Previous Page Next Page 
అష్టదళం 2 పేజి 3

    హిమబిందువులతో తడిసిన తెల్ల గులాబీలా వుంది ఆమె ముఖం. ఎంతో మోహనంగా వుంది. ఆ ముఖంలోకి చూస్తున్నకొద్దీ ఏదో ప్రేమ పాశం చుట్టేయసాగింది అతడిని.

     "ఏమైంది  బాబూ పిల్లకు?" అలివేణి కంఠంలో చెప్పలేని ఆందోళన.

     "స్పృహ తప్పింది. నీళ్లు తీసుకురండి. ముఖంమీద చల్లుదాం."

    ఆడుతూ, పాడుతూ, తూనీగలా తేలిపోవాల్సిన పిల్లకు ఈ చీడ ఏమిటిరా దేవుడా?" అలివేణి ఉరుకు పరుగులతో  వెళ్లి నిముషంలో నీళ్ల గ్లాసుతో వచ్చింది.

     సూర్య ఆ పిల్ల ముఖంమీద నీళ్లు చల్లాడు.

     ఆమెలో చలనం లేదు.

    ఆమె చేయి పట్టుకు చూశాడు సూర్య. అతడి ముఖం పాలిపోయింది.
     
    "ఏమైంది బాబూ పిల్లకు?" అలివేణిలో గాబరా పెరిగిపోయింది.

     "నాడి ఆడడంలేదు."

    "చచ్చిపోయిందా? ఆ రాక్షసి నా చిట్టిని చంపుకుపోయిందా?"

    అతడినుండి మాట రాలేదు. చందన ముఖంలోకి చూస్తున్న అతడి కళ్లల్లో నీళ్ళు. మనసులో దుఃఖపు సుడిగుండాలు. ఆ బాధలో అతడికి ఏంతోచిందో చొక్కా చేతిలోపల కుడిదండకు వున్న తాయెత్తు దారంవిప్పి చందన చేతికి కట్టాడు.      

    "అమ్మమ్మా! నీలూ! చెన్నా! రండిరా. మన చిట్టి  చచ్చిపోయింది. మన చిట్టి మనకిలేదు. " ఏడుస్తూ పెద్దగా కేకలు పెట్టింది అలివేణి గుండెలు బాదుకుంటూ.

     అందరూ పరుగున వచ్చారు.

     నీలవేణి నోట్లో గుడ్డ కుక్కుకుని  నిశ్శబ్దంగా రోధిస్తుంటే రంగసాని వచ్చి  చందనమీద పడింది.

     "దేవుడు నీకింత అల్పాయుష్షు యిచ్చాడా తల్లీ! నా చంద్ర పోలికలతో పుట్టి, సరిగ్గా అదే వయసుకి కన్ను మూశావా?" అంటూ రాగాలు తీయసాగింది.

      "నీ చంద్రే నా మనవరాలిని చంపేసింది ముసలిదానా!" ఏం పాపం చేసిందో అర్దాంతరపు చావు చచ్చి,  దెయ్యమైంది. అది చాలక, నా మనుమరాలికి పట్టి పొట్టన పెట్టుకుంది. ఇంత పాపం మూట గట్టుకున్నాక అది, మామూలు దెయ్యం ఎలా అవుతుంది? బ్రహ్మపిశాచి అవుతుందిగానీ....."

    "చచ్చిన బిడ్డను తిట్టకమ్మా! అది ముందే దురదృష్టవంతురాలు. దీనికి ఆయుష్షు తీరిపోయిందిగానీ...." రంగసాని మాట పూర్తికానేలేదు.

     నిద్ర నుండి మేలుకున్నట్లుగా కళ్లు తెరిచింది హరిచందన.

     భావరహితంగా వున్న ఆ కళ్లని చూస్తే, శవం కళ్లు తెరిచినట్లుగా వుంది.
     
    అందరికీ గుండెలు గుభేలుమన్నాయి.
   
    చందన బ్రతికిందా? లేక.....

    శవం కళ్లు తెరిచిందా?

    చందన బ్రతికిందనుకోవడం కంటే శవం కళ్లు తెరిచిందనే అనుకున్నారు.

     అందరి ముఖాలూ భయంతో పాలిపోయాయి.

     ఇదెలా సంభవించిందన్న విభ్రాంతి సూర్యలో.

     భావరహితంగా తెరుచుకున్న  చందన కళ్లల్లోకి ఎర్రజీరలు వచ్చేశాయి. ముక్కుపుటాలు విశాలమయ్యాయి.   పళ్లు పటపటలాడాయి.      

    హఠాత్తుగా చేతులు పైకిలేచి, సూర్య మెడను వడిసి పట్టుకున్నాయి. ఎంత బలం వుపయోగించినా ఆ చేతుల్ని తన మెడమీద నుండి తొలగించలేకపోతున్నాడు. యమపాశం మెడకు పడ్డట్టుగా వుంది.

     వూపిరి అందడంలేదు.

     కళ్లూ, నాలుక బయటకి వెళ్లుకొచ్చేస్తున్నాయి.

     మరణం ఇక తథ్యమనుకుంటున్న సమయంలో -
     
    చేష్టలుడిగి చూస్తున్న వాళ్లల్లో మెల్లగా కదలిక వచ్చినట్లుగా  అయింది. ముందుగా చెన్నయ్య ఒక్కదూకు దూకి. చందన చేతుల్ని పట్టుకుని లాగివేశాడు. అతడి బలమంతా ఉపయోగిస్తే గానీ, ఆ చేతులు సడలలేదు తామరతూడుల్లా వున్న ఆ చేతుల్లో అంత బలం ఎక్కడిదో తెలియదు.

    తల్లీ, అమ్మమ్మా కలిచీ సూర్య ఒళ్ళోంచి చందనని లాగి వేశారు.    

    "ఏమొచ్చిందే నీకు? నిండు ప్రాణం తీయబోయావుకదా?" అలివేణి కొడుతుంటే, చందన నవ్వసాగింది.
 
     నవ్వుతూనే సూర్య కట్టిన తాయెత్తు తీసి అతడి ముఖాన కొట్టింది.    

    "ఇక నీ తాయెత్తు కూడా నన్నేమీ చేయదురా. శక్తిహీనం చేశాను. ఇక ఆడిస్తాను నిన్నొక ఆట.  రోజుకొక ఆట, పూటకొక ఆట. దినదిన గండంగా మారుస్తాను నీ జీవితాన్ని. శాంతి లేకుండా చేస్తాను. నా ఆత్మకి ఎలా శాంతి లేకుండా చేశావో, నీ ఆత్మకీ లేకుండా చేస్తాను. నేను చంపను నిన్ను కుళ్లి కుళ్లి నువ్వే చావాలి."

    నవ్వి నవ్వి ఏడవసాగింది.

     ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లినట్లుగా పడిపోయింది.

     నల్లగా కమలిపోయి మంట పెడుతున్నమెడని రాచుకోసాగాడు సూర్య.

       
        *    *    *    *    *

   
    ఎప్పుడో దొరవారి బంగళాలో చచ్చి దెయ్యమైన చంద్రరేఖ రంగసాని ముని మనవరాలికి పట్టిందని,  సూర్య గొంతుపట్టి చంపబోయిందన్న వార్త ఊరంతా దావానంలా ప్రాకిపోయింది.
     
    జనాలు గుంపులుగా చేరి ఈ విషయాన్ని చిలువలు పలువలుగా చెప్పుకుంటున్నారు.

     చివరికి పొలాల్లో  కలుపుతీసే చోట కూడా ఇదే వార్త.
     
    "దొరవారి బంగళాలో తెల్లచీర కట్టుకుని గజ్జెల చప్పులుతో తిరిగేదట. పనివాళ్లకి అప్పుడప్పుడు కనిపించేదట. అదిప్పుడు రంగసాని మునిమనవరాలికి పట్టిందట. ఆ పిల్లని చంపిపోతానంటూందట."

     ఇంకా ఎన్నెన్నో కల్పనలు, చిలువలు, పలువలు."

    "మీరు చేతినుండి గోసాయి ఇచ్చిన తాయెత్తు తీయాల్సింది కాదు చినబాబూ! తాయెత్తు మీమీద వున్నంతవరకు. ఆ దెయ్యం మిమ్మల్ని  తాకలేకపోయింది. అది తీయగానే మీ గొంతు పట్టుకుంది. తాయెత్తు తీసి అనవసరంగా మీ ప్రాణాల మీదికి తెచ్చుకున్నారు" అన్నాడు రాందత్.

    "ఆ తాయెత్తు చందనకి కట్టినందుకే బ్రతికిందేమో!"

    "ఏం బ్రతకడమో ఏమో! ఇహ వాళ్ళింటికి వెళ్ళకండి చినబాబూ! అన్నాడు రాందత్.

    "చందన నా గొంతు పట్టుకోవడం దెయ్యం ప్రభావమే. అయితే ఆ దెయ్యం ఇక్కడికి రాదా? ఆమె మనింట్లోనే చచ్చి దెయ్యమైనానని చెప్పుకుంటోంది కదా!"   

    "ప్రక్క ఊళ్ళో దేశికాచారి అనిఒకాయన వున్నాడు. బ్రాహ్మడు.  మహా మంత్రవేత్త అని చెప్పుకుంటారు జనం. ఒకసారి ఆయన్ని ఇక్కడికి పిలుచుకురా చినబాబూ?"

    అమెరికాలో చదివి డాక్టర్ పట్టా తెచ్చుకున్నాడు.

     డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తున్నాడు.

     తనకి మంత్రగాళ్లని ఆశ్రయించాల్సిన దుస్థితి కలగడం ఎంత హాస్యాస్పదం.
 
    దెయ్యాలు లేవని కొట్టివేసి మందులతో చందన ఆరోగ్యం చక్కదిద్దలేకపోతున్నాను.

     మరి తన పరిస్థితి?

    రోజూ రాత్రి అవుతుందంటే భయం!

    కళ్లు మూయాలంటే  భయం!

     శరీరం ఎవరికో స్వాధీనం అవుతుంది.

     కాళ్లు చేతులు కదలడం లేదు.

     నోరు పెగలదు.

    ఎంత అరవాలనుకున్నా శబ్దం గుండెలోనే వుండిపోతుంది.

     స్వాధీనం తప్పిన ఆ శరీరం మీద ఉన్మాది ఎవరో గిచ్చినట్టుగా, రక్కినట్టుగా, కితకితలు పెట్టినట్టుగా  నానా చిత్రహింస.

    నిద్రలోకి జారిపోతున్నప్పుడు కాళ్లుచేతులు తిమ్మిరెక్కి కదల్చలేని స్థితిని నిద్రలో వచ్చే పక్షవాతంగా వైద్యశాస్త్రం పేర్కొంటుంది.

     దానికి మందులున్నాయి.

    కానీ  ఆ గిచ్చడం, రక్కడం, కితకితలు....

     ఆ చిత్రహింస ఏమి్టో ఏ వైద్యశాస్త్రం చెప్పలేదు.

     తను డాక్టరన్న విషయం మర్చిపోయి పరిస్థితులతో రాజీపడక తప్పదనిపించింది.

     "ఆ దేశికాచారి ఎవరో చూద్దాం తీసుకురా రామూ!" అన్నాడు సూర్య.

     రాందత్ ఆరోజే ప్రక్క గ్రామానికి వెళ్లి దేశికాచారిని కలిశాడు.

    "అయ్యో! చాలా ఆపదలో వున్నారే!' సంగతి విని నొచ్చుకున్నాడు దేశికాచారి.

    "నేను వచ్చేవాడినే. కానీ మా గురువుగారు వేంచేసి వున్నారు. ఆయన భారతదేశమంతా కాలినడకన తిరుగుతూ తిరుగుతూ ఇక్కడికి  వచ్చారు. నా ఆతిధ్యంలో కొద్ది రోజులుండటానికి నన్ను అనుగ్రహించారు.  నేను ఇప్పుడు రాలేను. కానీ ఒక ఉపాయం చెప్పగలను.

    మా గురువుగారు మహా మహిమాన్వితులు. హిమాలయాలలో సంవత్సరాల తరబడి తపస్సు చేసినారు. వారు ఈ సమయంలో మనమధ్య వుండటం మనందరి అదృష్టం. బాబుగారిని ఇక్కడికి తీసుకురా. వారిచూపు పడితే చాలు గాలి ధూళి ఏమున్నా దగ్దమైపోవాల్సిందే!" అని చెప్పాడు దేశికాచారి.

     రాందత్ వచ్చి చెప్పాడు.

     "అంత మహిమాన్వితులా? అయితే ఆయన దర్శనం తప్పక చేసుకోవాల్సిందే!"

    వీళ్ళు వెళ్లిన సమయంలో దేశికాచారి గురువుగారు ఆత్మానందులు ఆద్యాత్మిక ప్రసంగం చేస్తున్నారు.

     భక్తులు చాలామంది వచ్చారు.

     ఆ భక్తుల్లో మునిరాజు, మారుతి కూడా వున్నారు.    

 Previous Page Next Page