Read more!
 Previous Page Next Page 
సూర్యనేత్రం పేజి 3


    "మీరు విశ్రాంతి తీసుకోండి. నేను వెళ్ళిరాగలను" లేచాడు రవి.
    "నేనూ వస్తాను" తనూ లేచింది అనిల.
    "మళ్ళీ అంత శ్రమకి తట్టుకోగలరా?"
    "ఫర్వాలేదు. లిపి నోట్ చేసుకోవటానికి మీకు మరొకరి సహాయం కావాలి"
    "థాంక్యూ"
    ఇద్దరు వెళ్ళబోతూంటే జెన్నిఫర్ అడిగింది.
    "గాలి మిమ్మల్ని విసిరెయ్యలేదా?"
    "గోడనంటుకుని నడిస్తే గాలి అంత విసురుగా సోకదు. నా చీర ఎగిరి పోతుందనే సిగ్గులో నేను గోడనంటుకుని నడిచాను. మీరు జీన్స్ లో ఉన్నారు గనుక ఆ భయంలేక మధ్యకి వెళ్ళారు."
    "ఓ" అంది జెన్నిఫర్.
    "సారీ, ఇప్పుడు రాలేను. మరోసారి తప్పకుండా వస్తాను. బహుశా మనం మళ్ళీ వెళ్ళాలి"
    "అవును. విశ్రాంతి తీసుకోండి" అనిల, రవి లోపాలకి దిగారు. ఇప్పుడు మొదటిసారి కలిగినంత భయంలేదు. జీవితంలో ఏదైనా అభ్యాసంతో సాధించగలం. ఒకరి చెయ్యి ఒకరు గట్టిగా పట్టుకుని గోడనానుకుని నడుస్తున్నారు. మళ్ళీ హోరు మంటూ చల్లని గాలి.
    అనిల టార్చిలైట్ వేసింది శిల్పాల మీద, రెండోసారి కూడా భయపెట్టాయి అవి. అతడు లిపి చూసుకునే వరకూ శిల్పాల మీదా, ఆ తర్వాత డైరీ మీదా లైట్ ప్రసారం చేస్తూ అతడి ఆ లిపిని నోట్ చేసుకోవటానికి సహకరించింది అనిల.
    టార్చిలైట్ చుట్టూ వేసి చూశాడు రవి. ఒకచోట ద్వారం కనిపించింది.
    "అక్కడ ద్వారం ఉంది" అన్నాడు ఉత్సుకతతో.
    "చూశాను"
    "వెళ్దామా?"
    "పదండి"
    ఆమె పక్కన ఉంటే తనకెంతో మనోబలం వచ్చినట్లుగా అవుతుంది. ఎలాంటి కార్యమైనా సాధించగలననిపిస్తోంది.
    ఆమె చెయ్యి గట్టిగా పట్టుకుని గోడని ఆనుకునే నడిచాడు. అతడివెంట నడిచింది. ఇద్దరూ ద్వారం దాటారు.
    ఆశ్చర్యం! ఉధృతమైన ఆ చలిగాలి లేదు. ఆ చీకటి కూడా లేదు. ఎక్కడినుంచి వస్తుందో వెలుగు ఉంది. సన్నని వెలుగు సూర్యకిరణాలకు దట్టమైన తెర అడ్డుపడితే వచ్చేలాంటి వెలుగు. చుట్టూ రాతి గోడలే వున్నాయి. ఏ రకమైన కిటికీలూ లేవు మరి వెంటిలేషన్ ఎక్కడుంది?
    ఆ వెలుగుకి కళ్ళు అలవాటు పడగానే ఎదురుగా కనిపించింది అద్భుత మనోహర దృశ్యం. గోడమీద చెక్కిన సూర్య విగ్రహం దేదీప్యమానంగా వెలుగుతుంది.
    కిరణాలుగా చెక్కినవి ఏమిటి? కెంపుగా? ఎర్ర రాళ్ళా? వాటికాంత ప్రకాశం ఎలా వచ్చింది? కెంపులే అయితే ఇంతవరకూ ఎవరూ దొంగిలించకుండా ఎలా ఉంటారు?
    ఎర్రని కిరణాల వెలుగు బింబం చుట్టూ. చిత్రంగా ఆ బింబం మధ్య ఒక నేత్రం ఉంది. ఏ రాయితో చెక్కారో, ఏ ద్రవాలు పూశారో నీలంగా మెరుస్తోంది ఇప్పటికీ ఆ సూర్యబింబం. చుట్టూ కూడా వెనుకటి లిపిలో ఏదో వ్రాసి ఉంది. పెద్ద శ్రమ లేకుండా అది నోట్ చేసుకున్నాడు రవి.
    మసక వెలుగులు క్షీణించి చీకట్లు పరుచుకోసాగాయి.
    "చీకటి పడుతున్నట్లుంది వెళ్దాం" అంది అనిల.
    "ఈ శిల్పం క్రింద కూడా ఏదో రాసి ఉండ. అది కూడా నోట్ చేసుకుని వెళ్దాం."
    "వద్దు, చీకటి పడకుండా పైకి వెళ్ళాలి. అదీగాక ముందు మనం ఈ లిపి ఏ కాలందో తెలుసుకుని దీనిని తెలుగులోకి అనువదించుకోగలిగితే తర్వాత శ్రమ లేకుండా, ఒకేసారి వెలుగులోనే నోట్ చేసుకోవచ్చు. వెళ్దాం."
    ఆమె మాట కాదనలేని బలహీనత అప్పుడే తనలో చోటు చేసుకుంటున్నందుకు భయపడ్డాడు రవి. ఈ కొద్ది రోజులు గడిచిపోయి ఈ ఎక్స్ కవేషన్ అయిపోతే, ఎవరికెవరో? ఇద్దరూ బయటికి వచ్చేసరికి బాగా చీకట్లు అలుముకున్నాయి. త్రిసికి నిటారుగా నిలబడి ఇలా అంది "మూద్దా మహారాని ప ఉమరానీ, అమ్హి ఆణవేమితుమం కహిం పి నిగ్గస్స అణ్ణహ పమాజె బవిస్సఇ"
    ఆమె మాట్లాడుతున్నది ఏ భాషో ఎవరికీ అర్థం కాలేదు.
    "ఏం మాట్లాడుతున్నావు నువ్వు?" గదమాయిస్తున్నట్లు అడిగాడు.
    అది విననట్లు ఈ లోకంలో లేనట్లూ త్రిసికి మళ్ళీ అంది.
    మూద్దా మహారాని ప ఉమరానీ, అమ్హి ఆణవేమితుమం కహిం పి నిగ్గస్స అణ్ణహ పమాజె బవిస్సఇ" అవే మాటలు మళ్ళీ మళ్ళీ అంది.
    ఆ మాటలంటున్నప్పుడు త్రిసికి ముఖ భంగిమలు చిత్రంగా మారిపోయాయి. ఏదో మహారాణులకుండే ఠీవి ఆమెలో కనిపిస్తోంది. నిలబడటంలో తలపైకి ఎత్తి చూడటంలో ఉచ్ఛారణలో హుందాతనం తొణికిసలాడుతోంది. ఇతరులను తన దరిదాపులకు రానీయని గాంభీర్య రేఖః
    కింద ఏదో కలకలం వినిపించింది. త్రిసికి ముఖంమీద నిలిచిన అందరిచూపులూ అటు తిరిగాయి.
    ఒక యువకుడు దర్పంగా వస్తున్నాడు. అతడి వెంట బోలెడు పరివారం! అనిల కనుబొమ్మలు ముడిపడ్డాయి. అతడు దేవనారాయణ్.
    త్రిసికి మళ్ళీ అంది, అవే మాటలు.
    "రండి! రండి!" దేవనారాయణ్ ని ఆహ్వానించాడు రవి.
    అతడు అంతకుముందు అనేక తవ్వకాలలో పనిచేశాడు. ఆ అనుభవంతో గ్రామ పెద్దలని, ఒకరకంగా మకుటంలేని మహారాజులని, అతి గౌరవ మర్యాదలతో మన్నించాలని గ్రహించాడు. లేకపోతే ఆ గ్రామాలలో తవ్వకం కొనసాగించలేడు. రాజ్యాలు లేని ఈ మహారాజుల సహకారం లేకుండా ఏ చిన్న పనీ సాగదు.
    దేవనారాయణ్ రవిని ఒక అనుచరుణ్ణి చూసినట్లుగా చూశాడు. పాతకాలపు జమీందారుల దర్పం అంతా ఉట్టిపడుతోంది అతనిలో.
    రవికి సమాధానమే ఇవ్వకుండా అనిలని ఉద్దేశించి అన్నాడు, కొంచెం కఠినంగా.
    "నువ్వా గుహలోకి ఎందుకెళ్ళావ్? ఆడవాళ్ళకి ఇంత సాహసం పనికిరాదు. ఒంటినిండా ఆ రక్తం మరకలేమిటి? ఏం జరిగింది లోపల?"
    తనమీద ఏదో అధికారం ఉన్నట్లు అతడలా మాట్లాడటం అనిలకి నచ్చలేదు.
    "ఇప్పుడు నేను చాలా అలిసిపోయి వున్నాను. తరువాత చెప్తాను అన్నీ..."
    "సరే!మనం ఇంటికి వెళ్దాం పద? జీప్ సిద్ధంగా ఉంది"
    "సారీ? నేను రాను. డేరాలలోనే ఉంటాను."
    కళ్ళు పెద్దవి చేసి చూశాడు దేవనారాయణ్.
    "ఏమిటీ? నువ్వు...ఆ డేరాలలో...ఒంటరిగా..."
    "ఒంటరిగా కాదు నా స్నేహితులున్నారు. నాకు చాలా పనులున్నాయి అక్కడ."
    "ఏం పనులు?"
    "నీకనవసరం." అనాలనుకుంది. కానీ అతడితో ఆ సమయంలో ఘర్షణ పడకూడదని ఆమెకీ తెలుసు.
    "గుహలో మేం ఒక లిపి చూశాం. అది ఏ కాలం నాటిదో, దాని స్వరూపమేమిటో తెలుసుకోవాలి"
    "ఎలా తెలుసుకోగలవు?"
    "మా దగ్గిర పాతకాలపు శాసనాల కాపీ లుంటాయి. వాటి సహాయంతో తెలుసుకోవచ్చు."
    "ఆ పని ఇంటి దగ్గిరే చెయ్యొచ్చు కదా!"
    "కుదరదు...ఎందుకంటే లిపి తెలుసుకోవటం ఆ లిపిలో ఉన్న విషయమేదో గ్రహించటం అంత తేలికకాదు. చాల డౌట్స్ వస్తాయి. ఇక్కడయితే రవి గారితో డిస్కస్ చేయొచ్చు."
    చివరిమాటలతో ఎర్రబడిపోయింది దేవనారాయణ్ ముఖం. అప్పటికప్పుడు అనిల్ని జుట్టు పట్టుకుని తనతో ఈడ్చుకు పోవాలనిపించింది. కానీ, ఆ పని చెయ్యకూడదని అతనికి తెలుసు.

 Previous Page Next Page