ముందు పై అంతస్తులోకి వెళ్ళిన తరువాత అక్కడనుంచి యెలా వెళ్ళాలో ఏదో ఒకటి ఆలోచించవచ్చునని పైకివెళ్లే పైప్ లైన్ ను సమీపించాడు చక్రవర్తి.
ఒకరి వెనుక ఒకరు చొప్పున ముగ్గురు పైప్ లైన్ ను పాక్కుంటూ పై అంతస్తులోకి చేరారు.
అక్కడ విండోలోంచి తొంగిచూశాడు చక్రవర్తి.
విశాలంగా వున్న ఆ గది నిర్మానుష్యంగా వున్నది.
ఆ గదిలోకి ప్రవేశించి తలుపు తెరుచుకుని పై నుంచి క్రిందకుదిగారు. మెట్లు దిగుతూనే పరిశీలనగా చూశాడు చక్రవర్తి.
క్రిందిభాగం అంతా విశాలంగా వుంది.
వచ్చేపోయే గెస్ట్ ల కోసం ఆ ఆవరణ ఖరీదయిన ఫర్నీచర్ తో అందంగా తీర్చిదిద్దబడివుంది. మిగిలిన ఇద్దరినీ అక్కడే వుండమని చెప్పి మధ్య గది దగ్గరకు చేరుకుని కీహోల్ లోనుంచి లోపలకు చూశాడు చక్రవర్తి.
ఆ గదిలో ప్రశాంతంగా బెడ్ మీద నిద్రపోతున్నారు ఈశ్వరరావు దంపతులు....
తలుపు తెరుచుకుని లోపలకు వెళ్ళడం అసాధ్యం కాకపోయినా ఈ విషయం ఈశ్వరరావుకు తరువాతయినా తెలుస్తుంది.
చక్రవర్తి మెదడు వేగంగా ఆలోచిస్తోంది.
గోడమీద అలారం ఒంటిగంటా నలబై నిమిషాలను సూచిస్తోంది.
అతని ఆలోచనలు సెకన్లముల్లుతో పోటీపడుతున్నాయి.
చక్రవర్తి దృష్టి ఎత్తుగా వున్న వెంటిలేటర్ పై నిలిచింది.
దగ్గరకు రమ్మనట్టు ఒక అనుచరుడికి సైగచేసాడు.
చక్రవర్తి అతని భుజాలపైకి ఎక్కి విండో అంచును అందుకున్నాడు.
ఆ అనుచరుడి భుజానికివున్న త్రాడును తీసుకుని రెండవ చివర గట్టిగా పట్టుకోమని అతనికిచ్చి ఆ త్రాడును గదిలోకి వదిలాడు.
అతణ్ణి త్రాడు పట్టుకుని అలాగే వుండమన్నట్టు సైగచేసి నెమ్మదిగా వెంటిలేటర్ లోకి ఎక్కి కూర్చుని ముందు కాళ్ళు....ఆ తరువాత శరీరం జొనిపి అతిభద్రంగా గదిలోకి దిగాడు చక్రవర్తి.
ఆ త్రాడు అలాగే వేలాడుతోంది....
గదిలో ఎటుచూసినా నిశ్శబ్దం....
నెమ్మదిగా ఆ గది ఫ్లోరింగ్ నంతా పరిశీలించడం మొదలు పెట్టాడు చక్రవర్తి.
సమయం భారంగా గడిచిపోతుంది.
అంగుళం అంగుళం చొప్పున ముందుకు కదులుతున్నాడతను.
కానీ, ఎక్కడా బోలుగా వున్న ప్రదేశమే కనిపించలేదు.
గోడకు రెండు గజాల దూరంలో....
ఉన్నట్టుండి అతనికి కావలసిన ఓటి శబ్దం వినిపించడంతో చక్రవర్తి కళ్ళు మెరిశాయి. పరీక్షగా చూస్తే రెండు నాపరాళ్ళ మధ్య చిన్న ఖాళీ కనిపించింది. బటన్ నైఫ్ ను ఆ ఖాళీలో జొనిపి ఆ రాతిని కదిలించే ప్రయత్నం చేయగా సునాయాసంగా ఆ రాయి పైకి లేస్తున్నట్టు అర్ధమైంది.
ఒక ట్రాప్ డోర్ లా పైన ఆ రాతిని, రాతి ఫలకలా వుంచారని అర్ధమైందతనికి.
ఆ రాతిని జాగ్రత్తగా పైకి లేపి ప్రక్కనే వుంచాడు....
ఆ ఖాళీలోంచి కనిపించింది క్రిందకు వెళ్ళడానికి చెక్క మెట్ల నిచ్చెన!
క్రిందనున్న భూగృహం నిండా చీకటి....
ఆ చిమ్మ చీకట్లో పైల్ వెతకడం చాలా కష్టం....!
ఏదో అనుమానం వచ్చి క్రిందకు వంగి ఆ చీకట్లోనే తడిమిచూస్తే ఒక స్విచ్ బోర్డ్ చేతికి తగిలింది. శబ్దం రాకుండా జాగ్రత్త పడుతూ వరుసగా ఒక్కొక్క స్విచ్ ను వేసి చూశాక చివరకు అతని ప్రయత్నం ఫలించింది.
ఆ భూగృహంలోనే వెలుతురు పరచుకుంది.
ఆనందంతో మెట్లు దిగాడు చక్రవర్తి.
ఎంతోసేపు కష్టపడకుండానే ఐరన్ సేఫ్ తెరిచిన చక్రవర్తికి బ్లూ కలర్ ఫైల్ కనిపించింది.
అతని కళ్ళల్లో ఆనందంతో కూడుతున్న మెరుపు!
ఆ ఫైలు తీసుకుని పైకి వచ్చి స్విచ్ ఆర్పేసి బండను యధాస్థానంలో వుంచాడు చక్రవర్తి. తిరిగి త్రాడు దగ్గరకు చేరుకుని ఫైల్ ను నోటకరుచుకుని నెమ్మదిగా ప్రాక్కుంటూ వెంటిలేటర్ ద్వారా అవతలివైపుకు చేరుకున్నాడతను.
అప్పటికి ఈశ్వరరావు దంపతులలో ఎవరూ నిద్రలేవలేదు. ఎలాంటి ప్రతి బంధకమూ లేకుండా సునాయాసంగా ఫైలు చేజిక్కించుకున్నందుకు చక్రవర్తి మనసు ఆనందంతో గంతులు వేస్తుంది.
అంతకు ముందులానే పైపు ద్వారా క్రిందకు జర్రున జారి ప్రహరీ గోడ ప్రక్కనేవున్న తమ జీప్ దగ్గరకు చేరుకున్నాడు చక్రవర్తి.
* * *
1995....ఆగస్టు, 22....
తెల్లవారడానికి ఇంకా నాలుగు గంటల సమయం వున్నది.
ఎటుచూచినా నిశ్శబ్దం పేరుకొని వున్నది.
ఆ సమయంలో....
ఒక సెల్ లో....
నిద్రపోకుండా తీవ్రంగా ఆలోచిస్తున్నాడు ఒక ఖైదీ.
ఆ సెల్ ఎదురుగా వున్న మరొక సెల్ లోని వృద్ద ఖైదీకి అప్పుడే మెలకువ రావడంతో లేచి కూర్చున్నాడు.
ఇద్దరు ఖైదీలు ఒకరినొకరు చూసుకున్నారు.
"ఏం బాబూ....ఇంకా నిద్రపట్టలేదా?" అడిగాడు.
"లేదు తాత. నిద్రపట్టడం లేదు"
"ఏమిటాలోచిస్తున్నావు?"
"నేను ఎలాగయినా ఈ జైలు నుంచి బయటపడాలి."
అతని మాటలు విని ఆ వృద్ద ఖైదీ పేలవంగా నవ్వాడు.
"ఎందుకలా నవ్వుతావ్?"