"జైలు కొచ్చిన నీలాంటి ప్రతి ఖైదీ అలా అనుకోవడం సహజం. ఇదంతా నువ్వు ఏ నేరంచేసి జైలుకు వచ్చావ్?"
"ప్చ్....నాడొక విచిత్రమయిన కేస్. జరిగిపోయిన విషాదాన్ని త్రవ్వి తలుచుకునే ఓపిక ఇప్పుడు నాకు లేదు తాతా....ముందు నేనెలాగయినా బయటపడాలి"
"మొండి మనిషిలా వున్నావు. నీ వయస్సులో నేనూ అంతే"....
"నువ్వేం నేరం చేశావు తాతా?"
"నా భార్యను నేనే చంపాను. అలా అనేకన్నా నా భార్యతో అక్రమ సంబంధం వున్న వ్యక్తి ఆమెను చంపి ఆ నేరం నా మీదకు వచ్చేలా చేశాడని చెప్పడం బాగుంటుందేమో!"
"అదేంటి తాతా?"
"అవును బాబూ! ఒక దుర్దినం రోజున వాళ్ళిద్దరూ కలిసి వుండడం చూశాను. అదేమిటని అడిగిన నా మీద ఇద్దరూ కలిసి తిరగబడ్డారు. ఆ ఖంగారులో తగలరానిచోట దెబ్బతగిలి నా భార్య చనిపోయింది. వెంటనే ఇంటి బయట గొళ్ళెం పెట్టి పోలీసులకు తెలియజేసి నన్ను నేరస్థుడిగా చేశాడు ఆ పెద్దమనిషి. అప్పటినుంచీ చేయని నేరానికి నేను ఈ జైలులోనే మ్రగ్గిపోవడానికి అలవాటు పడిపోయాను"
చెప్పడం ఆపి కళ్ళ నీళ్ళు పెట్టాడతను.
మొదటి ఖైదీకి కూడా కళ్ళ నీళ్ళు తిరిగాయి.
సరిగ్గా అదేసమయంలో__
దూరం నుంచి బూట్ల చప్పుడు....
"ఎవరో వస్తున్నట్టున్నారు తాతా"
"జైలర్ అయివుంటాడు. ఇప్పుడు మనం ఇద్దరం మాట్లాడుకోవడం చూశాడంటే కొంపలు మునుగుతాయి.
"అవునూ....అడగడం మరచిపోయాను. నీ పేరేమిటి బాబూ?"
"చక్రవర్తి"
అని చెప్పి వెనుతిరిగి వెళ్ళి తన పడకపై పడుకున్నాడతను.
మొదటి ఖైదీ కూడా యధా స్థానానికి చేరుకున్నాడు.
జైలర్ బూట్లు టకటక లాడించుకుంటూ ఖైదీల సెల్స్ వైపు పరీక్షగా చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు.
* * * *
త్రీస్టార్ హోటల్!
మూడవ అంతస్థు....
రూమ్ నెంబర్ త్రీనాట్ త్రీ....
"ఈ రూమ్ తీసుకోవడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా?"
బ్లూ జీన్స్ వేసుకున్న పాతికేళ్ళ యువకుడు తనప్రక్కనే వున్న ఇరవై రెండేళ్ళ అమ్మాయితో అన్నాడు.
ఫక్కున నవ్విందామె!
మల్లెల వాన కురిసినట్టుంది ఆమె నవ్వు.
"అబ్బో! హోటల్ లో రూమ్ బుక్ చేయడానికి ఎంత కష్టపడాలో"ఎత్తిపొడుపుగా అందామె.
"భలేదానివే....నీకొక చిన్న విషయం తెలుసా?"
"ఏంటో చెబితేకదా తెలిసేది...."
"హోటల్ లో రూం బుక్ చేయాలంటే మనలాంటి వాళ్ళు ముందు ఆత్మాభిమానం అనే దాన్ని వదులుకోవాల్సి వుంటుంది"
"ఆత్మాభిమానమా...."
"అవును"
"ఆత్మాభిమానానికీ, హోటల్ గది తీసుకోవడానికీ ఏం సంబంధం వుందో నాకు అర్ధం కావడంలేదు" అయోమయంగా అందామె.
"ఆ రిసెప్షనిష్టుగాడు మన చుట్టం కాదు గదా!"
"కాకపోతేనేం?"
"రూమ్ బుక్ చేయడానికి వెళ్ళగానే వాడు అడిగే మొదటి ప్రశ్న. "ఎంతమంది" అని. "ఇద్దరం" అని చెప్పగానే అతడు అడిగే రెండవ ప్రశ్న....'హూ ఈజ్ షి" అని.
"ఓహ్! అదా ప్రాబ్లమ్....ఏం....నా గర్ల్ ఫ్రెండ్ అని చెబితే ఇవ్వరా?"
"ఎందుకు ఇవ్వరు....ఇస్తారు....కానీ అక్కడ ఇంకొక పెద్ద ప్రాబ్లమ్ ఉందే...."
"ఏంటది?"
"కౌంటర్ లో వున్నది లేడీ రిసెప్షనిస్ట్ అయితే ఫరవాలేదు....కానీ, అక్కడ మగవాడు వుంటేనే వస్తుంది చిక్కు....నాతోపాటు ఇంకొకరు వున్నారని వాడికి నీ గురించి చెప్పడమంటే....నిన్ను నేను ఇన్ డైరెక్టుగా వాడికి పరిచయం చేయడమన్నమాట."
"అందులో ప్రాబ్లం ఏం వుంది?"
"ప్రాబ్లమ్ లేదా....అది నీకెలా తెలుస్తుందిలే...."
"అబ్బ....కాస్త వివరంగా చెప్పవచ్చుకదా"
"ఏమీ లేదోయ్....వాడు మన అడ్రస్సు వగైరా నోట్ చేసుకుని, మన చేత సంతకం చేయించుకుని, ఎడ్వాన్స్ తీసుకుని రసీదు ఇచ్చేలోపు కనీసం పదిసార్లయినా నీవైపు చూస్తాడు"
"చూస్తే ఏం?"
"అమ్మో....ఈ అందమయిన అపురూప రాశిని అందులోనూ నా ప్రియాతి ప్రియమైన ప్రేయసిని నా ఎదురుగా మరొకరు చూస్తూ వుంటే అది చూసి నేను తట్టుకో గలగడమా?"
అతని అంతరంగం ఏమిటో అర్ధమయ్యేసరికి 'యూ సిల్లీ ఫెలో' అంటూ మరొకసారి ఫక్కున నవ్విందామె!
"ఆహా....ఆ మధురమైన నవ్వు....ఆ నవ్వుతోటే నన్ను చుట్టూ తిప్పుకుంటున్నావుకదూ...." ఆమెవైపు ఆరాధనగా చూస్తూ అన్నాడతను.
"యూ నాటీ....ఏమిటా మాటలు?"
"ఎస్ మైడియర్ డార్లింగ్....యు ఆర్ సో బ్యూటీ....అందుకే ఈ అందాలరాశిని అపురూపంగా చూసుకోవాలనే నా ఆరాటం."
"మాటలతో రెచ్చగొట్టకు."