"బాగా చెప్పారండీ!" అని డెయిజీ కూడా నవ్వేసింది.
రాజారావు ముఖం విప్పారింది.
సూరి ముఖం వాడిపోయింది గటగటా గ్లాసు ఖాళీచేసి "మరచాను, నా కొక అర్జంటు ఎంగేజ్మెంటుంది ఉదయమే వస్తా ఉంటారుగా ఇక్కడే?" అని లేచాడు.
"మంచిది నన్నెందు కడుగుతావు, డెయిజీ నడుగు" అన్నాడు రాజారావు.
"రైటో, గుడ్ నైట్!" అన్నది డైజి.
"రైటో" అని గుమ్మందాకా వెళ్ళి కన్ను గిలిపి వెళ్ళిపోయాడు సూరి.
ప్రశాంతమైన వాతావరణం రాత్రి-గ్లాసుల్లో మధువు - తనముందు సుందరి ఏదో స్వర్గంలో తేలిపోతున్నట్లనిపించింది రాజారావుకు గ్లాసు ఖాళీచేసి సిగరెట్టు వెలిగించాడు ఏదో ఉద్రేకం అతన్ని బాధిస్తుంది ఎలా వ్యక్తపరచాలో తెలీడంలేదు.
రాజారావు అమాయకతలో మునిగిపోయింది డెయిజీ తానెంత మందినో చూచింది కవ్వించింది నవ్వించింది డబ్బు లాగేసింది ఇలాంటి అమాయకత ఒకే ఒకనివద్ద చూచింది అతడు జార్జి జార్జి తనకు దక్కలేదు రాజారావులో జార్జి అమాయకత కనిపించింది అతని చూపులో ఏదో ప్రార్ధన, ఏదో వినతి, ఏదో విన్నపం కనిపించింది. దానిలో అగ్గి, తృష్ణ, అధికారం, అంధకారం కనిపించలేదు.
డెయిజీ చిరునవ్వు నవ్వింది.
"డెయిజీ! చిరునవ్వులో ఎంత అందంగా ఉంటావు? ఏదీ నీ చేయి ఒక్కసారి"
"మిస్ డెయిజీ! నీతో కాఫీ తాగాలని ఎంత కాలంగానో అనుకుంటున్నాను వస్తావా కాఫీ తాగడానికి" అన్న జార్జి మాటలు గుర్తుకు వచ్చాయి వెంటనే కళ్ళు చెమ్మగిల్లాయి మెల్లమెల్లగా ఏదో దౌర్భల్యం ఆమెలో ప్రవేశింపసాగింది చెమ్మగిలిన కళ్ళు దాచడానికి లేచి కిటికీ దగ్గరికి వెళ్ళి నుంచుంది.
నగరం యావత్తూ గోతిలో ఉన్నట్లు కనిపిస్తూంది చుక్కల్లా మిలమిలా మెరుస్తున్నాయి కరెంటు దీపాలు ఒక ఉల్క రాలింది అది తనమీద రాలినట్లు జంకింది రాజారావులో జార్జి కనిపించాడు డెయిజీకి తాను వచ్చింది రాజారావును మోసగించడానికి అతణ్ణిచూస్తే తానే లొంగిపోతూంది అతణ్ణి లోబరుచుకోవలసిందని చెప్పిపోయాడు సూరి అందుకు డబ్బు కూడా పుచ్చుకున్నాడు మైకేలు రాజాను డబ్బడగాలి ఎందుకు జాలి? ఇది తన వృత్తి ఎంతమందిని తానిలా మోసగించలేదు? కాని, రాజానా? తన జార్జినా?
రాజారావు సోఫాలోనుంచి లేచివచ్చాడు డెయిజీ వెనకనుంచొని జుట్టు సవరించాడు "కోపమా డెయిజీ! ఏం కావాలో చెప్పు? నాకేదో కొత్త ఆనందం నీలో కనిపించింది డార్లింగ్ డెయిజీ! నా జీవితం ఈ రోజు నుంచే బిగిన్ అయినట్లు అనిపిస్తుంది డెయిజీ, నువ్వు నా రాణివి" అని తనవైపు త్రిప్పుకున్నాడు.
తల వంచుకుంది డెయిజీ కరిగాడు రాజారావు అతనిని పిండవలసిందని చెప్పాడు సూరి తాను దించకుండ అతడే దిగాడు ఇక అడిగేస్తే? అవును అడిగేయాల్సిందే "నిన్ను చూచింతర్వాతే నా జీవితం మొదలైంది డెయిజీ" అన్న జార్జి మాటలు గుర్తుకు వచ్చాయి ఏ మూలనో, ఎక్కడో రాజారావు గుండెలో తన విషయంలో మమత గోచరించింది దాంతో ఆమెలో ప్రవేశించిన దౌర్భల్యం మరీ పెరిగింది లొంగిపోసాగింది రాజారావును చూచింది మనిషి అందమైనవాడు కాదు పొడుగ్గా, బక్కపల్చగా ఉన్నాడు అయినా, ఏదో ఆకర్షణ కనిపించింది తాను లొంగిపోతున్నానని గ్రహించింది దూరం జరగడం మంచిదనుకుంది.
అక్కన్నుంచి కదిలింది అద్దం ముందుకు వెళ్ళి నుంచుంది అద్దంలో తానే కనిపించింది ఏదో మమత, ఏదో ఆకర్షణ, ఎక్కడో ఆనందం, ఏదో ఓటమి, ఏదో బలహీనత, ఏదో లొంగుబాటు, ఏమిటో అర్ధం కాలేదు అద్దంలోని తన ప్రతిమను అడుగుదామనుకుంది పిచ్చిది అది తానేగా! జవాబేమీ చెపుతుంది?
రాజారావు వచ్చాడు గుండె జల్లుమన్నట్లనిపించింది "డెయిజీ డార్లింగ్! ఎందుకింత కఠినురాలవు అవుతావు? ఈ రోజే ఏదో కొత్త జీవితం, కొత్త ఆనందం, కొత్త వలపు కనిపించాయి నీలో నాకు ఆస్థికి లోటులేదు కార్లున్నాయి బంగళాలున్నాయి ప్రతిష్ట ఉంది పేరుంది, పలుకుబడి ఉంది అయినా, ఇన్నాళ్ళనుంచీ కనిపించని, అనుభవించని ఏదో కొత్తదనం నీలో కనిపిస్తూంది నువు ఊఁ అంటే నా ఆస్తి యవత్తూ పోయినా సినిమా తీసి నిన్ను తారాపధానికి ఎత్తుతాను"
డెయిజీలో ఘర్షణ ఎక్కువైంది ఆమెకు తెలియకుండానే గొంతుదాకా వచ్చిన "వద్దు రాజా, వద్దు సూరి మంచివాడు కాదు నువ్వు నాశనం అవుతుంటే చూడలేను" అన్న మాటలు మింగి, "నీలో ఏదో ఆకర్షణ ఉంది నాలో ఏదో దౌర్భల్యం ప్రవేశించింది రాజా! నేను నీధాన్ని ఇక నీదాన్నే" అని అతని కౌగిలిలో వాలిపోయింది గొంతు బొంగురువోయింది కళ్ళు చెమ్మగిల్లాయి.
రాజారావు ఆమె ముంగురులు సవరించాడు ఓదార్చాడు.
ఆ రాత్రి కొందరికి చీకటి రాత్రీ, కొందరికి వెన్నెల రాత్రీ అయింది.
* * *
2
పార్వతి పాతకాలపు మనిషి అంటే చదువు రానిదని కాదు హెచ్ ఎస్సీ వరకు చదువుకుంది ఆ సంవత్సరం స్ఫోటకం పోసింది దాంతో పరీక్ష రాయలేదు తరవాత ఆమెకు చదవాలనీ అనిపించలేదు తండ్రి నారాయణరావు బలవంతమూ చేయలేదు ఆధునిక విషయాల మీద అట్టే మోజు లేదామెకు నవలలకంటేనూ రామయణ, భాగవతాల్లాంటి వాటిమీదనే ఆమెకు ఆసక్తి పౌరాణిక సినిమాలే చూస్తుంది.
పార్వతి స్వతహాగా అందమైందే చిన్నతనంలో అప్పుడే వార్చిన గంజి చెదిరి పడడంతో ముఖం కుడిభాగం కాలింది ఆ మచ్చ నేటికీ అలాగే ఉంది అది అలా ఉండగా స్ఫోటకం ముఖం నిండా మచ్చలను ఏర్పరచిపోయింది ముఖం అందాన్ని మార్చిన స్ఫోటకం మనసు అందాన్ని మాత్రం మార్చలేకపోయింది.
పార్వతికి పూజలూ, వ్రతాలూ ఎక్కువ తన పూజకోసం చిన్న పూలతోట పెంచింది ఎందరు మనుషులున్నా ఆ మొక్కలకు తానే స్వయంగా నీరు పోస్తుంది. తెల్లవారుజామున లేచి స్నానం చేసి ఆ మొక్కల పూలు తెంపి తులశమ్మకు పూజచేసి, పూజ గదిలో ప్రవేశిస్తుంది ఆ గది అలంకరణ చూస్తే ఇంటి మొత్తంలోనూ ఆ గదిమీదనే ఆమెకు శ్రద్ద ఎక్కువని గ్రహించవచ్చు త్రిమూర్తుల అనేక అవతారాలే కాక వారి భార్యాబిడ్డల సహితంగా ముక్కోటి దేవతలూ అక్కడే కాపురం పెట్టారు.
పార్వతి తడివెంట్రుకల విడిముడితో భర్త రాజారావు గదికి మూడవసారి వెళ్ళింది కిటికీలోంచి చూస్తే ఇంకా నిద్రలోనే ఉన్నాడు నిన్నటి వరకూ తెల్లవారే వరకల్లా ముఖం కడుక్కొని పార్వతి తెచ్చే కాఫీకోసం ఎదురు చూస్తుండేవాడు కాఫీ తాగుతూ కాసేపు కులాసాగా కబుర్లు చెప్పుకునేవాళ్ళు కలుగబోయే పాపను గూర్చీ, భవిష్యత్తును గురించీ, ఇంటి విషయాలను గురించీ సరదాగా మాట్లాడుకునేవారు రాజారావు బయట పడ్డాడంటే ఏ రాత్రికోగాని వచ్చేవాడు కాడు కాబట్టి అదే పార్వతికి భర్తతో మాట్లాడే సమయం.
పదైనా ఇంకా లేవలేదు ఈ రోజు రాజారావును లేపుదామనుకుంది మరొక అర్ధగంట చూద్దామని వెళ్లిపోయింది వంటమనిషితో కబుర్లు చెప్పాలని ప్రయత్నించింది కాని, ఏదో గుండె దడ, ఏదో చిరాకు కలిగింది కాలు కాలిన పిల్లిలా ఇల్లంతా తిరిగింది ఏవేవో సవరించడానికి ప్రయత్నించింది తీసినవాటిని మళ్ళీ యధాస్థానంలోనే ఉంచింది పుస్తకం చదవాలని తెరిచింది.
రాముడు లంకకు వచ్చాడు, రావణుని వధించాడు సీతను రాముని ముందు ప్రవేశపెట్టాడు విభీషణుడు సీత రాముని ముందు సిగ్గుతో కుంచుంచుకుని కొంగు ముఖాన కప్పుకొని "ఆర్యపుత్రా" అని ఏడ్చింది రాముడు తనపక్కన నుంచున్న సీతను చూచాడు అతనికి క్రోధం పెల్లుబికింది కనుబొమలు ముడిచి చురచుర పక్కచూపులు చూస్తూ "నీకు నాకు నేత్రరోగికి దీపంలా ప్రతికూలవై వున్నావు కాబట్టి, నీకు అనుమతి నిస్తున్నాను - దశ దిక్కులలో నీకు యిష్టం వచ్చిన దిక్కుకు వెళ్ళు లక్ష్మణుని వద్దగాని, భరతుని వద్దగాని సుగ్రీవుని వద్దగాని ఆత్మపోషణము చేసుకో" అన్నాడు.