Previous Page Next Page 
చిక్కలేదు చిన్నదాని ఆచూకీ... పేజి 4


    ఆ వస్తువు ట్రైన్ టిక్కెట్ అని.

 

    ఎప్పుడూ స్వంత ఫ్లయిట్లో తప్ప తిరగని తాతయ్య చేతిలో ట్రైన్ టిక్కెట్...?

 

    ఆశ్చర్యంగా చూశాడు శ్రీధర్ తాతగారికేసి.

 

    "దిసీజ్ ఆర్డినరీ స్లీపర్ కోచ్ టిక్కెట్...నీ కోసమే తెప్పించాను. మధ్యాహ్నం రెండుగంటలకు ట్రైన్, అది బొంబాయి నుంచి హైదరాబాద్ వెళుతుంది. ఆ ట్రైన్ లో నువ్వు హైదరాబాద్ వెళతావు" భౌతికంగా అయన వృద్ధుడయినా, ఆయన కంఠంలోగాని, గంభీరమయిన బేస్ వాయిస్ లోగాని, ఏమాత్రం మార్పులేదు.

 

    తన చిన్నప్పటి నుంచి అయన కంఠం అలాగే వుంది.

 

    ఎవర్నో శాసించటానికే ఈ భూమ్మీద వున్నట్లుగా వుంటాడు ఆయన.

 

    కేవలం శాసించడానికేకాదు-అనుకున్నది, అంచనా వేసుకున్న టైమ్ లోనే సాధించుకోందే నిద్రపోని మొండివాడు.

 

    "నేను... హైదరాబాద్ వెళ్ళాలా? ఎందుకు? అందులోనూ డర్టీ ఇండియన్ రైల్వేలో... అందునా సెకండ్ క్లాస్ కంపార్ట్ మెంట్లో...?" విభ్రాంతిగా తన తాతగారికేసి చూస్తూ అడిగాడు శ్రీధర్.

 

    "ఎస్! చిన్న సూట్ కేస్ తో, రెండు జతల దుస్తులతో, నువ్వు సెకండ్ క్లాస్ కంపార్ట్ మెంట్లో, మేనేజ్ మెంట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ఒక మామూలు నిరుద్యోగిలా హైద్రాబాద్ రైల్వేస్టేషన్ లో అడుగు పెడతావు. అక్కడ నాకో ఫ్రెండ్ వున్నాడు. ఆ ఫ్రెండ్ ఫోన్ నెంబరు, అడ్రస్ యిస్తాను... వెళ్ళి కలుసుకో! అదీ ఈ తాతకి మనవడిగా కాదు. ఈ తాతకి తెలిసిన ఒక సాధారణ వ్యక్తి కొడుగ్గా" చెప్పి ఆయన నడవడం ప్రారంభించాడు తిరిగి.

 

    ఆయనేం చెప్పాడో, ఏమీ అర్థంకాలేదు శ్రీధర్ కి.

 

    ఇంత హఠాత్తుగా ఈ నిర్ణయమేమిటి? కొన్ని వేల జతలుండే వార్డ్ రోబ్ ని వదిలేసి, కేవలం రెండు జతలతో హైద్రాబాద్ ఎందుకు వెళ్ళాలి...?

 

    తాతయ్య తన విషయంలో ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు?

 

    దీని వెనుక ఏదో అర్థం... పరమార్థం లేనిదే ఇలా చెయ్యడు- అదేమిటి?

 

    "ఎందుకు డాడీ ఇదంతా?" తన స్వభావానికి విరుద్ధంగా మొదటిసారి తాను తండ్రిగా చూసుకొనే తన తాతగార్ని అడిగాడు.

 

    శ్రీధర్ చిన్నప్పట్నుంచి తన తల్లి దండ్రుల దగ్గర పెరగలేదు. తాతయ్య గుండెలమీద ఆడాడు- ఒడిలో పెరిగాడు. అందుకే శ్రీధర్ ఎప్పుడూ తన తాతగార్ని డాడీ అనే సంభోదిస్తాడు. అప్పుడప్పుడూ సరదాగా తాత, తాత డాడీ అనికూడా పిలుస్తుంటాడు. శ్రీధర్ అంటే ఆయనకు ప్రాణం.

 

    "ఇప్పుడు నీకు చెప్పడంవల్ల ఉపయోగంలేదు. నువ్వు హైద్రాబాద్ లో ఆరునెలలు మాత్రమే వుంటావు. అంటే సరిగ్గా 180 రోజులు. ఈ ఆరునెలల్లో ఉదయించే అనేక ప్రశ్నలకు జవాబు ఆటోమేటిగ్గా నీకే తెల్సి పోతాయి... దట్సాల్" అన్నాడాయన ఆరోజు.

 

    తాతయ్య చెప్పినట్లుగా శ్రీధర్ ఆరోజే ట్రైన్ ఎక్కాడు.

 

    ఇది జరిగి సరిగ్గా 20 రోజులయింది.

 

    ఏవో రెండు బ్రెడ్ ముక్కలు తిని, ఆ రాత్రికి భోజనం అయిందనిపించి బెడ్ మీదకు చేరుకున్నాడు.

 

    తిరిగి అవే ఆలోచనలు.

 

    అపర్ణ ఎప్పుడు డాన్సుప్రోగ్రామ్స్ ఇవ్వడం అవుతుంది?

 

    ఎప్పుడు పెళ్ళికి అంగీకరిస్తుంది ? అసహనంగా అటూ, ఇటూ కదిలి ఫ్యాన్ ఫుల్ స్పీడ్ లోపెట్టి, చలి పెరిగినట్టనిపించగా, ముసుగుపెట్టేసి, బలవంతంగా తనను తాను నిద్రలోకి జార్చుకున్నాడు.


                                                  *    *    *    *


    సరిగ్గా అర్థరాత్రి పన్నెండుగంటలకు అసంకల్పితంగానే మెలుకువ వచ్చింది శ్రీధర్ కి.

 

    తిరిగి అపర్ణ గురించి ....

 

    అపరాచితురాలి గురించి....

 

    ఆలోచించ సాగాడు.

 

    అపర్ణ పెళ్లికి ఎందుకు ఒప్పుకోవడం లేదు ?

 

    తనకేం తక్కువ?

 

    చీకటి సముద్రంలాంటి స్త్రీని ఏ వెలుగుతో చూడాలి ?

 

    ఏ కిరణాల్ని కళ్ళకు ఆసరా చేసుకోవాలి ?

 

    మగాడికి స్త్రీ ప్రేమగల శత్రువు....

 

    నిజమే - నిజంగానే దయగల శత్రువు....

 

    ఆలోచిస్తున్నాడు శ్రీధర్ .... అతని మెదడంతా గజిబిజిగా వుంది. అతను అపర్ణ ఫోన్ కాల్ కోసం వస్తే, రాంగ్ నెంబర్ ఫోన్ కాల్ రావడం, అందులో పేరు తెలీని అమ్మాయి టీజింగ్ గా మాట్లాడడం, అంతా ఆశ్చర్యంగా వుంది. సర్ ప్రైజింగ్ గా వుంది కూడా... పైగా ఫోన్ చేసిన నెంబర్ తనదే.... తనకా నెంబర్ కావాలని కూడా అంది. నిజంగా ఆమెకి రావనే వ్యక్తి కావాలా ?

 

    12155 అంటే ఏమిటి ?

 

    అతని బుర్ర నిండా 12155 నిండిపోయింది. నిద్రపూర్తిగా ఎగిరిపోయింది. టక్కున మంచం మీంచి లేచి, టేబుల్ మీదున్న పెన్ పాడ్ తీసుకొని డ్రాయింగ్ హాల్లోకొచ్చి, గ్లాస్ విండోస్ కి వున్న కర్టెన్ తొలగించాడు... తిరిగొచ్చి సోఫాలో కూర్చొని రైటింగ్ పాడ్, బాల్ పెన్ను తీసుకుని, 12155 సాల్వ్ చేయడానికి ప్రయత్నించసాగాడు.

 

    ఇరవై నిమిషాలు గడిచాయి.

 

    చికాగ్గా రైటింగ్ పాడ్, బాల్ పెన్ను టీపాయ్ మీద పడేసి, ఏదో పనున్న వాడిలా డ్రాయింగ్ రూమ్ లో పచార్లుచేయడం ప్రారంభించాడతను. ఇంతవరకు శ్రీధర్ - కాన్ సన్ ట్రేషన్ అంతా అపర్ణమీద వుండేది....అపర్ణ....

 

    కాలిఫోర్నియో -ఆల్బన్ యూనివర్శిటీలో తను ఎం.బి.ఏ. చేరిన రెండోరోజే అపర్ణ తనకు అక్కడ పరిచయమయింది. ఆమె కూడా అదే యూనివర్శిటీలో ఎం.బి.ఏ. చేయటానికి, తనలాగే ఇండియానుంచి వచ్చింది.    

 

    ఇద్దరి మధ్య తొలి అనుసంధానం... తెలుగు భాష, తెలుగు వారు కావడం... అపర్ణ ఇండియాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి, అమెరికాలో ఎం.బి.ఏ. చేసేందుకు వచ్చేటప్పటికే ఆమె మంచి డాన్సర్ అన్న విషయం తమ పరిచయం స్నేహంగా మారిన తరువాత తెలిసింది.

 Previous Page Next Page