Read more!
 Previous Page Next Page 
హ్యూమరాలజీ -2 పేజి 3


    "ఏం చెప్పమంటారు?"

 

    "నువ్వీ నేరం చేసేందుకు ఏ సినిమా ప్రోత్సాహం కలిగించింది?"

 

    "అయ్యో - అసలు నేను ఏ నేరమూ చేయలేదు- ఇంకా సినిమా ఇన్ స్పిరేషన్ ఏమిటి సార్? నా తలకాయ"

 

    "ఏయ్! ఏదొక సినిమా పేరు చెప్తావా- లాఠీతో బాదమంటావా?"

 

    శాయిరామ్ కంగారుపడ్డాడు.

 

    "ఏదొక సినిమా పేరు చెప్పెయ్- వీళ్ళతో గొడవెందుకు?" అన్నాన్నేను.

 

    శాయిరామ్ సినిమా పేర్లు ఆలోచించాడు. త్వరత్వరగా.

 

    'చలిచీమలు' అన్నాడు ఠక్కున.

 

    "అదీ సంగతి! అందులో ఓ మగచీమ రెండు ఆడ చీమల్ని ప్రేమించే సీన్ ఉందికదూ?"

 

    "అబ్బే! పేరుకి చలిచీమలు గానీ అందులో మనుషులే యాక్షన్ చేస్తారండీ!"

 

    ఇన్ స్పెక్టర్ చిరాగ్గా చూసాడు.

 

    "అయితే మరి చలిచీమలు అని పేరెందుకు పెట్టారు?"

 

    "తెలీదండీ-"

 

    "అది చీటింగ్ కింద వస్తుంది. వాళ్ళమీద రేపే కేస్ బుక్ చేయిస్తాను- అయితే నువ్ ఆ సినిమాలో లవ్ సీన్ చూసి- ఆ ఇస్పిరేషన్ తో మీ కాలనీ యువతిని ప్రేమించి, ఆమె తిరస్కరించే సరికి రేప్ చేసి మర్డర్ చేసి, శవాన్ని ఎక్కడోదాచి మళ్ళా ఏమీ ఎరగనట్లు వెతుకుతున్నావ్ అవునా?"

 

    "అంతా అబద్ధం" అన్నాడు శాయిరామ్.

 

    "ముందీ స్టేట్ మెంట్ మీద సంతకం పెట్టు-"

 

    "నేను ఛస్తే పెట్టను-"

 

    "పెట్టకపోతే బొమికవిరగ్గొడతాను- మిమ్మల్నందర్నీ కూడా శవాలుగా మార్చేస్తాను-" అన్నాడు లాఠీ ఒకటి శాయిరామ్ పొట్టలో గుచ్చుతూ.

 

    శాయిరామ్ భయపడుతూ సంతకం పెట్టాడు. ఆ తర్వాత సంధ్యారాణిని మేమే మర్డర్ చేసినట్లు అందరం స్టేట్ మెంట్ మీద సంతకాలు చేసాము- లాఠీతో చావుదెబ్బలు తిన్నాక.

 

    రెండో అమ్మాయిని కూడా పెళ్ళి చేసుకోవాలన్న ఇన్ స్పిరేషన్ శోభన్ బాబు తాలూకు సినిమాల వల్ల కలిగినట్లు కూడా వప్పుకుని తలోసినిమా పేరూ రాశాము.

 

    "ఇప్పుడు చెప్పండి- శవాన్ని ఎక్కడ దాచారు?"

 

    అందరికీ ఏడుపోచ్చేసింది.

 

    "నిజంగా చెప్తున్నానండీ! మాకేపాపమూ తెలీదు, కావాలంటే ఆ అమ్మాయి తల్లిదండ్రుల నడగండీ! మేమెంత మర్యాదస్తులమో చెప్తారు-"

 

    "అదంతా తర్వాత - ముందు బయటకు నడిచి వాన్ ఎక్కండి. శవాన్ని ఎక్కడ దాచారో చూపిస్తే వదిలేస్తాం-"

 

    "మాకు తెలీదు సార్-"

 

    లాఠీతో వీపులో గుచ్చి బయటకు తోయసాగారు కానిస్టేబుల్స్.

 

    -అందరం వాన్ ఎక్కాం చేసేదిలేక.

 

    వాన్ వేగంగా పరుగెడుతోంది రోడ్ మీద.

 

    లకడీకాపూల్ వచ్చేసరికి వాన్ ఆగిపోయింది.

 

    కార్లు, బస్ లు, లారీలు, స్కూటర్ల హారన్లతో మోతెక్కి పోతోందా ప్రాంతమంతా! ఎక్కడ చూసినా జనం, వాహనాలు- కిటకిటలాడిపోతున్నారు!

 

    హఠాత్తుగా వాళ్ళల్లో నుంచి తోసుకుంటూ రంగారెడ్డి గ్రూప్ వాళ్ళు బయటికొచ్చారు.

 

    వాళ్ళను చూస్తూనే మా ప్రాణం తిరిగి వచ్చినట్లయింది.

 

    "రెడ్డీ" అంటూ గట్టిగా అరిచాము.

 

    వాళ్ళంతా ఆగిపోయి వాన్ లో నుంచి చేతులూపుతోన్న మమల్ని చూసి పరుగుతో వచ్చారు.

 

    "ఇంక మేరు వెతకనఖ్ఖర్లేదు! దిగి వచ్చేయండి! సంధ్యారాణి గంట క్రితం ఇరానీ హోటల్లో 'టీ' తాగుతూ మన కాలనీ వెంకటేశానికి కనిపించిందట-"

 

    "ఏయ్ నువ్వెవరు?" అడిగాడు రంగారెడ్డిని.

 

    "రంగారెడ్డి - కేరాఫ్ నిర్భయ్ నగర్ కాలనీ-"

 

    "అయితే నోరు మూసుకుని నీ దారిని నువ్ వెళ్ళు - వాన్ లో ఉన్న వాళ్ళను దిగమని ఎందుకు చెప్తున్నావ్?"

 

    "వాళ్ళు సంధ్యారాణి కోసం వెతుకుతున్నారు గనుక- ఇంక ఆ అవసరం లేదని చెప్తున్నాము" అన్నాడు గోపాల్రావ్ కల్పించుకుంటూ.

 

    "నువ్వెవరు?" గోపాల్రావ్ వేపు కోపంగా చూస్తూ అడిగాడు.

 

    "గోపాల్రావ్- 'ఈ క్షణం' న్యూస్ పేపర్ జర్నలిస్ట్ ని! కేరాఫ్ నిర్భయ్ నగర్ కాలనీ"

 

    ఇన్ స్పెక్టర్ మొఖంలో రంగులు మారాయ్.

 

    "జర్నలిస్ట్ అయితే పెద్ద పోటుగాడినను కుంటున్నావా? పో, ఇక్కడనుంచి!"

 

    "మాటలు మర్యాదగా రానీయండి!" అన్నాడు గోపాల్రావ్.

 

    ఇన్ స్పెక్టర్ కి కోపం ఆగలేదు.

 

    "రాస్కెల్! నాకే వార్నింగిస్తున్నావ్ రా నువ్వూ" అంటూ వాన్ దూకి వెళ్ళి గోపాల్రావ్ కాలర్ పట్టుకున్నాడు.

 

    దాంతో జనమంతా హడావుడిగా వాళ్ళ చుట్టూ మూగిపోవటం మొదలుపెట్టారు. ఆ జనాన్ని చూచి మరో పోలీస్ జీప్ వచ్చి ఆగిందక్కడ.

 

    "నా చొక్కా పట్టుకుంటావా? రేపే ఈ ఓణంలో ఈ న్యూస్ ఫోటోతో సహా వేసేస్తాను. నీ అంతు తెల్చేస్తాను-" అరవసాగాడు గోపాల్రావ్-

 

    దాంతో ఇన్ స్పెక్టర్ కి భయం మొదలయింది.

 

    ఈలోగా జీప్ దిగి మరో పోలీస్ అధికారి వచ్చాడు.

 

    "వాటీజ్ ది మేటర్?" అడిగాడు ఇన్ స్పెక్టర్ ని.

 

    అదే అదనని మేమంతా వాన్ దూకి వాళ్ళ దగ్గరకు పరుగెత్తాం. జరిగిందంతా విన్నాడతను.

 

    "అయితే ఆ అమ్మాయి గంటక్రితం ఈ ఏరియాలో కనిపించిందంటారు!"

 

    "అవునండీ-"

 

    "ఒకవేళ మీ మాట అబద్దమని తేలితే మళ్ళీ మిమ్మల్నందరినీ మూసేస్తాం-"

 

    "అలాగేసార్-"

 

    "ఇంక పొండి-"

 

    మారు మాట్లాడకుండా అందరం కాలనీ వేపు బయల్దేరాము. సంధ్యారాణి ట్రాఫిక్ జాములో ఇరుక్కుపోయిందన్న విషయం కాలనీ అంతా చెప్పేశాం!

 

    "నేను ముందే అనుకున్నా! ఈ రోజుల్లో మన ట్రాఫిక్ పోలీసుల సమాఖ్య బాగా పెరిగిపోయింది కదా! అంచేత ట్రాఫిక్ జామ్ లు కూడా ఖచ్చితంగా పెరిగిపోతాయని" అంది రాజేశ్వరి.

 

    "పెరిగిపోతాయ్ ఏమిటి నా మొఖం! ఈ ఏడు ప్రపంచ ట్రాఫిక్ జామ్స్ పోటీల్లో హైదరాబాద్ నగరం ప్రథమ బహుమతి గెల్చుకుందని మా అన్నయ్య కొడుకు వారం క్రితం అమీర్ పేట ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్నప్పుడు ఓ దినపత్రికలో చదివాడట-" అంది పార్వతీదేవి.

 

    "గెలవక ఛస్తుందా? ట్రాఫిక్ పోలీస్ లెక్కువయిన కొద్దీ అంతేమరి-"

 

    అందరం ట్రాఫిక్ జామ్ కబుర్లలో మునిగిపోయాం.

 

    "మా బాబాయి వాళ్ళిల్లు మీ అందరికీ తెలిసిందే కదా! నారాయణ్ గూడా చౌరస్తా పక్కనే ఉంది. కిందటి సారి ట్రాఫిక్ జామ్ ఏర్పడినప్పుడు ఆ ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన చాలామందికి రెండు రోజులపాటు తన ఇల్లంతా అద్దెకిచ్చాడాయన. ఈ రెండు రోజుల్లోనే అయిదువేలు ఇన్ కమ్ వచ్చింది. ఆ తరువాత ఆ యింటిపేరు ట్రాఫిక్ జామ్ రిలీఫ్ సెంటర్ అని మార్చేశాడు. సంవత్సరం తిరగలేదు- ఒక అంతస్థల్లా ఇప్పుడు దానిమీద పది అంతస్థులేశాడు- దానిమీద వచ్చిన ఇన్ కమ్ తో-" అన్నాడు వెంకట్రావ్.

 Previous Page Next Page