Previous Page Next Page 
చిక్కలేదు చిన్నదాని ఆచూకీ... పేజి 3


    నయాగరా జలపాతంలా తుళ్ళుతూ నవ్వుతూ అంది.

 

    శ్రీధర్ కి నిజంగానే పిచ్చెక్కినట్టయింది.

 

    "ఆ మాత్రానికే పిచ్చెక్కినట్టయిపోతే ఎలాగయ్యా... బాబు. నీ లవర్ అపర్ణ ఫోన్ కోసమే... కదా ఎదురుచూస్తున్నావ్... ఇంతకీ రావుగానీ, గౌడగాని లేరంటావ్..."

 

    శ్రీధర్ కేం చేయాలో తోచక పిడికిలి బిగించి నుదురుకేసి కొట్టు కుంటున్నాడు.

 

    "ఎందుకయ్యా అందమైన నుదురునలా కొట్టేసుకుంటున్నావ్. ఆటైంలో నిన్నెవరైనా చూస్తే నీకు పిచ్చి పట్టిందనుకుంటారు."

 

    శ్రీధర్ కి షాక్ తిన్నంత పనయింది.

 

    ప్రత్యక్షంగా చూసినట్టే ఊహించి చెబుతున్న ఆ అమ్మాయిని ఎలా అర్థం చేసుకోవాలో శ్రీధర్ కేం తెలీడంలేదు.

 

    జుట్టు పీక్కోవడం, నుదురు కొట్టుకోవడం ఆపేసి బుద్ధిగా, ఒద్దికగా కూర్చున్నాడు శ్రీధర్.

 

    "తుళ్ళిపడవలసిన యవ్వనంలో అలా రాయిలా కూర్చోవడం నాకు మహా చెడ్డ చిరాకు. ఇంతకీ ఈ నెంబరు 366999 కదా? అయితే రావుండాలే. నువ్వేదో దాస్తున్నావని నా అనుమానం...?"

 

    శ్రీధర్ కి ఏడుపొచ్చినంత పనయింది.

 

    "మొగాళ్ళేడిస్తే బాగోదోయ్."

 

    "రావు నీ మొగుడా? నీ లవరా? నీ కీపా?"

 

    విపరీతమైన అసహనానికి లోనవుతూ అడిగాడు శ్రీధర్.

 

    "నాకు పెళ్ళికాలేదు కాబట్టి మొగుడుండే అవకాశం లేదు. నువ్వూహించినట్టుగా పి.వి. నరసింహారావును ప్రేమిద్దామనుకుంటే ఆయన కేసుల్లో ఇరుక్కు పోయి కొట్టుకుంటున్నాడు. గౌడని ప్రేమిద్దామనుకుంటే ఆయనెప్పుడు నిద్ర లేస్తాడో తెలిసిచావదు. చివర్లో నువ్వు అనుకుంటున్నట్టుగా కీప్ చేద్దామనుకుంటే నువ్వేమో చిరాకుపడిపోతున్నావు. ఇంకెలా?"

 

    "నీకు జీవితాంతం రుణపడివుంటా నన్నొదిలెయ్."


    
    "అమ్మదొంగా. నా దగ్గర అప్పు చేద్దామనా?"

 

    "నేనా? అప్పా? నీ దగ్గరా?"

 

    "ఇప్పుడే కదా జీవితాంతం ఋణపడి వుంటానన్నావ్!"

 

    "బుద్ధిలేక ఏదో మాటవరసకన్నా, అలాగన్నా నన్ను వదిలేస్తావని."

 

    "నిన్ను చూస్తే జాలేస్తుందోయ్... వదిలేస్తాలే. నేను వదిలేస్తేనే కదా, నీ లవర్ అపర్ణతో నీవు మాట్లాడుకునేది! కానీ నాకోటిస్తే నిన్నొది లేస్తా !"

 

    "త్వరగా చెప్పేంటో."

 

    "నాకు 12155 కావాలి."

 

    "వాట్...? 12155 ... అదేంటి? ఫోన్ నెంబరా? గ్యాస్ కనెక్షనా? కారు నెంబరా? ఇంటి నెంబరా?" విస్మయంగా అడిగాడు శ్రీధర్.

 

    "అవేవీ కావు. ఒక వయసులో వున్న అమ్మాయి ఒక వయసులో వున్న అబ్బాయిని అడిగేది 12155."

 

    "ఆలోచించు అదేమిటో..." ఆమె గొంతు హస్కీగా ఉంది- మత్తుగా ఉంది- గమ్మత్తుగా ఉంది.

 

    అప్పటివరకూ ఎంతో అసహనానికి గురై, చిరాకు పడిపోయిన శ్రీధర్ ఆమె విసిరినా పజిల్ అర్థంకాక, అసంకల్పితంగానే ఆలోచించడం మొదలెట్టాడు.

 

    నిముషం... రెండు నిముషాలు... మూడు... నాలుగు.

 

    ఆలోచిస్తున్నాడు...తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. మదనపడిపోయి మరీ ఆలోచిస్తున్నాడు.

 

    ఇప్పుడతనికి అపర్ణగానీ, ఆమెనుంచి వచ్చే ఫోన్ కాల్ కానీ గుర్తుకులేవు.

 

    అదే పనిగా ఆమె అడిగిన 12155 గురించే, ప్రపంచ ఆర్ధిక సమస్య అంత తీవ్రంగా ఆలోచిస్తున్నాడు.

 

    "పోనీ ఒక పనిచేద్దాం. నీక్కొంత టైం యిస్తా. ఈలోగా ఆలోచించు. ఇది చెప్పలేకపోతే నువ్వు ప్రేమించడానికి పనికిరావు!?" అని ఆమె అంటుండగానే ఫోన్ డిస్ కనెక్ట్ అయిపోయింది.

 

    కళ్ళెదురుగా మనోహర దృశ్యం అకస్మాత్తుగా మాయమైపోతే ఎలా వుంటుందో అలా వుంది ఇప్పుడు శ్రీధర్ మానసిక పరిస్థితి. తనూ ఫోన్ ను క్రెడిల్ చేసి, ఆమె చెప్పిన పజిల్ గురించి ఆలోచిస్తూ అన్నీ మర్చిపోయాడు శ్రీధర్.

 

    ఇంతకీ ఒక వయసులో వున్న అమ్మాయి వయసులో ఉన్న అబ్బాయిని ఏమడుగుతుంది? అడగాల్సినవి ఏయేవో వదిలేసి అంకెల్ని అడగడంలో అర్థం ఏమిటి?

 

    అతను డ్రస్ మార్చుకోవడం కూడా మర్చిపోయి ఆమె ఆలోచనల్లోనే కూరుకుపోయాడు.

 

    అలా ఆ ఆలోచనల్లో... ఆ అపరిచితురాలు విసిరినా పజిల్ గురించి ఎంతసేపాలోచించాడో అతనికే తెలీలేదు.

 

    అవును...ఇదేమిటి...ఇలా...జరిగింది ?

 

    అపర్ణ ఏమయిపోయింది? అపర్ణ ఫోన్ కాల్ ఏమయిపోయింది...?

 

    ఫోన్ చేసి... చేసి తన ఫోన్ ఎంగేజ్ లో వుండడంతో విసుగేసి, కోపగించుకొని ఫోన్ చేయడం మానేసిందా? అదే జరిగుంటుంది.

 

    ఇంకోసారి ఇలా జరక్కుండా చూసుకోవాలి. అని స్థిరంగా మనసులో అనుకుని కుర్చీలోంచి లేచి, డ్రస్ ఛేంజ్ చేసుకోసాగాడు.

 

    ఆ పని చేస్తూ తిరిగి ఆలోచన్లోకెళ్ళిపోయాడు.

 

    కోపం నిదానంగా వచ్చేవాడు బలవంతుడికన్నా బలిష్టుడు, తన ఆత్మను తాను పాలించుకునేవాడు ఒక రాజ్యాన్ని జయించిన వాడికన్నా గొప్పవాడు.

 

    ఎవరు... ఎవరీ మాటలు తరుచూ తనతో అనేవారు...?

 

    ఇంకెవరు? తన తాతగారే... తను ప్రేమగా పిలుచుకునే డాడీ తాతా... తాత. డాడీ....


                          *    *    *    *


    చిన్నగా నవ్వుకున్నాడు ముసలాయన. కుడి జేబులో చెయ్యిపెట్టి ఓ చిన్న వస్తువును బయటకు తీసాడు. ఆ వస్తువుని అంతకు ముందెప్పుడూ చూసుండకపోవడం, అదేమిటో శ్రీధర్ కి వెంటనే అర్థంకాలేదు. ఆ తరువాతే తెలిసింది.

 Previous Page Next Page