వెంటనే మరోవ్యక్తి లేచి "నేను బాబూ నమాజ్ నుంచి వచ్చాను సార్. మేము 'జంతు చింతన' అనే త్రైమాస పత్రికను తేవాలనుకుంటున్నాం. అందుకు మీ చందా...." అంటూ నసగడం ప్రారంభించాడు.
"ఓ పాతికవేలు చాలా?"
అతను వుబ్బితబ్బియిపోయాడు. చాలనట్టు తల ఆడించాడు.
"మీరు...." అర్థంలో ఆగాడు సోఫాలో చివరన కూర్చున్న మహిళలకేసి చూస్తూ.
లావుగా రుబ్బురోలుకు చీర చుట్టినట్టున్న ఒకామె కదిలినట్టు పైకి లేచింది.
"మహిళా మండలి సభ్యులం. పేద ప్రజల మీదున్న ప్రేమకు చిహ్నంగా మీకు 'దీనజన బంధు' అన్న బిరుదునూ, జంతువుల మీదున్న మమకారానికి గుర్తుగా 'జంతు నాధుడు' అన్న మరో బిరుదును ఏకకాలంలో ఇవ్వాలన్న నిన్న జరిగిన మీటింగ్ లో డిసైడ్ చేశాం. మీరు సమ్మతిస్తారని ఆశిస్తున్నాం."
ఈసారి రాయుడు ఇబ్బంది పడ్డాడు. "ఈ బిరుదులూ, సన్మానాలు నాకు గిట్టవు కానీ.... మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి ఒకే అంటున్నాను."
అప్రయత్నంగా మహిళలంతా చప్పట్లు చరిచారు. రుబ్బురోలులాంటి ఆమె మరోసారి థాంక్స్ చెప్పింది. వాళ్ళు నమస్కరించి వెళ్ళిపోయారు.
మిగిలిన వాళ్ళతో ముచ్చటించేసరికి పన్నెండు అయ్యింది. ఇక ఆ రోజుకి "పబ్లిక్ సేవ" అయిపోయినట్టే. రాయుడు మెల్లగా పైకి లేచి తన 'ప్రయివేట్ సేవ' కోసం తన గదిలోకి వెళ్ళిపోయాడు.
సెక్రటరీలంతా ద్వారం దగ్గర ఆగిపోయారు.
రాయుడు లోపలికి ప్రవేశించగానే తలుపు మూసుకుపోయింది.
ఏర్ కండీషన్డ్ చేసిన ఆ గదిలో సన్నటి వెలుగు గత జన్మపు జ్ఞాపకంలా మసగ్గా వుంది. ఏదో తెలియని పరిమళం, మెత్తగా పరుచుకుని మత్తెక్కిస్తుంది. నీటి కొలను మధ్యలో కట్టినట్టు ఆ గదిలో చల్లటి గాలి అలలు అలలుగా పాకుతోంది.
రాయుడు కూర్చోగానే అక్కడున్న రెండు నీడలు కదిలాయి. ఒక నీడ ఆయన ముందు విస్కీ సరంజామా అంతా సర్దింది. మరో నీడ ఆయన కెదురుగ్గా నిలబడి నినయంగా వంగింది.
"ఏమయినా అవసరం వుంటే పిలుస్తాగానీ, అటువెళ్ళి నిలబడు" అన్నాడు రాయుడు ఆ నీడకేసి చూస్తూ.
అంతలో కాలింగ్ బెల్ మ్రోగింది.
"ఎవరొచ్చారో చూడు"
నీడ పరుగున అక్కడినుంచి కదిలి తిరిగి వచ్చింది.
"శివరామయ్యగారు" ఆ నీడ తాలూకూ వ్యక్తి చెప్పాడు.
"లోనికి రమ్మను"
రెండు నిమిషాల తర్వాత శివరామయ్య అక్కడికి వచ్చాడు.
ఆయన రాయుడికి కుడిభుజం ప్లస్ ఎడమభుజం. ఏ సలహాకయినా ఆయనను సంప్రదిస్తాడు రాయుడు. భుజభలం రాయుడిది అయితే బుద్ధి బలం శివరామయ్యది. రాయుడు ఆ ప్రాంతానికి చక్రవర్తి అయితే శివరామయ్య ఆయుధ మంత్రి.
ఏడేళ్ళవరకూ శివరామయ్య ఆ వూరికి కరణం. కొత్త ప్రభుత్వం వచ్చి కరణం పదవులను రద్దు చేయడంతో ఆయన తీసేసిన కరణం అయ్యాడు. ఏరోజూ ఆయన ప్రభుత్వం ఇచ్చే ఆ జీతపు రాళ్ళ కోసం కాచుక్కూర్చోలేదు. కాబట్టి పవర్ పోయిందనే బాధ తప్ప ఉద్యోగం వూడిందనే దిగులు ఆయనకు కలగలేదు.
రాయుడి సేవలోనే ఆయన జీవితం పూనీతమైపోతోంది.
"నమస్కారాలండీ రాయుడుగారూ!" నోరారా అంటూ ఎదురుగా వున్న కుర్చీలో కూర్చున్నాడు శివరామయ్య.
"నీ కోసమే వెయిట్ చేస్తున్నాను. పన్నెండయినా ఇంకా రాలేదేమిటా అనుకుంటూ వున్నాను. ఎంతవరకు వచ్చాయి మన పనులు? తీర్థం పుచ్చుకుంటూ చెబుదువుగానీ, ఆ కుర్చీ ఇలా లాక్కో" అన్నాడు రాయుడు.
శివరామయ్య ఆయనకు మరింత దగ్గరగా కూర్చీని లాక్కుని కూర్చున్నాడు.
"మొన్న మీరు అప్పగించిన పని అయిపోయింది. ఆ వేయి ఎకరాలకూ సెటిల్ మెంట్ పట్టా పుట్టిచ్చేసరికి మా తాతలు ఏ లోకాన వున్నారో ఏమో - వాళ్లు దిగొచ్చారంటే నమ్మండి. అది అడవి గనుక అందరి చేతులు తడిపి, దొంగపత్రాలు సృష్టించి ఎట్టకేలకూ మీ పేర పట్టా తెప్పించాను. ఇక మీరు ఈ మధ్య సెలెక్టు చేసిన ప్లేసుల్లో మొసళ్ళ పెంపక కేంద్రం కోసం పని చురుకుగాసాగుతోంది. అక్కడికి వెళ్ళే ఇటు వచ్చాను. మైఖేల్ ఆ పనులన్నీ స్వయంగా చూసుకుంటున్నాడు."
"సెహభాష్! కప్ప కాళ్ళు పంపించారా?"
"నిన్న ఒక లోడ్ మరో లోడ్ వెళుతోంది. మైఖేల్ సాయంకాలం వచ్చి మిగతా వివరాలన్నీ చెబుతానన్నాడు."
"వెరీ గుడ్!" రాయుడు సంతృప్తిగా అన్నాడు.
శివరామయ్య తన ముందునున్న మందుగ్లాసు వేపు ఆబగా చూస్తూ ఆ తర్వాత దాన్ని అందుకున్నాడు.
ఒక్కో గుక్కా కిందకు దిగుతూంటే స్వర్గానికి ఒక్కో మెట్టూ పైకెక్కుతున్నట్టుంది.
రెండో రౌండ్ కూడా పూర్తయింది.
రాయుడు చిన్నగా ఒక్కో సిప్ చేస్తుంటే శివరామయ్య మాత్రం గ్లాసులు గ్లాసులు లాగిస్తున్నాడు. మందంటే ఆయనకు భలే యిష్టం.
ఇప్పుడు శివరామయ్యలో మరో కొత్త మనిషి దర్శనమిస్తున్నాడు మాటలు కూడా ఎక్కువయ్యాయి.
"అయ్యా! రాయుడుగారూ? మందు పోయడంలో మీ చేతికి ఎముకలేదు. మీరిలా మందు పోస్తూనే వుండాలి. నాలాంటి వాళ్ళు తాగుతూనే వుండాలి. నాకు మందంటే వీక్ నెస్. మీకు ముండలంటే వీక్ నెస్. అసలు ఏ వీక్ నెస్ లేని మనిషి సృష్టిలో లేడనుకోండీ. భగవంతునికి సృష్టి చేయడమే వీక్ నెస్. కాదంటారా?"
రాయుడు చిరునవ్వు నవ్వి వూరుకున్నాడు. శివరామయ్య తాగినపుడు ఎక్కువ మాట్లాడుతుంటాడని తెలిసిన ఆయన ఇంకా మాట్లాడమన్నట్టు కళ్ళు ఎగరేశాడు.
"రాయుడుగారూ! ఎప్పుడూ నేను మాట్లాడటమేగానీ మందు దగ్గర కూర్చుంటే మీరు పెదవి విప్పరు. కాని ఈరోజు మీరు మాట్లాడాలి"
"నేనేం మాట్లాడను?"
"ఏదో ఒకటి.... మీరు మన్నిస్తానంటే నాకు చాలా రోజుల్నుంచీ ఓ డౌట్ వుంది. అడగమంటారా?" సందేహంగా చూశాడు శివరామయ్య.
"అడుగు"