ఎటువంటి పరిస్థితుల్లోను అవతలి వారి చేతివ్రాతను అధ్యయనం చేసేటప్పుడు ఏ రెండు మూడు లక్షణాలనో పట్టించుకొని, మిగిలినవి విడిచిపెట్టి తెలిసీ తెలియని విశ్లేషణ చేయకండి.ఆమూలాగ్రం చదివి, అన్ని లక్షణాలను దృష్టిలో పెట్టుకుని, అప్పుడు మీరేమనుకుంటున్నారో చెప్పడం ప్రారంభించండి.
గ్రాఫాలజీ యొక్క పరిమితులు.
ఎవరైనా ఒక శాస్త్రం గురించి అధ్యయనం చేసేటప్పుడు, ఈ శాస్త్రం చాలా గొప్పది, దీనికన్నా మించింది మరోటిలేదు అంటూ వుంటారు. కానీ ప్రతీశాస్త్రానికి కొన్ని పరిమితులుంటాయి. అలాగే గ్రాఫాలజీకి కూడా కొన్ని పరిమితులున్నాయి. ఉదాహరణకి, చేతివ్రాతను చూసి ఒక మనిషి యొక్క వయసుచెప్పలేం. అదే విధంగా ఇంతకు ముందే చెప్పినట్లు ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో ఆడా, మగా చేతివ్రాతల తేడాని చెప్పడం కష్టమౌతోంది. గ్రాఫాలజీ మనిషి మూడ్ పట్టి కూడా మారుతూవుంటుంది. కాబట్టి c నార్మల్ కండిషన్ లో వున్నప్పుడు వ్రాసిన వ్రాతనే ప్రామాణికంగా తీసుకోవాలి.
గ్రాఫాలజీ బట్టి వయసు చెప్పటం పెద్ద కష్టం కాదుగానీ, కొందరు వృద్దులు కూడా చిన్న పిల్లల మనస్తత్వం కలిగి వుండొచ్చు. అలాగే కొందరు చిన్నప్పుడే వైరాగ్యంతో వృద్దులైపోవచ్చు. అలాగే ఆడవారు ఇంటిబాధ్యత వహించినప్పుడు వారిలో పురుషలక్షణాలు కనిపించవచ్చు. స్త్రీ మనస్తత్వం వున్న పురుషులు కూడా వుండవచ్చు.
ఏది ఏమైనా, ఈచేతివ్రాత సాయంతో మనం ఎనభైశాతం వరకూ మన (లేదా) అవతలివాళ్ళ మనస్తత్వాన్ని తెలుసుకోవచ్చు.
ముఖ్యగమనిక
ఈ పుస్తకాన్ని చదవబోయేముందు మీరు తప్పనిసరిగా ఒక విషయాన్ని గమనించాలి. లేకపోతే మీ యొక్క మనస్తత్వాన్ని తెలుసుకునే అవకాశాన్ని కోల్పోతారు.
1. ఇంగ్లీషులోనూ, తెలుగులోనూ మీరు ఎప్పుడో వ్రాసిన రెండు కాగితాల్ని దగ్గర పెట్టుకోండి. రూళ్ల కాగితం మీద వ్రాసిందయితే మంచిది. అది దొరకని పక్షంలో తెల్లకాగితం మీద వ్రాసింది దగ్గరుంచుకోండి.
ఒకలైను, రెండులైన్లు కాకుండా పది, పదిహేను లైన్ల మేటర్ దగ్గర పెట్టుకోవటం మంచిది. అదే విధంగా "ఎడమవైపు మార్జిన్ గీత" లేని కాగితం మీద వ్రాసిందయితే బావుంటుంది.
ఎట్టి పరిస్థితులలోనూ ఈ పుస్తకం కోసం మీరు వ్రాయడం ప్రారంభించవద్దు.
అలా వ్రాస్తూవుంటే మీరు ఒకవిధమైన ప్రభావంతో, బాగా వ్రాయాలి అన్న వుద్దేశ్యంతో వ్రాయడం మొదలుపెడతారు. అందుకని ఎప్పుడో వ్రాసిన కాగితాన్ని దగ్గిరుంచుకోవడం చాలా ముఖ్యం.
2. ముందు పుస్తకాన్ని చదివి ఆ తరువాత మనస్తత్వాన్ని పరిశీలించుకుందాంలే అని అనుకోవద్దు.
అటువంటి పరిస్థితుల్లో ఏదైనా ఒకరకం చేతివ్రాతకి ఎదురుగా ఏదైనా చెడు వ్రాసి వుంటే అది మనకు సంబంధించినది కాదులే అనుకునే ప్రమాదం వుంది. అందుకని వివరణ చదవకుండా ముందే మీరు మీచేతివ్రాత ఏవిభాగానికి చెందుతుందో గుర్తుపెట్టుకోండి.
3. రకరకాలుగా వ్రాసేవారి మనస్తత్వాలు ఈ పుస్తకంలో రకరకాల విభాగాలుగదా విడగొట్టబడ్డాయి. వాటినన్నింటిని చదివి, అందులో అన్నిటికంటే ఏది బావుంటే, అది మీదన్న సంతృప్తితో తప్పు అంచనాకి రాకండి.
ఒక్కొక్క చాప్టర్ లో చాలా చేతివ్రాతలు ఉదహరణలుగా ఇవ్వబడ్డాయి మీదగ్గర వున్న (ఎప్పుడో వ్రాసిన) మీ చేతివ్రాతలో c ఏ ఉదాహరణ సరిపోతుందో చూసుకుని ముందుగా 'టిక్' పెట్టుకోండి.
అన్ని ఛాప్టర్లలోనూ అలా టిక్ పెట్టుకున్నాక, ఒకేసారి మొత్తం అదంతా చదవండి. మీ మనస్తత్వం కరెక్టుగా తెలుస్తుంది.
4. మీ స్నేహితుల, స్నేహితురాండ్ర చేతివ్రాతలు పరిశీలించబోయేటప్పుడు కూడా ఆవిధంగానే చేయండి. ముందుగా, ఆ చేతివ్రాత ఏ 'విభాగానికి' చెందుతుందో నిర్ణయించుకొని'టిక్' పెట్టుకోండి. పుస్తక మంతా ఆ విధంగా టిక్కులు పెట్టుకున్న తరువాత, ఆ విభాగానికి చెందిన గుణగణాలన్నీ చదివి వారిపట్ల మీరు ఒక అంచనాకి రండి.
మీకు స్కూల్లో ఏవిధంగా నన్నా నేర్పనీ, మీరు చిన్నప్పుడు ఎన్ని కాఫీ పుస్తకాలైనా వ్రాసి వుండనీ మీ దస్తూరి మీ మనస్తత్వాన్ని బట్టే ఏర్పడుతుంది. అది అప్పుడప్పుడు మీ టెన్షన్స్ నీ, మీ చిరాకునీ, అన్నింటినీ ప్రస్పుటం చేస్తుంది.