"చైతన్య తల్లిగారు."
"మీరెవరు?"
"నేనూ చైతన్యని."
"ఎవరూ?"
"త్వరగా అమ్మని పిలువు."
నిమిషం తరువాత మరో గొంతు లైన్ లోకి వచ్చింది.
"ఎవరు కావాలి?"
"ఎవరు మాట్లాడేది?"
"సుబ్బరాజు."
సుబ్బరాజంటే చైతన్య సెక్రటరీ. అతడు తేలిగ్గా వూపిరి పీల్చుకున్నాడు.
"నేనూ చైతన్యని."
"ఏం కావాలి చెప్పండి."
"అమ్మ లేదా?"
"అమ్మగారు వారం రోజుల క్రితమే కాశ్మీర్ వెళ్ళారు. చైతన్యగారితో కలసి."
"సుబ్బరాజూ- నేను చైతన్యని."
"అవును చెప్పారుగా" ఇంకో చైతన్య ఎవరో అన్నట్లు విసుగ్గా అన్నాడు.
అతడు కోపం అణచుకుంటూ- "నిన్న షూటింగ్ కి బయలు దేరినప్పుడు అమ్మ నాకు టిఫిన్ కూడా యిచ్చింది. వారం రోజుల క్రితం కాశ్మీర్ వెళ్ళటం ఏమిటి? అసలు నువ్వు సుబ్బరాజువేనా?" అంటూండగా-
అవతల్నుంచి ఫోన్ కట్ అయింది. సినిమా యాక్టర్లకి ఇలాటి ఫోన్స్ మామూలే. అతడు నిస్సహాయంగా ఫోన్ పెట్టేసి వెనుదిరిగాడు. డాక్టర్ ఏమీ మాట్లాడలేదు. అతడు తన గదివైపు నడిచాడు. లోపలికి ప్రవేశిస్తూ ఆగిపోయాడు. డాక్టర్ అతని భార్యని అడుగుతున్నాడు.
"ఏమ్మా! మీ ఆయనకి చైతన్య అంటే చాలా ఇష్టమా?"
"చాలా ఇష్టం డాక్టర్ గారూ! ఇంటినిండా ఆయన ఫోటోలే అతికించుకొంటూ వుంటారు. ఈ వయసులో కూడా తలుపులన్నీ వేసుకుని బ్రేక్ డాన్సులు చేస్తుంటారు."
"అదీ విషయం" మరో డాక్టర్ అన్నాడు. "ఇట్సె క్లియర్ కేస్ ఆఫ్ పారానాయిడ్ సైకాలజీ. అమ్మవారు పూనినప్పుడు భక్తులు 'నేనే పోలేరమ్మని' అని చిందులు తొక్కుతారు. ఇదీ అలాంటి కేసే. మన పేషెంట్ చైతన్య ఫాన్. చైతన్య సెక్రటరీ పేరు ఫోన్ నెంబరుతో సహా కంఠతా పట్టినంత భక్తుడు. తలమీద ఈ గాయంతో, he intered the shoes of chaitanya."
మిగతావాళ్ళు తలూపారు.
"డాక్టర్ గారూ! ఆయన బాగుపడతారా? ఇద్దరి తరఫునా పెద్దవాళ్ళు ఎవరూలేని సంసారమండీ మాది" ఏడుస్తూ అంటోంటి ఆమె. బయటినుంచి ఇదంతా వింటున్న అతను ఒక్క ఉదుటున లోపలికి వెళ్ళాడు. ఆమెని పట్టుకుని విసురుగా తనవైపు తిప్పుకున్నాడు. "ఏమిటీ నువ్వు నా భార్యవా? నా పేరు సుబ్బారావా? ఆడదానివి కాబట్టి బ్రతికిపోయావు. మొగాడివైతే పాతేసి వుండేవాడిని."
డాక్టర్లు అతడిని బలవంతంగా అక్కడినుంచి తీసుకెళ్ళారు.
"ఆమె అబద్ధం చెపుతోంది. ఆమె ఎక్ స్ట్రా ఆర్టిస్టు" గింజుకుంటూ అన్నాడు.
"మిస్టర్ సుబ్బారావ్! నీ మొహం అద్దంలో ఎప్పుడన్నా చూసుకున్నారా?"
అతను ఆగాడు. డాక్టర్లు అతడి చేతుల్ని వదిలేశారు. దూరంగా గోడకి నిలువుటద్దం.
అతను అందులో తనని తాను చూసుకున్నాడు. మార్పేమీ లేదు. కాస్త నొక్కుల జుట్టు, అందంగా విప్పారిన కళ్ళు, బలమైన చెంపలు... ఎందరో యువకుల పుస్తకాల మధ్యలోనూ, యువతుల హృదయాల్లోనూ దాచుకోబడిన రూపం అది. రెండురోజుల అలసటవల్ల కాస్త గెడ్డం మాసిందంతే.
"మీది చాలా అందమైన పర్సనాలిటీ సుబ్బారావ్! మీ పారానాయిడ్ సైకాలజీకి అది కారణం అయుంటుంది. 'చైతన్యకన్నా నేను అందగాడిని' అన్న భావం మీలో ఏమూలో వుంది. అది నిజమే! మీరు పిక్చర్ ఫీల్డులో వుండి వుంటే బహుశా చైతన్య నెంబర్ వన్ హీరో అయి వుండేవాడు కాదేమో."
"నాన్సెన్స్! నేనే చైతన్యని."
"మీ ఫోటో తరచూ పేపర్లో పడుతూ వుంటుంది కదూ?"
"దాదాపు రోజూ ఏదో ఒక అడ్వర్టయిజ్ మెంట్..." అన్నాడు అతడు.
డాక్టర్ అసిస్టెంట్ వైపు తిరిగి- "ఈ రోజు పేపరు పట్రా" అన్నాడు. అయిదు నిమిషాల్లో పేపర్ వచ్చింది. అతడు అన్నాడు-
"చివరి పేజీ చూడండి. ఈ రోజే నా పిక్చర్ రిలీజ్. ఫుల్ పేజీ ప్రకటన వుంటుంది" అతడి కంఠంలో 'ఇక ఈ అయోమయానికి ముగింపు దొరకబోతోంది కదా' అన్న రిలీఫ్ కనబడుతోంది.
డాక్టర్ దృష్టి దానిమీద పడింది. అడ్డుగా వున్న డాక్టర్ తల క్రమక్రమంగా, నెమ్మదిగా వెనక్కి తొలగుతూన్న కొద్దీ పైనుంచి కనబడుతుంది.
"అతడే ఆమె సైన్యం"
హీరోయిన్ ఫోటో-
వెనుక మిషన్ గన్ పట్టుకుని అందమైన హీరో ఫోటో.
తను కాదు, వేరే ఎవరో.
"ఇతను చైతన్య కాదు" అరిచాడు అతను. "నేనే చైతన్యని. 'అతడే ఆమె సైన్యం' సినిమాలో హీరోని నేనే."
అతని వైపు జాలిగా చూస్తూ సూపర్నెండెంట్ నెమ్మదిగా అన్నాడు- "లాభంలేదు. షాక్ ట్రీట్ మెంట్ ప్రారంభించండి."
సుబ్బారావు భార్య రోదించటం మొదలు పెట్టింది.
2
అతడి మెదడులో ఫిరంగులు పేలుతూన్న హోరు! లయబద్ధంగా తలమీద ఒకే బీట్ లో ఎవరో కొడుతున్న భావన!! తన నుంచి తను విడిపోయి వెయ్యిరూపాలుగా విశ్వరూపం ప్రదర్శిస్తూ నాట్యం చేయాలన్న కోర్కె! రకరకాల రంగుల విశ్లేషణాలు శరీరం మీద పాముల్లా జారిపోతూంటే తాండవించాలన్న తపన! తపోభంగమైన ఋషిలా వుంది అతని పరిస్థితి. నెమ్మదిగా అతడికి స్పృహ వచ్చింది. చేతులూ కాళ్ళూ స్వాధీనంలోనే లేవు. చుట్టూ చూశాడు. అదే పక్క. అదే హాస్పిటల్ వాతావరణం.
తనకి కరెంట్ షాక్ ఇచ్చి, ఆ తరువాత తిరిగి పక్కమీదకు చీర్చారని అర్ధమైంది.
అందుకే ఇంత నిస్సత్తువ! షాక్ తరంగాల వత్తిడివల్ల కంటినుంచి నీటిచుక్క చెంపమీద జారింది. అతడు గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. ఏమిటిది? అసలేం జరుగుతోంది? తను సుబ్బారావేంటి? తను ఇప్పుడీ పిచ్చాసుపత్రిలో వుండటం ఏమిటి? అక్కడ తన షూటింగ్ లు ఎలా జరుగుతున్నాయి? తను నటిస్తున్న చిత్రాలు దాదాపు అయిదున్నాయి. ఆ నిర్మాతలు ఎంత టెన్షన్ అనుభవిస్తూ వుండి వుంటారు. ముఖ్యంగా- ఇంకో నెలరోజుల్లో రిలీజ్ కానున్న రెండు కోట్ల ప్రాజెక్టు నిర్మాత రెడ్డి- ఆయన కసలే బి.పి. ఆయన ప్రస్తుతం ఏం చేస్తూ వుండి వుంటాడు? తను 'తప్పిపోయిన' విషయం పేపర్లో వచ్చి వుంటుందా? రాష్ట్రంలో తన అభిమానులు ఆ వార్తకు ఎలా స్పందించి వుంటారు? తన ఇంటి దగ్గర పరిస్థితి ఎలా వుండి వుంటుంది? పోలీసులు ఏం చేస్తూ వుండి వుంటారు?
అతడి ప్రశ్నలన్నింటికీ సమాధానంగా పక్కనే పేపర్ నవ్వుతూ కనబడింది. విప్పి చూశాడు. ఎక్కడా తన ప్రసక్తే లేదు. చివరిపేజీలో మామూలుగానే చైతన్య ఫోటో...
'అతడే ఆమె సైన్యం' అడ్వర్ టైజ్ మెంట్...
"నేడే పదో రోజు" అని.
ఎదురుగా అద్దంలో తన ప్రతిబింబం వెక్కిరిస్తూ.
రెంటికీ పోలికే లేదు.
అతడు బలంగా నిట్టూర్చబోతుంటే 'హలో' అని వినపడింది. ఒకాయన లోపలికి వచ్చి, 'కొత్తగా వచ్చార్టగా' అన్నాడు చొరవగా కూర్చుంటూ.
చైతన్యకి ఒళ్ళు మండింది. అదేదో ఆఫీసు అయినట్టు, తను అప్పుడే అందులో చేరినట్టు ఆయన విష్ చేయడం చూసి.
"ఎవరు మీరు?" అని అడిగాడు.
ఆయన అటూ ఇటూ చూసి- "నేను అల్లు రామలింగయ్యని" అన్నాడు.
చైతన్య అదిరిపడి అతనివైపు చూశాడు. అతనికి యాభై అయిదేళ్ళుంటాయి. సన్నగా, పొట్టిగా వున్నాడు. "నేనే అల్లురామలింగయ్యని అంటే వీళ్ళు నమ్మటంలేదు. ఎస్వీ రంగారావుగారూ, నేను కలిసి నటించిన చిత్రాల్లో విషయాలు వివరంగా చెప్పినా కూడా వీళ్ళు నమ్మటంలేదు." అరగంటసేపు తన ఫ్యామిలీ గురించి చెప్పాడు.
"నేను రామలింగయ్యనని మొదట్లో ఎవరూ నమ్మలేదు. చివరికి మా అబ్బాయి అల్లు అరవింద్ గుర్తుపట్టాడు. నెలనెలా వచ్చి పళ్ళూ అవీ తెచ్చి ఇస్తూ వుంటాడు. తొందరగా కోలుకొమ్మని విష్ చేస్తూ వుంటాడు. నాకు విషయం పూర్తిగా అర్ధమైంది. నాకు పిచ్చిలేదు. ఇంకేదో ఆస్పత్రిలో నేను బాధపడతానని ఇలా చెప్తున్నారు" అతనికి నవ్వొస్తూంది. బలవంతంగా ఆపుకున్నాడు. ఆయన నెమ్మదిగా అన్నాడు. "నాకు నా వారందర్నీ చూడాలనుంది. కానీ నా కోసం ఎవ్వరూ రారు. రాత్రంతా ఒంటరిగా కూర్చుని కిటికీలోంచి బైటకు చూస్తూ కూర్చుంటాను. చీకటి తప్ప ఇంకేమీ కనపడదు నాకు" ఆయన కంఠం రుద్ధమైంది. 'అతనికి' కూడా కళ్ళు తడి అయ్యాయి.
"పాపం నా నిర్మాతలు ఏమయ్యారో అక్కడ, నేనేమో ఇక్కడ వుండి పోయాను."
అతను అదిరిపడ్డాడు.
తను మనసులో అనుకున్న మాటే ఆయన బైటికి అన్నాడు. అప్పుడే ఆయన దృష్టి పేపరుమీద పడింది. చివరిపేజీ ప్రకటన చూపిస్తూ "ఇదిగో 'అతడే ఆమె సైన్యం'. ఇందులో కూడా నేను 'యాక్ట్' చేశాను. ఇదే నా ఆఖరి సినిమా. ఇదే నా ఫోటో" అంటూ చూపించాడు. ఇది (నిజం) అల్లు రామలింగయ్యది. అతడు ఆయన వైపు జాలిగా చూశాడు. అంతలో బయట గుమ్మం దగ్గర అలికిడి అయింది. అతడు తల తిప్పి చూశాడు.
తన జీవితంలో అంత అద్భుతమైన అందాన్ని అతడు అంతకు ముందెన్నడూ చూడలేదు. తూర్పు నుంచి వచ్చే సూర్యుడు థాయ్ లాండ్ పూల సొగసుని, ఉత్తరం నుంచి వచ్చే గాలి మంచు ధృవపు తెల్లదనాన్ని, పశ్చిమనుంచి ఇంటికొస్తూన్న పక్షి ఈజిఫ్టు పిరమిడ్ల నునుపుదనాన్ని తెచ్చి ఆమెకిచ్చి నట్టున్నాయి.
ఆమె లోపలికి వచ్చి మృదువుగా "మీరిక్కడ వున్నారా? మీకోసం హాస్పిటల్ అంతా వెతికాను" అంది.
"నేను రాను. వస్తే ఆ చేదు మందిస్తావు" అరిచాడు ఆయన.
"ఇవ్వను. రండి. మీ అబ్బాయిగారు వచ్చారు."
ఆయన అబ్బాయి పేరు వినగానే లేచాడు. అరవింద్ వచ్చాడని తెలియగానే అతడు ఉద్వేగంతో లేచి "సిస్టర్" అని అరిచాడు. ఆమె ఆగింది.
"మీ పేరు?"
"అక్షౌహిణి."
ఆ పేరులోని విలక్షణతకి అతడు ఆశ్చర్యపడ్డాడు. తన ఆశ్చర్యాన్ని అణుచుకుని "నాకో సాయం చేస్తారా?" అని అడిగాడు.
ఆమె చిరునవ్వుతో 'చెప్పండి' అంది.
"ఒకసారి అరవింద్ ను కలుసుకోవాలి నేను" అన్నాడు.
ఆమె మౌనంగా తలూపి అక్కణ్ణుంచి ఆయన్ని తీసుకువెళ్ళిపోయింది. రెండు నిమిషాల తరువాత డాక్టర్ వచ్చి "అరవింద్ ని కలుస్తావా?" అన్నాడు.
అతను చప్పున లేచి తలూపాడు. అరవింద్ ను కలుస్తే ఈ సమస్య క్షణాల్లో తేలిపోయినట్టే.