ఆ మాటలన్నీ ఆ స్లమ్స్ లో తనకే వర్తిస్తాయ్. ఒకవేళ ఆ దండయాత్ర తనమీదే కాదుగదా?
"ఇక్కడ ఇంత రాద్ధాంతం అవుతున్నా లోపల వాడికి చీమ కుట్టినట్లయినా ఉందేమో చూడు. ఎవడేమైనా తిట్టనీ మనకేం అనుకుని పడుకున్నాడు" మళ్ళీ అంటుంది ఆడగొంతు.
"చీమూ నెత్తురూ వున్న సరుకయితే కదా మాట్లాడ్డానికి" మగ గొంతు.
"వంట్లో సీమూ, నెత్తురూ ఎక్కడుందహ. లోపలంతా నాటు సారాతో నిండిపోయి వుంది" మూడో వాళ్ళెవరో గొంతు కలిపారు.
"ఏరా దొంగనాయాలా? ఏడ్రా మీ చిన్నాన్న? ఆడంగోడిలాగా లోపల దాక్కుంటాడేంరా? రమ్మను."
మళ్ళీ నవ్వులు.
చిరంజీవికి కోపంతో ఒళ్ళు వేడెక్కిపోయింది.
సందేహం లేదు ఆ మాటలన్నీ తననుద్దేశించే.
మళ్ళీ రాజుగాడు ఏదో చిలిపి పని చేసి ఉంటాడు. అందుకే ఈ గొడవంతా!
బద్ధకంగా లేచి నిలబడి వళ్ళు విరుచుకుని లుంగీ బిగించి కట్టుకుని పెంకుటింటి బయటకు నడిచాడతను.
ఇంటిముందే నిలబడి వున్నారు రంగబాబు, అతని భార్య సీతమ్మ. రంగబాబు చేతిలో రాజుగాడి చొక్కా కాలరు.
పోలీస్ చేతిలో ఇరుక్కుపోయిన దొంగలా తలవంచుకుని నిలబడ్డాడు రాజు.
వారిచుట్టూ మూగిన చుట్టుపక్కల ఇళ్ళవాళ్ళు.
"ఏంటి మాట్లాడుతున్నారు?" అడిగాడు చిరంజీవి రంగబాబు వంక చూస్తూ.
రంగబాబు కొంచెం తగ్గాడు.
"ఏమిటేమిటయ్యా!ఇప్పటికిప్పుడే ఇది రెండోసారి వీడు మా పెరట్లో అరటిగెల నుంచి పళ్ళు కోసి దొంగతనం చేయటం. లాస్టు మినిట్ లో నేను పెరటికి వచ్చి చూడబట్టి దొరికాడు గానీ లేకపోతే మొత్తం గెల ఖాళీయేగా? ఇదివరకు ఇలాగే చేస్తే "వాడింకోసారి అలా చేయడు లెండి" అంటూ పెద్ద హామీ ఇచ్చావుగా ఇప్పుడేమంటావ్?"
"అంత చేతకానోడివి ఆ పిల్లల్ని అనాధాశ్రమంలో చేర్పించవయ్యా! శుభ్రంగా బ్రతుకుతారు. అంతేకాని దొంగలుగా చేసి దేశం మీదకి వదిల్తే ఎలా?" అతని భార్య అరుస్తోంది.
చిరంజీవికి కోపం ముంచుకొస్తోంది.
"ఆపు" బిగ్గరగా అరచాడతను.
ఆ అరుపుతో ఆమె గొంతు టక్కున మూతపడింది.
"వాడిని వదులు ముందు" రంగబాబు వేపు కోపంగా చూస్తూ అనేసరికి రంగబాబు చటుక్కున రాజుని వదిలేశాడు.
చిరంజీవి రాజు జుట్టు పట్టుకున్నాడు.
"ఏరా? వాళ్ళింట్లో అరటిపళ్ళు కోశావా?"
వాడు భయంగా తల ఊపాడు.
వాడి చెంప చెళ్ళుమంది. ఆ ఫోర్స్ కి కిందపడి చెంప పట్టుకుని బిగ్గరగా ఏడవసాగాడు. ఆ దృశ్యం చూసి అక్కడ మూగిన వారంతా చెల్లాచెదురయిపోయారు.
"ఆ అరటిపళ్ళ ఖరీదెంతవుతుందో చెప్పు! ఇచ్చేస్తాను. ఇంకొక మాట మాట్లాడావంటే అరటిపళ్ళు కాదు నీ పళ్ళు రాలగొడతాను తెలిసిందా?"
"అయితే నాలుగు రూపాయిలివ్వు"
చిరంజీవి లోపలకు నడిచి వంకీకి తగిలించివున్న తన ప్యాంటు జేబులోంచి అయిదు నోటు తీసుకొచ్చి రంగబాబు మీదకు విసిరాడు.
అతను ఆ నోటు అందుకుని వెళ్ళిపోయాడు.
రాజు నెమ్మదిగా లేచి నుంచున్నాడు కిందనుండి.
"పద ఇంట్లోకి" అరచాడు చిరంజీవి.
వాడు ఇంట్లోకి నడిచి ఓ మూల గోడ కానుకుని కూర్చుని ఏడవసాగాడు నెమ్మదిగా.
"ఎందుకురా ఆ పని చేశావ్?"
"శీను, రజని, భాను ఆకలేస్తుందని అన్నారు అందుకని..."
"అంటే వాళ్ళు ముగ్గురు కూడా స్కూలుకెళ్ళలేదూ?"
"లేదు...."
"ఎక్కడున్నారు వాళ్ళు?"
"సినిమా హాల్ దగ్గర"
చిరంజీవి షర్టు వేసుకుని బెల్టు తీసుకుని బయటకు నడిచాడు.
మెయిన్ రోడ్ కి దగ్గర్లోనే వుందా సినిమా హాల్.
ఆరోజే విడుదలయిన సినిమా తాలూకు పాటలు స్పీకర్ లో వినబడుతున్నాయి.
బయట జనం కిక్కిరిసిపోయి వున్నారు.
ఆ జనంలో జాగ్రత్తగా వెతకసాగాడతను.
చివరకు బుకింగ్ విండో దగ్గర క్యూ పక్కనే నిలబడి కనిపించారు ముగ్గురూ.
రజని క్యూలో వున్నవారికి ఓ టికెట్ చూపుతూ అరుస్తుంది.
"మూడ్రుపాయల టికెట్ ఎనిమిది రూపాయలు, మూడ్రూపాయల టికెట్ ఎనిమిది రూపాయలు ఎవరిక్కావాలి సార్. మూడు రూపాయల టికెట్ ఎనిమిది రూపాయలు గొప్ప ఫైటింగ్ లు, బూతులు వున్న అద్భుత చిత్రం కేవలం ఎనిమిది రూపాయలే సార్!"
రజని వెనుకే నిలబడి వేరుశనగ పప్పులు తింటున్నారు శీను, భానులు. రజని టికెట్ పట్టుకుని అరుస్తూ చిరంజీవి దగ్గరకొచ్చేసింది.
అతనిని చూడకుండానే టికెట్ అతనికి చూపుతూ 'మూడ్రూపాయల టికెట్ ఎనిమిది రూపాయలు" అనేసి అప్పుడు అతనిని చూసింది.
చూస్తూనే ఆమె చేతిలోని టికెట్ కిందపడిపోయింది.
కళ్ళల్లో విపరీతమయిన భయం.
"మావయ్యా" అంది ఖంగారుగా.
"ఎందుకు చేస్తున్నావీ పని?"
"అదికాదు మావయ్యా. రాజు ఇది అమ్మమని చెప్తేనూ."
ఆమె మాట పూర్తికాక మునుపే అతని చేతిలోని బెల్టు విసురుగా ఆమె నడుము మీద పడింది.
ఆమె రెండో చేతిలోని స్కూలు పుస్తకాలు ఎగిరి చెల్లాచెదురుగా పడినయ్.
"మావయ్యా" అని నడుము రుద్దుకుంటూ బిగ్గరగా ఏడ్చేయసాగింది.
శీను, భాను ఒక్క వుదుటున అక్కడినుంచి ఇంటివేపు పరుగెత్తారు.
జనమంతా మూగారు వారి చుట్టూ.
ఈసారి ఇంకో బెల్టు దెబ్బ ఆమె వీపుమీద పడింది.
"అరెరె చిన్నపిల్లను కొడతావెందుకయ్యా పోనీ" ఎవరో అతనిని అడ్డుకుంటున్నారు.