పాత గ్రామ్ ఫోన్ రికార్డుమీద ముల్లు కదలకపోవడం వల్ల అవే మాటలు వినిపిస్తున్నట్లు అతని మనసులో జెయిలు నుంచి పారిపోవాలనే ఆలోచనే సుళ్ళు తిరుగుతోంది.
అతను చదువుకున్న ఫిలాసఫీలో జెయిలునుంచి ఎలా పారిపోవాలో నేర్పలేదు. ఎదుటివాడి దుష్ట ఆలోచనల్ని పసిగట్టి క్షణంలో పై ఎత్తులు వేసే అనుభవమూ లేదు. తన తెలివితేటల్ని ఉపయోగించే అవసరమూ రాలేదు.
కానీ ఇప్పుడొచ్చింది.
మొదటిసారి అతను శక్తియుక్తుల్ని ప్రయోగించబోతున్నాడు. చిన్నప్పట్నుంచీ చేతిలో చిల్లిగవ్వ లేకుండా పెరిగిన అతను కోట్లకు పడగలెత్తిన తన ప్రత్యర్థిని ఢీకొనబోతున్నాడు. తుపాకులను చేతబట్టుకుని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని పహరా కాసే జెయిలు సిబ్బందిని ఎదుర్కొని పారిపోవడానికి అతను ఆయత్తమవుతున్నాడు.
ఇందులో అతను విజయం సాధిస్తాడా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి.
తిలక్ తలపైకెత్తి చుట్టూ పరిశీలనగా చూశాడు.
మనుషుల్ని మూసివుంచే పెద్ద సిమెంట్ బుట్టలా వుండే జెయిలు అతన్ని భయపెట్టలేదు.
'త్వరలోనే తాను ఇక్కడినుంచి పారిపోతున్నాడు' అని మనసులోనే మరోసారి అనుకున్నాడు.
"వాడ్ని లోపలికి తీసుకెళ్ళండి" శ్రీపతి ఆజ్ఞాపించాడు.
చివుక్కున తలపైకెత్తి ఆయనవేపు ఓసారి చూసి తలదించుకున్నాడు తిలక్.
తన తప్పేమిటో తెలిసింది శ్రీపతికి. ఇక ఎప్పుడూ అతనికని అమర్యాదగా పిలవకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు.
తిలక్ ముందుకు కదిలాడు.
ఆకాశం వంటిమీద ఎవరో సిగరెట్ పీకతో కాల్చినట్టు సూర్యుడు మొలిచాడు.
అప్పుడే సైరన్ మ్రోగడం ప్రారంభించింది.
ఎందుకనో ఆ మోత అపశకునంలా అనిపించింది శ్రీపతికి.
* * * *
అప్పుడు ఉదయం ఎనిమిది గంటలే అయినా 'జీవకారుణ్య సదన్' వచ్చిన వాళ్ళతో నిండిపోయింది. మరీ ముఖ్యమయినవాళ్ళు హాల్లోని సోఫాల్లో కూర్చుని రూపాయి రాయుడి కోసం చూస్తున్నారు.
జీవకారుణ్య సదన్ అని పిలవబడే ఆ భవనం పదెకరాల స్థలంలో సరస్సు మధ్య అందం బరువుకి విచ్చుకున్న తెల్లతామరలా అద్భుతంగా వుంది. దాని ఖరీదు అరవయిలక్షల రూపాయలుంటుంది. దాని యజమాని రూపాయి రాయుడి ఖరీదు కడకు ఇన్ కమ్ టాక్స్ వాళ్ళకు కూడా తెలియదు.
సరిగ్గా ఎనిమిదీ పదినిమిషాలకు రూపాయిరాయుడు తన పరివారంతో పై అంతస్తులో చందమామలా తళుక్కున మెరిసాడు.
ఆయనకు నలభై అయిదేళ్ళు. కానీ చూడడానికి దేవతల వరంచేత ఎప్పుడూ యువకుడిలానే వుండిపోయినట్టు పాతికేళ్ళ వాడిలా కనిపిస్తాడు. ఆయన యెప్పుడూ కషాయం రంగు దోవతీ, జుబ్బానే తొడుగుతాడు. మెడలో వేలాడే బంగారంతీగతో చేసిన రుద్రాక్షమాల ఆయన్ని యోగిలా అనిపింపజేస్తే కళ్ళకున్న రిమ్ లెస్ కళ్ళజోడు భోగిలా ఎత్తి చూపిస్తుంది.
ఆయన హాల్లోకొచ్చి ప్రత్యేకంగా వున్న సోఫాలో కూర్చున్నాడు. ఎదురుగ్గా వున్న జనం ఒక్కసారి పైకిలేచి నమస్కరించి తిరిగి ఒద్దికగా కూర్చున్నారు.
అంతలో మినీస్కర్టులో వున్న ఆయన సెక్రటరీ మిస్ మాల టెలిఫోన్ తీసుకువచ్చి "ఢిల్లీ నుంచి కాల్ సార్" అంది.
రాయుడు ఎంతో విలాసంగా కదిలి రిసీవర్ అందుకున్నాడు. ఓ నిముషం మాట్లాడి రిసీవర్ ని మాలకు అందించాడు.
ఇక చెప్పండన్నట్టు ఎదురుగ్గా కూర్చున్న వాళ్ళవంక నవ్వుతూ చూశాడు.
చాలా విశాలంగా వున్న ఆ హాల్లో సోఫాలు చిన్నవిగా కనిపిస్తున్నాయి. అక్కడక్కడా వున్న పూలకుండీలు వెన్నెల్లో ఆరబెట్టిన రంగురంగుల కలల్లా వున్నాయి. గోడలకు వేలాడుతున్న వివిధ జంతువుల లైఫ్ సైజ్ ఫోటోలు అచ్చం అరణ్యంలో వున్న ఫీలింగ్ ను కలుగజేస్తున్నాయి.
"సార్!" మెల్లగా పిలిచాడు సోఫాలో మొదల కూర్చున్న వ్యక్తి.
"వూఁ" అన్నాడు రాయుడు.
"రేపు టౌన్ హాలులో 'జంతుబలి నిషేధం' అన్న టాపిక్ మీద మీటింగ్ వుంది సార్! దానికి మీరు అధ్యక్షత వహించాలి. నెలరోజులు ముందే మిమ్మల్ని ఇన్వయిట్ చేశాం. మీరు ఒప్పుకున్నారు. ఒకసారి ఆ విషయాన్ని గుర్తు చేద్దామని...." ఆ తరువాత వినయం డామినేట్ చేయడంతో అంతవరకు ఆపేశాడు ఆ వ్యక్తి.
"అవును. గుర్తుంది. ఇంతకుముందే చీఫ్ గెస్ట్ గా వస్తున్న అటవీ శాఖామంత్రి ఫోన్ చేసి చెప్పారు. ఇద్దరం కలిసే మీటింగ్ కి వస్తాం."
ఆ వ్యక్తి నమస్కరించి వెళ్ళిపోయాడు.
"నెక్ట్స్"
బూడిదరంగు సూట్ లో వున్న వ్యక్తి కాస్తంత ముందుకు వంగి "నా పేరు గజపతి సార్. మునిసిపల్ కమీషనర్ ని. మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన జింకల కేంద్రాన్ని మీరు ప్రారంభించాలి సార్. మీరు ఏరోజు చెబితే ఆ రోజు ముహూర్తం పెట్టుకుంటాం. ఈ కేంద్రం ఏర్పాటుకు మీరు లక్షరూపాయలు విరాళం యిచ్చిన సంగతి మీకు గుర్తుండే వుంటుంది" అని తాను ఎక్కువ మాట్లాడుతున్నట్టు అనిపించి ఇబ్బందిగా చూశాడు.
ఇదేమీ పట్టించుకోనట్టు "విరాళం ఇవ్వకపోతే పిలవరా" అని నవ్వాడు రాయుడు.
ఆ జోక్ కి అక్కడున్న వాళ్ళంతా విరగబడి నవ్వారు. డబ్బుకు, అధికారానికి వున్న విలువే అంత. అవి ఎదుటివాళ్ళను నవ్విస్తాయి. కాదంటే కన్నీళ్ళను తెప్పిస్తాయి.
గజపతి కూడా హాయిగా నవ్వి, కాసేపటికి సర్దుకున్నాడు.
"ఎంతమాట సార్! మూగజీవాలమీద మీకున్న ప్రేమ ప్రపంచానికి తెలియనిదా? జంతువులను కూడా పౌరులుగా ప్రకటించి వాటిని హింసించే వాళ్ళను ప్రాసిక్యూట్ చేయాలని మీరు చేపట్టిన ఉద్యమం ప్రపంచాన్ని, ఆకర్షించింది. జంతువులంటే మీకు ఆరోప్రాణం కనకే జీవకారుణ్య సంస్థ రాష్ట్ర అధ్యక్షులయ్యారు. వన్య మృగ సంరక్షణ డైరెక్టర్ అయ్యారు. అలాంటి మీరు జింకల కేంద్రాన్ని ప్రారంభించాడం పురజనుల అదృష్టం సార్" గజపతి అక్షరాసత్యాలైనట్టు అక్కడున్న వాళ్ళంతా తన్మయత్వంలో విన్నారు.
రాయుడు ఆ మాటలకు చిన్నగా నవ్వి "ఏదో సరదాగా అన్నారు లేవయ్యా, డేట్ సెక్రటరీ చెబుతాడు. ఆ రోజు ఫిక్స్ చేయండి. వస్తాను" అన్నాడు.
గజపతి సెక్రటరీని కలవడానికి లేచాడు.