ఇలా సతమతమైవుతూ వుండగా మనోరమ ఒకనాడు తన తండ్రికి ట్రాన్స్ ఫరయిన సంగతి చెప్పింది. ఆయనకు విజయనగరం బదిలీ అయింది. అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవటంలో కలిగిన బాధలోని పత్యం గుర్తించింది మనోరమ.
ఆమెలో పసితనం నశించినట్లయింది. చిలిపితనం అంతరించినట్లయింది. ఆమె బాధపడింది. కనులలో నీరు తిరిగింది. అతని జుట్టులోకి చెయ్యిపోనించి "రామూ" అంది ప్రేమగా.
ఈ పిలుపు! అతడి శరీరం రోమాంచితమయింది. కొత్తగా ఏదో స్ఫురించిన అనుభూతి కలిగింది.
"ఎందుకు కన్నీరు?" అడిగాడు లాలనగా.
"మిమ్మల్ని విడిచిపోలేను."
అతని హృదయం నీరుగా మారింది కర్తవ్యం స్పురించలేదు.
"ఈ విషయం యిన్నాళ్ళూ ఎందుకు చెప్పలేదు?" అన్నాడు మృదుకంఠంతో.
మనోరమ హృదయం విప్పి, సిగ్గువిడిచి తనని పెళ్ళి చేసుకొమ్మని అడిగింది.
రామం నిస్వార్థంగా ఆలోచించాడు. తానింకా తలిదండ్రులమీద ఆధారపడి వున్నాడు. తన స్థితే చాలా అస్థిమితంగా వున్నది. పెళ్ళిచేసుకుంటే ఏమి సుఖాన్ని పొందగలడు?
"నాకోసం కొన్నిరోజులు వేచివుంటావా?" అని అడిగాడు.
"ఏం?"
"నేను ఉద్యోగంకోసం ప్రయత్నిస్తున్నాను. వెంటనే కాకపోయినా కొన్నిరోజుల్లో దొరకవచ్చు. అప్పుడు నిన్ను స్వీకరిస్తారు" అన్నాడు.
మనోరమ అంగీకరించింది.
ఆమె విజయనగరం వెళ్లిపోయింది.
రామానికి తెలుసు తన తండ్రికి తమని పోషించటం కష్టమని. ఆయన రిటైరైనాడు. వచ్చే పెన్షన్ మీద, ఆర్జించిన పొలంవల్ల వచ్చే రాబడి మీద తమ సంసారం జరగాలి. జీవితంలో పైకి రావటం ఎలాగా అని రామం ఆలోచించాడు. ఇంజనీరో, డాక్టరో చదవటం తప్పితే పైకి రావటానికి వేరు మార్గం లేదా? మరి యింతమంది ఆఫీసర్లు ఎలా అవుతున్నారు? తాను ఒకవేళ యం.ఏ. ప్యాస్ అయినా ఏ కాలేజీ లెక్చరర్ గానో ఉద్యోగం వెదుక్కోవట మేగా, ఏమిటి మార్గం? అతనిలో పైకి రావాలన్న ఆరాటం అధికం కాసాగింది. అన్ని కంపెనీలలో అప్లయి చేశాడు.
ఏది చూసినా నూరు నూటయాభయి రూపాయల ఉద్యోగం. అందులో ఎన్నాళ్ళకి ఎదుగుతాడు?
అతని మనసు వ్యాపారంమీదికి పోయింది.
అవును, వ్యాపారం. అదృష్టం వుంటే వేలకువేలు సంపాదించవచ్చు. కాని రిస్క్ లేని వ్యాపారం ఏదీ కనబడలేదు. ఏదయినా ఫారిన్ కంపెనీ ఏజన్సీ తీసుకుంటే బాగానే వుంటుంది. కాని దానికి బోలెడు డబ్బు డిపాజిట్ కట్టాలి. పెట్టుబడిలేని వ్యాపారం తనకు తెలియదు. ఈ కంట్రాక్టులు, ఇవన్నీ చెయ్యటమెలాగో అతని ఊహకందని విషయం.
అతనిలా సతమతమవుతోన్న రోజుల్లో పరిచయస్తుడయిన ఓ మనిషి కనిపించాడు. ఆయన కెమిస్టు. చాలాకాలంగా అనేక కంపెనీలలో పనిచేసి ఆ ఉద్యోగాలు చెయ్యటం యిష్టంలేక, ఏదోమార్గంలో స్వతంత్రంగా బ్రతుకుదామని ఆలోచిస్తున్నాడు. "ఈ ప్రాంతంనుండి సరియైన సోప్ మ్యాన్ ఫ్యాక్చరింగ్ లేదు నేను ఫస్టుక్లాసయిన సబ్బుల్ని తయారు చెయ్యగలను. సోప్ ఇండస్ట్రీస్ ప్రారంభిద్దామంటే యిద్దరం వాటా కలుద్దాం. బిజినెస్ యింప్రూవ్ చేసే పూచి నాది" అన్నాడాయన.
రామానికి ఈ అభిప్రాయం బాగానే వున్నట్లు తోచింది. కాని పెట్టుబడి ఎలా వస్తుంది?
చెరి ఒక అయిదువేలన్నా వేసుకుంటేనేగాని నడవదని చెప్పాడా పెద్దమనిషి సోమయాజులుగారు.
ఈ విషయం తండ్రిదగ్గర ఎలా బయటపెట్టడమో తెలియక బాధపడ్డాడు. కొన్నిరోజులు తల్లితోనయినా ముభావంగానే వుంటాడయ్యె. చివరికి ఆమెకే చెప్పక తప్పలేదు.
భర్త యింత మొత్తం యివ్వటానికి ఒప్పుకుంటాడా అని భయపడింది లలితమ్మగారు. కాని రోజురోజుకూ రామం పోరు ఎక్కువయ్యేసరికి విధిలేక భయపడుతూ భయపడుతూ భర్తనడిగింది.
విశ్వనాథంగారికి వ్యాపారమంటే అసహ్యం. పెద్ద పెద్ద చదువులు చదువుకొనీ గొప్ప ఉద్యోగస్థులవడమే ప్రయోజకత్వంగాని... యితర విధానాల పట్ల ఆయనకు గురిలేదు.
లలితమ్మగారు మళ్ళీమళ్ళీ ప్రాధేయపడేసరికి ఆయన మరీ మండిపడ్డాడు. పైగా తన పెద్దకొడుకు సమర్థతమీద ఆయనకేమీ నమ్మకంలేదు. "ఇలాంటి చచ్చుపనులకి ఒక్కదమ్మిడీ కూడా యివ్వను" అన్నాడు గట్టిగా అరుస్తూ.
ఈ అరుపులు రామం చెవినపడినాయి. అతని అహం దెబ్బతింది. ఈ యింట్లో అన్నం తినకూడదన్నంత కోపం వచ్చింది. ఆ సాయంత్రం అలా తీవ్రమయిన ఆలోచనలతో, వాడిపోయిన ముఖంతో కుళాయిచెరువు వయిపు పోతూ, సిగరెట్ లకోసం గురువులు కిళ్ళీకొట్టుదగ్గర ఆగాడు.
"అలా వున్నావేం రాంబాబూ?" అని అడిగాడు నలభై అయిదేళ్ళ గురువులు. తమ కుటుంబానికి సన్నిహితుడయిన గురువులు.
"మనసేం బాగుండలేదు గురువులూ" అన్నాడు రామం మ్లానవదనంతో.
"ఏం?"
రామం కారణం చెప్పాడు. గురువులికి అర్థమయేటట్లు, సానుభూతి కలిగేటట్లు, తన ప్రయోజకత్వంమీద నమ్మకం కలిగేటట్లు.
"నాన్నగార్కి నేను చెబుతాలే బాబూ" అన్నాడు గురువులు జాలిగా.
ఆ రాత్రికి రాత్రే వెళ్ళి పెదబాబు మనసు కష్టపెట్టవద్దని విశ్వనాథంగారికి ఎంతో నచ్చచెప్పాడు అతను.
ఆయన చివరకు "అయిదువేలు ఎక్కడ్నుంచి తీసుకువచ్చేది గురువులూ?" అని గోలపెట్టాడు.
"పెదబాబు చాలా ఆవేశపరుడు బాబుగారూ! తను అనుకున్నది నెరవేరేవరకూ మామూలు మనిషి కాలేడు. అయినా అతనికి ఉద్యోగాలు చెయ్యాలని లేదు. ఎట్లా ఏర్పడిందో దీనిమీద గురి ఏర్పడింది. ఇందులో పైకి రావొచ్చని నాక్కూడా తోస్తూ వుంది. మీరెంత మొండికెత్తినా అతన్ని మరింత మొండివాడ్ని చేయటం తప్ప వేరే ఫలితం వుండదు. నామాట వినండి" అన్నాడు గురువులు హితోపదేశం చేస్తున్నట్లుగా.