో తీక్షణత. ఒకసారి అతడి కళ్ళలోకి చూసిన వాడెవడూ వాటిని మర్చిపోలేడు. దీపం దగ్గరికి ఆకర్షితమయ్యే శలభంలా ఆకర్షింపబడతాడు.
మనిషి మాంత్రికుడు అవ్వడానికి పది సంవత్సరాలు, మహా మాంత్రికుడు అవ్వడానికి ఇరవై సంవత్సరాలూ, యోగసిద్ధ తాంత్రికుడవ్వడానికి ఆ పైన ఇరవై అయిదు సంవత్సరాలూ పడతాయని గ్రంధాల్లో వ్రాసివుంది. ఆ లెక్కన యాభయ్ ఐదు సంవత్సరాలు. కానీ ఎంతో అనుభవజ్ఞుడూ , మహాసిద్ధుడూ అయిన విషాచికే ఆశ్చర్యంగా వుంది దార్కా ప్రగతి. మంత్రగాళ్లు నేర్చుకోవడానికి దాదాపు ఎనిమిది సంవత్సరాలు పట్టే మామూలు చేతబడి అతడు నాలుగు సంవత్సరాలకల్లా వేర్చుకున్నాడు.
ఈ మధ్య దార్కా ఆదోలా వుండడాన్ని విషాచి పసిగట్టేడు. అయినా ఎందుకో అడగలేదు. అతడే చెప్తాడు కదా అని. ఒకరోజు అతడి అంచనా ఫలించింది.
"నేనొకటి చెబ్దామనుకున్నాను విషాచీ" అన్నాడు దార్కా.
"ఏమిటి"
దార్కా తటపటాయిస్తూ క్షణం ఆగేడు చెప్పాలా వద్దా అన్నట్టూ. విషాచి రెట్టించలేదు చెప్పమన్నట్టూ కొంచెం నిశ్శబ్దం. తర్వాత దార్కా నెమ్మదిగా అన్నాడు.
ధ్యానముద్రలో నేను కళ్ళు మూసుకున్నప్పుడల్లా నాకో చిత్రం కనబడ్తూంది.
"ఏమిటది?"
"ఐదు తలలున్న సింహం."
నడూస్తున్న విషాచి చప్పున ఆగిపోయి "ఏమిటీ - సరిగ్గా చెప్పు" అన్నాడు.
"ఒక కమలంలో అది కన్పిస్తూంది. దానిపైన నాలుగు తలల రాక్షసుడు కనిపిస్తున్నాడు. పద్మం మధ్యలో నక్షత్రం ఒకటి ఉంది."
అప్పుడు విషాచి నవ్విన భయంకరమైన నవ్వు ఆ చుట్టుప్రక్కల భయంకరంగా ప్రతిధ్వనించింది. "సాధించేవు దార్కా. మహా యోగులకు కూడా సాధ్యంకాని యోగాన్ని నువ్వు సాధించేవు."
"ఏమి సాధించేను నేను."
"అది చెప్పేముందు నీకు మూలాధార చక్రం గురించి చెప్పాలి. వెన్నెముక కొసన ఒక చక్రం వుంది. అన్ని చక్రాలకి ఆధారం కాబట్టే దాన్ని మూలాధార చక్రం అన్నారు. ఆ చక్రానికి నాలుగు దళాలుంటాయి. అవి రక్తవర్ణంలో వుంటాయి. వాటిమీద అక్షరాలుంటాయి. మధ్యలో ఐరావతం అనే ఏనుగు ఐదు తొండాల్తో వుంటుంది. ఇదిగో ఇలా" అంటూ ఎండుకొమ్మతో గీసి చూపించేడు.
ఈ మూలాధార చక్రం దర్శనమైనవాడు మహాయోగి అవుతాడని సిద్ధులు చెబ్తూ వుంటారు. లింగం పై భాగంలో కుండలినీ శక్తి వుంది. ఆ కుండలిని లేపి సుషమ్న ద్వారా మూలాధారం నుంచి సహస్రారానికి చేర్చడం రాజయోగం లక్ష్యం.
దార్కా ఈ యోగులు మనకి శత్రువులు. వీరిని దేముడు రక్షిస్తూ ఉంటాడు. ఇన్నాళ్ళకి మన ఈ చీకటి ప్రపంచంలో ఒక మహా మాంత్రికుడు ఉద్భవించేడు. మూలాధార చక్రంలో అయిదు తలల సింహాన్ని చూసినవాడు. సింహం ఏనుగు శత్రువు. దార్కా! ఇక నిన్ను ఎదుర్కొనే వాడులేడు. నాతో రా"
ఎక్కడికీ అని అడగలేదు దార్కా. అడగడం అతడి చరిత్రలోనే లేదు. ఇద్దరూ చీకటిలో నడుస్తున్నారు.
అరగంటలో శ్మశానం మధ్యకి చేరుకున్నారు.
చప్పున దార్కా ఆగేడు -
కాద్రా చేతిని చూసి,
భూమిలోంచి పైకి పొడుచుకు వచ్చిన ఎముకలు! చూపుడువేలూ - మధ్య వేలూ శిధిలమైపోయినయ్. ఎముకలతో సహా.
"ఇలా రా" అన్న మాటలకి అక్కణ్నుంచి కదిలేడు దార్కా. కొంత దూరం తీసుకెళ్లి "ఇక్కడ తవ్వు" అన్నాడు.
మారు మాట్లాడకుండా దార్కా తవ్వడం ప్రారంబించాడు. ఈ లోపులో విషాచి వెతికి రాళ్ళు పట్టుకొచ్చేడు.
రెండు గంటల్లో నిలువెత్తు గొయ్యి తయారయింది. అందులో రాళ్ళు పక్కల్న పేర్చాడు -విషాచి. అంచున కూడా వాటిని కూర్చి, వాటి ఆలంబనతో మన్ను పేర్చాడు. పిరమిడ్ కట్టిన శాస్త్రజ్ఞుడి ఏకాగ్రత, నేర్పు అతడిలో ఉంది. ఇదంతా ఎందుకో ఆడలేదు దార్కా.
"పద" అన్నాడు విషాచి పని పూర్తి చేసి.
ఇద్దరూ వెనుదిరిగేరు.
గ్రామం వేపు వస్తూంటే విషాచి అన్నాడు. "దార్కా! నిన్ను నా శిష్యుడిగా ఎందుకు స్వీకరించానో - నీ నుంచి ఏం కోరుతున్నానో నీకు తెలుసు. ఇక నేను నీకు బోధించనవసరంలేదు. మూలాధార చక్రంలో సింహాన్ని చూడగల్గిన నిన్ను - ఈ ప్రపంచంలో ఏ శక్తీ ఏమీ చేయలేదు. కాద్రా చనిపోయిన రోజు నేను ఎందుకు నిన్ను నా శిష్యుడుగా స్వీకరించానో నీకు తెలుసా?"
"తెలుసు"
"బిస్తా గ్రామంలోకి ముగ్గురు వచ్చి ఒక మాంత్రికుణ్నిం చంపేరు."
"వాళ్ళమీద పగ తీర్చుకోవాలి."
"అవును దార్కా! అందుకే నీకే విద్యలన్నీ నేర్పి - ప్రపంచంలో కెల్లా పెద్ద మాంత్రికుణ్ని చేసింది. ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప మంత్రగాడు ఎవరూలేరు. చరిత్రలో. దార్కా -మంత్రగాళ్ళ చీకటి జీవితపు చరిత్ర పుటల్లో నీ పేరు ఎర్రటి అక్షరాల్తో వ్రాయబడుతుంది."