Previous Page Next Page 
అనగనగా ఓ హనీమూన్ పేజి 5


    ఆ సైక్రియాటిస్టు చెప్పిందే కరెక్టా? సావిత్రి లేచిపోయాక రాజేశ్వరితో చాలా రోజులు జాలీగానే గడిచింది గానీ రాను రాను ఆమె దబాయింపు పెరిగిపోవడం భరించలేక సైక్రియాటిస్టు దగ్గిరకు వెళ్ళినప్పుడు తనను వేసిన మొదటి ప్రశ్న ఇది.
    "మీ హాబీలేమిటి?"
    "సైట్ సీయింగ్"
    "సైట్ సీయింగ్ సమయంలో మీ హాబీలేమిటి?"
    తను వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు.
    "ఏముంటాయ్? జస్ట్ రిఫ్రెష్ అవటం."
    "ఏ పద్ధతుల ద్వారా?"
    "ఏవో చిన్న చిన్న సరదాలు"
    ఎలాంటి సరదాలు?"
    "చిన్న చిన్నవి"
    "ఫరవాలేదు చెప్పండి!"
    "తప్పదా?"
    "తప్పదు."
    "అందమైన అమ్మాయిలు" సిగ్గుపడిపోతూ చెప్పాడు.
    "అరెరె! ఎందుకలా సిగ్గుపడిపోతున్నారు?"
    "ఈ వయసులో కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది కదా?"
    "అలాంటి సైట్ సీయింగ్ లు చాలా అరుదా? తరచుగా ఉంటాయా?"
    "చాలా తరచు."
    "అలాంటప్పుడు మరి మీ రెండో భార్యతో కూడా అదే ఉత్సాహంగా ఉండగలరా?"
    "కొంచెం కష్టం!"
    "ఇప్పుడు మీకర్థమయిందనుకుంటాను!"
    "ఏ విషయం?"
    "అదే మీ రెండో భార్య దగ్గర మీరెందుకు భయపడాల్సి వస్తోంది?"
    "నాకేం అర్థంకాలేదు."
    "ఆల్ రైట్! ఇంకొంచెం వివరంగా చెప్తాను! మీ మొదటిభార్య లేచిపోయింది గనుక మీరామె గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. అందుకే జీవితాన్ని రిఫ్రెష్ చేసుకోవటం కోసం మీరు యవ్వనంలో వున్న ఓ అందగత్తెను రెండో పెళ్ళి చేసుకున్నారు. ఆమె మీద సరదా కూడా కొద్దిరోజుల్లో తగ్గిపోయింది. ఎందుకంటే 'రిఫ్రెషింగ్' అనే ఆలోచన నీ మైండ్ లోనే భద్రంగా వుంది గనుక. అందుకని మళ్ళీ సైట్ సీయింగ్ లు మొదలుపెట్టారు. అయితే మీరేం కుర్రాళ్ళు కాదు గదా...అంచేత ఓపిక రాను రాను తగ్గిపోతోంది.
    కానీ మీ రెండో భార్యేమో యవ్వనంలో ఉంది. అంచేత మీరామెకు సెక్స్ విషయంలో పూర్తి న్యాయం చేయలేరన్న నిజం మీకు తెలిసింది. ఆ క్షణం నుంచే మీరామెకు సైకలాజికల్ గా భయపడటం ప్రారంభమయి ఉంటుంది.
    ఈ పరిస్థితుల్లో దాన్ని పోగొట్టాలంటే మీరు మీ 'రిఫ్రెషింగ్' మనస్తత్వాన్ని మార్చికోవాలి. మీ సైట్ సీయింగ్స్ కి మంగళం పాడాలి. ఇప్పుడు మీకర్థమయిందనుకుంటాను."
    "అయింది" అన్నాడు ఈశ్వరరావు నుదుటిమీద చేరిన సేద బిందువులను తుడిచేస్తూ.
    "మరి మీ పద్ధతులు ఇప్పటికయినా మార్చుకుంటారా?"
    "ఊహు! అది మాత్రం కష్టమనుకుంటాను."
    "అయితే మీ రెండో భార్యను మీ యజమానిగా భావించటం అలవాటు చేసుకోండి. ఇంక సమస్య ఉండదు."
    ఈశ్వరరావు చిరాకుగా లేచి నిలబడ్డాడు.
    తన మీద యజమాని ఉండటం అన్న ఆలోచనే భయంకరంగా వుంది.
    చిన్నప్పటినుంచి నిరంకుశుడిగా పెరిగాడతను. నిరంకుశుడిగానే విజయాలను సాధించాడు. కోట్లకు కోట్లు ఆస్తిని కాపాడుకోగలుగుతున్నాడు. కానీ తను ఒక బలహీన క్షణంలో చేసిన తప్పు వల్ల తన రెండో భార్య చేతిలో బిగిసిపోవడం సహించలేకపోతున్నాడు.
    ఆలోచనల్లో నుంచి బయటపడి ఏకధాటిన మ్రోగుతున్న రెండు ఫోన్లూ ఒకేసారి అందుకున్నాడు. తమ సంస్థ లాయర్లు, ఎకౌంటెంట్స్, మేనేజర్స్ అందరూ ఆ ఫ్యాక్టరీ గురించే మాట్లాడుతున్నారు.
    సాయంత్రం మూడవుతుండగా ఆ హడావుడిలో నుంచి కోలుకున్నాడతను.
    ఎదురుగా కనకరాజు కూర్చుని ఉన్నాడు.
    కనకరాజుని చూస్తే ఈశ్వరరావుకి ఎలర్జీ. అంత అందమైన రాజేశ్వరికి ఇంత బేవర్స్ గాడు ఎలా తమ్ముడిగా పుట్టాడో ఎంత ఆలోచించినా తన ఊహ కందని విషయం. అతను నవ్వుతూంటే బంగారం పళ్ళు మెరుస్తుంటాయి.
    "ఫ్యాక్టరీ బూడిదయిపోయింది తెలిసిందాండీ?"
    "తెలిసింది"
    "అంతా మన బ్రెయినేనండీ! దుమ్ము దులిపేశాను"
    "ఏమిటి మన బ్రెయిను?" చిరాకుగా అడిగాడు ఈశ్వరరావు.
    "అదే! ఆ ఫ్యాక్టరీ అగ్ని ప్రమాదమే! మనమే చేయించాం" గర్వంగా అన్నాడు.
    ఈశ్వరరావు ఉలిక్కిపడ్డాడు.
    "ఏమిటి?"
    "అవునండీ! కేవలం మన బ్రెయిన్ వేవ్ ఉపయోగించి రూఫ్ లేపేశాం."
    "అంటే?"
    "ఫ్యాక్టరీ మెషినరీ హర్యానా నుంచి తెప్పించాం కదా! నిజానికి హర్యానా మెషినరీ తయారుచేసే వాడిని మనం మానేజ్ చేసేశామన్న మాట. ఎందుకూ పనికిరాని డామేజ్ అయిన మెషినరీని నాలుగోవంతు ధరకు తెప్పించి కొత్తదాన్లా ఇన్ స్టాల్ చేయించి ఫ్యాక్టరీ తగలబెట్టేశాం. ఇన్సూరెన్స్ వాడిప్పుడు మొత్తం డబ్బిస్తాడు. దాంతో మనకి కోటి రూపాయలు లాభం. ఎలా ఉంది బావగారూ మన ఐడియా?"
    ఈశ్వరరావు తన ఆవేశాన్ని అతికష్టంమీద అణుచుకోసాగాడు.
    ఆ కనకరాజుని అమాంతం పీకపిసికి చంపాలనుంది.
    వాడు ఇంత దారుణమైన మోసాలు చేయగలడని తనకు తెలీదు. అనుమానం కూడా రాలేదు.
    ఈశ్వరరావు కోపంగా లేచి నిలబడ్డాడు.
    "ఇలాంటి ప్లాన్ సరిగ్గా నాలుగేళ్ళక్రితం ఢిల్లీ దగ్గర్లో ఎవడో వేసి తెగ సంపాదించేశాడని పేపర్లో చదివానండీ. అప్పటినుంచి ప్లాన్ వేస్తూ వచ్చాను. అనుకోకుండా మీరు బావగారయ్యేసరికి ఆ బ్యాంక్ ల వాళ్ళు గవర్నమెంటూ, అందరూ లోన్లు ఇచ్చారు. మీ మొహం చూసే అనుకోండి. అదే నేనొక్కడినే ఇంత పెద్ద ఫ్యాక్టరీ పెడతానంటే ఎవడూ నమ్మడు. ముందు కాపిటల్ చూపించమంటారు. అందుకే మీ పేరు కూడా కలిపాను. నిజానికి ముందే ఈ ప్లానంతా మీతో చెప్పాలనుకున్నాను కాని అక్కయ్య వద్దంది. ఇలాంటి పనులు మీ బావగారికి పడవురా! వద్దంది, మానేశాను."
    "గెటౌట్" అరిచాడు ఈశ్వరరావు.
    కనకరాజు తెల్లబోయాడు. మాట ఆగిపోయింది.
    "ఎవర్ని?" అంటూ చుట్టూ చూసి ఎవరూ లేకపోవటం గమనించి అనుమానంగా లేచి నిలబడ్డాడు.
    "నీకే చెప్పేది గెటౌట్" టేబుల్ మీదున్న పేపర్ వెయిట్ చేతిలోకి తీసుకుంటూ మళ్ళీ అరిచాడు.
    అప్పుడర్థమయిందతనికి.
    బుల్లెట్ లా బయటకు దూసుకుపోబోయాడు గానీ ఈశ్వరరావు చేతిలోని పేపర్ వెయిట్ బుల్లెట్ బాబులాగా వచ్చి అతని నెత్తిని కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని కిందపడిపోయింది. కనకరాజు గావుకేక వేసి వేగం పెంచేశాడు.
    ఆ తరువాత ఈశ్వరరావు దీర్ఘమైన ఆలోచనలో పడిపోయాడు. తనకు చాలా వ్యాపారాలున్నాయి. చాలా ఆస్తులున్నాయి. అయినాగానీ తానేనాడు ఇంత దారుణంగా ప్రభుత్వాన్ని గానీ, బ్యాంక్ లను గానీ, ఇతర ఆర్ధిక సంస్థలని గానీ మోసగించలేదు. అలాంటి షార్ట్ కట్ మోసాలు తనకిష్టంలేదు. కానీ తనను అడ్డం పెట్టుకుని ఈ కనకరాజుగాడు ఇంత డ్రామా ఆడాడంటే కళ్ళు తిరిగిపోతున్నాయి.

 Previous Page Next Page