Previous Page Next Page 
అనగనగా ఓ హనీమూన్ పేజి 3


    "కాదు నేను నమ్మిందే."
    "ఛీ! సిగ్గులేని శుంఠా! అదే నిజమయితే నువ్వు సెకండ్ సెటప్ ఎందుకు పెట్టావ్?"
    ఈశ్వరరావుకి చెమటలు పట్టేసినాయి. "సెకండ్ సెటప్పా? సావిత్రీ? ఏమిటి నువ్వు మాట్లాడుతోంది" కంగారుగా అడిగాడు.
    సావిత్రి కోపం పట్టలేక ఆ పక్కనే వున్న ఫ్లవర్ వాజ్ తీసి పట్టుకుంది.
    "నాటకాలాడావంటే దీంతో తల పగలగొట్టి చంపేస్తాను. సెకండ్ సెటప్ ఎందుకు పెట్టావ్?"
    తనింకా భయపడిపోయాడు.
    "అనుకోకుండా జరిగిపోయింది."
    "నాలో లేనిది దానిలో ఏం కనిపించింది? నా వంక పరీక్షగా చూసి చెప్పు! ఫర్లేదు నేనేం అనుకోను."
    "అదికాదు సావిత్రీ!"
    "మాట మార్చావంటే చస్తావు? నేనడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు. నావంకే చూడు."
    "ఏమీలేదు."
    "ఏమీ లేనిదే రోజుకో ఆడదాని కోసం ఎందుకలా వెర్రెత్తి చస్తున్నావ్?"
    "అది నా వీక్ నెస్"
    "వీక్ నెస్ కాదు! డబ్బు మదం! సరే పోనీ రోజుకో దానితో తిరుగుతున్నావు! మధ్యలో ఈ సెకండ్ సెటప్ ఎందుకు పెట్టావు?"
    "అనుకోని పరిస్థితుల వల్ల...."
    "ఇదిగో! నీక్కావాల్సిన ఆడదానిలాగా నేనూ తయారయ్యానివాళ! రోజూ నన్ను తాగమని బలవంతం చేసేవాడివి కదా. అందుకని తాగేశాను. నీతోపాటు సిగరెట్ కాల్చమనేవాడివి కదా! కాల్చేస్తున్నాను. నేనివన్నీ చేయటం లేదనేగా దాన్ని పెళ్ళి చేసుకున్నావు?"
    "అదికాదు..."
    "అబద్ధాలు చెప్పావంటే కరాటే కిక్కిస్తాను. ఇదిగో! నీకు వార్నింగిస్తున్నాను. విను! రేపు ఉదయంలోగా ఆ సెకండ్ సెటప్ ని కాన్సిల్ చేయకపోయావో నేను మనోహర్ సింగ్ తో లేచిపోతాను."
    ఈశ్వరరావు గాభరాగా చూశాడు.
    "మనోహర్ సింగెవరు?"
    "నాతోపాటు చదివాడు. నాకు లైఫ్ లాంగ్ ఆఫర్ ఇచ్చాడు. నేనెంత వయసులో వచ్చేసినా పెళ్ళి చేసుకుంటానని. ఇప్పుడు నా వయసేం ఎక్కువ లేదు. కొత్త జీవితం మొదలెడతాను సంతోషంగా."
    ఈశ్వరరావుకేం చేయాలో పాలుపోలేదు. సావిత్రి లాంటి స్త్రీ ఇంతకాలం సంసారం చేసిన తర్వాత మొగుడ్ని వదిలి ఇంకొకడితో లేచిపోతుందంటే నమ్మటం కష్టం.
    కేవలం తనను బెదిరించటానికే అలా మాట్లాడుతుందేమో. ఏదేమయినా రాజేశ్వరి లాంటి అందాల బొమ్మను వదులుకోలేడు. సినిమా స్టార్ లా వుంటుంది రాజేశ్వరి. అదీగాక ఆమె మాంఛి యవ్వనంలో ఉంది. అదీగాక... ఇంకా చాలా కళలున్నాయి ఆమెలో.
    ఆ రాత్రి రాజేశ్వరి ఫ్లాట్ లోనే గడిపాడతను.
    ఉదయం ఇంటికొచ్చేసరికి బెడ్ రూమ్ లో మామూలుగా సినిమాల్లో కనిపించినట్లుగానే ఆమె రాసిన లెటర్ కనిపించింది.
    "ఒరే జానర్౧ నీలాంటి మృగం నాకవసరం లేదురా. ప్రేమ అంటే అర్థం తెలిసిన మనోహర్ సింగ్ తో వెళ్ళిపోతున్నాను. నీలాంటి సెక్స్ మానియేక్ గాడికి రోడ్ సైడ్ కేసులే సరైన జోడీ. చూస్తూండు! ఏదో ఒకరోజు ఎయిడ్స్ తగులుకుంటుంది నిన్ను. దాంతో కుక్క చావు చస్తావు.
                                                                    ఇట్లు
                                             ఎన్నోస్ సంవత్సరాలు మోసగింపబడిన సావిత్రి!
                                                   కేరాఫ్ మనోహర్ సింగ్-ది గ్రేట్ లవర్"
    ఈశ్వరరావుకి వళ్ళు మండిపోయింది. ఒక్కసారిగా గుండెంతా సావిత్రి మీద ద్వేషంతో నిండిపోయింది. కేవలం సెకండ్ సెటప్ పెట్టినంతమాత్రాన ఇంతకాలం కాపురం చేసిన భర్తనూ, రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్న ఆరేళ్ళ కొడుకునీ వదిలేసి వెళ్ళిపోతుందా? అసలది ఆడదేనా? భారత స్త్రీకి ఉండాల్సిన లక్షణాలివేనా?
    ఆ క్షణం నుంచీ అతనికి పెళ్ళి అంటేనే విరక్తి కలిగింది. రాత్రింబవళ్ళు మందుకొట్టి దీర్ఘంగా ఆలోచించి మగాడనేవాడు 'పెళ్ళి' చేసుకోకూడదనీ, ఇష్టం వచ్చిన అమ్మాయితో తాత్కాలికంగా గడిపి తనదారిన తను బ్రతకాలనీ కొత్త సిద్ధాంతం తయారుచేశాడు.
    ఆ సిద్ధాంతాన్ని అతని మిత్రబృందంలో చాలామంది సమర్థించారు.
    "మా ఆవిడా అంతే గురూ! నేను పాత సెక్రటరీని డిస్ మిస్ చేసి కొత్త సెక్రటరీని అపాయింట్ చేశానని నాకు విడాకుల నోటీస్ ఇచ్చింది" అన్నాడు బ్రహ్మానందం.
    "ఎందుకు? పాత సెక్రటరీ అందంగా ఉండదా?" అడిగాడు ఈశ్వరరావు.
    "ఏడ్చినట్లుంది. పాత సెక్రటరీ మగాడు"
    "ఓహోహో! అక్కడొచ్చిందన్నమాట తేడా"
    "అందుకే మనందరం కలిసి మనలాంటి జాలీ పురుషుల కోసం ఓ సంస్థ స్థాపించాలి" అన్నాడు బ్రహ్మానందం.
    "అవును, స్థాపించాల్సిందే. ఆ సంస్థ పేరు జాలీ లైఫ్!" మందు కొడుతూ అరిచాడు మరో యువకుడు రాజేష్.
    "జాలీ లైఫ్! బాగానే వుంది" అన్నాడు ఈశ్వరరావు.
    "బాగానే వుందేమిటి నీ తలకాయ్? అద్భుతం" అరిచాడు బ్రహ్మానందం.
    "జాలీ లైఫ్ జిందాబాద్!"
    "ఈ సంస్థలో చేరదల్చుకున్నవారంతా భార్యల నుంచి విడాకులు పొందిన వారయి వుండాలి!" అన్నాడు రాజేష్.
    "అవును" ఒప్పుకున్నాడు బ్రహ్మానందం.
    "దీనికి ఇంకో చిన్న సవరణ" కొంచెం సిగ్గుపడుతూ అన్నాడు ఈశ్వరరావు.
    "ఏమిటది?"
    "భార్యల నుంచి విడాకులు పొందినవారే కాకుండా లేచిపోయిన భార్యలు గల భర్తలు కూడా చేరవచ్చు అంటే బావుంటుంది. అంటే ఈ క్లాజ్ ఎవరికయినా ఉపయోగపడవచ్చు. నాకలాంటిదేమీ లేదు, జనరల్ గా చెప్తున్నాను."
    "ఓ యస్! దానికేం అబ్జెక్షన్ లేదు. లేకపోతే దానికో చిన్న క్లాజ్ పెడితే సరిపోతుంది" అన్నాడు బ్రహ్మానందం.
    "ఏమిటది?"
    "ఒకసారి లేచిపోయిన భార్యను తిరిగి అతగాడు లేపుకురాకూడదు."
    "నాకంత ఖర్మేం పట్టలేదు" కోపంగా అన్నాడు ఈశ్వరరావు.
    "అదేమిటి? మేమనేది జనరల్ గా! నీ సంగతి కాదు."
    "అవునవును! నా సంగతి కాదు! మర్చిపోయాను. జనరల్...జనరల్..."

 Previous Page Next Page