Previous Page Next Page 
జయ - విజయ పేజి 3


    "వెరీ గుడ్! అది వదిలేసరికి పదకొండవుతుందెలాగూ! అంతవరకూ మనం 'ఫ్రీ' అన్నమాట!" ఆనందంగా అన్నాడతను.
    ఆమె తలూపింది చిరునవ్వుతో.
    ఇద్దరూ థియేటర్ వేపు నడిచారు.
    అప్పటికే సినిమా మొదలయినట్లుంది.
    అతను వెళ్ళి రెండి టిక్కెట్లు తీసుకొచ్చాడు.
    ఇద్దరూ థియేటర్లోకి నడిచి ఓ మూలగా కూర్చున్నారు.
    ఏదో ఇంగ్లీష్ సినిమా అది.
    దాన్నిండా ముద్దులూ, కౌగిలింతలూ పుష్కలంగా వున్నాయ్.
    జయకు లోలోపల కొంచెం భయంగా వుంది. తనకిది మొదటిసారి. ఇలా ఓ యువకుడితో సినిమాకు రావడం.
    అతను ఆమె చేతిని అందుకుని తన పెదాలకు ఆన్చి ముద్దు పెట్టుకున్నాడు. ఆమె చేయి సన్నగా కంపించింది. ఆమె శరీరమంతా జలదరింపు కలిగింది. ఎంత హాయిగా ఉందతని కర స్పర్శ?
    "జయా!" మధురంగా వినిపిస్తోందతని గొంతు.
    "మీరెంత బ్యూటిఫుల్ గా ఉన్నారో తెలుసా? మీ అంత అందమైన అమ్మాయిని నేనింతవరకూ చూడలేదు. అందుకే మొదటిచూపులోనే మీ ప్రేమలో పడిపోయాను." ఆమె చేతిని నొక్కుతూ అన్నాడతను.
    జయ మాట్లాడలేకపోతుంది. అతని స్పర్శ తాలూకు ఆనందం ఆమెని నోరు మెదపనీయటం లేదు.
    "ఇవాళ పార్క్ కి రమ్మని నిన్న మీతో అన్నానే గాని మీరు ఇంత తేలికగా ఒప్పుకుంటారనుకోలేదు."
    జయ నవ్వింది చిన్నగా.
    ఆమె కళ్ళల్లోకి తదేకంగా కొద్దిక్షణాలపాటు చూశాడతను. చటుక్కున ఆమె కళ్ళమీద ముద్దు పెట్టుకున్నాడు.
    జయ తన్మయత్వంతో కళ్ళు మూసుకుంది.
    "జయా! నేనెంతో అదృష్టవంతుడిని!"
    "ఎందుకని!"
    "మీలాంటి అందమైన అమ్మాయి ప్రేమను పొందినందుకు!"
    "కాదు! ఆ అదృష్టం నాది."
    "నేనొప్పుకోను..."
    ఇద్దరూ నవ్వుకున్నారు.
    "నేను అలా అడగగానే మీరేమనుకున్నారు?" అడిగాడతను.
    "ఏమీ అనుకోలేదు. మీరు అడిగినట్లు చేయాలనిపించింది. అంతే!"
    "ఎందుకు?"
    "ఏమో!" ఆమె సిగ్గుపడింది.
    "నామీద ఇలాంటి భావం నిన్నే కలిగిందా. లేక మనం కలుసుకున్న మొదటిరోజే కలిగిందా?" అడిగాడతను.
    "మొదటిరోజే మీరంటే ఎంచేతో ఓ విధమయిన ఆకర్షణ కలిగింది!"
    అతను నవ్వాడు.
    "లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే అదే కదూ?"
    జయ తలూపింది.
    "ఇప్పుడు నాకేమనిపిస్తూందో చెప్పనా?" అడిగాడతను.
    "చెప్పండి!"
    "మిమ్మల్ని ఒక్కసారి తనివితీరా కౌగిలించుకుని గాఢంగా పెదాల మీద ముద్దు పెట్టుకోవాలనిపిస్తోంది."
    అతని చేతిని మృదువుగా నొక్కింది జయ. అతని మాటలు ఆమెకు ఉద్రేకం కలిగిస్తున్నాయ్.
    "ఆ అవకాశం ఎలా లభిస్తుందంటారు" అడిగాడతను.
    "ఏమో! నాకేం తెలుసు!"
    "రేపు కాలేజీ ఎగ్గొట్టి నాతో రాగలరా?"
    "అమ్మో!" భయంగా అంది జయ.
    "భయమెందుకూ?" నవ్వుతూ అడిగాడతను.
    "ఎక్కడికి రావాలి?" అడిగిందామె.
    "ఎక్కడికో నాకూ తెలీదింకా! మీరొస్తానంటే సరదాగా గడిపే స్థలం గురించి ఆలోచిస్తాను."
    "కానీ ఎందుకక్కడికి?"
    "ఊరికే! మరింతగా దగ్గరవడానికి!"
    "ఊహూ! వద్దు!"

 Previous Page Next Page