"ఎస్! టోటల్లీ జనరల్."
"జనరల్లీ జనరల్."
"జాలీ లైఫ్ లో మెంబర్లు జీవితాంతం అలా ఒంటరిగానే వుండిపోవాలి. టెంపరరీ సెటప్ లు పర్లేదుగానీ పర్మినెంట్ సెటప్ లు వుండకూడదు."
"ఏమాత్రం ఉండకూడదు."
"జై జాలీ లైఫ్" అరిచాడు ఈశ్వరరావు మందు గ్లాసు గాలిలోకి లేపుతూ.
"జై జాలీ లైఫ్" బ్రహ్మానందం, రాజేష్ ఇద్దరూ కూడా అరిచారు.
"ఇంతకూ నీ కేసేమిటి బ్రదర్?" రాజేష్ ను అడిగాడు ఈశ్వరరావు మందు కొట్టేశాక.
"మీ ఆవిడ విడాకులెందుకిచ్చింది?"
"వెరీ షింపుల్!"
"అఫ్ కోర్స్ విడాకుల కేసులన్నీ సింపుల్ గానే వుంటాయి."
"కాని నాది మరీ షింపుల్. ఓన్లీ వన్ డే మ్యారేజ్! క్రికెట్ లో వన్ డే మాచ్ అని పెట్టారు కదా! అలాగన్నమాట"
"ఒక్క రోజులో పెళ్ళీ, విడాకులూ రెండు అయిపోయాయా?"
"బ్రహ్మాండంగా"
"ఎలా?"
"వెరీ షింపుల్! పురోహితుడు కళ్ళు మూసుకుని నాలుగుసార్లు మంత్రాలు చదివేసరికి పెళ్ళయిపోయింది. శోభనం రాత్రి నేను కళ్ళు మూసుకుని, అంటే నిద్రలోనన్నమాట. శ్రీలక్ష్మి పేరు నాలుగుసార్లు కలవరించేసరికి కేన్సిలయి విడాకులయిపోయింది."
"శ్రీలక్ష్మి ఎవరు?"
"కొత్త సెటప్."
"ఓ! ఐ కెన్ అండర్ స్టాండ్."
అలా మొదలయ్యింది జాలీ లైఫ్. అది తమలాంటి జాలీ మనస్తత్వం గల ధనికుల మెంబర్ షిప్ తో దినదిన ప్రవర్థమానమై ఈ రోజు చాలా పెద్ద సంస్థ అయిపోయింది. దాంట్లో ఇప్పుడు తన కొడుకు చిరంజీవి సెక్రటరీ.
సావిత్రి మనోహర్ సింగ్ తో లేచిపోయాక, శెలవుల్లో ఇంటికొచ్చిన చిరంజీవి "డాడీ! మమ్మీ ఏది?" అని అడిగినప్పుడు తను వాడికి అబద్ధం చెప్పాడు. మమ్మీ టూర్ వెళ్ళిందని!
ఆ ప్రశ్న రెండోసారి అడక్కుండా వాడికి ఆ రోజు నుంచే బ్రెయిన్ వాష్ ప్రారంభించాడు. ఆడది అనేది అలంకారప్రాయం అని ఆడది అంటే ఎంజాయ్ మెంట్ కి ఉపయోగపడే బొమ్మ అని, ఆడది అంటే మగాడి పాలిట శాపం అనీ... ఇలా ఎన్నో హితబోధలు చేశాడు.
ఆఖర్లో వాడికి కావాల్సిన ప్రపంచజ్ఞానం వచ్చాక "మీ అమ్మ ఎవడితోనో లేచిపోయిందిరా! నిన్నూ, నన్నూ వదిలేసి ఇంకొకడితో సంసారం చేస్తోంది" అంటూ వాడినే ఆమె ఇంటికి తీసుకెళ్ళి దూరంనుంచీ సావిత్రిని చూపించేశాడు.
ఆరోజు నుంచీ వాడిక ఎప్పుడూ తల్లిని గురించి అడగలేదు. క్రమేపీ వాడి మనసులో కూడా ఆడదాని మీద చులకనభావం ఏర్పడిపోయింది. వివాహం అనేది మగాడి స్వేచ్చా స్వాతంత్ర్యాలకు ఒక అవరోధం అని అర్థమయిపోయింది.
"హలో" అంటూ ఫోన్ లో వినిపించింది రాజేశ్వరి గొంతు.
ఒక్కసారిగా తన ఫ్లాష్ బాక్ లో నుంచి బయటపడ్డాడు ఈశ్వరరావు.
"హలో రాజేశ్వరీ!"
"ఏమిటి?"
"రాజేశ్వరీ ఘోరం జరిగిపోయింది."
ఆమె గొంతులో బెదురు కనపడుతుందేమోనని ఎదురుచూశాడతను.
"ఏమిటది?" చాలా తాపీగా అడిగింది.
"మీ తమ్ముడి కోసం కట్టించిన పెట్రో కెమికల్ ఫ్యాక్టరీ రాత్రి అగ్ని ప్రమాదంలో బూడిదయిపోయిందట"
"ఇంతేనా? ఇంకేదో కొంపలు మునిగిపోయాయనుకున్నాను."
తను షాక్ తిన్నాడు.
"అదేమిటి? ఇంత పెద్ద ఘోరం జరిగితే కొంపలు మునిగినట్లు లేదా?"
"ఈశ్వరరావు! నాకు నిన్నేమనాలో తెలీటం లేదు. ఫ్యాక్టరీ అన్నాక అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. అందులో ఆశ్చర్యం ఏమిటి?"
"ఆశ్చర్యం ఏమిటంటే అది ఇంకో రెండు రోజుల్లో ప్రొడక్షన్ ప్రారంభిస్తుందనగా అగ్నిప్రమాదం జరగటం."
ఆమె నవ్వింది. "నువ్వింత పెద్ద పారిశ్రామికవేత్తవి ఎలా అయ్యావో నాకు తెలీటంలేదు. ఎలా అయ్యావ్?"
"నాకు తెలీదు" కోపంగా అన్నాడు.
"నాకు తెలుసు."
"తెలిస్తే చెప్పు"
"వంశపారంపర్యంగా ఆస్తి వస్తోంది గనక అయ్యావ్! లేకపోతే అడుక్కుతినే వాడివి"
"ఆల్ రైట్! అలాగే అనుకో."
"అగ్నిప్రమాదాలు ఫలానా రోజు జరగాలని రూలేమీ లేదు. తెలుసా?"
"తెలుసు. కానీ అన్ని కోట్లు ఇన్వెస్ట్ చేసిపెట్టిన ఫ్యాక్టరీ తగలబడిపోతే నీకది చాలా చిన్న విషయంలాగా అనిపించటం నాకు ఆశ్చర్యంగా ఉంది. ఎంత నష్టమో తెలుసా ఇప్పుడు?"
"ఫ్యాక్టరీ పోయినా డబ్బెక్కడికీ పోదుగా?"
"అంటే?"
"ఇన్సురెన్స్ వాళ్ళు మొత్తం డబ్బంతా ఇచ్చేస్తారుగా?"
ఈశ్వరరావుకి ఆశ్చర్యం కలిగింది. తను ఇంత పెద్ద పారిశ్రామికవేత్త అయ్యుండి కూడా తనకావిషయం తట్టనేలేదు. అలాంటిది ఆఫ్ట్రాల్ వ్యాపారంలో ఏమాత్రం అనుభవంలేని తన భార్య అంత తేలిగ్గా ఆ విషయం గ్రహించేయటం చాలా తమాషాగా వుంది.
"అఫ్ కోర్స్! ఇచ్చేస్తారు."
"మరెందుకు కంగారు?"
"అఫ్ కోర్స్! ఆ మాట నిజమే..."
"ఇంకేమయినా మాట్లాడాల్సింది వుందా?"
"లేదు...లేదు..."
ఫోన్ డిస్కనెక్ట్ అయ్యింది. అంతవరకూ ఈశ్వరరావులో వున్న ఉత్సాహమంతా నీరుగారిపోయింది. ఇప్పుడే కాదు. ఎప్పుడూ అంతే! రాజేశ్వరి మాట్లాడితే తనెందుకలా భయపదిపోతాడో తనకే అర్థం కావటం లేదు.